గృహహింస సామాజిక నేరం

డా. మానేపల్లి

గృహహింస అంటే ఒక కుటుంబంలో భర్త భార్యను గానీ, లేదా అవిభక్త/ఉమ్మడి కుటుంబంలో అత్తమామలూ, ఆడపడుచూ – పై ఇంటినుంచి కోడలుగా వచ్చిన ఇల్లాలిని పెట్టే హింసగాని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, లేక బావలు, మరుదులు పెట్టే హింసగాని – అని అర్థం చెప్పుకోవచ్చు. అది అన్ని ఇళ్ళల్లో అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఆ యింటి స్థాయి, కుటుంబసభ్యుల ఆర్థికస్థాయి, ఆస్తిపాస్తులు, కులంమతం సంప్రదాయం వంశాచారాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గృహహింస-ఈ సమాజం అంత వైవిధ్యమైనది. కుటుంబం అంత పురాతనమైనది.

మహిళా కార్యకర్తలంతా రెండు ముఖ్యగ్రంథాల్ని అధ్యయనం చెయ్యాలని సూచిస్తున్నాను. ఒకటి ఫ్రెడరిక్ ఏంగిల్స్ రచన – ”కుటుంబ, రాజ్యాంగం పుట్టుక, వ్యక్తిగత ఆస్తి” – ఇది 1950ల నాటికే తెలుగులో అనువాదమైంది, అనేక పునర్ముద్రణలు కూడా పొందింది. మరొక పుస్తకం ప్రముఖ ఫ్రెంచి రచయిత్రి సైమన్ ది బువో రాసిన ”సెకండ్ సెక్స్”. ఇది నేను సంక్షిప్తంగా తెలుగులో అనువదించాను. హైదరాబాద్ బుక్ ట్రస్టువారు ప్రచురించారు (2000 – ప్రస్తుతం కాపీలు లభించడం లేదు.) వీటితోపాటు చలం రచనలు స్త్రీ, బిడ్డల శిక్షణ రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ – కూడా చదవడం అవసరమే. సమస్యను మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి ఈ పుస్తకాలు చాలా సహకరిస్తాయి.

స్త్రీకి మొదటినుంచీ బానిసత్వం లేదు, హింసకు గురికానూలేదు. మానవులు ఆహారసేకరణ దశ, వేట దశలో – వ్యవసాయ నాగరికత ముందు – స్త్రీపురుషులలో భేదం లేదు. స్త్రీని దేవతగా పూజించడం కూడా లేదనే చెప్పాలి. వైదికనాగరికత కాలంలో – క్రీస్తుపూర్వం 10-5 శతాబ్దాల కాలంలో స్త్రీ పూజనీయురాలయింది. అప్పటికి దేవతా విగ్రహాలుగాని, గుళ్లూగోపురాలు పూజలూ వ్రతాలు గానీ లేవు. మలివైదిక నాగరికత కాలంనాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వేట వెనుకబడి – వ్యవసాయం పెరిగింది. ఆవు-గోమాత అయింది.

జంతువుల్ని మచ్చిక చేసుకుని, వ్యవసాయం, పాడీ ప్రారంభించారు. ఈనాటి స్త్రీపురుషసంబంధాలూ భార్యాభర్త సంబంధాలు ఆనాడు లేవు. ఒక గుంపులోని స్త్రీలు, ఇంకొక గుంపులోని పురుషులందరికీ భార్యలే. సంతానంపై తల్లికి ఆధిపత్యం ”మాతృదేవోభవ” ”యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర నందంతి దేవతాః” ఇదీ పరిస్థితి. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నకొద్దీ – మాంసాహారం తగ్గింది. గోవధ నిషేధం వచ్చింది. మాంసాహారం కంటే శాకాహారం పవిత్రమైనదనీ, ఉత్తమమైనదనే నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది. అప్పటికి బౌద్ధం ఆవిర్భవించింది. అహింస పరమోధర్మః అయింది. ”మాంసం మాంసేన వృధ్యతే” ఇక ఎంతమాత్రం అమలు కాలేదు. సరిగ్గా ఆ దశలో స్త్రీ ఆధిపత్యం తగ్గి పురుషాధిపత్యం పెరిగింది. కొంత పోరాటం జరిగింది. దుర్గ-మహిషాసురమర్దన, అర్థనారీశ్వరుడు – ఆ కాలం నాటికే తండ్రి ఆజ్ఞమేరకు తల్లిని నరికేవాళ్ళ కథ పుట్టింది. ఇప్పుడు కొత్తగా – ”పితృదేవోభవ” పుట్టింది.

