ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం

ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….?

సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.

ప్రయాణానికి రెండు నెలల ముందే వచ్చిన ఆ ఉత్తరానికి ఎంతమంది ఏ విధంగా స్పందించారో తెలీదు కానీ నాకు మాత్రం వెంటనే సత్యవతిని ముద్దుపెట్టుకోవాలన్నంత ముచ్చటేసింది… చివరికి ముప్ఫయి మందితో సెప్టెంబరు పదహారు, పదిహేడు, పద్దెనిమిది తేదీల్లో పాపికొండలకి వెళ్ళేలా నిర్ణయమైందంటూ రెండో ఉత్తరం వచ్చేసింది…

అందులో పదహారు ఉదయానికి అంతా నర్సాపురం చేరుకున్నట్టయితే ఆరోజంతా పేరుపాలెం బీచ్‪లోనూ, మర్నాడు సత్యవతి సొంతవూరు సీతారాంపురం, అంతర్వేది, బూరుగులంక… ఆ రాత్రికి రాజమండ్రి చేరుకుని మర్నాటి (18) ఉదయం పాపికొండలకి లాంచిలో ప్రయాణం… ఆ సాయంత్రం రాజమండ్రి చేరుకుని ఎవరి ట్రెయిన్లు వాళ్ళు పట్టుకోవడం… యిదీ స్థూలంగా మా ప్రయాణం.

ఇక మా హడావిడి ప్రారంభమైంది…

నెల రోజుల ముందే చంద్రలత నెల్లూరు నుండి ఫోను. “మనిద్దరికీ శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం దాకా రిజర్వ్ చేయించాను… అక్కడ దిగి మనం నర్సాపురం వెళ్దాం” అంటూ…. ఇక అప్పట్నుండీ వివిధ ప్రాంతాల నుండి మిత్రుల ఫోన్లు… ఏ ట్రెయిన్ కి బయల్దేరుతున్నావు?… ఏమేం తెచ్చుకుంటున్నావు?… సముద్రతీరంలో చీరకన్నా చుడీదార్లు బావుంటాయి కన్వీనియంట్‌గా వుంటాయి…. తెచ్చుకొమ్మంటూ రకరకాల కబుర్లు… నిజానికి ప్రయాణంకంటే ప్రయాణపు ముందరి హడావిడి, ఆనందం చెప్పనలవి కానివి.

అనుకోకుండా తిరుపతి నుండి విష్ణుప్రియ కూడా మాతో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే బయలుదేరడం మరో సంభ్రమాశ్చర్యకరమైన కొసమెరుపు…

సెప్టెంబరు పదిహేనో తారీఖు రాత్రి 11.30 కి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరులో బయల్దేరింది. అప్పటికే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైద్రాబాద్ నుండి బయలుదేరిన సత్యవతి బృందం గోలగోలగా ఫోన్లు చేస్తూ మమ్మల్ని విష్ చేస్తూనే వుంది…

శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మా ముగ్గురివీ మూడు కంపార్ట్‌మెంట్లు కావడంతో సెల్ ఫోన్లు మాత్రమే కొన్ని కబుర్లు మోసి ఆ తర్వాత టవర్ అందకపోవడంతో తప్పనిసరిగా నిద్రకొరిగాయి…

పదహారు ఉదయం ఆరింటికి భీమవరం చేరుకుంది మా రైలు. అక్కడ ఆటో ఎక్కి నా కాలేజీ స్నేహితురాలు నిర్మల యింటికి చేరుకున్నాము. అప్పటికే నిర్మల మాకోసం ఎదురుచూస్తోంది… పరిచయాలూ, పలకరింపులూ పూర్తయిన తర్వాత స్నానాలు ముగించి, టిఫిన్లు పూర్తిచేసి నిర్మలకి వీడ్కోలు చెప్పి మేం ముగ్గురం టాక్సీలో నర్సాపురం బయల్దేరాం.

భీమవరం నుండి నర్సాపురం ప్రయాణం.. అందునా ఆ సన్నటి తుప్పరలో చాలా అద్భుతంగా సాగింది. గోదావరి జిల్లా అంతా యింతేనేమో రోడ్డుకిరువైపులా వరుసగా ఎవరో పనిగట్టుకుని పేర్చినట్లుగా వున్న కొబ్బరిచెట్లూ… వాటి ఆకుల సందుల్లోనుండి పొరలుపొరలుగా నేలవాలుతోన్న సూర్యుడి లేలేత వెలుగు కిరణాలు… కనుచూపుమేర ఎటుచూసినా పచ్చటి పంటపొలాలు…. అక్కడక్కడా ఎవరు సృష్టించారో తెలీని నీటి దొరువులూ… రొయ్యల గుంటలూ… చేపల చెరువులూ.
అందులోనూ రెండురోజులుగా పడుతోన్న వర్షపు చినుకులతో మొక్కలన్నీ తమని తాము కడిగి ఆరబెట్టుకుంటున్నట్లుగా నీటి బిందువులతో నిండి కిలకిలా నవ్వుతున్నట్లుగా వున్నాయి… మమ్మల్ని స్వాగతిస్తున్నట్లుగానూ వున్నాయి.

