మాఘ సూర్యకాంతి

బండారి సుజాత

కథా పరిచయం : ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో కథనం చేసే స్త్రీకి పెద్ద కూతురు కమల, రెండవ కూతురు శ్యామల కాక ఇద్దరు మగ పిల్లలు.

వారిది మధ్య తరగతి కుటుంబం ఆమెకు చిన్నప్పుడే పెళ్ళయింది. అత్త, మామ, ఆడపడుచు, మరుదులతో సఖ్యంగా మెలుగుతూ కాపురం చేసింది. నలుగురు పిల్లలను కన్నది. భర్త కనుసన్నలలో మెదులుతూ ఏనాడు ఎదురు చెప్పకుండ అందరితో చక్కని ఇల్లాలు అనిపించుకుంది.

భర్త ఉద్యోగపు బదిలీతో ఊరు మారిన తరువాత ఇరుగు పొరుగులతో మాట్లాడడం, ఏవైనా పుస్తకాలు చదవడం, పనిలేనప్పుడు మంచం మీద పడుకోవడం, పగలు కూడ భర్తతో మాట్లాడే సౌకర్యం ఇవన్నీ ఆమె జీవితం లోకి ప్రవేశించాయి. అయినా కొన్నాళ్ళు స్వంత కాపురంలో కూడ ఎవరో తనని గమనిస్తున్నట్లు ఇలా చేస్తున్నావేం? అని అడుగుతున్నట్లు అనిపించేది.

పెద్ద కూతురు కమలని కాన్వెంటులో చేర్పించాలనిపించినా భర్త నిర్ణయం మేరకు మామూలు స్కూల్లోనే చదివించాల్సి వచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత కమల తండ్రితో మారాం చేసి ఆడపిల్లల కాలేజిలో ఆర్ట్స్ గ్రూప్లో చేరింది. కమల డిగ్రీ టైపు షార్టుహ్యాండ్ పాసయి తను చదువుతున్న కాలేజీలోనే టైపిస్టుగా ఉద్యోగంలో చేరింది.

సంపాదిస్తున్న కూతుర్ని చూసుకుని ఆ తల్లి చాలా గర్వపడుతుంది. వయసు తెచ్చిన వన్నెతో, చదువు ప్రసాదించిన వర్చస్సుతో తమ్ముళ్ళకి చదువులో సాయం చేస్తూ, ఇంట్లో పనిలో పాలు పంచుకుంటూ ఉండే కమలంటే తల్లికి ఎంతో ఇష్టం.

అరవై ఏళ్ళ పంతులుగారు దత్తు తెచ్చుకున్న కుర్రాడితో కూతురి పెళ్ళి నిర్ణయిస్తాడు తండ్రి. అతడు డిగ్రీ పాసయ్యాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. వారికి ఎక్కువ కట్నం అవసరం లేదని తండ్రి ఆ సంబంధానికి మొగ్గాడు. ఆస్తి లేకపోయినా ఫర్వాలేదు ఉద్యోగం ఉన్న వాడ్ని చేసుకుంటానంటుంది కమల. పల్లెటూరు వెళితే ఉద్యోగం ఉండదు. ఇంత చదువుకుని వాళ్ళకు సేవలు చేయాలా? అంటే చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారా? రేపో, మాపో అతనికి ఉద్యోగం వస్తే మీరు ఇక్కడికే వస్తారు అని కమలకు సర్ధి చెప్పి కమల పెళ్ళి చేస్తారు.

మొదట్లో గొడవ చేసిన కమల పెళ్ళిలో సంతోషంగా ఉండటమే కాకుండా వెళ్ళేప్పుడు హుషారుగా వెళ్ళి పదిరోజులు తిరగకుండానే భర్తతోపాటు వచ్చేస్తుంది.

కమల భర్త రవికుమార్ మొహమాటం లేకుండ అరడజను సార్లు కాఫీ, మధ్యాహ్నం టిఫిన్, సాయంత్రం సినిమాకు వెళ్ళేవాడు. రోజు రెండు మూడు జతల బట్టలు విప్పి పెట్టడం, గదినిండా కాల్చేసిన సిగరెట్లు, శ్యామలతో చవకబారు హాస్యం ఆడేవాడు. ఇదంత చూసిన కమల తల్లికి అసంతృప్తిగా వుండేది కాని మొదటినుండి ఆలోచనలు బహిర్గతం చేసే అలవాటు లేదు కనుక సరిపెట్టుకొని ఉండేది.

