షబ్నమ్ నాదియ
అనువాదం. ఓల్గా
బరాహో కోడలు, చక్రవర్తికి ఆస్ధాన జ్యోతిష్కురాలు, చిక్కుల్లోనుంచి బైటపడేసే తాంత్రికురాలు అయిన ఖానా తన విద్యలో చాలా ప్రావిణ్యం సంపాదించింది. ఆమె భవిష్యత్తుని గురించి చెప్పే మాటలన్నీ నిజం కాసాగాయి.
అప్పుడు బరాహో ఆమె నాలుకను కత్తిరించేశాడు. మనందరికీ తెలుసు ఖానా ఘోరాతి ఘోరమైన తప్పు చేసింది. తన భర్త, మామ చేసే పనే, తనూ చేస్తూ వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యం చూపింది. సత్యం పలకటంలో అగ్రగణ్యురాలయింది. ఆమె నేరస్తులందరిలోకి ముందు శిక్షింప బడాల్సిన వ్యక్తి అయింది. ఎందుకంటే ఆమె ఆడది.
ఖానా మనందరికీ నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరాన్ని నేర్పింది. లేకపోతే మనల్ని నిశ్శబ్దం చేసేస్తారనీ చెప్పింది. రచయితకు తన హృదయాన్ని తెరిచి, మెదడును సంపూర్ణంగా తెరిచి ఏ రక్షణ కిందా లేకుండా ఉండటం అవసరం. ఐతే ఆ చర్య ప్రమాదంతో కూడినదనే ఆందోళన నిరంతరం వెన్నాడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు. ఖానా కథ ఉన్న సామాజిక నిర్మాణాలు అప్పుడూ ఇప్పుడూ మాట్లాడే స్త్రీని భయపెట్టటానికి ఎంత లోతుగా కర్కశంగా పనిచేస్తాయో మనకు చెప్తుంది. లక్ష్మణ రేఖలను దాటాలనుకునే మనలాంటి వాళ్ళ గొంతు నొక్కాలని సమాజం ఎంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందనే దానికి ఖానా నాలుకను కత్తిరించటం అనేది రక్తసిక్తమైన రూపం. మనల్ని ఎప్పుడూ గొంతు విప్పకుండా వుంచటం అధికారంలో ఉన్నవారికి లాభం. మన నిశ్శబ్దం మనల్ని విలువైనవారిగా చేస్తుంది – మన నిశ్శబ్దం మనల్ని గురించిన మన సందేహానికి టెస్టమెంటు. (అన్ని రకాల లొంగుబాట్లను రహస్యాలను ఆ నిశ్శబ్దం మనకు తెలియజేస్తుంది) ప్రవక్తల ప్రవచనాలు ఆషామాషీవి కావని పురుషులకు మరోసారి హామీ యిస్తుంది.
ఐనప్పటికీ ఈ నిశ్శబ్దాల మధ్యలోంచే పెనుతుఫాను పుడుతుంది. అక్కర్లేని వాళ్ళంగా ఉండటమనే ఈ ఘర్షణ మనకు అవ సరమేమో. మనలో అప్రయోజకంగా పడి వున్న దానిని వదిలించుకోవటానికి అది అవసరం కావచ్చు. లేదా ఘర్షణ లేకుండా కూడా మనం బాగా చేయగలమేమో. ఏది సత్యమైనా, దానిని మించిన సత్యమేమిటంటే మనలాంటి వాళ్ళం ఉన్నాం. ఎప్పటినుంచో ఉన్నాం – మంచి అమ్మాయిలం కాని వాళ్ళం, నోరుమూసుకుని ఉండలేని వాళ్ళం ఎప్పుడూ ఉన్నాం.
