చిల్లర వర్తకంలో చొరబడ్డ ‘బడా’ దొంగలు

ఎన్‌. హేమలలిత

తెలతెలవారుతుండగానే చిన్నప్పుడు అమ్మ మేలుకొలువు తర్వాత వినిపించే కేక మా రాములమ్మది. నలుపు తెలుపుల కలయిక జుట్టుని ముడివేసి, అలిసి సొలసిన శరీరానికి చీరలాంటి ఓ పొడవాటి గుడ్డముక్కను చుట్టేసి, కొంగుచాటున దాచేసిన దు:ఖాన్ని ఎవరికి కంటపడనీయక సంసారభారాన్ని గంపనెత్తుకొని ప్రతి ఇంటికివెళ్ళి తాజా కూరగాయాలు అమ్మేది. కూరలు డబ్బులకు అమ్మితే కరివేపాకు, కొత్తిమీర, మిర్చికోసం యింత బియ్యం పెట్టించుకొనేది. ఆ అమ్మే ప్రక్రియలో ఎన్నెన్ని కబుర్లు...

తన బాధ, బయట ప్రపంచంలో వింతలు, యింట్లో జరిగే పండుగలు, పబ్బాల గురించి వాటిద్వారా ఏమైనా చిన్న పనులు దొరుకుతాయోమోనని ఆశతో ఆరాలు అడిగేది. ఒక యింట్లో మనిషిగా కలిసిపోయేది. పది పదకొండు గంటలకు చేపల బుట్టను పట్టుకొచ్చే గంగానమ్మ అమ్మే తీరుని చూడవలసిందే. రొయ్యల్ని కుప్పలుగా పెట్టి ప్రపంచంలోని లెక్కలన్ని తెలియచెప్పేది. భర్త వేటకెళ్ళి సగం అమ్మేసుకొని తాగుడికి డబ్బులు తీసేసుకుంటే, మిగిలిన చేపలు అమ్ముకుని వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని చూసుకునేది. సాగరాన్ని ఈదినంత గర్వం ఆమె కళ్ళలో తొణికిసలాడేది. పళ్ళముకొనే చిలకమ్మ యిలా… ఎందరో బంధుమిత్రులగానే కుటుంబ సంబంధాల్లో కలిసిపోయేవారు. ఒక్కరోజు రాకపోయినా అదేంటి ఈ రోజు ఎందుకు రాలేదని ప్రశ్న ఆరోజంతా వేసుకునే వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు ప్రతినెల మొత్తం సరుకులు తెలిసిన కొట్టునుండి తెచ్చుకుంటే, శ్రామికులు ఏరోజుకారోజు దినసరి సరుకులు తెచ్చుకునేవారు.అవసరమైతే అప్పుపుట్టేది. అలా పరస్పర ఆధారిత సామాజిక ఆర్థిక సంబంధాలు అవి. అలాంటి సంబంధాల్లోకి ‘కారుచిచ్చు’లా వచ్చింది ఫారెన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ రిటైల్‌ మార్కెట్‌.(చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు).

ఈస్టిండియా కంపెనీ పేర వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఈ దేశాన్ని నాలుగు వందల ఏండ్లు దోచుకున్న బ్రిటిష్‌ దొరల్ని తన్ని తరిమి కొట్టి స్వాతంత్య్రమే సంపాదించేమో స్వరాజ్యమే సాధించామో ఎప్పటికప్పుడు ఒక తేలని అంశంగానే వుంటుంది. స్వాతంత్య్రం రాక పూర్వం సంతలు, మేళాల పేరుతో సరుకులు మార్కెట్‌లో దొరికేవి. 1970లొ మొట్ట మొదటిసారిగా టెక్స్‌టైల్‌ రంగంలో సంఘటిత రిటైల్‌ వ్యాపారం ప్రవేశించింది. 1991లో లిబరైజేషన్‌, ప్రైవేటేజేషన్‌, గ్లోబలేజేషన్‌(ఎల్‌పిజి) ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో పద్ధతి ప్రకారం ఆర్థిక దోపిడికి ద్వారాలు తెరువబడ్డాయి. 1995 నుంచి కొత్తగా మాల్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. 2000 నుంచి సూపర్‌ మార్కెట్లు ఆ తర్వాత బిగ్‌బజార్‌, రిలయన్స్‌, హేరిటేజ్‌ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడి దారులు మార్కెట్‌లో ప్రవేశించి చిన్నచితక వ్యాపారస్థుల పొట్టను కొట్టడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వీరు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే 2006లో పాలకపక్షాలు సింగల్‌ బ్రాండ్‌ పేరిట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమి 51% వాటాతో నిస్సిగ్గుగా వ్యాపారులు, రైతుల సంక్షేమం, ఉపాధి పేరిట బహుళజాతి సంస్థలకు వారి దళారీలకు అప్పనంగా లక్షల కోట్లు రూపాయల చిల్లర వ్యాపార మార్కెట్లను పళ్ళెంలో పెట్టి ఆహ్వానించారు.