ఈ మొత్తం ప్రయాణంలో భీమవరం నుండి నర్సాపురం కారులో ప్రయాణం ఒక చెప్పుకోదగిన అనుభూతి… భీమవరం నుండి నర్సాపురం దాకా ఎక్కడా గ్యాప్ అనేదే లేకుండా వరుసగా వున్నాయి ఊళ్ళు. భీమవరం, శృంగవృక్షం, వీరవాసరం, లంకలకోడేరు, బగ్గేశ్వరం, పూలపల్లి, పాలకొల్లు, నర్సాపురం…

నర్సాపురంలోనికి ప్రవేశిస్తుండగా సత్యవతికి ఫోనుచేసి మా డ్రైవరుకిస్తే మేం ఎక్కడికి రావాలో చిరునామా చెప్పింది…

మాకు వై.ఎన్.కాలేజి (సినిమా హీరో చిరంజీవి చదివిన కాలేజి) గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేశారు. మేము అక్కడికి చేరుకునేటప్పటికి హైదరాబాద్ నుండి వచ్చిన మిత్రబృందం + విజయవాడ నుండి వచ్చిన పి. సత్యవతి మిత్రబృందం అంతా స్నానాలు చేసి సిద్దంగా వున్నారు.

మమ్మల్ని చూడగానే కొండవీటి సత్యవతి స్వాగతం చెప్తున్నట్లుగా పెద్దపెట్టున ఈలవేసింది. ఈలవేయడంలో సత్యవతి దిట్ట. రంగురంగుల హరివిల్లు నర్సాపురంలో మాత్రమే విరిసినట్లుగా, అనేకానేక రంగుల పూలబాలలన్నింటినీ ఒకచోట కలబోసినట్లుగా… ఆయిల్ పెయింట్ల అద్భుత ప్రకటనలా వుందా దృశ్యం.

హృదయాలతో పలకరింపులూ, ప్రేమపూరిత స్వాగతాలూ, ఆనందకరమైన కేరింతలూ…. అదో మరపురాని తీపి అనుభూతి…

అందరం కలిసి బస్సెక్కి సత్యవతి చదువుకున్న బి.జి.బి.ఎస్ ఉమెన్స్ కాలేజికి వెళ్ళాము…జగ్గంపేట నుండి వచ్చిన కె.వరలక్ష్మి ఆ కాలేజీ వద్దకు చేరుకుని మమ్మల్ని కలిసింది… మళ్ళీ కరచాలనాలు….
ఆ కాలేజీలో సత్యవతికి చదువు నేర్పిన గురువులూ, ఆమెతో పాటు చదువుకుని యివ్వాళ అక్కడే బోధకురాళ్ళుగా వున్నవారు… అక్కడ ప్రస్తుత విద్యార్థినులూ అంతా సత్యవతితో పాటు మమ్మల్నందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి ఒక చిన్న కలయిక సమావేశం ఏర్పాటు చేశారు….
ఆ సమావేశంలో అందరం ఎవరికి వాళ్ళం పరిచయం చేసుకున్నాం…సత్యవతిని ఏ పూర్వబాల్య స్మ్పుతులు ముప్పిరి గొన్నాయోగాని చాలా ఉద్వేగంగా కన్పించింది ఆ క్షణంలో…

అనంతరం అక్కడే మా అందరికీ బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేయబడింది. మేము ముగ్గురం నేను, విష్ణు, చంద్ర భీమవరంలో ఫాస్ట్‌ని బ్రేక్ చేసే వచ్చామని ఎంత చెప్పినా వినకుండా ఆకుకూరతో చేసిన వడలు కొసరి కొసరి వడ్డించారు వాళ్ళు… స్వచ్ఛమైన వారి ఆప్యాయతకు సత్యవతితో పాటు మేమంతా కూడా చిత్తయిపోయాం…

