డా. నార్ల లావణ్య
సమాజంలో వైషమ్యాన్ని, పురాతనాచారాలని, సమాజాన్ని కలుషితం చేసే అనేక రుగ్మతల్ని, దురాచారాలను వ్యతిరేకిస్తూ తనదైన శైలిలో అందంగా రాయటంలో సిద్ధహస్తులు నార్ల వెంకటేశ్వరరావుగారు. నార్ల వెంకటేశ్వరరావుగారు 1907 జబల్‌పూర్‌లో జన్మించారు. 8 సం||ల పాటు అక్కడే వుండి తరువాత కృష్ణాజిల్లా కౌతారం వచ్చారు.
నార్లవారు పలు సంపాదకీయాలు, సాంఘిక, పౌరాణిక నాటికలు, జీవితచిత్రాలు, అనువాదాలు, పద్యాలు… ఇంకా అనేక ప్రక్రియల్ని చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. మానవుని స్వేచ్ఛను అరికట్టేవి ఏవైనా వాటిని ఎదిరించి పోరాడటమే తన కర్తవ్యంగా ఉండేవారు. ఆ ఆశయాలతో అనేక రచనలు చేశారు.
నార్లవారు సాహిత్యంలోకాని, వారి జీవితంలోకాని స్త్రీకి సముచితస్థానం కల్పించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో మాలతీచందూర్‌గారి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘ప్రమదావనం’ అనే శీర్షికను ప్రారంభించారు. అంతేకాదు రచనారంగంలో ఎంతోమంది రచయిత్రులను ప్రోత్సహించారు.
స్త్రీ స్వాతంత్య్రం అనే సంపాదకీయంలో ‘నేటి భారతీయ సంస్కృతి జీవనదివలె అవిచ్ఛిన్నంగా ప్రవహించడానికి కారణం భారతనారి. ఆమె అన్ని విధాల అణిచివేయబడుచున్నప్పటికి మన ఆచారవ్యవహారాలను, భారతీయ సంప్రదాయాలను కాపాడుతూ వచ్చింది. అందులో ఉత్తమమైనవి, అధమాధమమైనవి వున్నాయి కాని ఆమె మంచిగాని, చెడుగాని వంశపారంపర్య పద్ధతులకు భిన్నంగా పోరాదని కాంక్షించినది కాబట్టే మన సంస్కృతి ఈనాటికీ మిగిలివుంది.”
ఆమె కాపాడిన సంస్కృతి ఇంకా ఉన్నతంగా, ఉజ్వలంగా ప్రకాశించలేకపోవడానికి కారణం ఆమెకు సమాజంలో, గృహంలో ఆలోచించటానికి, స్వతంత్రంగా నడుచుకునే స్వాతంత్య్రాన్ని ఇవ్వలేకపోవటమే అని ఆయన ఉద్దేశ్యం. అంతేకాక ఆమెను ఇంటికి నాలుగుగోడల మధ్య బంధించి ఆమెను విద్యకు, విజ్ఞానానికి, స్వాతంత్య్రానికి దూరం చేశారు. ఆమెను వాటన్నింటికి దూరం చేసిన కారణంగానే మానవజాతి ఉన్నతంగా ప్రకాశింపలేకపోయింది. స్త్రీజనాభివృద్ధి, స్త్రీ స్వాతంత్య్రం అంటే కేవలం స్త్రీలకి సంబంధించిన విషయం కాదు. అది మొత్తం మానవజాతికి సంబంధించిన విషయమని ఆయన అభిప్రాయం.
‘భారతనారి’ అనే సంపాదకీయంలో భారతస్త్రీకి స్వాతంత్య్రం నిరాకరించిన కారణంగానే భారతజాతి స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. ఆమెను చదువుకు దూరం చేసిన తరువాతే అజ్ఞాన, మూఢాచారాలు ప్రబలినవి. ఏ జాతి పతనమైన స్త్రీజాతి పతనంతో ప్రారంభం కావడంవల్లనే కాబోలు సంఘ సంస్కరణోద్యమాలు, జాతీయ పునరుజ్జీవనోద్యమాలు పుట్టినాయి. భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి ప్రధానకారణం భారతనారిలో ఆత్మస్వరూపాన్ని శక్తిని గ్రహించటం, గుర్తించడమే. తన శక్తిసామర్థ్యాలను గుర్తించిన నారి స్వాతంత్య్ర సంగ్రామంలో అడుగుపెట్టింది. నాటినుండి నేటివరకు అది ముందుకే పోతున్నది అని వివరించారు.
