వాస్తవ చిత్రీకరణకు అద్దం పట్టిన నవల ‘తూర్పుగాలి’

తూర్పుగాలి పీలుస్తూ, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడిపేవారంతా, ఏదో కారణంతో పడమటిగాలి ప్రేరణకి లొంగిపోయినా, అంతరంగ తరంగంలో మాత్రం తూర్పుగాలి స్పర్శ పోగొట్టుకున్న వెలితిని అనుభవిస్తూనే వుంటారనే సత్యాన్ని భార్గవీరావ్ గారు కళ్ళకు కట్టించిన నవల ‘తూర్పుగాలి’.

తల్లితండ్రులందరి భావంలోనూ, అమెరికాలో ఇంజనీరుకి అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తే, ఆ అమ్మాయీ గొప్ప అదృష్టవంతురాలు, తామూ అదృష్టవంతులమే అనీ! – ఇది ఒక ఇంటి ఆలోచన కాదు. ఇంటింటి ఆలోచన.

అమెరికాలో ఇంజనీరు సుధాకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.కామ్ చదువుతున్న పద్మినిని వివాహం చేసుకోవటంతో కథ ప్రారంభమైంది, పెళ్ళయిన జంట హుసేన్ సాగర్ తీరంలో, ఓ మందార గుబురుని ఆనుకుని కూచోటం, ఎర్రని గోరింటాకు పండిన చేతులు, పారాణి పాదాలు అందంగా కనిపిస్తుంటే ‘‘వెళ్ళగానే పేపర్లు పంపిస్తావు కదూ’’ అంది పద్మిని…అసలు కథ ఇక్కడినుంచే మొదలు!! డిపెండెంటు వీసాపేపర్లు రెండు నెలల్లో వచ్చేయచ్చు!!-రచయిత్రి ఓ పది హేనేళ్ళలో పదిసార్లు అమెరికా వెళ్ళొచ్చిన అనుభవాలు మూట కట్టారిందులో.

‘తూర్పుగాలి’ అనే పేరు ఈ నవలకి ఎంత సార్థకమైందో, మొదటినుంచీ చూపారనిపిస్తుంది నవల చదువుతుంటే. ‘‘నీవు అమెరికా రావాలని కలలు కంటున్నట్టు, నేను ఇండియాకి వచ్చేయాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా’’ అని సుధాకర్ అనటం, ‘‘అమెరికా భూతల స్వర్గం అంటారు కదా నన్ను చూడనీ, తరువాత ఇద్దరం కలసి తిరిగి వచ్చేద్దాం’’ – పద్మిని అనటం, ‘‘భూతల స్వర్గం కాదోయ్, భూతాల స్వర్గం’’ డబ్బు, స్వేచ్ఛ, ఆకర్షణా అన్నీ పుష్కలంగా వుంటాయి. అక్కడుండి చూస్తేకాని తెలియదు లేనిదేమిటో. నేనూ ఓ ఐదేళ్ళుండి సంపాదించుకుని వచ్చేద్దామనే వెళ్ళాను… కానీ’’ ఆ ‘‘లేనిదేమిటో’’ మనసుకి హత్తుకునేలా చెప్పటం రచయిత్రి ప్రత్యేకత ఈ నవలలో.

‘‘మరో ఐదేళ్ళు, ఇద్దరం కలసి సంపాదించుకుని మన దేశం వచ్చేద్దాము, సరేనా’’ – సరేనని పద్మిని చెక్కిలిమీద సుధాకర్ పెదవులు చెప్పాయి – అంతే!! – ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళయిపోయింది – ఇదే తూర్పుగాలికై ఎదురుచూస్తూ అమ్మమ్మలు, తాతయ్యలు అయిపోతున్న మనందరి పిల్లల స్థితి ఇదే- అందుకే ‘‘తూర్పుగాలి’’ ఇంటింటి కథ.

