ఏండ్రియా డ్వోర్కిన్

పి.సత్యవతి

”పోర్నోగ్రఫీ పరిశ్రమకి ముఖ్య భాష మన శరీరం. వాళ్ళు చెప్పదలచిందంతా మన శరీరాల చేత చెప్పిస్తారు. వాళ్ళకా అధికారం లేదు. వుండకూడదు. వాళ్ళు మన శరీరాల ద్వారా లాభం పొందడాన్ని మనం నిరో ధించాలి.

ఇది కొంచెం ప్రమాదంతో కూడు కున్న పని. ఒక్కొక్కసారి మన జీవితాలను కూడా ‘ఫణం పెట్టవలసి రావచ్చు. అయినా మనం దీన్ని నిరోధించాలి’ అంటూ 40 సంవత్సరాలపాటు అశ్లీలతకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది పురుషుల ద్వేషానికీ – అబద్ధపు ప్రచారానికి గురి అయిన ఏండ్రియా డ్వోర్కిన్ రెండవ దశ స్త్రీ వాదులతో – రాడికల్ ఫెమినిస్ట్గా, గట్టిగా నోరు విప్పిన వ్యక్తి – ఎంత గట్టిగా మాట్లాడుతుందో, ఎంత తీవ్రంగా వ్రాస్తుందో అంత సౌమ్యురాలు. ప్రేమాస్పదురాలు. గృహహింసకు లోనైన స్త్రీలకు బాసటగా నిలబడిన వ్యక్తి – స్వయంగా ఆ హింసను అనుభవించిన మనిషి. చిన్నప్పటినుంచే అంగీకృత భావజాలం పట్ల అసమ్మతి తెలపడానికి వెరిచేది కాదు – మానవ హక్కులు, ఆత్మగౌరవం, ఆలోచించ గలగడం, సూటిగా మాట్లాడ గలగడం తన తండ్రి ద్వారా సంక్రమించాయట ఆమెకి. ‘పురుషద్వేషి’ అని పేరుపడిన ఈమె జీవితంలో అత్యంత సన్నిహితులైన ముగ్గురు పురుషులున్నారు. ఒకరు ఆమె తండ్రి. రెండవవారు ఆమె సహోదరుడు. మూడవ వ్యక్తి 30 సంవత్సరాల పాటు ఆమెతో సహజీవనం చేసిన జాన్ స్టోల్టెన్ బర్గ్.

1946 సెప్టెంబర్ 26న జన్మించిన ఏండ్రియా కళాశాలలో చదివేటప్పుడు ఐక్యరాజ్యసమితి ముందు వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శన చేసి అరెస్ట్ అయి, ఒక విమెన్ డిటెన్షన్ సెంటర్లో అవమానకరమైన శరీర పరీక్షకు గురైంది.
స్త్రీల అధీనత, వివాహ చట్రం మొదలు రాజకీయాల వరకూ ఎట్లా విస్తరించి వుంటుందో అధ్యయనం చేసి నిర్భీతిగా తన అభిప్రాయాలు వెల్లడించడానికి తన శక్తి నంతా వినియోగించింది. 1974లో ‘విమెన్ హేటింగు’ అనే పుస్తకంతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఏండ్రియా, పితృ స్వామ్య అధికార కేంద్రమైన కుటుంబాన్ని విచ్ఛేదం చెయ్యాలి అని చెప్పింది. చైనాలో స్త్రీ పాదాలను కట్టివెయ్యడం, యూరప్లో మంత్రగత్తెల పేరిట స్త్రీలను సజీవదహనం చెయ్యడం, జానపదకథల్లో అంతర్లీనంగా వుండే స్త్రీ వ్యతిరేకత, అశ్లీలత పట్ల నిరసన, ఈ పుస్తకంలోని అంశాలు. ఏండ్రియా రచనలు, ఉపన్యాసాలు ఆమె కెంతమంది అభిమానుల్ని తెచ్చిపెట్టాయో, అంతగా అశ్లీల పరిశ్రమ ఆగ్రహాన్ని కూడా కొనితెచ్చింది. అమెరికాలో పోర్నోగ్రఫీ పరిశ్రమ కొన్ని మిలియన్ డాలర్ల పెట్టుబడి, టర్నోవర్ల మీద నడుస్తుంది. ఏండ్రియా ప్రచారం పరిశ్రమకి నష్టం కలిగించే లాగా వుండడమే అందుకు కారణం. ఈ వ్యాపారస్థులేకాక కొంత మంది ఉదారవాదులు కూడా ఆమెని తీవ్రంగా విమర్శించారు. ఆమె రచనల్ని వక్రీకరించి, వింత భాష్యాలు చెప్పి, ఆమెని అణచి వుంచడానికి ప్రయత్నించారు.

