జూపాక సుభద్ర
యునైటేడ్ నేషన్స్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదాకా మహిళా సాధికారత గురించి, జెండర్ బడ్జెట్ గురించి మాట్లాడ్తున్నరు. అట్లనే రాజకీయ పార్టీలు ఉద్యమ సంఘాలు, ఎన్‌జివోలు డిమాండ్ చేస్తున్నయి. యివన్ని వింటు వుంటే చూస్తుంటే చాలా మంచి ఆలోచన అని సంబుర పడ్తాము. కానీ ప్రభుత్వాలు చేతల్లో జెండర్ బడ్జెండింగ్‌కు అందులో అణగారిన సమూహాల జెండర్ సాధికారతకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అమలు చేయడంలో ఎలాంటి ప్రయత్నాలు లేకపోవడం, ప్రత్యేక రూపకల్పనలు యివ్వడంలేదనే దానికి నిలువెత్తు సాక్ష్యం.ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం. యీ చట్టాన్ని దళితకులాలు, ఆదివాసి కులాలు ఎంతో పోరాడి సాధించుకున్నారు. స్వాగతించాల్సిందే. యిది యీ మధ్యనే రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో ఆమోదించబడి చట్టంగా రూపుదిద్దుకుంది. కాని యీ చట్టంలో దళిత, ఆదివాసీ.
మహిళల కోసం నిర్ధిష్టవాటా కేటాయింపులు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందనీ, దానివల్ల యీ మహిళలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు అంచునే వుండే పరిస్థితులే వుంటాయనేది దళిత, ఆదివాసీ మహిళల ఆందోళన.
ఎట్లాంటే రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలు మొత్తం (61+35) కలిపి 96 కులాల జాతులున్నయి. వీరి జనాభా మొత్తం సుమారు 2 కోట్ల 20 లక్షల దాకా వుంది. కుల సమాజ జనాభాలోనే అత్యంత దోపిడీ పీడనలకు గురవుతూ అవకాశాల చట్రం నుంచి నిరంతరం నెట్టి వేయబడుతూ, అణచివేతలకు గురవుతున్న ఎస్‌సి ఎస్‌టి సమూహాల్లోని ఆడవాల్లు యింకా నిర్లక్ష్య సమూహాలు. సంక్షేమ రాజ్యంగా సంక్షేమ ప్రభుత్వంగా చెప్పబడ్తున్న రాష్ట్రంలో మొట్ట మొదటి సంక్షేమ ప్రాధాన్యతలు యీ కులాల, తెగల ఆడవాల్లకే యివ్వాల్సి వుంది. కాగా గత ముప్పయి ఏండ్ల నుంచి ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చేయాల్సి వుండింది. కాని అట్లా కాక వారి నిధులు దారి మళ్ళించి పైలా పచ్చీసు చేసింది ప్రభుత్వం. రింగు రోడ్లకు, హైస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు, పర్యావరణ పరిరక్షణకు, మంత్రుల కార్లు కొనుగ్లోకు, కార్యాలయ సింగారాలకు లగ్జరీలకు ఎస్సీ ఎస్టీ సంక్షేమాల్ని తాకట్టు పెట్టింది. గత ముప్పయేండ్ల నుంచి దాదాపు ముప్పయివేల కోట్లకు పైగా ఎస్సీ, ఎస్టీ నిధులు ప్రభుత్వాలు పక్క దారి పట్టించి వారిని ఎదగనీయకుండా పేదరికంలోనే వుంచారని దళిత ఉద్యమకారులు తేల్చిండ్రు.
యిపుడు మనం చూస్తున్న ఎస్సీ కార్పోరేషన్‌లో లబ్దిదారులలో కనీసం 1% కూడా ఎస్సీ మహిళలుండరు. అట్లనే ఎస్టీ కార్పోరేషన్‌లో గిరిజన మగవాల్లే లబ్దిదారులు. బీసీ కార్పోరేషన్‌లో బీసీ మగవాల్లే లబ్దిదారులు. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్‌లో లబ్దిదారులంతా ఆగ్రకులాల మగవాళ్లే వుంటరు. నిజానికి యీ కార్పోరేషన్ అందరిది ఆడ, మగ, కుల మత భేదం లేకుండా ఎవరైనా లబ్దిదారులు కావచ్చు. కాని కింది కులాలమగ, ఆడ, అగ్ర కుల ఆడవాల్లు కూడా యీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్‌లో లబ్దిదారులైన దాఖలాలు చూడబోము. అట్లనే మహిళా కార్పోరేషన్. పేరుకు యిది అందరు మహిళలకు సంబంధించిన కార్పోరేషన్.కాని దీని లోన్స్‌అప్పులు, ప్రయోజనాలు పొందే లబ్దిదారులంతా అగ్రవర్ణాల మహిళలే. ఒకటి అర బిసీలు ఆడవాల్లు కనిపించినా, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు కానరారు. కార్పోరేషన్స్ యిట్లా కుల, జెండర్ పేరుతో ఆధిపత్యాలు ఆక్రమించుకున్న విధానాలున్నయి. మరి దళిత, ఆదివాసీ మహిళలు అటు కులం పేరు మీద జరిగే సంక్షేమాలు ఆ కులాల మగవాల్లు పొందుతున్నరు. జెండర్ పేరు మీద వచ్చేవి యిచ్చేవి అగ్రకుల ఆడవాల్లు సొంతం చేసుకుంటున్నరు.
మహిళా కార్పోరేషన్ మహిళా సాధికారతకోసం, సంక్షేమం కోసం స్వయం ఉపాధి పథకాలకోసం, వ్యవసాయ రుణాలకోసం ఏర్పాటైంది. కాని యీ కార్పోరేషన్‌లో రుణాలు తీసుకున్నవాల్లు లబ్దిపొందుతున్నదంతా అగ్రకుల ఆడవాల్లు. గూడెం, తండా ఆడవాల్లదాకా రావు. అసలు యీ కార్పోరేషన్ వుందనే సంగతి కూడా ఎస్సీ ఎస్టీ మగవాల్లకు, ఆడవాల్లకు తెలవనియ్యకుండా వున్నయంటేనే అర్థం చేసుకోవచ్చు. యిది రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళల పరిస్థితి. యిట్టి పరిస్థితులున్న కారణంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు గంపగుత్తలు, గుండు గుత్తలుకాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో ప్రత్యేకమైన జెండర్ బడ్జెట్‌ను రూపకల్పన చేయాలని దళత సంగాల్ని, మేధావుల్ని ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో చేయాల్సిన కొన్ని సవరణలు-
1. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ మహిళా జనాభాను ఒక ప్రత్యేక యూనిట్‌గా గుర్తించాలి. 2. ఎస్సీ, ఎస్టీ మహిళలకు నిర్ధిష్టంగా స్వయం ఉపాధి పథకాలు, యిండ్ల స్థలాలు, పేదరిక నిర్మూలన పథకాలు, ్యవసాయభూములు, రుణాలు యితర సంక్షేమ పథకాలను అందించే విధంగా యీ చట్ట సవరణలో రూపొందించాలి. 3.జోగినీ, మాన్యువల్ స్కావెంజర్స్, పారిశుద్య కార్మికులు, వికలాంగ ఎస్సీ ఎస్టీ మహిళకు ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా సవరణ చేయాలి. 4.కులం జెండర్ ప్రాతిపదికన నిధులు కేటాయింపులు జరగాలి.