పద్మిని అమెరికా జీవితానికి అలవాటు పడిపోయింది. ఇండియాలో పుట్టిన అబ్బాయి అనఘ, అమెరికాలో పుట్టిన అమ్మాయి అనన్య పెరిగి పెద్దవాళ్ళయిపోయారు. అయినా పద్మిని మాత్రం ‘‘మనం మటుకు బాగా సంపాదించుకుని వెళ్ళిపోదామండి. ఎంత సంపాదించినా చూసి సంతోషించేవాళ్ళు లేకపోతే ఏం ప్రయోజనం’’ అని భర్తతో అంటూనే వుంది.

భార్గవీరావుగారు ఇటు ఇండియా సంస్కృతిని జీర్ణించుకోటం, అటు అమెరికా సంస్కృతిని అర్థం చేసుకోటం వలన ఈ నవలలో గొప్ప సమన్వయం చూపించగలిగారు.

ఇండియాలో పుట్టిపెరిగిన అమ్మాయిలు అమెరికా వచ్చాక వారి భావాలు ఎలా వుంటాయో ఎంతో స్పష్టంగా చెప్తూ ‘‘అక్కడ ఇండియాలో వాళ్ళకి ఈ దేశం పట్ల ఎన్నో అపోహలు. అమెరికాలో చెట్లమీద డాలర్లు గుత్తులు గుత్తులుగా వుంటాయని, దిగగానే కార్లల్లో వెళ్ళి కోసుకోవచ్చనీ! ఎంత చెప్పినా అర్థం కాదు. జమిందార్లలా పెరిగిన అమ్మాయిలు కొంతమంది ఇక్కడ కొచ్చి ఇంట్లో పనివాళ్ళులేక, బయట పల్కరించేవాళ్ళు లేక, ఉద్యోగాల్లో ఇమడలేక పిచ్చెత్తిపోతారు’’ అన్నారు భార్గవీరావ్ గారు. ఇది పచ్చినిజం!!-

‘‘భారతదేశంలో వున్న అన్ని వసతుల్ని చెప్తూ, భారతదేశం యొక్క పురోభివృద్ధిని చెప్తూ, అమెరికాలో వున్న భారతీయులు దగ్గర కావాలనుకుంటారని, ఆధ్యాత్మికంగా అందరూ ఒకటైతే, ఎంత దూరంలో వున్నా అభద్రతా భావం తక్కువయ్యే అవకాశముంటుందని కూడా చెప్తూ మన ఆధ్యాత్మికతలో నమ్మకం పెరిగింది’’ అంటారు రచయిత్రి.

ఈ ‘తూర్పుగాలి’ చదివిన వారంతా ఇది మనకథే అనుకుంటారు నిస్సందేహంగా. మమతాబంధాలకు, పుట్టిన దేశానికి దూరమైన ఎందరి మనోభావాలనో అద్దంపట్టి చూసింది ‘‘ తూర్పుగాలి’’.

ఈ నవలలో మలుపు ఏమిటంటే ‘‘ఇక్కడ అమెరికాలో ఉద్యోగం చేసి, కాస్త సంపాదించుకుని, ఒక్క ఐదేళ్ళుండి మనదేశం వెళ్ళిపోదాం- ఒక్క ఐదేళ్ళలో వెనక్కి వెళ్ళిపోదాం – సరేనా’’- అంది ప్రీతి !! – ఎవరీ ప్రీతి !! – పాతికేళ్ళనాడే అమెరికా వచ్చి, ఐదేళ్ళలో మనదేశం వెళ్ళిపోదాం అన్న పద్మిని కోడలు!! – అందుకే అనిపిస్తుంది అక్కడ పడమట సంపాదన, ఇక్కడ తూర్పుగాలి !! – ఇది వాస్తవం!

ఇది ఇవాల్టి మనోవేదన కాదు కదా.

అదే సారాంశం ‘‘ తూర్పుగాలి’’ గొప్ప నవల, వాస్తవ చిత్రీకరణతో రచించిన భార్గవీరావ్ గారికి అభినందనలు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.