రాత్రి కడిగిన ముత్యంలా గదిలోకి వెళ్ళిన కమల తెల్లవారే సరికి ఉబ్బిన కళ్ళతో, డొక్కుపోయిన మొహంతో కనపడేది. ఎవరూ చూడకుండ బాత్రూమ్లో దూరి మొహం కడుక్కుని నోరు పులుముకొని వచ్చేది. ఒక్కోరోజు చిట్లిన పెదవులతో కనిపించేది. పదిరోజుల తర్వాత తిరుగు ప్రయాణమైన భర్తతో తాను వెళ్ళనని మొరాయిస్తుంది. మరునాడు కాలేజికి వెళ్ళి కమల ఉద్యోగంలో చేరుతుంది.

తరువాత ముసలాయన వచ్చి తీసుకువెడతానన్న కమల వెళ్ళనంటుంది. చిన్నపిల్ల వారం రోజుల్లో మేము తీసుకుని వస్తామని సర్దిచెప్పి ముసలాయనను పంపిస్తుంది తల్లి. నీ మూలంగానే కూతురు ఇలా అయ్యిందని భార్యను కేకలు వేస్తాడు భర్త.

ఎవరెన్ని చెప్పినా కమల వెళ్ళలేదు. కాలం ఆగలేదు దీపావళి వచ్చింది. ముసలాయన దీపావళి పండక్కి అల్లుణ్ని పంపుతున్నానని నాలుగు రోజులుంచుకుని ఇద్దర్ని పంపించండని ఉత్తరం వ్రాస్తాడు.

రవికుమార్ రాక కమలకు సంతోషాన్ని కలిగించదు. భర్త, మామ కలిసి చేసే లైంగిక వేధింపులు భరించలేనని చెప్పి ఆ కాపురం తనకు వద్దని చెప్తుంది కమల. మన పిల్లని మనం రక్షించుకుందామని తల్లి చొరవ చూపడంతో కథ ముగుస్తుంది.

కథా విశ్లేషణ : ఈ కథ రెండు తరాల స్త్రీల స్వభావాన్ని, జీవితానుభవాన్ని, ఆలోచనలను, ఆసక్తులను, కుటుంబ వ్యవస్థా స్వభావాన్ని తెలియచేస్తుంది.

తల్లి తరం స్త్రీలు తమ జీవితంలో అన్నింటిలో పరాధీనులే. ఎక్కువమంది విద్య, ఉద్యోగం లేనివాళ్ళే, కుటుంబంలోని వారు చెప్పినట్లు నడుచుకోవడమే వారి జీవిత ధర్మం స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు వున్నా వాటిని బహిర్గతం చేయరాదు. చేసినా వాటికి ఎవరు విలువనిచ్చేవారు కారు.

అత్తింట్లోను, పుట్టింట్లోను అందరికి తలలోని నాలుకలాగుంటేనే ఆ స్త్రీకి గౌరవం. స్త్రీల నుండి ఏదైన చిన్న పొరపాటు జరిగినా పుట్టింటి మర్యాదకు భంగం కలుగకుండ లోపల ఎన్ని బాధలున్నా భరించాల్సిందే.

తల్లితరంలో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు. అందులో ఉన్న ప్రతివారికి కావలసిన సౌకర్యాలు అమర్చివారి మెప్పు పొందడం తలుపు చాటునుండి మాట్లాడడం, పెద్దల ఎడల భయభక్తులు ప్రదర్శించడం చాప మీద మాత్రమే కూర్చుని తలుపులు రాత్రి గడియపడ్డ తరువాతనే భర్తతో మాట్లాడి, ఆయన కనుసన్నలలో నడవడమే ఆమె జీవితం. ఈ శిక్షణలో వారందరి కోసమే తను అనే దృక్పథాన్ని స్త్రీలు అభివృద్ధి చేసుకోవడం, అనివార్యంగా జరుగుతుంది.