1990లు తర్వాత మొదలైన ఆర్ధిక సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ మరింతగా చిన్నాభిన్నం అవుతూనే వుంది. అలాంటిదేమి జరగదు. పైగా యిండియా అభివృద్ధి ప్రధానంగా దూసుకుపోతుందని పాలక పెద్దలు నిజంగానే అబద్ధాలు చెబుతున్నారు. బ్రిటిష్‌ వలసవాదకాలంలో మన నుండి తీసుకెళ్ళిన ఉత్పత్తులు ఆ దేశ శ్రామికుల పొట్టను కొడితే అక్కడి ప్రజలు తిరగబడ్డారు. కాబట్టి నయా వలస వాదులు ఇప్పుడు తమ దేశాలలో తయారయిన వస్తువులను అభివృద్ధి చెందుతున్న దేశాలలో అమ్ముకొని లాభాలు గడించాలనుకుంటున్నారు. అందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల్నే తమ సూపర్‌పవర్‌తో శాసిస్తున్నారు.

వ్యవసాయం తర్వాత అతి పెద్దది రిటైల్‌ రంగం 2000 సం. అంచనాలు ప్రకారం సుమారు 3,10,20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో సుమారు 720 మిలియన్ల వినియోగదారులు 6,27,000 గ్రామాల్లో వున్నారు. యిందులో హాకర్స్‌ 15% తోపుడు బండ్ల, 31%, బంకులు, కిళ్ళికోట్లు లేదా చిన్న చిన్న కిరాణా కోట్లులతో 31% వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. మిగిలిన వారంతా 15% పెద్ద వ్యాపారస్థులు రంగంలో వున్నారు. సాధారణంగా చిన్న వ్యాపారస్థులందరూ తమ కుటుంబ సభ్యులతో షిప్టుల ప్రకారం పనిచేస్తారు. అంటే సరుకులు టోకుగా అమ్మే చోట నుండి కొని తెచ్చి మార్కెట్లో అమ్మే వరకు కుటుంబ సభ్యులందరూ కష్టపడతారు. ముఖ్యంగా స్త్రీల విషయాన్కి వస్తే ఒంటరి స్త్రీలు తమకున్న చిన్నపాటి ఆర్థిక వనరులతో కుటుంబ పోషణకై ఎంతో శ్రమించి చిల్లర వర్తకంలో వున్నారు. ఒక పక్క ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో ఇస్తున్న రుణాలు పుచ్చుకొని ఆర్థిక స్వావలంబన చేకూర్చుకొని అభివృద్ధి చెందాలని చెబుతూనే మరో ప్రక్క వారి ఆర్థిక పునాదుల్ని కూల్చేస్తుంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదుకోట్ల ప్రజలు చిల్లర వర్తకంలో ఉపాధి పొందుతున్నారు అంటే 20 కోట్ల మంది ఈ వ్యాపారం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అఖిల భారత వర్త సమాఖ్యలో వీరు సభ్యులు. 40% పైగా నిరక్షరాస్యులైన స్త్రీలు చిల్లర వర్తకులుగా వున్న వారు యిలాంటి సంఘాలలో సభ్యులుగా లేరు. కాస్త చదువుకున్నా వ్యాపారస్తులకు దీంట్లో సభ్యుత్వం తీసుకోవాలన్న విషయం తెలియదు. ఎందుకంటే దేశంలోని మొత్తం రిటైల్‌ వ్యాపారం 97% అసంఘటిత రంగమే. ఆర్థికంగా చితికిపోయిన వారు, శారీరకంగా శ్రమ చేయలేని వారు కుటుంబ పోషకుడ్ని కోల్పోయిన స్త్రీలకు వచ్చే ఆలోచనే చిల్లర దుకాణం. చిల్లర వ్యాపారంపై అతి తక్కువ లాభాలతో జీవనంపై ఆధారపడినవారు ఎక్కువ ఎస్‌సి, బిసిలే, కొన్ని సామాజిక వర్గాలు ఈ వ్యాపారం పైనే ఆధారపడి బ్రతుకుతున్నాయి

అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పిలవబడే మన దేశంలో రాజ్యాంగం, చట్టాలున్నాయి. అయితే యివన్నీ కొన్ని వర్గాల వారికే అందుబాటులో వున్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వివక్షతతో కూడుకున్నది. బహుళజాతి కంపెనీలు, వరల్డ్‌బ్యాంకు కనుసన్నలో మన భావస్వేచ్ఛ, విశ్వాసం, మన ప్రజాస్వామ్యం యిమడిపోయి వుండవలసిందే. సమానత్వం అందరికి వర్తించదు. ఏమైౖనా ప్రపంచంలో అతి పెత్తందారి శక్తి ముందు మోకరిల్లివలసిందే. వారి డేగ కన్ను మన చిల్లర వ్యాపారంపై పడింది. మన చిల్లర వ్యాపార రంగం చూసినట్లయితే భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో 11% రిటైల్‌ వ్యాపారం నుంచే వస్తుంది. జనాభా, చిల్లర మార్కెట్‌ విస్తరణలో అతిపెద్ద రెండవ దేశంగా భారతదేశం వున్నది. 30 లక్షల కోట్ల వాణిజ్య కార్యకలాపాలకు చిల్లర వర్తకంలో అవకాశం వుంది. వారి రిటైల్‌ రంగానికి కావలసిన మరోకోణం వుంది. భారతదేశంలో యువత శ్రమశక్తి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది. ఎందుకంటే 66% మంది యువత, 35సం. లోపువారే. అందుల్లో మళ్ళీ 50% 25సం.లోపువారే. 2020 లో అక్షరాస్యత 75% పెరుగుతుంది. పనిచేసే స్త్రీల పెరుగుదల 20% వుంటుంది. 72% యుక్తవయస్సు బాలికలు పనిలోకి వెళతారని అంచనా. అలాగే మన బాలలు 291 కోట్లు ప్యాకెట్టు మనీ వాడతారని అంచనా కూడా వుంది. ఇవి వారి వ్యాపార విస్తరణకు కావలసిన కొన్ని మౌలిక అంశాలు. అందుకే రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్షబడులు అనుమతించడానికి బహుళాజాతి కంపెనీలు భారతప్రభుత్వంపై వొత్తిడి తెచ్చాయి. ఫలితంగా సెప్టెంబరు 15ని, 2012న కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబడింది. అంతకు ముందే 2006లో సింగిల్‌ బ్రాండ్ల చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. ఇప్పుడు మల్టీబ్రాండ్లు అనుమతించారు. ఈ ఒప్పందం ప్రకారం10 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలి. 50% గ్రామీణ ప్రాంతంలో పెట్టాలి. 30% ఉత్పత్తులు స్థానిక చిన్న మధ్య తరహా కంపెనీల నుంచి సేకరించాలి. 70% ఎక్కడనుంచి అయినా సేకరించవచ్చు. అయితే 30% ఏఏ ఉత్పత్తులో సేకరించాలన్నది వారి యిష్టమే. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను తమ రాష్ట్రాలలో అనుమతించాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యిష్టమే. కాని మాములుగానే జరిగేదేంటంటే ఏ రాజకీయ కూటమి అయితే ఈ విధానాలను అమలు చేస్తాయో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విదేశీ ప్రత్యక్షబడులను అనుమతిస్తాయి.యూపియే కూటమి భాగస్వామ్య పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం మొ.అనుమతించాయి. విపక్షాలకు చెందిన యు.పి. ఎం.పి. ఒరిస్సా, గుజరాత్‌, కర్నాటక, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌ మొ. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. చెప్పుకోదగ్గ దేమిటంటే యూపి.ఎ భాగస్వామ్య పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. అలాగే విపక్షంలో వున్న ఎన్‌డిఎ కూటమి భాగస్వామ్య రాష్ట్రమైన పంజాబ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి యివ్వబడింది.