నీది అసమ్మతి స్వరమైతే – నిజాయితిగా చెప్పాలంటే నువ్వు స్త్రీవైతే అసలు ఏమాట మాట్లాడినా అది అసమ్మతి రూపంలోనే ఉంటుంది – అప్పుడు మంచిగా పొందికగా మాట్లాడకూడదని నిర్ణయించుకోవటం ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. ఇతర రచయిత్రులు కాకుండా – నిజంగా స్త్రీలు రాయాలని కోరుకునే వారెవరు? కానీ మనం ఎలాగైనా ఆ పని చేస్తాం.
మనకు అలా చేయగల ధైర్యం ఉండటం వల్ల మనమీద కొంత క్రూరత్వం అమలవుతుంది. మనం పనికివచ్చే వాళ్ళమా, ప్రచురించటానికీ, చదవటానికీ, సీరియస్గా తీసుకోటానికి సమీక్షించటానికీ మన రచనలు తగినవేనా పనికొచ్చేవేనా అని చూడటంతో కనపడకుండానే జండర్ వివక్ష దట్టంగా అలముకుని ఉంటుంది.
పవిత్రమైన, పుణ్య ప్రదేశంగా అనుకునే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాని ఒక నవలా రచయిత్రి ముక్కలుగా చింపేసింది, లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీని కేవలం యుద్ధంలో జరిగే దురదృష్టాల కోణం నుంచే కాకుండా రేపే గురించి సమాజానికి వున్న భయంకరమైన అభిప్రాయాల కోణంనుంచి కూడా చిత్రించి ఆమె ఆ పని చేసింది. ఆ రచయిత్రిని మొదట సాహిత్య పీఠాలు పట్టించుకోలేదు.
తర్వాత పురుష విమర్శకులు ఆమెకు ఎలా రాయాలో సలహాలు ఇచ్చారు. నేను సీరియస్ రచయిత్రిగా పరిగణింప బడాలంటే కేవలం స్త్రీల సమస్య మీద కేంద్రీకరించి రాయకూడదని ఒక సంపాద కుడు నాకు సలహా ఇచ్చాడు. అంతవరకూ ఆయనకు నేను పంపినవి ఒక చిన్న కథ, హక్కుల ఉల్లంఘనకు వైద్య పరీక్షను రూపకాలంకారంగా వాడి రాసిన ఒక కవిత, విశ్వాసం యొక్క స్వభావం మీద రాసిన మరో కవిత, మూడు విమరిక్కులు. అంతే. నిజంగా స్త్రీల సమస్యలే మరి. ఆ చిన్న కథను ఆ సంపాదకుడి సలహా తర్వాత స్పెయిన్ లోని ఒక పట్టణంలో జరిగిన చిన్న సాహిత్య పోటీకి పంపితే దానికో చిన్న అవార్డు కూడా వచ్చింది. ఆ విషయం నేను ఆ సంపాదకుడికి తెలియజేస్తే మళ్ళీ ఏ సమాధానమూ రాలేదు.