గడిచిన నూరేళ్ళలో పాశ్చాత్యదేశాలు సాధించలేకపోయిన పురోగతి గడిచిన 30 సంవత్సరాల కాలంలో భారతనారి శీఘ్రగతినే సాధించగలిగింది. పాశ్చాత్యదేశాలు ఓటింగ్ హక్కుకోసం సత్యాగ్రహాన్ని చేయవలసివచ్చింది. కాని భారతనారికి అటువంటి అవసరం కలగలేదు. ఇప్పటికి పాశ్చాత్య స్త్రీలు అన్ని పదవులకు అర్హులు కారు. కాని భారతీయ మహిళ పొందని పదవులు లేవు.
కాని స్త్రీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురోగమించిన నాడు మరియు ఆమె ప్రతిష్ట ఇనుమడించిననాడు ప్రతి రంగం కొత్త శక్తులతో, నూతనోత్సాహంతో పరుగులు పెడుతూ అభివృద్ధిదిశగా వెళుతుంది. భారతనారితోపాటుగా పతనమైన భారతదేశం తిరిగి ఆమెతోపాటు తలెత్తుతుంది. ఇది తథ్యం అని నార్లవారు విశ్వసించారు.
తెలుగులో ఆధునిక కవిత్వం, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వాలు రాజ్యమేలుతున్న సమయంలో నార్లవారు వాటిలో దేనితో మమేకం కాకుండా ‘వేమన’ ప్రభావంతో ‘నవయుగాల బాట నార్లవారి మాట’ పేరుతో వేమన పద్యాల రీతిలో పద్యాలు రాశారు. తేలికమాటలతో (తేట), సుందరమైన శైలిలో పద్యరచన చేయటం నార్లవారికి ఇష్టం. నార్లవారి పద్యాలలో చమత్కారం, గడుసుదనం, వ్యంగ్యం, నీతి పుష్కలంగా వున్నాయి.
వారి పద్యాల ద్వారా వివాహవ్యవస్థ యొక్క తీరుతెన్నులని వరకట్న దురాచారాలని తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం రచనల ద్వారానే కాకుండా నిజజీవితంలో కూడా 1938 ఏప్రిల్ 24 చెన్నయ్‌లో సులోచనాదేవి గారిని ఏవిధమైన కట్నకానుకలు, హంగూ ఆర్భాటాలు లేకుండా రిజిష్టరు మ్యారేజి చేసుకున్నారు. అది ఈనాడు సర్వసాధారణం కావచ్చు. కాని అది ఆనాడు ఆదర్శవివాహం. అంతేకాదు వారు తమ పిల్లలకి కూడా అలాంటి పెళ్ళిళ్ళే చేశారు. ఎవరికీ కట్నాలు ఇవ్వలేదు. తీసుకోలేదు. వారు వారి ఆశయాలని, ఆదర్శాలని కేవలం రచనలలోనే కాకుండా నిజజీవితంలో ఆచరించి చూపారు.
మన వివాహవ్యవస్థలోని కన్యాదానం పద్ధతిని ఆయన పూర్తిగా వ్యతిరేకించేవారు. ఆడపిల్ల ఏమైనా వస్తువా దానం చేయటానికి? అలా చేయటాన్ని ఆ కన్నెపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరచడమేనని ఆయన భావించేవారు.
”వాడు కొనగనొక్క వస్తువు సాటిగా
భార్యనెంచుకొనుట పాడికాదు
పరువు కాదు భార్యపళ్ళెము కాదురా
నవయుగాల బాట నార్లమాట”
మన వివాహవ్యవస్థలో ప్రధానంగా చోటుచేసుకొనెడి డబ్బు (కట్నం) ప్రసక్తి లేని వివాహసంబంధాలు ఉండుట చాలా తక్కువ. దాన్ని నిరసిస్తూ నార్లవారు ఇలా అన్నారు.
”బ్రతుకులో సగము పంచిపెట్టగ పెండ్లి
అందుకొనగ కాదు ఆస్తి కొంత
ఆస్తి కొరకు పెండ్లి అధమాధమమ్మురా!”
అని వివాహవ్యవస్థలోని డబ్బు, ఆస్తి పద్ధతిని విమర్శించారు. అంతేకాకుండా విద్యాధికుడైన పురుషుడు కూడా దానిని వ్యతిరేకించకపోవడం ఆయనకి నచ్చలేదు. వారు వివాహపు మాటలను ‘సంతలోని పశువుల బేరం’తో పోల్చారు.
”పాట సాగవచ్చు పశువుల సంతలో
పాట సాగనేల వరుని కొరకు
పరిణయమ్ము ఫక్తు పశువుల బేరమా?”