కాని భారత ఆర్థిక వ్యవస్థను గమనిస్తే గ్రామాల్లోగాని, పట్టణాల్లోగాని, కోమట్లు, మర్వాడీలు, కిరాణా అధిక పెట్టుబడితో వ్యాపారాన్ని శాసిస్తుంటారు. వీళ్ళు క్రింద కులాలనుంచి పనివాళ్ళను పెట్టుకోరు. దళితులు గ్రామాల్లో ఈ వ్యాపారంలో అడుగిడినా ఆధిపత్య కులాలు వారు వారి దగ్గర ఎక్కువగా సరుకులు కొనరు. మాంసం, చేపల దుకాణాలు శూద్రకూలాలు చేతుల్లో వుంటాయి. పంటల పడించి వస్తువులు తయారు చేసి సరుకుగా మార్చేంతవరకు దళిత శూద్రకూలాలు శ్రమిస్తే అవి సరుకుగా ఆధిపత్య కులవర్గాల షాపుల్లోకి వెళ్ళిపోయి లాభాలు గడిస్తారు. చింతామణిలో సుబ్బిశెట్టి జ్ఞాపకం వున్నాడు కదూ! మన కిరాణా వ్యవస్థలో కులం ఎంతటి పాత్ర వహిస్తుందో మన సుబ్బిశెట్టి తేటతెల్లంగా చెపుతారు. ఒకసారి ఆలోచిద్దాం! 80% చిల్లర వర్తకం నల్గురైదుగురు బడా చిల్లర వ్యాపారస్తులైన వాల్‌మార్ట్‌, టెస్కో, కాలిఫోర్‌ లాంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తాజా ఆహారం ప్రోస్రెస్‌ చేయబడి ప్లాస్టిక్‌ బ్యాగుల్లోకి కుక్కబడుతుంది. క్రమంగా ఈ ఆధిపత్య కుల, వర్గాల చేతులనుంచి రిటైల్‌ వ్యవస్థ పోయి యిప్పుడు బహుళజాతి సంస్థల ఆక్రమిస్తాయి. బహుళజాతి సంస్థలు మొదట్లో కొద్దిమంది జాతీయ పెద్ద పెట్టుబడి దారులతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. అంటే అగ్రవర్ణ దేశీయ దళారీ, బూర్జువా, విదేశీ బడా పెట్టుబడి వర్గంతో కలిసి పోతుంది. ఆ తర్వాత క్రమంగా ప్రత్యక్షంగా మనకు అనుభవమైన ఈస్టిండియా పాలనను అవి పునరావృత్తం చేస్తాయి.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి చిల్లర వర్తకంలో చూసినట్లయితే ఈ రోజుకీ రోజు వచ్చింది కాదు. సెప్టెంబర్‌ 2012లో యూనియన్‌ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నప్పటకీ గత 15 ఏళ్ళుగా ఈ విషయం నానుతూనే వుంది. 1997 లోనే 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి క్యాష్‌ అండ్‌ క్యారీ అనే విధానంతో అంశాలను బట్టి ప్రవేశపెట్టబడింది. ఎన్‌.కె.సింగ్‌ కమిటీ సలహాతో 10 వ పంచవర్ష ప్రణాళికతో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతి నిరాకరించబడింది. 2003లో జర్మనీ బేస్‌ కంపెనీ మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ తో బెంగుళూరులో మొట్టమొదటిసారిగా ఈ వ్యాపారంలోకి టోకు వ్యాపారస్థుడుగా వచ్చారు. 2006 నుంచి సింగిల్‌ బ్రాండ్‌తో వాల్‌మార్ట్‌, మెట్రో, కారిఫోర్‌ బహుళజాతి కంపెనీల షాపులు వెలిశాయి. వీటినుంచి లైసన్స్‌ పొంది దేశంలో బడా వ్యాపారస్థులు అనేక చోట్లలో దుకాణాలు తెరిచారు. ప్రధానంగా మూడు అంశాలతో చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నా మని ప్రభుత్వం చెబుతుంది. రైతులకు, వ్యాపారులకు లాభదాయకమని, మౌలిక సదుపాయాలు, శీతలీకరణ, గిడ్డంగులను ఏర్పాడతాయని, ఉపాధి దొరుకుతుందని ఆశలు చూపిస్తున్నారు. ఒక కోటి ఉద్యోగాలు ఈ రంగం కల్పిస్తుందని ప్రభుత్వం చెప్పిందే. కాని సాంప్రదాయ వ్యాపారుల గురించి ఏమి మాట్లాడలేదు. ఎందుకంటే పేద మధ్యతరగతి, దళిత, ఆదివాసీలు పోరాడలేరనే భావపతోనే, యిది సరికొత్త మరో విప్లవం అని కాంగ్రెసు ప్రకటించంది. కానీ యిది ప్రపంచీకరణలో భాగంగా రాజీవగాంధి ప్రవేశపెట్టిన విధానాలకు కొనసాగింపే.

యిందులో 30% తప్పనిసరిగా రైతులనుంచి కొనాలని అయితే వుందికాని వరల్డ్‌ ట్రెడ్‌ అర్గనేజేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ నిబంధన చెల్లదు. మరొక విషయం ఏమిటంటే ‘వేస్టేజి’ని అరికడతామని, నిజానికి భూతద్దంలో చూపారు. యిప్పటి వరకు వున్న సూపర్‌మార్కెట్లు, పెద్దపెద్ద దుకాణాలు రోజు వారి లెక్కల ప్రకారం తీసుకుంటున్నారే కాని ‘కాంట్రాక్టు’ తీసుకుని కాదు. వాటిని భద్రపరచడానికి ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. కేవలం కొన్ని కలెక్షన్‌ సెంటర్లు తప్ప. కాబట్టి 50% మౌళికసదుపాయాలు కల్పిస్తామన్న మాట భ్రమే. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించరు. స్థానిక సరుకులకు ధర వుండదు.ఈ బహుళజాతి కంపెనీలు యిచ్చే అడ్వర్జ్‌ మెంటు ఖర్చులు వినియోగ దారునిపై పడుతుంది. విదేశీ భారీ చిల్లర దుకాణాలవారు రైతుల వద్ద కారుచౌకగా కొనుగోలు చేసి, నిలవచేసి కృత్రిమ కొరతను సృష్టిించడం దీర్ఘకాల పరిణామం.

అమెరికా, యింగ్లాండు, చైనాలాంటి దేశాలో చూస్తే మాములు గిట్టుబాటు ధరకంటే బహుళజాతి కంపెనీలు తక్కువ ధరను రైతులకు యిస్తున్నారు. అందుకే యూరప్‌లో రైతు సబ్సిడిలపై జరిగిన అధ్యయనం ప్రకారం ప్రతి నిమిషానికి ఒక రైతు వ్యవసాయం నుండి వైదొలుగుతున్నాడు. 20వ శతాబ్దంలో అమెరికాలో 70% రైతు లభిస్తే 2005 నాటికి 4% పడిపోయింది. ఈ బడా కంపెనీలను కాదంటే సప్లయర్‌గా రైతులను నిరాకరించి నష్టపరచ వచ్చు. వ్యవసాయపు పనులలో 60% పైగా స్త్రీలే పనిచేస్తున్నారు. వారి ఉపాధికి గండే. ఈ బహుళజాతి కంపెనీలు వారికిష్టమైన పంటల్నీ రైతులను పండించమని నిర్భంధించి ఏకీకృత పంట విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తారు.అప్పులిచ్చి ఆ అప్పులభారాన్ని తీర్చలేక రైతులు భూమిని పోగొట్టుకుంటారు. యిది భూస్వామ్య వ్యవస్థలోని వెట్టి చాకిరికి మారణకూపం మాత్రమే, అనివార్యంగా కూలిరెట్లు పడిపోతాయి. కార్పొరేట్‌ వ్యవసాయం అమలులోకి వస్తుంది. 2003లో బెంగుళూరులో చిల్లర వ్యాపారంలోకి సింగిల్‌ బ్యాండ్‌ అనుమతించిన తర్వాత జరిగింది యిదే. అంటే మరో ప్రత్యేక మండలాలుగా యివి తయారవుతాయి. ఈ రంగం కొద్ది మంది బహుళజాతి కంపెనీల వశమౌతాయి. మార్కెటులో ఎదురులేని శక్తులుగా తయారయ్యి రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు చవకగా తీసుకుని వినియోగదారులకు ఎక్కువగా అమ్ముతారు.