మనలో చాలామంది సంపాదకుల నుంచీ, ప్రచురణ కర్తల నుంచి, విమర్శకుల నుంచి స్పష్టంగా, సూటిగానో, లేదా అస్పష్టంగా, హావభావాలలో దాచిన అమర్యాదా పూర్వకమైన నవ్వులతో, ఫెమినిస్టు సాహిత్యం సీరియస్ సాహిత్యం కాదనీ, ఇంటికి సంబంధించిన విషయాలు మహిళా పాఠకులను మాత్రమే ఆకర్షిస్తాయని లేదా యితర మహిళా రచయితలను మాత్రమే ఆకర్షిస్తాయనీ, రచయిత్రుల నుంచి రాజకీయాల గురించో, మతం గురించో సృజనాత్మక వాదనలు వస్తే పాఠకులు ఆమోదించరనీ చెబుతుంటే బాధపడిన వాళ్ళమేగదా. బంగ్లాదేశ్ రచయిత్రుల నుంచి వచ్చిన చిన్న కథా సంకలనాన్ని సమీక్షిస్తూ ఒక విమర్శకుడు ఈ పుస్తకంలోని చాలా కథలు సారాంశంలో స్త్రీల కథలనీ, సంబంధాల గురించి, ఇంటి సమస్యల గురించిన కథలనీ రాశాడు. అతనింకా రాస్తూ ఈ పరిమితి కారణంగానే బంగ్లాదేశ్లో స్త్రీల కాల్పనిక సాహిత్యం విస్తృతమైన మార్కెట్ని పట్టుకోలేక పోతోందని అన్నాడు. ఐతే నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే ఏ కథ మానవ సంబంధాల గురించి మాట్లాడకుండ ఉంటుంది? సరే చూద్దామని బంగ్లాదేశ్లో ప్రముఖ పురుష రచయిత రాసిన కథా సంకలనాన్ని చదివాను. అందులో 21 కథలున్నాయి. అందులో 12, అంటే సగం మధ్య తరగతి జీవితాలను అందులోని రకరకాల కుటుంబ సంబంధాలను చిత్రించాయి. ఆ కథా సంకలనాన్ని గురించి వచ్చిన అనేక సమీక్షలలో ఈ విషయం నామమాత్రంగానైనా ఎవరూ ప్రస్తావించలేదు.
నేను రేప్ గురించి ఒక కథ రాశాను. అనివార్యంగా పాఠకుల స్పందన (ముఖ్యంగా మగ పాఠకుల స్పందన అనాలి) లో ఒక ప్రశ్న ఉంది ”ఇందులో ఎంత భాగం ఆత్మకథ ఉంది?” ఈ ప్రశ్న తప్పకుండా అడిగితీరే పురుష స్వభావం, నా సృజనాత్మక శక్తి ఎంతుందో వూహించలేనితనం నన్ను చాలా కల్లోలానికి గురిచేస్తుంది. రాసిన దానిలో వాస్తవం ఎంత, కానిదెంత అనేది ఒక రచయిత్రిగా నేను నిర్ణయించిన సరిహద్దుల మీద కాకుండా, పురుష పాఠకులు ఆమో దించిన అవిశ్వాసాల మీద ఆధార పడతాయి. ఆ పురుష పాఠకుడు రేప్ నామీదో నా వారి మీదో జరిగిందని నమ్మటానికి యిష్టపడతాడు. స్త్రీలకు సంబంధించి ఉద్రేకాన్ని రెచ్చగొట్టే అంశం మరీ అంత దూరంగా ఉండదు.
అన్ని కపట రూపాలలో సెన్సార్షిప్కు ప్రధానమైనది ఏది రైటు ఏది కాదు, ఏది ప్రచురించ తగినది, ఏది కాదు అనేది నిర్ణయించటమే. అది ఒక కౌన్సిల్ చేసినా, ప్రభుత్వ విభాగం ఒక రచయితను నిషేధించామని ప్రకటించటం ద్వారా జరిగినా, లేదా కొందరు వ్యక్తులు గుంపుగా పోగై తిరుగుతూ, ఉన్మాదంతో కూడిన ఉత్సాహంతో ఒక రచయిత పుస్తకాలు మంటల్లో వేసి తగలబెట్టినా, లేదా మన అమ్మ మన భుజాల మీదుగా మనం రాసేది చూస్తోందని నమ్ముతూ మనమ్ మనంగా విధించుకునే నిశ్శబ్దమైనా – ఏదైనా సరే సారాంశంలో అన్నింటి పలితమూ ఒక్కటే. సృజనాత్మక కళాకారుల అసలైన ఆత్మను ముక్కలు ముక్కలు చేయటమే. ప్రత్యేకంగా విన్పించే మన గొంతులను నొక్కి వూపిరాడకుండా చేయటం. అణచివేతే మనలను తయారు చేస్తుంది, మనల్ని విరగగొట్టేస్తుంది.