పురుషస్వామ్యభావజాలం ఏ స్థితికి దిగజారాలో అంతా దిగజారింది. స్త్రీ బుద్ధి: ప్రళయాంతకః, న స్త్రీ స్వాతంత్య్రమర్హతిలాంటి కొత్త ఆర్యోక్తులు బయలుదేరాయి.

అబద్ధం ఆడితే ఆడదయి పుడతాడు, నాలుగు కొప్పులు ఒక దగ్గర ఇమడవు, ఆడపెత్తనం – బాజా, ఇలా స్త్రీబతుకు దుర్భరమైంది.

హాలుని గాథాసప్తసతి – క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటిది. ఆ గాధల్లో కనీసం పదిహేను గాథల్ని రచించాడని ఆరుద్ర, తిరుమల రామచంద్ర వంటి పండితులు నిరూపించారు. ”ముదిత నేనేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్” అనే వాక్యం 16 శతాబ్ది మధ్యకాలానికి చెందినది. తరిగొండ వెంగమాంబ, తాళ్లపాక తిమ్మక్క, కుమ్మరి మొల్ల (ఈమె ఇంటిపేరు ఆతుకూరు – కాని ఈమెను కందుకూరి వీరేశలింగం వంటి మహాపురుషులు కుమ్మరి మొల్లను చేశారు) ముద్దుపళని, కృష్ణాధ్వరి, పసుపునేటి సుభద్ర – ఈ మొదలైన వారెందరో కవయిత్రులున్నారు. 1650-1700 వరకూ పరిస్థితులు బాగానే వున్నాయి. రాణీరుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, చాంద్బీబీ – వీరంతా మహిళలే. కాని వలసపాలనతో పరిస్థితులు బాగా దిగజారాయి. ముస్లిం స్త్రీలలోనే కాక, కులీన హిందూస్త్రీలలో కూడా ఘోషా/పర్దా పద్ధతి వచ్చింది. మగువ మాంచాల, బొబ్బిలిలో మల్లనుదేవి కూతురు – సతీసహగమనం చేశారని కథలు చెబుతున్నాయి. స్త్రీలు చదువులకు దూరమయ్యారు. కులం విపరీతంగా బలపడింది. ఒకనాటి కులాంతర వివాహాలు లేవు. స్త్రీకి అటు వారసత్వ హక్కుగాని, ఇటు సంతానంపై హక్కుగాని లేవు. ఆడపిల్లలు పుడితే బాధపడటం చంపడం ప్రారంభమైంది. కన్యాశుల్కం వచ్చింది. ప్రాచీన వివాహంలో కట్నం సమస్య లేనే లేదు. ఇది మధ్యయుగాల్లో వచ్చిందని గుర్తించాలి. ధర్మసమ్మతంగా తాళికట్టిన భార్యకు తప్ప, ఇతర స్త్రీలకు వారసత్వ అర్హత లేదు, వారి సంతానానికి ఆస్తిహక్కు లేకపోతే – సమాజంలో గౌరవనీయమైన గుర్తింపులేదు. శ్రీకృష్ణుడి అష్టభార్యలు, పదహారువేల గోపికల కథ – పురుషుడిలో భోగలాలసతకు పరాకాష్ఠ. కృష్ణదేవరాయలు, రఘునాథనాయకుడు బహుభార్యత్వం అవలంబించారు. నాయకరాజుల కాలంలో దేవదాసి, గణికలు, సర్కిరికలు, తెలంగాణాలో ఆడబాప, బసివి వ్యవస్థ ఏర్పడి అనుల్లంఘనీయమై పోయియి. గృహహింసపై జరగవలసిన చర్చకు – తరతరాల ఈ చరిత్ర మొత్తాన్ని నేపథ్యంగా తీసుకోవలసి వుంది. 1750 తరవాత పరాయి/వలస పాలనలో స్త్రీల స్థితిగతులు ఎంత దుర్భరంగా మారాయో అర్థం చేసుకోవాలి. రాజారామమోహనరాయ్ సతీసహగమన దురాచారాన్ని బిల్లు ద్వారా నిరోధించగలిగాడు గాని – సమాజంలోంచి తొలగించలేకపోయాడు. గురజాడ కన్యాశుల్కంపై పోరాటం ఫలించింది గాని – అది రూపం మార్చుకుని – వరకట్నం అవతారంలో కాటువెయ్యడం ఇప్పటికీ మానలేదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి తీవ్రంగా, దేశవ్యాప్తంగానూ, సంఘటితంగానూ కృషి చెయ్యాలి.