బాధితులకు జరిగే నష్టం గురించి, నష్టపరిహారం గురించి ప్రస్తావన ఎక్కడా ఈ విధానంలో లేదు. అయినా యిప్పటివరకు ఎన్నో ప్రాజెక్టులో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఏమి చేసింది? ఒక నిర్థిష్ట పాలసీ, యంత్రాంగం వస్తుందా? అదీ బహుళజాతి కంపెనీల కనుసన్నలలో బ్రతుకుతున్న పాలకవర్గాల వలన? యిదెప్పటికి అసాధ్యమేనని మన చరిత్రే చెబుతుంది. ఎన్ని రైతుల ఆత్మహత్యల చరిత్ర భరించలేదు. నిన్న మొన్నటి లక్ష్మింపేట సంఘటనలో 5 గురు దళితుల రక్తంతో భూమి తడిసిపోతే ప్రభుత్వం 250 ఎకరాల ప్రభుత్వ భూమిని వారికి పంచలేకపోయింది. ఆంధ్ర వలస వాదులు, పెట్టుబడిదారులనుంచి విముక్తి కావాలని గత దశాబ్దకాలంగా పోరు చేస్తుంటే యిప్పటికీ తెలంగాణకు విముక్తి లేదు. యిక బహుళజాతి కంపెనీల నుంచి మనకు భవిష్యత్‌లో విముక్తి కలుగుతుందా!

యిప్పటివరకు ఉత్పత్తి దారులకు వినియోగదారులకు పలు అంచెల గొలుసు కట్టు దళారీ వ్యవస్థ ఉంది. వినియోగదారుడు చెల్లించే డబ్బులో చాలా కొద్ది వాటా మాత్రమే రైతుకు దక్కుతుంది. కాబట్టి ఈ దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామనడం మరో అబద్ధం. వాళ్ళు మరో రూపం తీసుకుంటారు. క్వాలిటీ కంట్రోలర్‌, స్టాండ్‌రైజర్‌, ధృవీకరణ ఏజన్సీ, ప్రాసెసర్‌, ప్యాకింగ్‌ కన్సల్టెషన్‌ యిలా ఎన్నో! ఈ ప్రపంచం బడా చిల్లర వర్తకున్ని కంట్రోలు చేయడానికి ఏ పార్లమెంటరీ శక్తులు ముందుకు రావు. ఉపాధి విషయానికొస్త్తే మాత్రం మాల్స్‌లో దొరికే ఉపాధి కొన్ని పదులమందికే. 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు, దేశ జనాభాలో మూడింట ఒకవంతు వుండి మనజాతీయ ఆదాయంలో మూడింట రెండువంతులు మనకు అందిస్తున్నారు.

