చంద్రలత మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు తెలుగు సాహిత్యం నుండి ప్రతినిధుల్ని పంపేప్పుడు.. తగిన వారిని ఎన్నిక చేయాల్సిన అవసరం వుందనీ… ఇక్కడ్నుండి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా తమగురించి తాము చెప్పుకోడానికే తప్ప మొత్తం మీద తెలుగు సాహిత్యపు ప్రామాణికతను రెప్రెజెంట్ చేయడం లేదనీ, మన సాహిత్యపు ప్రమాణాలను, సంస్కృతినీ భిన్నంగా, ఒక వైవిధ్యంతో వ్యక్తపరచగలిగేటువంటి సమర్థులయిన సాహితీకారులను ఎన్నికచేసి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు పంపడం అన్నది ముఖ్యమని అభిప్రాయపడ్డారు… పైగా యిటువంటి సెమినార్లకు వెళ్ళినపుడు భాష ఒక సమస్య కావడం.. ఇటీవల ఒక సెమినార్‌కి వెళ్ళాల్సివచ్చినపుడు తన ప్రసంగ పాఠాన్ని ఆరి సీతారామయ్యగారితో అనువాదం చేయించి చదివినపుడు మంచి స్పందన లభించిందనీ.. ఆవిధంగా సమర్థులయిన వ్యక్తులతో అనువాదాలు చేయించి ప్రెజెంట్ చేసినపుడు తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించే అవకాశం వుంటుందనీ అభిప్రాయపడ్డారు…
పి. సత్యవతి ‘మనం కొత్త విషయాలు కొత్త అంశాలు తెలుసుకుంటుండాలి, తెలుసుకోవాలి అన్నది చాలా మందిలో తక్కువయిపోయింది… అది మనం గమనించాలి.’
మన జ్ఞానాన్ని, మన ప్రమాణాలనీ పెంపొందించుకోవాలంటే, ప్రపంచ పోకడలను తెలుసుకోవాలంటే ఆంగ్ల భాష తప్పకుండా అవసరం… ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న అనేక మార్పుల్ని మనం గమనిస్తూండాలి… ప్రపంచ సాహిత్యాన్ని మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి… అప్పుడే మనం స్టాండర్డ్‌స్‌ని పెంచుకుని తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయ గలమని అన్నారు.
ఇంకా మనకి మంచి ట్రాన్స్‌లేషన్స్ రావట్లేదని కూడా అభిప్రాయపడ్డారు…
కొండేపూడి నిర్మల మాట్లాడుతూ “అనువాదాలు ఎక్కువగా లేకపోవడం… అంటే
ఆంగ్లంలోకి మాత్రమే కాకుండా మన సోదర భాషల్లోకి కూడా అనువాదాలు వెళ్ళకపోవడం తెలుగు సాహిత్యానికి నిజంగా పెద్దలోటు. అందునా స్త్రీల రచనలు మరింత తక్కువ… కాబట్టి ఒక్కో రచయిత్రివీ మూడేసి రచనల చొప్పున మనమే అనువాదం చేయించుకుని మనమే ఒక పుస్తకంగా తీసుకురాగలిగితే ఇతర భాషల పాఠకులకు మన రచనలు అందుబాటులో కొస్తాయని’ అభిప్రాయపడ్డారు.
దానిమీద మిగిలిన వాళ్ళు కూడా స్పందించారు… మన రచనలు మనమే అనువాదం చేసుకోవడానికి ఒక ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసుకోవాలనీ, సమర్థులయిన వ్యక్తులతో అనువాదాలు చేయించాలనీ… మొత్తం మీద మనం వ్రాస్తున్నది యితర భాషలలోకి వెళ్ళాల్సిన అవసరం వుందనీ నిర్ణయించారు. మనం ఇంటర్నెట్‌తో తప్పనిసరిగా టచ్‌లో వుండడం అవసరమనీ అందులోని సైట్లలో వివిధ రంగాలకు చెందిన లోతయిన సమాచారం నిక్షిప్తమై వున్నదనీ… మనక్కావల్సిన విషయాన్ని అందులోనుండి తెలుసుకోవచ్చుననీ అంతా అభిప్రాయపడ్డారు…
శిలాలోలిత మాట్లాడుతూ ‘ఆడవాళ్ళకు ఏమీ రాదని ఒక నిర్ధారణకు వచ్చేసి… వాళ్ళకంత జ్ఞానం లేదు… అన్నిటికీ మేమే వున్నాం’ అని పురుషులు అభిప్రాయపడుతున్నారు అని అన్నారు.