ప్రభుత్వం మద్దతు కూడా వారు సంపా దించారు. 1980లో ఏండ్రియా తన సహ ఉద్యోగి అయిన కాథరిన్ మెకిన్నన్తో కలిసి ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పంపింది – పోర్నోగ్రఫీ, లైంగిక వివక్ష అనేవి స్త్రీల పౌరహక్కులకి విఘాతం కలిగించేవి కనుక, వాటిని అంతమొందించే విధంగా ఒక ఆర్డినెన్స్ తేవాలనేది ఆ విజ్ఞాపన. అయితే పోర్నో పరిశ్రమ మొత్తం ఈ ఆర్డినెన్స్ని తీవ్రంగా వ్యతిరేకించింది. హస్లర్ అనే పత్రిక ఏండ్రియా కార్టూన్ని ప్రచురించింది. ప్లేబాయ్ పత్రిక, ఇటువంటి ఆర్డినెన్స్ పత్రికా స్వేచ్ఛకి భగ్నం కలిగిస్తుందని, పౌరహక్కుల సమితికి విజ్ఞప్తి చేసింది. తను స్వయంగా గృహహింసను, రాజ్యహింసను అనుభవించిన కారణంగా, ఆ కోపంతో, ఆమె అంత ఘాటైన రచనలు చేస్తోందనీ – పోర్నో సమస్యను మరింత నిష్పక్షపాతంగా చూడవచ్చనీ వాళ్ళంటారు. దానికి ఏండ్రియా జవాబే మిటంటే, ”సోల్జనిత్సిన్ (రష్యన్ రచయిత) గులాగు ని అట్లా చూడగలడా” అని 1987లో ఆమె ప్రచురించిన ‘ఇంటర్కోర్స్’ అనే పుస్తకం ఇంకొంచెం ఘాటైన విమర్శల నెదుర్కొంది. ఏండ్రియాకు శృంగారానికీ, అత్యాచారానికీ తేడాతెలీదనీ – శృంగారాన్ని అత్యాచారం క్రింద జమకడుతుందనీ ఆరోపించారు. ఆమెపై ధ్వజమెత్తారు.
అయితే తన ఉద్దేశ్యం అది కాదని, ఆ ఆరోపణలని ఖండిస్తూ ఆమె ఎన్నో పత్రికలకు లేఖలు వ్రాసినా, అవి ప్రచురింపబడలేదు. చాలామంది పత్రికా సంపాదకులు ఆమెపై చాలా నిర్దయగా ప్రవర్తించారు. ఎ బ్యాటర్డ్ వైఫ్ సర్వైవ్స్ అనే పుస్తకంలో ఏండ్రియా ఇట్లా వ్రాస్తుంది. ”నిజం తెలుసుకోవడం ఎట్లా?” అని చాలా మంది పురుషులు చాలా కాలంగా చాలా చర్చలు చేశారు. అయితే గృహహింస బాధితురాలికి ఈ నిజం తెలుసు. నీ జీవితంలో ఒక వేధించే సంఘటన జరిగినప్పుడు – అది అట్లా జరుగుతోందని నీకు అర్థం అయి, ఆ విషయాన్ని నువ్వు ఇతరులకు చెప్పు కున్నప్పుడు, వాళ్ళు దానిని నమ్మితే అదే నిజం. అయితే భర్త హింసకు గురయ్యే ప్రతి స్త్రీ, ఆ నిజాన్ని పోగొట్టుకుంటోంది.