వారి వద్ద వీడ్కోలు తీసుకుని అందరం బస్సెక్కి ‘పేరుపాలెం’ బీచ్‌కి చేరుకున్నాము… బస్సులో నా పక్కనే వరలక్ష్మి కూచుంది.. తను జగ్గంపేట నుండి నర్సాపురం చేరుకున్న ప్రయాణం గురించి చెప్తూ, ప్రస్తుతం తను వ్రాస్తోన్న కథగురించీ, మొన్న ‘ఆటా’లో తనకి మొదటి బహుమతొచ్చిన కథా నేపథ్యం గురించీ చెప్తూండగానే సముద్రతీరానికొచ్చేశాం మేము…

కొంచెం ఎక్కువగా వర్షం పడుతూండడంతో సముద్ర తీరానికి ఎదురుగా వున్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నాం అంతా…

అప్పటికే మధ్నాహ్నం పన్నెండయినా వాతావరణం మూలంగా ఉదయం పదిన్నరలానే వుంది… గెస్ట్‌హౌస్‌లో మేము కూర్చున్న గదిలో వున్న విశాలమైన విండో గుండా ఉవ్వెత్తున ఎగిసి పడుతోన్న సముద్రం కరచాలనం చేస్తున్నట్లుగా వుంది…

మేము కొలువు తీరగానే వేడి వేడి టీ సర్వ్ చేయబడింది… బయటున్న అత్యంత చల్లని వాతావరణాన్ని, వేడి టీని ఒకేసారి అనుభూతిస్తుండగా మొదలు పెట్టింది సత్యవతి… ఈల వేయకుండా చాలా సీరియస్ గా…

“మనమంతా తరచుగా ఎందుకు కలవలేకపోతున్నాం… మనందరికీ ఒక వేదిక అవసరం కాదా? కన్నడ రచయిత్రులు, బెంగాలీ రచయిత్రులు వాళ్ళు సొంత భవనాలు ఏర్పాటు చేసుకున్నారు. మనం ఎందుకు చేయలేక పోతున్నాం”.

భూమికకి సీరియస్ ఉమెన్ మేగజైన్‌గా మంచి పేరుంది… మంత్లీ అయినప్పటినుండి రచనల అవసరం చాలా ఎక్కువయింది… భూమికని సొంతం చేసుకోండి.. రచయితల పుస్తకాలు చాలా వస్తున్నాయి… గ్లోబలైజేషన్ నేపథ్యంలో సమస్యలు పెరుగుతున్నాయి… అయినా మనం ఎందుకని ఎక్కువగా వ్రాయలేక పోతున్నాం… ఈరోజు దీని గురించి మనందరం మాట్లాడుకోవాలి… ఇంకా ఇంటర్‌నెట్‌లో తెలుగు రచయిత్రుల పేర్లు కన్పించవు.. ఇవన్నీ సమస్యలు చాలా వున్నాయి. తల్చుకుంటే మనం ఏమయినా చేయగలం… ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి.

“మనం చదవాల్సిన పుస్తకాలూ, చేయాల్సిన పనులూ, తీసుకోవాల్సిన నిర్ణయాలూ… వీటన్నింటినీ గురించి మనం మాట్లాడుకుందాం… మీ మీ అభిప్రాయాలతో ముందుకు రండి…” అంటూ పిలుపు నిచ్చింది.
అంతా ఒకరొకరుగా మాట్లాడ్డం మొదలు పెట్టారు…

కొండేపూడి నిర్మల మాట్లాడుతూ, “మగవాళ్ళ పుస్తకాలు ఫోకసయినట్లు మహిళా రచయితల పుస్తకాలు అవట్లేదు… ఇంటర్నేషనల్ మీడియాలో అయితే తెలుగు రచయితల గురించి అందునా స్త్రీల గురించి చాలా తక్కువ మాట్లాడతారు” అన్నది.

ఇటీవలే అమెరికా నుండి వచ్చిన రెంటాల కల్పన స్పందిస్తూ ‘ఎక్కడయినా స్త్రీల పరిస్థితి, స్త్రీలకి సంబంధించిన సాహిత్యమూ రెండో స్థానంలోనే వున్నాయనీ… అమెరికాలోని తెలుగు సంస్థల పరిస్థితీ అదేననీ, అక్కడ కూడా ఎక్కువ పురుష రచయితలే వేదికల మీద వుంటారనీ, ఒకరిద్దరు స్త్రీ రచయితలని పిలిచినా కేవలం నామమాత్రంగానే వుండి పోతారనీ… అక్కడ కూడా యిక్కడికంటే మెరుగ్గా ఏమీ లేదనీ… మన సాహిత్యాన్ని వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అనేదానిమీద తానోకథ వ్రాశానని అన్నారు.

( 1 2 3 4 5రెండవ భాగం  >>

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.