కులం, మతం, సంప్రదాయాలు – ఒకరకంగా హింసకు పట్టుగొమ్మలు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న సందర్భాల్లో వధూవరులను (లేక ప్రేమికులను) దారుణంగా హింసించడం, కుటుంబపరంగా సమాజపరంగా వెలివేసి వేధించడం, కొన్ని పరిస్థితుల్లో ద్వేషం, కక్ష పెంచుకుని చంపడం – మనం తరచు పత్రికల్లో చూస్తున్నాం. జీవితవిధానంగా మతభావనను ఒకస్థాయివరకూ అంగీకరించవచ్చు. కాని మానవుల మధ్య అడ్డుగోడలు నిర్మించడం, వివాహసంబంధాలు మొదలైన వాటికి అవాంతరంగా, హానికరంగా తయారైతే సహించకూడదు. ముస్లిం మతంలోని తలాక్ వ్యవస్థ రద్దు చేసి కులంతో మతంతో సంబంధం లేకుండా – అన్ని వివాహాలు రిజిస్ట్రేషన్ చేయించాలి. విడాకుల కేసుల్లో – భార్యాబిడ్డలకు తప్పనిసరిగా ఆర్థికరక్షణ, పోషణ, వసతులు కల్పించాలి. భర్త ఏ కారణంచేత అతితక్కువ ఆదాయం కలవాడయితే – కొంత భారాన్ని (సబ్సిడీ/ప్రత్యామ్నాయ ఆర్థిక సహకారం) మహిళాశిశుసంక్షేమశాఖ, రెవిన్యూశాఖ భరించే విధంగా చట్టం తేవాలి. వివాహేతర సంబంధాల విషయంలో గట్టి శిక్ష విధించి, నిషేధించాలి. కొందరు ముస్లిం మతంలో బహుభార్యాత్వం అనుమతిస్తారు గనుక, ఆ మతం స్వీకరించి ఇద్దరేసి ముగ్గురేసి భార్యల్ని పెళ్లిచేసుకుంటున్నారు.

కొన్నిరకాల మతభావనలు కలవారు – కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వ్యతిరేకం – అంటే సంతానం దైవదత్తం గనుక దాన్ని నిరోధించడం హత్య, పాపం అని – అధికసంతానం కనడానికి సిద్ధపడుతున్నారు. 50, 60 ఏళ్లు దాటిన కొందరు షేకులు ముక్కుపచ్చలారని 13, 14 సం|| పసిపిల్లల్ని పెళ్లిచేసుకుంటున్నారు. పేద ముస్లిం అమ్మాయిలని కొని – వ్యభిచారం సాగిస్తున్నారు. దీన్ని నిరోధించడానికి తగిన చట్టం గాని, బలమైన ప్రభుత్వ యంత్రాంగం గాని లేదు. బాల్యవివాహం చట్టం పటిష్టం చేసి ప్రతి పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించి తీరాలని చట్టం చేస్తే బాల్య వివాహాలు చాలవరకు నిరోధించవచ్చు.

స్త్రీలు ఉద్యోగాలు చేసే సందర్భాల్లో కూడా – భర్తలు వారిపై అజమాయిషీ చెయ్యడం చూస్తున్నాం. స్త్రీకి స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. రికార్డుల్లో తప్పనిసరిగా తల్లిపేరు ఉండాలి. పేదరికస్థాయి దిగువనగల ప్రతి ఆడపిల్లకు ప్రభుత్వం శాశ్వత ఆర్థిక సహకారం అందించాలి. చట్ట సభల్లో 33% మహిళా ప్రాతినిధ్యం బిల్లు దశాబ్దాల తరబడి దీర్ఘనిద్ర తీస్తోంది.

ప్రతి జిల్లాలో బలమైన మహిళాసంఘాలుండాలి. మహిళల్లో అక్షరాస్యత పెంచాలి. మహిళా శిశు సంక్షేమశాఖ పరిధి విస్తరించాలి. గర్భంలోనే ఆడపిల్ల పిండాన్ని చంపేసే పద్ధతిని నిషేధిస్తూ చట్టం తేవాలి. గృహహింస నిరోధచట్టం పేరుకు వచ్చింది గాని, అది అమలుకావడం లేదు. కాగితాలకే పరిమితం అయ్యింది.

స్త్రీ బాలవృద్ధుల సంక్షేమం, రక్షణ – కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు సమాజం మొత్తం ఇందుకు బాధ్యత వహించాలి.
(రచయిత ఒక ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్. విశాఖ జిల్లా ‘ఎలమంచిలి’లో ‘అవగాహన’ సాహిత్యసంస్థ నిర్వహిస్తున్నారు).

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.