ఒక ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత టి.వి. ఇంటర్వ్యూలో సెక్స్, మతం వీటిని గురించి రాయకూడదని చెబుతుంటే చూసిన జ్ఞాపకం ఉంది. ”చూడండి. నా పిల్లలు చదవటానికి అనుమతించలేని వీటి గురించి నేను రాయలేను. అలా చేస్తే నేనెలాంటి తండ్రినవుతాను?” అన్నాడు. ఆలోచించ కుండా తన గురించి తాను చేసిన మోసపూరితమైన ప్రకటన సంగతి అలా ఉంచితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఆ రచయిత మగవాడు. అంతకంటే ఆసక్తికర మైన విషయం ఏమిటంటే కొన్ని సెకండ్ల తర్వాత తనేం చెప్తున్నాననే స్పృహ లేకుండా తన తల్లి తాను రాసిన ప్రతి పదమూ ఇప్పటికీ చదువుతుందని చెప్పాడు. వాళ్ళు పుట్టినప్పటి నుంచీ వారిని కట్టి పడవేసే అనేకానేక సాంఘిక, నైతిక సూత్రాలతో, ఈ రకమైన అనియతమైన సెన్సార్షిప్ ఎంత గాఢంగా ఎంతదూరం వ్యాపిస్తుందనేది మనం ఊహించవలసిందే.
ఒక రచయిత్రిగా నేను ప్రత్యక్షంగా, సూటిగా డీల్ చెయ్యలేని విషయాలు కొన్నుంటాయి అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవటంలో కూడా నన్ను నేను మోసం చేసుకున్నాను. నేను రాయకుండా తప్పుకుంటున్నది చాలావరకూ సెక్స్ గురించే. చిన్నతనంలో ఇంకించుకున్న సాంఘిక, సాంస్కృతిక నమ్మకాల ఫలితం యిది అనుకున్నాను. అది తెలుసున్నానాక నేను పట్టుదలతో, ఒక విశ్వాసంతో దీన్ని తలకిందులు చేయాలనుకున్నాను. సెక్స్ గురించి రాశాను. నేను రాసిన చాలా కథలలో సెక్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటూనే వచ్చింది. నేను నాలోని పూర్వపు రాయలేని తనాన్ని పీకిపారేసి, దాన్ని తీసిపారేసేంత అల్పంగా చేశానని ఆత్మతృప్తితో నిశ్చింతగా ఉన్నాను. ఈ సదస్సు కోసం ఏదైనా రాయాలని కూర్చున్నపుడు నా హృదయపు లోతులలో నేను దాచుకున్న సత్యాన్ని గ్రహించాను. నేను నిజంగా రాయకుండా వదిలేస్తున్నది ఎక్కువగా సంక్లిష్టమైన, బాధాకరమైన, అశాంతి మయమైన, కుటుంబ, వైవాహిక సంబంధాలలోని వాస్తవాన్ని. నా మనస్సు రహస్యపు పొరలలో నేనీ విషయాల గురించి రాస్తే ఆ విషయాల గురించే నన్ను గుర్తు పడతారనీ, ఆ విషయాలు నా తోటి గుర్తింపబడతాయనే భయం నాకు చాలా ఉంది. నేను రాసే కాల్పనిక సాహిత్యం లోకి ఈ విషయాలను రాసే సాహసం చేయటం లేదు. ఐతే నేను అనుభూతి చెందుతున్న వాటిని వ్యక్తీకరించా లనే తపన నన్ను కవిత్వం రాసేలా పురిగొల్పింది.
తేలికగా అర్థంకాని, లోపలి ముసుగులను నాకు సహాయంగా తీసుకున్నాను. నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే ఈ కవితలను ప్రచురణ కోసం పరిశీలించమని ఎప్పుడూ ఎక్కడికీ పంపలేదు. ఇది కావాలని చేసుకున్న నిర్ణయం కాదుగానీ నేను పాత ఫైళ్ళను, ప్రచురణకు పంపిన రికార్డులను చూస్తే ఈ క్రమం స్పష్టంగా కనపడింది.