కొత్తతరం స్త్రీలు కలిసి వచ్చిన అవకాశాలతో చదువుకొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమ మనోభావాలను ధైర్యంగా బయట పెట్టడంలో స్వయం నిర్ణయాధికారంతో తమ జీవిత దృక్పథాన్ని నిర్మించుకొనడంలో చొరవ చూపిస్తున్నారు.

మాఘసూర్య కాంతి కథ ఆ విధమైన రెండు తరాల స్త్రీల కథ. ఒకరు కమల తల్లి, రెండవ వారు కమల. తల్లి నడి వయస్సు స్త్రీ ఉత్తమ పురుషలో ఆమె ఈ కథంతా చెప్తుంది. తన తరం స్త్రీలందరిలాగే ఆమెను కూడ పెద్దలు చదివించలేదు. బడికి పంపి చదివించకున్నా స్త్రీ ఏవిధంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో చెప్పే విద్య, శిక్షణ కుటుంబంలో ఆమెకు లభించాయి. పదహారేళ్ళు వచ్చేసరికి తల్లి సుమతి శతకం, కుమారి శతకంలోని పద్యాల తాత్పర్యం నూరిపోసింది. భర్తే నీకు దైవం. అతనేమన్నా ఓర్పు వహించు, మాట తూలకు అన్నింటికి సర్దుకుపో అని హితవు చెప్పింది. స్త్రీకి గృహకృత్య నిర్వహణమే ప్రధాన విద్య అయినప్పుడు, భర్త గురువు అయినప్పుడు స్త్రీకి ఇవ్వాల్సిన విద్య అంతా ఈ సూత్రీకరణతోనే అంగీకరించబడుతుంది.

పమిటలు వేసుకోవడం మొదలు పెట్టిన కొన్ని నెలలకే ఆమెకు పెళ్ళి అయింది. తండ్రి ఇష్టప్రకారమే ఆ సంబంధం నిర్ణయమైంది. అబ్బాయి బావున్నాడా? లేడా? ఎటువంటివాడు? కుటుంబం ఎలాంటిది? అనే ప్రశ్నలు ఆనాడు ఆమెకాని, ఆమె తల్లి కాని వేయలేదు. స్త్రీల జీవితాలను నిర్ణయించడంలో పురుషుడి పాత్ర ప్రదానమైనది. స్త్రీల ఆలోచనలకు, అభిప్రాయాలకు అందులో తావు లేదు.
తండ్రి నిర్ణయించిన పెళ్ళికి తలవంచి తాళి కట్టించుకుని తల్లి చెప్పి హితవులతో తన జీవితాన్ని ఒద్దికగా నిర్దేశించుకుని ఏ ఆలోచనను బహిర్గతం చేయకుండ ప్రతి దానికి సరిపెట్టుకుంటూ దాంపత్య జీవితాన్ని మెస్తూనే వచ్చింది ఆమె.

ఉమ్మడి కుటుంబంలో ఆమె సంసారం ఇంట్లోవాళ్ళ అవసరాలు బంధువుల అవసరాలు చూసుకొనడం ఇంటి కోడలిగా ఆమె బాధ్యత ఆ బాధ్యతను సహనంగా మోసింది కనుకనే బంధువుల మెప్పు పొందగలిగింది. అందుకు ఆమె లభించిన ప్రతిఫలం ఇంటిపని భారం ఎక్కువ కావడం వలన వచ్చిన అలసట. దానితో కళ్ళకింద చర్మం నల్లబడింది. పనిచేసి చేసి అరచేతుల్లో నల్లటి గీతలొచ్చాయి.

రాత్రైన తరువాతనే భర్తతో రెండు మాటలు మాట్లాడుతూ ఓద్దికగా చేసిన సంసారం, ఫలితంగా ఇరవై ఆరేళ్ళ వయస్సుకు ఆమె నలుగురు పిల్లల తల్లైంది. ఫలితంగా ఆమెకు లభించింది తలకట్టు మూడొంతులు రాలిపోవడం, పొత్తికడుపు పెరగడం, తనకు నాలుగోవాడు పుట్టినప్పుడు పెళ్ళి చేసుకున్న తన స్నేహితురాలు ఇంకా పదహారేళ్ళ పడుచులా ఉండటం చూసి ఆమెకు లోలోపల దిగులు.

