జూపాక సుభద్ర
నువ్వు నా గుండె గుడిసెలకు
అరికిళ్ల దండమై అడుగేస్తివి
నీ యెండపొడ కండ్ల పలకరింపులు
నా మన్సంత నల్లతామెర్లల్లుకున్న
సెరువోలె అలుగువడేది
నీ పేరు తెలుసుకోనీకి నీ రూపుసెలిమలు
దాసేదానికి నాకళ్లు యెన్ని ఎడారులనాలింగనం
చేసుకోవాల్సొచ్చిందో…
నీ పేరన్న దెల్వకమునుపే
నా మనసు మంగులంపెంక మీన పేలాలై మెరిస్తివి
నా కడుపుకుండల తియ్య కుడుమై కల్లపెల్ల వుడికితివి
మా అవ్వజేసిన తెల్లజొన్న రొట్టోలె నవ్వి
నా కలలకు సందమామోలె పిండారబోస్తివి
యిల్లలుకని నా ఆదర్శాలకు ముగ్గేసి పండుగ జేస్తివి
నా స్వరాల దర్వాజలకు తీగెరాగాల
బంతిపూలతోటలు పాడిస్తివి
నా సదువుల మొక్కజొన్నసేనుకు మంచెమీని వడిసెలైతివి
ఎంతమందిలనైనా నీ అలికిడి
వుడుకుతున్న సియ్యలకూర వాసనై నన్ను గుమ్మెత్తిచ్చేది
మన యేడేడు తరాల యేడు కడుపులాకలి
సల్లారనీకి వూరును లందజేసి
కులంతోకలిసి సెప్పులు గుట్టుదాము
దండోరేసే డప్పుల్జేద్దామంటివి
నాకాల్లు నీకళ్లు పేనుకొని నడిసిన
ఆ… నీల్లమీది మేఘాలతొవ్వలు
యిప్పుడు కండ్లు బొడుసుకున్నా కానొస్తలేవు
ఏమైతివి? యేడబోతివి!
‘తన్నుకపోయినవా’ అనియే గద్దనడుగుదు,
‘మెత్కపొయినా’ అని ఏ కాకి నడుగుదు
దాసినవా అని ఏ సెట్టునడుగుదు,
మూసినవా అని ఏ పుట్టనడుగుదు
మల్లా కండ్ల సలువలై నాయిల్లు నిండవా