గ్లోరియా స్టైనమ్ చేసిన వ్యాఖ్య ”వాళ్ళ తల్లులు జీవించని జీవితాలను పిల్లలు జీవిస్తుంటారు” అనేది నాలోపల ఒక పెద్ద నాదాన్ని ప్రతిధ్వనించింది. మా అమ్మ కిశోర ప్రాయంలోనూ, పంతొమ్మిదేళ్ళ వరకూ రచనలు చేసింది. కవితలు, వ్యాసాలు, కథలు, అనువాదాలు రాసింది. 19 సంవత్సరాల వయసులో ఆమెకు పెళ్ళయింది. సంవత్సరానికి మా అన్న పుట్టాడు. మరో మూడేళ్ళకు నేను పుట్టాను. ఆమె ఆనర్స్ చేసింది. మాస్టర్స్ చేసింది. అపుడు మా తమ్ముడు పుట్టాడు. టీచర్గా పనిచేస్తూ పి.హెచ్డి చేసింది. తన సృజనాత్మక రచనను కోల్పోయింది. నా జీవితమంతా ఆమె నన్ను రాయమని గట్టిగా ముందుకు నెట్టింది. నేను రచనలోకి ఆలస్యంగా రావటానికి ఒక కారణం అదే. ఆమె జీవితాన్ని జీవించేందుకు నేను నిరాకరించాను. ప్రతిఘటించాను.
తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె ఒక కథానిక రాసింది – తల్లీ కూతుళ్ళ అను బంధాన్ని గురించి – అది బెంగాల్ భాషలోని ప్రముఖ పత్రికలో కలం పేరుతో ప్రచురించింది. దానిని నేను మా అమ్మ రాసిందని తెలుగుకు, ఇంగ్లీషులోకి అనువదించి ఒక పోటీకి పంపితే బహుమతి వచ్చింది. ఆ సంఘటన ఒక విధంగా నా జీవితాన్ని నడుపుకునే స్వేచ్ఛ నిచ్చింది – అది నేను రచనలోకి ప్రవేశించటం. నా నిశ్శబ్దాన్నించి బైటపడే అవకాశాన్నిచ్చింది.
నిజంగా నేను భయపడింది దేని గురించి? ఆమోదం దొరకదనా? తిరస్కారం ఎదురవుతుందనా? కృతజ్ఞత లేనిదాన్నను కుంటారనా? నేను నిజంగా భయపడింది గుర్తించబడతానని – ఈ ప్రదేశాలలోనే దాగుడు మూతలు సరిగా పనిచేయవు. ఇక్కడ పాఠకులు ఇది వాస్తవ జీవితమేనా అని అడగరు. కాని ఖచ్చితంగా జీవితమేనని గ్రహిస్తారు.
నిజం చెప్పాలంటే అమ్మ మన భుజాల వెనక నిలబడి చూడటమనే భయం అన్నిటికంటే లోతైనది. బైటినించి విధించే నిషేధాలను, పుస్తకాన్ని తగలబెట్టడం, గ్రంథాలయాలను ధ్వంసం చేయటం – యివి నిరాశను, నిస్పృహను కలిగించే వాటిని ఎదుర్కోవచ్చు. వీటిని వేలెత్తి చూపించి చూడండి మీరు నన్నేం చేస్తున్నారు మాకేం జరుగుతుందో అని అడగొచ్చు. కానీ మరోదాని సంగతేమిటి – పైకి కనిపించని రూపాలలో వ్యక్తిగతంగా జరిగే నిషేధాల మాటేమిటి? దానిని మనం సూటిగా స్పష్టంగా చూసి, దానిని మొత్తంగా తీసెయ్యనిదే మనం ముందుకు నడవలేం. రచయితలుగానే కాదు మానవులుగా కూడా!