”నడుములు విరిగే చాకిరీలో నలిగి
గుక్కపట్టిన పిల్లల ఏడుపుల మధ్య ఊహించని
స్త్రీలు….
ఇన్నాళ్ళ అమానవీయ హింసలో
చివరకు గర్భంపై ప్రసవ చారికలు మాత్రమే దక్కిన స్త్రీలు…” అని
విమల ఏ స్త్రీల గురించి చెప్పిందో ఆ స్త్రీలకు ప్రతినిధిగా కనపడుతుంది తల్లి.

ఉమ్మడి కుటుంబంలో అందరికి అన్ని పనులు చేస్తూ శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతూ, గృహస్తు ధర్మాన్ని నిర్వహిస్తూ శరీరంలో వచ్చే పరిణామాలకు నిస్సహాయంగా అనుభవిస్తూ ఉండే ఆమెకు తన శరీరం మీద కాని, పిల్లలమీద గాని ఏ హక్కులు లేవు. పిల్లల్ని కనటంలో కష్టం తనదే అయినా ఎంతమందిని కనాలో ఎప్పుడు ఆపాలో నిర్ణయించేది అతనే. ఇక పిల్లలు చాల్లే అని భర్త అనే వరకు ఆమె పిల్లల్ని కంటూ ఉండటం దానినే సూచిస్తుంది. ఇక పిల్లల జీవితాలను తీర్చిదిద్దే అధికారం కూడ ఆమెకు లేదు. నిర్ణయాధికారంలో పాత్ర కూడ కాదు. ఆమె అభిప్రాయాలకు విలువ లేదు. తన పెద్ద కూతురు కమలను కాన్వెంటులో చదివించాలని ఆమెకు వున్నా అది జరగలేదు. కూతురి పెళ్ళి విషయంలో కూడ భర్త ఏ రకంగా కూడా ఆమె అభిప్రాయం అడగలేదు, తెలుసుకోలేదు తన అభిప్రాయం ప్రకారం తను తెచ్చిన సంబంధానికి ఒప్పుకునేట్లు కూతుర్ని ఒప్పించాల్సిన బాధ్యత మాత్రమే ఆమెది.

తన పెళ్ళి తన ఇష్టాఇష్టాలతో జరగలేదు. పమిటలు వేసి వేయగానే జరిగిన పెళ్ళి తనకంటూ అభిప్రాయాలు ఏర్పరచుకునే వయసు లేదు, చదువు లేదు, సామాజిక జీవితానుభవం లేదు. ఈనాడు కూతురుకి చదువుంది. తనగురించి తాను ఆలోచించుకొనగలిగిన అభిప్రాయాలు ఏర్పరచు కొనగలిగిన వయసు ఉంది.

వాటిని అమలు చేసుకొనడానికి ఎవరి అధికారానికి తలవొగ్గాల్సిన పరిస్థితి లేదు. ఆమె ఉద్యోగం చేస్తున్నది. కనుక ఆర్ధికంగా స్వతంత్రురాలు. అయినా భర్త కూతురి పెళ్ళి తన ఇష్టప్రకారమే జరగాలన్నాడు. తన ఇష్టానికి అనుకూలంగా ప్రవర్తించేటట్లు కూతురికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదేనని చెప్పకనే చెప్పాడు”. ”పిల్లకెలాగైనా నచ్చచెప్పక ఆముదం మొహం పెట్టుకు చూస్తావేం”, అని కోప్పడ్డాడు కూడ. అందువలన కూతురికి నచ్చచెప్పి తల్లిగా తన బాధ్యతను నిర్వహించింది ఆమె.

ఇల్లు ఇల్లాలు అంటారు కాని ఇంటి పెత్తనంలోగాని నిర్ణయాలు తీసుకొనడంలో గాని ఆమె మాటకు ఎలాంటి విలువ లేదు. ఇల్లాలు అంటే ఇంట్లో జీతం, భత్యం లేకుండా అందరికి తలలోని నాలుకలా పనిచేసేదిగా వుండటమే.

ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వరకే ఆమె పని. ఇంటి చాకిరికి ఆమె బ్రతుకును పరిమితం చేయడం అందులోని సారాంశం. ఇంటి విషయాలలో తన విషయాలలో పిల్లల విషయాలలో తుది నిర్ణయాలు భర్తవే.

”తాను కొనుక్కునే చీర నుండి తాను చేసే పూజ వరకు” అతని నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయన్న స్పృహ, దాని పట్ల కొంత నిరసన చైతన్యం కూడ ఆ తల్లిలో కనిపిస్తాయి. అంతేకాదు అతని సరదాలే అందరు తమ సరదాలుగా చేసుకుని, అతని కిష్టమైన రీతిలో భార్యపిల్లలు ప్రవర్తిస్తూ ఉండటం భర్తకు ఇష్టం. ఆ రకంగా అతను అందరినీ నియంత్రిస్తాడు కూడ. అతను మగవాడు కనుక. ఇంటికి పెద్దవాడు కనుక సంపాదించి తెచ్చేవాడు కనుక అతను చెప్పినట్లు ఆ ఇంట్లో అమలవుతుంది.

పండగ వచ్చిందంటే పిల్లలు సంతోషంగా ఉండాలని వాళ్ళడిగినవన్ని కొనివ్వడం, పండుగంటు పదిరకాల వంటకాలు చేయమని పురమాయించడం భర్త అలవాటు, అభీష్టం. అది ఆమెకు ఇష్టముండదు. మధ్య తరగతి కుటుంబం కనుక ఒకేరోజు అంతలేసి ఖర్చుచేసి ఆ తరువాత బాధపడటం ఎందుకని ఆమె ప్రశ్న? ఈ ప్రశ్న భర్తను అడిగినా వాదన పెట్టుకున్నా చివరకు ఆమె ఓడిపోవాల్సి వస్తుంది. ఆ ఫలితమే ఆమె ఓడి పోయే స్థితిలో ఉండటం. ఎలాగు ఓడిపోవడం ఖాయమేనని అనుభవం తెలిసిన గృహిణి కనుక అతను చెప్పినట్లు నడవటం ధర్మమని, మౌనమే శరణ్యమని సరిపెట్టుకునే స్థితికి వచ్చి జీవిస్తున్నది ఆమె. రాజీ లేకపోతే స్త్రీలకు జీవితం లేదని, ఇందువల్ల స్పష్టం. స్వంత కాపురంలో కూడ వెనుక నుంచి ప్రతి పనిని ఎవరో గమనిస్తున్నట్టు ఇలా చేస్తున్నావేం? అని తను సంజాయిషి అడుగుతున్నట్లు ఆమెకు అనిపించేదంటే ఇన్ని నియంత్రణల మధ్య, ఇంట్లో నిత్య నిర్భంధంలో గడిపిన జీవితానుభవాల వల్లనే అని అనుకోవలసి వస్తుంది.

పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో అనుభవించిన ఈ పరోక్ష హింసవల్ల ఆర్థిక స్వాతంత్య్రం లేని అశక్తత వల్ల తనలోతాను మధన పడుతూనే జీవించిన ఆమె జీవితం నేర్పిన అనుభవాల నుండి పదునెక్కిన చైతన్యంతో తన కూతురి సమస్య విషయంలో తాను చొరవ చూపించడానికి ముందుకు వచ్చింది. ఇష్టం లేని కాపురం వద్దనుకుంటున్న కమలకు తాను మద్దతుగా నిలబడింది. యుద్ద విముఖత నుండి యుద్ద సంసిద్దత వైపుకు ఆమె ప్రయాణం చేసే జీవితానుభవాలే నిర్దేశించాయి.

తండ్రి నిర్ణయం ప్రకారం జరిగిన కమల పెళ్ళి నిత్యం శారీరక మానసిక హింసల కారణంగా సంక్షోభంలో పడ్డప్పుడు తల్లి ఆమెను దాని నుండి కాపాడు కోవాలనుకుంటుంది. తన జీవితమంతా తన ఇంట్లో వాళ్ళ సౌకర్యాల కోసం, సౌఖ్యాల కోసం వారి వారి ఇష్టా ఇష్టాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా ఇన్నాళ్ళు గడిపింది.