చిన్న చిన్న పెట్టుబడిదార్లగా వున్న వాళ్ళు సేల్స్‌మెన్‌గా మారిపోతారు. 70 కోట్ల మంది ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కుటీర పరిశ్రమలైన ప్యాకేజింగ్‌లో ఉన్న స్త్రీలు ఉపాధి కోల్పోతారు. డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు వాటి ఉపాధి పోతుంది. చేతి వృత్తులు నాశనమవుతాయి. చదువు, వీలుంటే అందం, టెక్నాలజీ తెలుసుండాలి. మరి మన రాములమ్మ, గంగాలమ్మ, చిలకమ్మ, యాదయ్యలకు యివన్నీ ఉన్నాయా? సిస్టర్స్‌ అండ్‌ కామ్రేడ్స్‌ వ్యాస సంకలనంలో (క్షమించండి రచయిత) పేరు గుర్తు లేదు) బడా కంపెనీలద్వారా లాటిన్‌,అమెరికా యూరప్‌ తదితర దేశాలలో స్త్రీలు ఉపాధి రంగంలో ఎన్ని రకాల దోపిడీకి గురయ్యారో తెలియచేస్తారు. మన దేశం అందుకు మినహియింపు కాదు. మన దేశంలోని సెజ్‌లవలన వచ్చిన పరిశ్రమలలో లేదా యిప్పటి బిగ్‌బజార్‌, రిలయన్స్‌, హేరిటేజ్‌లాంటి పెద్ద పరిశ్రమలనే తీసుకుందాం.. రోజుకు 12గం. షిష్టు ఉద్యోగ పురుష లక్షణం అనే ఫ్యూడల్‌ భావజాలంలో స్త్రీల ఉపాధిపై ఎపుడూ చిన్న చూపే. కాబట్టి వారి శ్రమను అతి తక్కువగా చౌకగా కొనేస్తారు. వీరిలో లైంగిక హింసకు గురైనవారు ఎంతోమంది వున్నారు. కుటుంబ భారం, పిల్లల పెంపకం, అధిక పనికి, స్త్రీల ఆరోగ్యంతో ఆడుకుంటాయి. ఉద్యమించి సాధించుకున్న ప్రసూతి చట్టం, ఇ.ఎస్‌.టిలు,పి.ఎఫ్‌లు, పనిగంటలు యివ్వేవి వర్తించవు. యిక యూనియన్‌గా ఏర్పడడం, హక్కులు యివన్న్నీ హుళుక్కే. ఉన్న గుప్పెడు మంది పరిస్థితి యిలా వుంటే ఈ మొత్తం వ్యవహారంలో కార్మికుల మధ్య పోటీ పెరిగి శ్రమ దోపిడి జరుగుతుంది. ఉపాధి లేని వారు మిగులు మనుషులుగా మారి సామాజిక,రాజకీయ, ఆర్థిక సమస్యగా మిగులుతారు.

యితర దేశాల అనుభవాలు చూస్తే కూడా వీరు చేసే వాటికి వ్యతిరేకంగా వున్నాయి. వాల్‌మార్ట్‌ (అమెరికా కంపెనీ) ద్వారా లభించే సగటు టర్నోవరుకంటే మన చిల్లర వ్యాపారంలో ఉపాధి 95 % రెట్లు ఎక్కువే. రిటైల్‌ వ్యాపారంలో 20% మార్కెటు ఈ కంపెనీలు కైవసం చేసుకున్న 80 లక్షల మందికి ఉపాధి పోతుంది. ప్రస్తుతం దేశంలో కోటి యిరువై లక్షల దుకాణాలు వున్నాయి. 96% 500 చం. అడుగులలోపే విస్తీరణం కల్గి వున్నాయి. కాని బహుళజాతి కంపెనీలు నగరం నడిబొడ్డులో స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసుకుంటాయి. యిది మరో భూదందాకు మార్గమే. ఉదా. వాల్‌మాల్ట్‌ సగటు సైజులు 85 వేల చం. అడుగులు. అంతేకాదు వాల్‌మార్ట్‌ సగటు ఆదాయం 37,900 కోట్లు డాలర్లు కారీఫోర్‌ (ఫ్రాన్స్‌) 12,300 కోట్లు డాలర్లు. వాటితో మన చిల్లర వ్యాపారులు కాదుకదా టోకు వ్యాపారదార్లు కూడా పోటీ పడలేరు.. 15 బహుళజాతి కంపెనీల ఆదాయం 120 వర్ధమాన దేశాల జాతీయ ఆదాయం కంటె ఎక్కువే. ఆసియా అభివృద్ధిబ్యాంకు ఈ బహుళజాతి కంపెనీలు చిన్న చిన్న వ్యాపార సంస్థలకు వాటి ఉనికికేే ప్రమాదమని హెచ్చరించిందికూడా.

బ్రిటన్‌లో గత 2 సం. లలో టెస్కో రిటైల్‌ కంపెనీ 11 వేలు ఉద్యోగాలను, శానిస్‌బరీ 13 వేలే ఉద్యోగాలకు అదనంగా కల్పిస్తామని రాయితీలు పొందాయి. కాని టెస్కో 726 అదనపు ఉద్యోగాలు, శానిస్‌బరీ 874 మంది ఉద్యోగాలను తీసివేసింది. స్వదేశంలోనే యిలా చేసిన బహుళజాతి కంపెనీలు మనదేశంలో యింక ఉపాధి కల్పిస్తామని బుకాయిస్తున్నాయి.యిది పెద్ద పట్టణాలను పరిమితమైన ఫ్రాంఛైన్‌ పద్ధతిద్వారా చిన్న పట్టణాలను పెద్ద గ్రామాలకు విస్తరిస్తారు.

