శిలాలోలిత
జీవితం, జీవనవిధానం అత్యంత వేగంగా మారిన ప్రస్తుతకాలంలో సాహిత్యాభి లాష తగ్గుతూ వస్తోంది. సాహిత్యపఠనం ఇంచుమించుగా తగ్గి పోతోంది. ముఖ్యంగా ఇటీవలి యువతరంలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతోంది.
ఇటువంటి స్థితిలో ‘బసలింగప్ప’గారి ‘టూకీలు’ నిజంగా టూకీలే. చాలా క్లుప్తంగా, గుప్తంగా, చదవగానే మనసుకు హత్తుకునేట్లుగా వుంటాయి.
పెద్ద కవితలు, కథలు, నవలలు చదవలేని, సమయం కొరవడిన చాలామందికి ఇవి మలయమారుతాలే.
ఐతే, ఎంతో గాఢమైన, లోతైన, తాత్వికసంబంధమైన, చర్చనీయాంశమైన, వాస్తవాల నెన్నింటినో ఈ ‘టూకీలు’ చూపిస్తాయి.
27 అక్షరాలలోపు పరిధిని పాటించాయి.
‘అక్కడ నన్నేమి అనరు
అది మరణశయ్య’.
బతుకంతా మోసిమోసిన కష్టాలు, కడగండ్లూ, ఎత్తిన బరువుబాధ్యతలతో విసిగి వేసారిన మనిషి విశ్రాంతి కేంద్రం, ప్రశాంతత నిచ్చేది, మరణశయ్యే సుమా! అనే లౌకికసత్యాన్ని స్పష్టంగా చెప్పారు.
186 టూకీల్లో విలక్షణత ఎక్కువ. వస్తువైవిధ్యం, నవ్యత దీని ప్రత్యేకత.
విద్యావ్యవస్థలోని వాస్తవస్థితిని –
కార్పోరేట్ చదువు
కన్నవాళ్ళకు బరువు
కన్నీటి చెరువు.
వేమనలా స్వల్ప వ్యంగం కొన్నిచోట్ల కన్పిస్తుంది. సున్నితంగా చురకలు పెట్టడం ఈయన శైలీ లక్షణం.
‘అవివేకిని
మెచ్చుకోవాలంటే
అవివేకికే సాధ్యం!’
స్నేహాన్ని ప్రాణంలా భావించే ఈ కవి భావనలో –
జీవన నదిలో
దొరికిన మంచిముత్యాలు
మించిమిత్రులు.
సమాజంలో నిర్లిప్తత, స్థబ్దత ఎక్కువ వడాన్ని గమనించి –
‘ఏదీ నీ అనుభవంలోకి రాదా!
ఐతే నీ గురించి ఆలోచించాలి’
బతుకుపాఠాల్ని బోధించే అధ్యాపకుడిగా ఇందులో కన్పిస్తారు.
మనిషి కొవ్వొత్తైనా కావాలి
లేకుంటే
అద్దమైనా కావాలి
తనను తాను దర్శించుకోవడం ముఖ్యం, తాను తన కోసం కాక సమాజానికి ఉపయోగపడి, కరిగిపోయే జీవనరీతి వుండాలని భావించారు.
సముద్రం
ఎంతగొప్పదైతేనేం
పడవ దాని గుండెల్ని చీలుస్తుంది.
ఈ అక్షరాల దగ్గర క్షణం ఆగితే చాలు, అనేక అర్థాల, దృశ్యపటాలను ఆవిష్కరిస్తూ పోతుంది.
ఇటీవలి కొన్ని పరిశోధనల పట్ల వ్యంగ్యాస్త్రం
పరిశోధన
ఎంత జరిపితేనేం
విప్పేది పాతముల్లెలే…
ఇలా చెప్పుకుంటూపోతే, టూకీల మూట విప్పుకుంటూ పోతే 186 టూకీలు బయటపడ్డాయి.
ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం, బతుకు పుస్తకం, ఊహల ఉసుళ్ళు, జీవన చదరంగం, మానవ మనస్తత్వాల వెలుగు చారిక, వెన్నెల మడుగులు కన్పిస్తాయి.
సాహిత్యంపట్ల అభిరుచిని కలిగించ డానికి ఇదొక సాధనంగా పని కొస్తుంది. ప్రయాణం చేస్తూనో, అతితక్కువ సమయం లోనో హాయిగా చదువుకోగలిగే, ఆలోచన రేకెత్తించగలిగే నిప్పుకణికలు ఇవి.
నిరాడంబరి, నిగర్వి ఐన బసలింగప్ప గారి అంతరంగ మనోచిత్రాలివి. తుపాకి గుండు చిన్నగా వున్నా ఎంత శక్తిమంతవైనవో ఈ టూకీలు కూడా అంతే. రూపం చిన్నది, కానీ విశ్వరూపమంత భావాన్ని క్లుప్తంగా చెప్పడంలోని ఘనతే ఈ కవిత్వ పాదాల్లో వుంది.
సరళంగా చెప్పడం, స్పష్టమైన భావ ప్రకటన, సున్నితమైన పదబంధాలు, విన సొంపుగా, కనువిందుగా ఉండే ఈ ‘టూకీలు’ అందరం చదవదగ్గ, చదవగలిగిన విశిష్టతను సంతరించుకున్నాయి.