ఏనాడు తన ఇష్టమేమిటని? అడిగిన వారు లేరు? తను చెప్పలేదు. భర్త చెప్పినట్లు వినటమే కాని ఇది కావాలని తను అడగలేదు. కాపురం ఇష్టం లేదని కూతురుంటున్న భర్త మళ్ళీ కూతురును అత్తవారింటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆడవారి కష్టాలు అతనికేం తెలుస్తాయి? ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది. అందులో తన కూతురు అనుభవించే కష్టాలు ఏ స్త్రీకి వద్దనుకుని ఏదైతే అదైంది అనుకుని తన కూతురుని అత్తవారింటికి పంపనని చెబుతాననుకుంటుంది. తనకామాత్రం హక్కు లేదా? అన్న ఆలోచన ఆమెలో ఉదయించింది. ఆమె జీవితం అంతా నిత్యనిర్భంధంలో కొనసాగడం వలన తన అనుభవాలనుండి యుద్ద విముఖురాలై రాజీలతో దాంపత్యాన్ని కొనసాగించిన తల్లి కూతురికి పెళ్ళి ఒక హింసగా మారడాన్ని భరించలేకపోయింది. ప్రత్యక్షహింస నెదుర్కొనటానికైనా ప్రతిఘటన లేకపోతే, ఇక పరోక్ష హింసమీద యుద్దం ఎక్కడ మొదలవుతుంది? అందువల్ల ఆమె కూతురి విషయంలో యుద్ద సంసిద్దత ప్రకటించింది.

ఎప్పుడు ఏది మాట్లాడిన ఓడిపోవాల్సి వస్తుందని ఆమె ఇన్నాళ్ళు మాట్లాడలేదు. కాని ఈనాడు ఎవరేమన్నా తన కూతురి జీవితాన్ని చక్కదిద్దడానికి భర్తతో కూతురి విషయం మాట్లాడి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచి అతనిని ఒప్పిస్తుంది.

కమల తన పెళ్ళి విషయంలో అస్వతంత్రురాలు.తండ్రి చెప్పినట్లు వినాల్సివచ్చింది. కమల పెళ్ళి విషయంలో కమల తల్లి కూడా అస్వతంత్రురాలే ఆమె భర్త చెప్పిన సంబంధానికి కూతుర్ని ఒప్పించాల్సి వచ్చింది. ఆమె పెళ్ళి విషయంలో కమల తల్లి అస్వతంత్రురాలే తండ్రి చెప్పిన సంబంధం చేసుకుంది. కమల తల్లి, పెళ్ళి విషయంలో ఆమె తల్లి కూడ అస్వతంత్రురాలే. భర్త తెచ్చిన సంబంధానికి ఆమె తలవొగ్గింది. ఆరకంగా కమల, కమల తల్లి, కమల అమ్మమ్మ ఇలా మూడు తరాల స్త్రీలు అస్వతంత్రులే. ఈ అస్వతంత్ర వారసత్వం పితృస్వామిక కుటుంబ వ్యవస్థా లక్షణం. ఈ వార సత్వాన్ని దిక్కరించి నిలిచిన ఆధునిక స్త్రీ కమల.

కమల ఆడపిల్లలందరి లాగానే తండ్రి నిర్ణయాధికారంలోనే పెరిగింది. మామూలు స్కూల్లో చదివి ఫస్టుక్లాసులో పాసయిన కమలకు గంతకు తగ్గ బొంతని చూసి ముడి పెట్టేద్దాం అని తండ్రి ఒకవైపు అంటున్నా మారాం చేసి కాలేజిలో చేరింది. ఆమెకు ఊహ తెలిసినప్పటినుండి తండ్రితో తన నిర్ణయాలు, అభిప్రాయాలు తెలియచేస్తూనే ఉంది. తను నమ్మిన బాటలో నడవటానికి ఆమె కృషి చేస్తూనే కాలేజిలో టైపిస్టుగా ఉద్యోగంలో చేరి తనకంటు ఒక ఉపాధిని సంపాదించుకుని తల్లికి గర్వకారణమైంది.