వాల్‌మార్ట్‌ యిప్పటికీ సింగిల్‌ బ్రాండ్‌ మార్కెటులో సునీల్‌మిట్టల్‌కు చెందిన సంతతితో కలిసి క్యాష్‌ అండ్‌ క్యారీ సంస్థలను 175న స్థాపించింది. బెస్ట్‌ప్రెజ్‌ పేరుతో విజయవాడలోనూ తెరిచింది. యిప్పుడు హైద్రాబాద్‌లో రాబోతుంది. విజయవాడలో ఈ షాపు ప్రభావంతో రిలయన్స్‌, స్పెన్సర్ల ఆదాయమే పడిపోయింది. 7 వేలకు పైగా చిల్లర కొట్లు, 2500 పైగా వీధిలో అమ్మకం చేసేవారు. 13 వేలకు పైగా చిల్లరవర్తకులు నడిరోడ్డు మీదకు వస్తున్నారు. వీటి ప్రభావం భారత ఆర్థిక రంగం పైనా వుంటుంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలలో తమ ఉత్పత్తుకు గిరాకీ తగ్గింది. వాటికి మార్కెట్‌ కావాలి. బహుళజాతికంపెనీల ఒత్తిడి అమెరికా అధ్యక్షుడు ఒబామాపై పడింది. అందుకే ఒబామా భారతపర్యటన, అమెరికా ఎన్నికలతో వాగ్ధానాలు, మన మార్కెటు ఒబామా ఎన్నికల రేటింగు పెంచటానికి దోహదపడింది. అందుకు దాసోహమన్నవి మన పాలకవర్గాలు. ఒక వైపు అమెరికా, చైనా ప్రజలు వాల్‌స్ట్రీట్‌ వాల్‌మార్ట్‌ వ్యతిరేకంగా ఉద్యమిస్తూంటే మరోవైపు మన ప్రభుత్వాలు మోకరిల్లుతున్నాయి. ఫలితంగా మన పాలక వర్గాలు నయ వలసవాదానికి ఉతమిచ్చాయి. మన నిత్యావసర వస్తువుల గుత్తాధిపత్యానికి విదేశీ వస్తువులు ముమ్మరంగా దిగుమతికి దోహదబడ్తాయి. ఎగుమతులు గణనీయంగా దెబ్బతింటాయి. వాటితో పాటు వస్తువినిమయ సంస్కృతికి పేట్రుగిపోయి స్త్రీలపై మరింత హింస పెరుగుతుంది. విదేశీ నాగరికత సంబంధాలకు దెబ్బతిస్తుంది. సామాజిక సమస్యల దారి తీస్తాయి. మనము ఏ స్వాతంత్య్రం కోసం శతాబ్దాలు పోరాటామో అదే పొగోట్టుకునే దిశలో మనం ప్రయాణిస్తున్నాం.

పాలకవర్గాలు దేశస్వాలంబన దిశగా ఆలోచించక పోవడానికి మరో కోణం వుంది. కేంద్రమంత్రి వర్గం అంతా ప్రత్యక్ష సంబంధాలుతోనో, తమ బంధువుల ద్వారానో విదేశీ శక్తులతో కలిసిపోయి వున్నారు. సామ్రాజ్యవాద దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి వీరిి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ప్రాధమిక హక్కులను కాలరాస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతి దుష్పరిమాణాలు యిప్పటికే చవిచూస్తున్నది. ఒక వాదన ఏమిటటంటే కోమటి మర్వాడీ అగ్రవర్గాల చేతుల్లో వున్న రిటైల్‌ వ్యాపార రంగం బహుళాజాతికంపేనీల ప్రవేశంద్వారా విముక్తి పొందుతున్నది అనేది ఏ మేరకు వాస్తవం. చిన్న చితాకా వ్యాపారాలు చేసుకుంటున్న స్త్రీలు బడుగు వర్గాల పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఈ వాదన సరియైనదే అనుకుంటే మన ఇంటి దొంగనుంచి విదేశీ దొంగలైన బహుళా జాతి కంపెనీలకు తాళాలు ఇవ్వడమే. కుల తత్వం పోతుంది అన్న పేరుతో మరింత దోపిడీకి గురిచేయడమే. బ్రిటిష్‌ కాలంలో తమ సామ్రాజ్యవాద అవసరాల రీత్యా కొన్ని సంస్కరణలు వారు దేశంలో ప్రవేశపెట్టి తమ ప్రయోజనాలను సుస్థిరం చేసుకోవడానికి తెల్లదొరలు జిమ్కిక్కులు చేశారు. కాని నేటి మన నల్లదొరలు వ్యవస్థలోనే అసమనతలను సంస్కరించాల్సింది పోయి దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థను బహుళజాతి కంపెనీలకు, నయా సామ్రాజ్యవాదులకు స్వాధీనపరచుటకు ఎంతటి దేశద్రోహం! స్త్రీలు, కులవ్యవస్థకు బలయిన అట్టడుగు వర్గాలు భూస్వామ్య దురంహకారంగా బలైతే యీ ‘నయా పెట్టుబడిదారులతో మరింత దోచుకోబడతారు.

అంతేకాక మన దేశ సార్వభౌమాధికారాన్ని బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడం. అంటే మరెన్ని ఈస్టిండియా కంపెనీలకు ద్వారాలు తెరిచి మన ప్రజాస్వామాన్ని, స్వాతంత్య్రాన్ని వదులుకోవడమే! గత శతాబ్ది కాలంలో వున్న 8-9.5 వృద్ధి రేటు గణసాయంగా పడిపోతుంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతి వద్దని మన పౌరుల్ని తమ దేశాల నుంచి తరిమి వేస్తుంటే మన రిటైల్‌ రంగంలోకి మాత్రం అవేే దూసుకు వచ్చి ఆధిపత్యాన్ని నిలుపుకోవాలను కుంటున్నాయి. అందుకు మన పాలక వర్గాలు చేతకానితనమే కారణం.