లైంగికతపై ఏండ్రియా అభిప్రాయాలకు రంగు పులిమి వక్రభాష్యాలు చెప్పి ఆమె ఉత్సాహంపై నీళ్ళు చల్లినా, బాధిత స్త్రీల జీవితాలలోని వికృత అనుభవాలను వాస్తవాలను బహిర్గతం చేస్తూనే వుంది – పురుషాధికారం అనేది ఒక రాజకీయవ్యవస్థ అని నమ్మిన ఏండ్రియా, లైంగిక హింసలకు గురైన స్త్రీలవైపున జీవితకాలం పోరాడింది. బాధిత స్త్రీలను ఎంత హేళనగా, నిర్దయగా సమాజం చూస్తుందో, ఏండ్రియాను కూడా అలాగే చూసిందనవచ్చు.
ఆమె ఎంచుకున్న ఉద్యమం, ఆమె అభిప్రాయాల సారం, ఆ అభిప్రాయాలను వ్యక్తపరచడంలోని తీవ్రత, గాఢత, ఆమె పట్ల పురుషులకు ద్వేషం కలగడానికి కారణ మయ్యాయి. పురుషాధికారాన్ని గురించి నిర్భీతితో మాట్లాడే స్త్రీలకి ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలు ఆమెకి ఎదురయ్యాయి. 2005వ సంవత్సరం ఏప్రిల్ నెలలో తన 58వ ఏట ఏండ్రియా, అనేక రుగ్మతలతో బాధపడుతూ, మరణించింది. ఆ సందర్భంగా ఆమెకు నివాళి అర్పిస్తూ, ఆమెతో కలిసి పనిచేసిన కేధరిన్ మెకిన్నన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఇలా వ్రాసింది.

”ఎంత మేధావంతురాలైనప్పటికీ, ఆ మేధాశక్తికి తగిన గౌరవాభిమానాలనూ, రచయితగా దానికి తగ్గ ఆదాయంతోపాటు సౌకర్యవంతమైన జీవితాన్ని పొందలేక పోయింది ఏండ్రియా. పాశ్చాత్య దేశాలలో ఇంతగా అపార్ధం చేసుకోబడ్డ రచయిత్రి ఎవరు లేరేమో. కాల్పనిక సాహిత్యం, సాహితీ విమర్శ, రాజకీయ విశ్లేషణ, చరిత్ర మొదలైన అనేక విషయాల మీద దాదాపు 13 గ్రంథాలు ప్రచురించినప్పటికీ, ఆమెకి నోబెల్ నామి నేషన్ లేదు.” ఏండ్రియా డ్వోర్కిన్ 2002వ సంవత్సరం తన అనుభవాలను జ్ఞాపకాలను గుది గుచ్చి ”హార్ట్ బ్రేక్” అనే పుస్తకం ప్రచురించింది.
అశ్లీలతపై పోరాటం ఎంతక్లిష్టమైనదో, దానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంత నిరసన వుంటుందో తెలియడానికి ఏండ్రియా జీవితం ఒక ఉదాహరణ.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

One Response to ఏండ్రియా డ్వోర్కిన్

  1. seethaa Devi says:

    నిజమయిన మహిలా వేదన వినిపి0చి0ది ఈమె-ఆమెకు జోహార్లు-మహిలలు నిజముగా పోరాడవలసిన
    సమయము వచ్చినది-కుహనా కమ్యూనిస్టులమాదిరి గాకు0డా,నిజమయిన స్త్రీ వ్యక్తిత్త్వము కొరకయి
    పోరాడాలి

Leave a Reply to seethaa Devi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.