అప్పటికి, ఇప్పటికి అనేక విషయాలలో మార్పులు వచ్చినాయి. కాని వివాహవ్యవస్థలో, స్త్రీ విషయంలోను మార్పులేదు. ఆనందంగా భర్తతో జీవితం గడపవలసిన యువతులు వరకట్న దురాచారానికి తమ జీవితాన్ని ప్రాణాలను కోల్పోతున్నారు.
”కోరినట్టి వెల్ల కోడలు తేకున్న
కాల్చి చంపు జాతి కటిక జాతి
కటిక జాతి బ్రతుకు కంపురా, గబ్బురా!” అని తన వాదన. ఈ రీతిన వెల్లడించారు.
వరకట్న దురాచారం పెరగటానికి స్త్రీ కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అత్తా తాను కూడా ఒకనాడు కోడలే అన్న సంగతి మర్చిపోయి కోడలిని హింసిస్తుంది. ఇంటిలోని భర్తతోపాటు ఆదరించవలసిన అత్తే హింసిస్తుంది. అప్పుడు అది ‘కాపురం కాదు కత్తుల బోను’ అవుతుంది అని అన్నారు.
”అత్త తిట్టిపోయ, ఆడబిడ్డలు మొట్టు
మామ కసురుకొనగ, మగడు తన్న
కొత్త కాపురమ్ము కత్తుల బోనురా!”
వరకట్న దురాచారం రూపుమాపటం స్త్రీల చేతులలోనే ఉందని వారి విశ్వాసం. విద్యాధికులైన యువతులు కట్నాలు కోరేవాళ్ళను పెళ్ళి చేసుకోనని అవసరమైతే అవివాహితగా ఉంటానని హెచ్చరిక చేయమంటున్నారు.
”కట్నమిచ్చి మగని కట్టుకొనుట కంటె
మంచిదమ్మ పెండ్లి మానుకొనుట
రొక్కమిచ్చి కొనగ ఒక్కడె కానేల?”
మన ధర్మశాస్త్రాలు, పురాణాలు స్త్రీలకి చాలా అన్యాయం చేస్తున్నాయి. స్త్రీ, పురుషుని సుఖంకోసం, క్షేమంకోసం సర్వం త్యాగం చేస్తుంది. వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు.
”ప్రతి పురాణమందు పతిభక్తి మహిమను
నూరిపోయు కథలు మూరుమార్లు
మాయ నిజము కింద మాడిపోయిన కల్ల”
…..
”తిట్టి, మొట్టి, కొట్టి పుట్టెడు కష్టాలు
పెట్టు మగడు కట్టిన తాళి
అట్టిపెట్టుకొన్న గట్టెక్కలేవమ్మ”
స్త్రీ లేనిదే సృష్టి లేదని, పురుషుని జీవితం స్త్రీ లేకపోతే సార్ధకం కాదు అనెడివారు. స్త్రీపురుషుల సమానత్వంలోనే ప్రపంచం ఉంది.
”నరుడు లేక నారి పరిపూర్ణ కాలేదు
నారిలేక నరుడు దారితప్పు
నూరు కలల పంట నారీనరుల జంట”
స్త్రీ, పురుష లింగభేదములను పూర్తిగా వ్యతిరేకించారు. తల్లి కూడా బిడ్డలలో భేదము చూపించుట పాడికాదే అని నిక్కచ్చిగా చెప్పారు.
”కూతుల నొకరీతి, కొడుకుల నొకరీతి
ఆదరించు తల్లి అధమురాలు
బిడ్డలందరొకటి భేషన తల్లికి”
”తల్లి యొకతె సాకు పిల్లలెందరినైన
ఉంగలోన ప్రేమ రంగరించి
తల్లి యొక బరువు పిల్లలెందరికైన”
వివాహ వ్యవస్థ కానివ్వండి, లేక ఇతర సామాజిక, సంస్కరణలో సాంస్కృతిక రంగంలో పురోగతి కానివ్వండి నాయకత్వం వహించవలసింది స్త్రీ. స్త్రీ బాహ్యాలంకరణ, వస్త్రాలంకరణలో కనబడుతున్న నవ్యత మార్పు స్త్రీ మనస్సులో, విశ్వాసాలలో, జీవితవిధానంలో మార్పు జరగవలసి వున్నది. ఆ మార్పు రానంతవరకు మన దేశంలో వరకట్న హత్యలు తప్పవు. స్త్రీకి హీనస్థితి తప్పదు. అందువలన స్త్రీ విద్యావంతురాలై అన్ని రంగాలలో ఉన్నతంగా రాణించిననాడు జాతి పురోగమిస్తుంది అని అనేవారు.