పెళ్ళి విషయంలో తండ్రి అభిప్రాయంతో కమల ఏకీభవించలేకపోయింది. ఆ స్థితిలేక పోయిన ఫరవాలేదు. ఉద్యోగస్తుడిని చేసుకుంటానని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతుంది. తండ్రి చెప్పిన సంబంధం ప్రకారం పెళ్ళి చేసుకుని తాను పల్లెటూరు వెళ్ళాల్సి వుంటుంది. ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇంత చదువుకుని అత్తింటి సేవలు చేస్తూ గడపలేనంటుంది.ఆ రకంగా పెళై ్ళనా ఉద్యోగం వదులుకోవడం తనకు ఇష్టం లేదని తండ్రికి చెప్పకనే చెప్తుంది. స్త్రీ ఆర్ధికంగా స్వతంత్రురాలైతేనే తన జీవితం సరిదిద్దుకోగలనన్న నమ్మకం కమలలో ఉంది. కమల చదువునుండి పెళ్ళి వరకు తండ్రితో నిరంతర యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. కాని పెళ్ళి విషయంతో కూడ తన అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్తూ ఉండే తండ్రి చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారా? అసలు నీకు పదో క్లాసు కాగానే పెళ్ళి చేసేస్తే సరిపోయేది అంటాడు.

దీనిని బట్టి స్త్రీకి బాల్యావస్థ దాటకముందు పెళ్ళి చేస్తే తమను ప్రశ్నించదని, ఎదిరించదని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు స్పష్టమవుతూనే ఉంది.

అంతేకాకుండా విద్యవలన ఆలోచనలు, నిర్ణయశక్తి, అభిప్రాయ వ్యక్తీకరణ పెంపొందుతాయి. కనుక అందుకు ఆడపిల్లలకు అవకాశాలే కల్పించరాదన్న పితృస్వామిక నీతి కనపడుతూనే ఉంది.

మొదటి పదిరోజుల కాపురంలో కమలకు దాంపత్యం పేరుమీద, శరీరం మీద జరిగే హింసను భరించడం కష్టమైంది. దానికి తోడు మామగారి అసహజమైన లైంగిక వాంఛలు ఆమెను మరింత కృంగదీసాయి. ఈ విషయాన్ని సూటిగా తల్లిదండ్రులకు చెప్పలేక తానిక కాపురానికి వెళ్ళనంటూ ప్రకటించి తన అభిప్రాయానికి తిరుగు లేదన్నట్లుగా తన ఉద్యోగంలో తిరిగి చేరింది. స్త్రీ ఆర్ధికంగా స్వతంత్రురాలైనప్పుడు తన జీవితం మీద తాను నిర్ణయం తీసుకోగలుగుతుంది, నిలబడ కలుగుతుంది. ఆ రకంగా ఆమె అప్పుడు అసలైన యుద్ధం ప్రారంభించింది.

కమల పరిస్థితిని అల్లుడి దౌర్జన్యాన్ని తమ ఇంట్లో కళ్ళార చూసి కూడ తండ్రి కమలను అత్తవారింటికి పంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ఆడపిల్లల జీవిత దౌర్భాగ్యం.

కమల తన జీవితాన్ని తాను జీవించడానికి సిద్దపడింది కనుకనే తల్లితో అత్తవారింటికి వెళ్ళనని, అటువంటి కాపురం తనకు అక్కర లేదని స్పష్టం చేసింది.

బ్రతకాలన్న తన ఆకాంక్షను గుర్తించి ప్రవర్తించమని తల్లిని వేడుకొనడం వుంది ఇందులో అందుకే ఆమె తల్లి ఆమెకు మద్దతు నిచ్చింది. కమల నిలబడగలిగింది. తన జీవిత గమ్యాన్ని తాను నిర్దేశించుకుని ప్రస్థానం చేయడానికి ఆధునిక మహిళ సంసిద్ధమవుతున్న స్థితిని కమల నిర్ణయం నిరూపిస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.