ఇక్కడ మనం అసలు కీలకమైన విషయానికి వస్తాం. ఆ విషయపు హృదయంలోకి చూస్తాం. నిషేధమనేది ఒక పుస్తకాన్నో, సినిమానో, పెయింటింగునో, పాటనో పాఠకులకు, ప్రేక్షకులకు అంద కుండా చేయటం కాదు. దాని అసలైన ఉద్దేశ్యం మన గొంతులను నిశ్శబ్దంలోకి నెట్టడం. మన వూహలలోకి వచ్చేవాటికి వ్యక్తీకరణ లేకుండా కత్తిరించటం. అసలైన ఉద్దేశం మనల్ని చీకట్లో బంధించటం.
నాకు 20 సంవత్సరాల వయసున్నపుడు రాసిన కవితతో ముగిస్తాను.
నా చుట్టూ వాళ్ళు కొన్నిసార్లు నాతో అంటుంటారు
(వాళ్ళేదో నాకు కితాబిచ్చినట్లు)
నేనెంత మంచి ప్రవర్తనగల యువతిగా తయారయ్యానూ!
వాళ్ళది అద్భుతమంటారు
వాళ్ళది ఉత్తమమంటారు
నేను జీవితపు అన్యాయం గురించి
ఇంక అరవటం మానేశానని
వాళ్ళనుకుంటారు
నాగరీకంగా ఉండడమంటే అదేనని.
విషాదాన్ని పట్టించుకోకపోవటం, వికారాన్ని చూడకపోవటం
వాళ్ళనుకుంటారు
నోరుమూసుకోవటం అనేదానిలో
మానవోత్సాహంలోని అసలైన విజయం ఉందని నీళ్ళలో ఎలాంటి తరగలనూ సృష్టించనివారే.
ఎప్పటికీ అత్యుత్తమ ఈతగాళ్ళని
నీకు వూపిరాడక పోయినా
కలకలాన్ని సృష్టించక పోవటమనేదే
అసలు విషయం
నీకు తెలుసా నేనింకా అరుస్తూనే ఉన్నాను
ఐతే నేను నీళ్ళలో చాలా లోతుకి వెళ్ళాను
నువ్వింక నా గొంతును వినలేవు.
ఒక కవితగా యిదెంత మంచి రూపాన్ని పొందిందో తెలియదు. ఐతే ఒక దశాబ్దం పాటు దానిని తిరిగి చదువుకున్న తర్వాత, గడిచిన సంవత్సరాలలో నేను ఎంత సాధించానో నాకు తెలిసింది. నా ఆలోచన లను ఆవరించినట్లు కనిపించిన నిస్పృహను, ఇది తప్పదని ఆమోదించటాన్ని దాటి – తిరుగుబాట దశ అనేదాన్ని కూడ దాటి ఇప్పుడు ఆత్మవిశ్వాసపూరితమైన నిశ్చయంతో నా లోపలి సహేతుకతకు గొంతు నిస్తున్నాను. నా ఊహలకు ఆకార మిస్తున్నాను. రాయాలి. రాయాలి. రాయాలి. ఏదైనా సరే. నాకు మరింత అధికారం !
ఖానాని ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంచగలిగారా? ఖానా వచనాలు, ఖానా మాటలు నా బంగ్లా నేల మీద ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. రైతుకి, జాలరికి, నేత కార్మికు రాలికి, జీవితాన్ని మోసేవారికీ వివేకాన్ని స్తుంటాయి. ఆమె హృదయంలో ప్రకాశించే వెచ్చని వాస్తవం – ఆ భవిష్యద్దర్శని? తల్లి, సోదరి, దివ్యమైన వెలుగును మోసే దార్శనికు రాలి మాటలు మన మెదళ్ళలో ప్రతి ధ్వనిస్తాయి. మన ఆత్మలకు తెలివిడి నిస్తాయి. నాశనం చేసింది ఆమె నాలుకనే – ఆమె ఆత్మను కాదు.
నేను ముందే చెప్పినట్లు ఖానా నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కత్తిరించిన నాలుక చెప్పిన కథ.