మాట్లాడే ప్రతిమాట వెనకా, మన దృక్పధం కనిపిస్తుంది. నామిని అని నాకో మంచి రచయిత మిత్రుడున్నాడు. ‘‘ఏంసార్ ఏంటి సంగతులు’’ అని తన ధోరణిలో చాలా అభిమానంగా పలకరిస్తాడు. ఈ సార్ అనే పదానికి జండర్ లేదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని పెద్దల్ని అందరికీ సంబంధించిన ఉమ్మడి పిలుపు అది.
మేడమ్ అనే మాటగాని పోనీ మనిషి పేరుగానీ ఆయనకెప్పుడూ గుర్తుండవట! తనకి స్నేహితులుగా వుండదల్చుకున్నవారు ఈ నియమానికి లోబడే వుంటారు. ఒకసారి బంజారా హిల్్స దగ్గర వుండే తనని కలిసి వస్తూ అక్కడ వున్న షాపులో మా తమ్ముడి పుట్టిన్రోజు కానుకగా మంచి చొక్కాలాగూ కొనడం కోసం తిరుగుతున్నాను. ఆరోజు నాతో నామిని కూడా వున్నాడు. షాపువాడు చూపించిన రంగులు నచ్చక గుట్టలకొద్దీ బట్టలు వెతుకుతున్నాను.
‘‘ఏంసార్ మీ ఫెమినిస్టులకి కూడా తమ్ముడంటే ఇంత ప్రేముంటుందా’’ అన్నాడు ఆశ్చర్యంగా. నేను దిగ్భ్రాంతిలో పడ్డాను.
‘‘ఫెమినిస్టులు తమ్ముళ్ళని ద్వేషిస్తారని ఎవరు చెప్పారు?’’ అనడిగాను.
‘‘అహ అలా అనుకున్నాను. అయితే మీరు వేరు మీ రచనలు వేరు’’ అని తీర్మానించాడు.
ఏ కారణంలేని ఈ రకం ఆరోపణలు తరచుగానే మనం ఎదుర్కోవాల్సి వస్తూ వుంటుంది.
ఫెమినిస్టులు మానవసంబంధాలు ధ్వంసం కావాలని ఎప్పుడూ కోరలేదు. మానవ సంబంధాల్లో వుండే అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు.
కానీ మనల్ని ‘‘ఫెమినిస్టులుగా కాక మనుషులుగా చూళ్ళేరా’’ అనే ప్రశ్న అడుగుతామని, అడగాలని ఎక్కువమంది ఎదురుచూస్తారు. ఈ ప్రశ్న ఎంత విసిగిపోయిన సందర్భంలోంచి వచ్చినా సరే అది ఆశించిన వాడికి విజయమే అవుతుంది. ఫెమినిస్టులా చూడొద్దు అంటే మామూలు సంప్రదాయ పెత్తన పరిభాషలోనే చూడమని అర్థం.
‘‘నన్ను భార్యగా తప్ప మనిషిగా చూడలేరా?’’
‘‘ తల్లిగా తప్ప మనిషిగా చూడలేరా’’
అని మన సినిమా నాయికలు వేర్వేరు సందర్భాల్లో అడుగుతూ వుంటారు.(ఆ సంభాషణలు రాసింది మగ రచయితలే) అంటే హక్కులూ, ఇష్టాయిష్టాలూ వున్న సాటిమనిషిగా చూడమనే అర్థం. సారాంశంలో ఫెమినిస్టులు అడుగుతున్నది అదే.
ఆడవాళ్ళ గుంపుకి ప్రమీలా రాజ్యం, ఆగ్రహానికి అలక, కోరికకి కులుకు అంటూ జనం పెడుతున్న పేర్లు ప్రత్యేకమైన దృక్పధానికి సంబంధించినవే.
సాధారణంగా మనల్ని ఆఫీసులో, బైటా, ‘ఏమ్మా’ అంటారు. పేరు చివర ‘ గారు’ చేర్చి మనం వాళ్ళని మర్యాదగా పిలుస్తున్నప్పుడు ఇలా అమ్మ, బొమ్మా అనడం చిరాగ్గానే వుంటుంది.
‘అమ్మా’ అని మనం బైట ఎవర్ని అంటాం? మనకంటే వయసులో కానీ స్థాయిలో కానీ చిన్నవాళ్ళని మాత్రమే అనగలుగుతాం. సాటి వాళ్ళని గాని పెద్దవాళ్ళని గాని పిలుస్తున్నప్పుడు ఈ పదం బావుండదు. కానీ మనల్ని అన్ని స్థాయిల్లోనూ, వయసుల్లోనూ అమ్మా అనే పిలుస్తారు. అదే గ్రహ భాషలో తిరిగి మనకంటే పెద్ద స్థాయిగాని సమస్థాయిగాని మనిషిని ‘ అయ్యా’ అనో ‘ అన్నా’ అని పిలిచి చూడండి. అంటే మగవాడెప్పుడూ బైట సాంఘిక స్థాయిలోనే గుర్తించబడాలని అనుకుంటాడు.
‘అమ్మా’ అనే పిలుపు ఒక భావజాలానికి సంబంధించినది మాత్రమే. ఈ పిలుపువల్ల యిచ్చామనుకుంటున్న గౌరవానికి, వాస్తవంగా దక్కుతున్న హక్కులకి, సామాజిక హోదాకీ మధ్య చాలా అగాధం వుంటుంది.
ఈ అగాధాల్లో మునకలు వేసే సహనం మనకింకా వుందా?
మంచి point చెప్పారండీ.