2005 తర్వాత వచ్చిన చట్టాలు చూస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భూమికగానే ఆ చట్టాలు చేయబడ్డాయని గమనించ వచ్చు. ఆహార భద్రతా చట్టం, ఈ చట్టం ప్రకారం పేద ప్రజలకు ఆహారభద్రత కల్పించిదని చెబుతున్నారు. దీని ప్రకారం 120 కోట్ల భారతీయులకు సమతుల్యమైన ఆహారాన్ని అందించే ఆహారభద్రతకు గ్యారంటీ చేయబడటమంటే భారతదేశం మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. అందుకు మరింత భూమిని సేద్యానికి అనువుగా చేయాలిగాని వ్యవసాయ భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి రైతులను దెబ్బతీస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆహారానికి బదులు నగదు యిస్తారు. నగదు ఆహార ధాన్యాలకు ప్రత్యామ్నాయమా? లేక మార్కెటులో బడా బహుళజాతి కంపెనీల మార్గం సుగమయం చేయడమా? వైద్యఖర్చు, అప్పులు, తాగుడుకు పేద వర్గాలలోని పురుషులు నగదు ఖర్చయితే ఈ బడా కంపెనీలు ఆహార ధాన్యాల వ్యాపారాన్ని హాయిగా సాగించవచ్చు. ఆ తర్వాత నగదు పంపిణీి ఎలాగో ఆపేస్తాడు.

యిక రైతులనుండి ఆహార సేకరణ అవసరం ఉండదు. కాబట్టి రైతులకు మద్దతు ధర ఉండదు. ఇది కార్పొరేట్‌ శక్తులకు మంచి అవకాశం కల్పించాలన్న ముఖ్యోఉద్దేశమే. అలాగే ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం 2005 తీసుకున్న అంతే. పరిశ్రమలు, ఎగు మతులు, ఉపాధి పేరిట భూములు పారిశ్రామిక వేత్తలకు బదలా యింపు. పేదలకు సంక్షేమ పథకాలనుండి బయటకు గెంటేసి చిల్లర వ్యాపారంలో బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను ప్రోత్స హించి ప్రజాపంపిణి వ్యవస్థను, ఆహార ధాన్యాల సేకరణను విధ్వంసం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న రహస్య ఏజెండా! యిప్పటికి వరకు చరిత్రలో చూస్తే భూస్వాములు, పెట్టుబడిదార్లుగా మారడం చూస్తాం. యిప్పుడు పెట్టుబడిదార్లు భూస్వాములుగా రూపాంతరం చెందుతున్నారు. మరి యిక ఏకంగా మన భూమి మార్కెటు, మానవ వనరులు ఈ బహుళ జాతి కంపెనీలకు అప్పగించడానికి పునాది రిటైల్‌ రంగంలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు అన్నది యిప్పటి శీతకాల పార్లమెంటు సమావేశాలలోనే అర్థం అయ్యింది. అందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ రాజకీయ ప్రయోజనాలకోసయైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా విపక్షాలు ఈ తీర్మానాన్ని బలపరచలేదు. విపక్షాలు చర్చకు, ఓటింగ్‌కు మాత్రమే పట్టుబడితున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? విపక్షాలకు తెలుసు. స్వీకర్‌ ‘ఓటింగ్‌’కు అనుమతించాలా వద్దా అన్నది స్పీకరు విచక్షణా అధికారంపై ఆధారపడివుంది. కాబట్టి ఓటింగ్‌ జరిగితే మంచిదే లేకపోయినా ఫర్వాలేదు అన్న ధోరణి మన విపక్షాలలో వుంది. యిది మన ప్రజాస్వామ్యా ధోరణి.. కాదు విపరీత ధోరణులు. అయినా ఈ రాజకీయ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే కదా! తోడేళ్ళతో చేరి తరమడం, కుందేళ్ళలో కలిసి పారిపోవడం పార్టీల విధానమన్నది స్పష్టమైన అంశం.

స్వాతంత్య్ర ప్రకటన తర్వాత మన అనుభవం ఏమైనప్పటికీ ప్రజలవలన, ప్రజల చేత, ప్రజలకొరకు పాలించేబడే సర్వసత్తాక రాజ్యంగా ప్రజాస్వామిక దేశంగా పేర్కొనబడింది. కాని యిప్పుడు బహుళజాతి కంపెనీల వలన, బహుళజాతి కంపెనీల చేత, బహుళజాతి కొరకు పాలించబడే రాజ్యంగా మారబోతుంది. కాబట్టి దేశ పౌరులుగా, వెనుకబడిన వర్గాలకు చెందిన స్త్రీలగా, దళితులుగా, ఆదివాసీలుగా వీటికి వ్యతిరేకంగా పోరాడడమే ప్రథమ కర్తవ్యం. మరి ఒక్కసారి ఆలోచించండి! జీవించే హక్కును భద్ర పరుచుకుంటూ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్దపడవలసిన ఆవశ్యకత నేడు మనపైన ఎంతైన ఉంది…

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.