నిర్మల మాట్లాడుతూ ‘మీటింగులకి పిల్చినపుడు వెళ్ళి నేను నా అభిప్రాయాలని వ్యక్తపరచాలా, వద్దా అన్న కన్‌ఫ్యూజన్ వుంటుంది… ఈ టి.వి ‘ప్రతిస్పందన’ కార్యక్రమంలో ఆడవాళ్ళు చాలా తక్కువగా కన్పిస్తారు?’ అంది.
‘అలాంటప్పుడు ‘నవీన’ లాంటి మనకు ఛాన్స్ యిచ్చేవాళ్ళని మనం వినియోగించుకోవాలని’ కొండవీటి సత్యవతి అన్నది…
అనిశెట్టి రజిత మాట్లాడుతూ
‘మనం కలవకపోవడం, స్పేస్ లేకపోవడం నిజమే… చాలా ఆధిపత్యాల నెదుర్కుంటున్నాము… మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం మనని గుర్తించడం లేదు… కలుపుకుపోవడం లేదు అనుకోవడానికి ముందు మనలో మనం కూడా అన్నిరకాల ఆధిపత్యపు ముసుగుల్ని తొలగించుకుని… ఎటువంటి మార్మికతలు లేకుండా… దురహంకారాలని దూరంగా పెట్టి అందర్నీ ప్రజాస్వామికంగా కలుపుకుపోవలసిన అవసర మున్నదనీ… ఎంతోమంది కవయిత్రులు కొత్తగా వ్రాస్తున్నారనీ… వారిలో ఎంత మందిని మనం మోటివేట్ చేసి బయటికి తీసుకురాగలుగుతున్నామనీ?’ ఆవేదనతో ప్రశ్నించారు. అంతేకాకుండా ‘వేదికలమీద మనల్ని గుర్తించిండ్రు చాలు అని ఆనందపడిపోవడమే తప్ప కొత్తవారిని ఎందుకని ప్రోత్సహిస్తలేము’ అన్నారు.
చివరికి అన్నిటికన్నా ముఖ్యం మనం తరచుగా కలుసుకుని మన అభిప్రాయాలను పంచుకోవాలని అంతా అనుకున్నారు. ఇలా అంతా తమ తమ అభిప్రాయాలను విడివిడిగా వ్యక్తపరుస్తూంటే చాలాసేపటిదాకా మాకు సమయం తెలియలేదు… చివరికి గెస్ట్‌హౌస్ సిబ్బంది వచ్చి భోజనానికి లెమ్మని పిలిచేదాకా కూడా రెండున్నరయినట్లుగా ఎవరమూ గుర్తించనేలేదు…
మేమంతా లేచి వారు వడ్డించిన పసందయిన విందును ఆస్వాదిస్తూండగా వర్షం తగ్గిన విషయాన్ని గుర్తించి హఠాత్తుగా ఈల వేసింది సత్యవతి…. ‘సముద్రం దగ్గరికి వెళ్దాం త్వరపడండోచ్’ అంటూ సైరన్….
ఇక మా బృందానికి పట్టపగ్గాల్లేకపోయాయి.
తింటున్న ఐస్‌క్రీమ్‌ని హడావిడిగా పూర్తిచేసి సుజాతా పట్వారి బాత్ రూమ్‌లో దూరి స్విమ్మింగ్ డ్రస్ వేసుకొచ్చింది…. చాలామంది చీరల్లోనుండి చుడీదారుల్లోకి మారారు. శారదా శ్రీనివాసన్‌కి చుడీదార్ బాగా నప్పింది.
మిగిలినవాళ్ళెవరూ స్విమ్మింగ్ డ్రస్సులు వేసుకోకపోవడంతో సముద్రంలో కూడా ఈదగల గజీతరాలు సుజాతా పట్వారి ఈదడం కోసం అంతా ఎదురుచూడసాగాం ఆతృతగా… ఆసక్తిగా…
ఎంతకీ ప్రారంభించదు… మాతోపాటే నిల్చుని కాళ్ళు తడుపుకుంటోంది మృదువుగా… ఇదేమిటని ప్రశ్నిస్తే ‘ఆఁ ఎవరు చెప్పారు స్విమ్ చేస్తానని.. జస్ట్ బిల్డప్’ అన్నది నాలుకెగరేస్తూ…
అంతా పొట్టలు చెక్కలయ్యేలా విరగబడ్డంతో ఆ నవ్వులన్నీ కూడా సముద్రపు అలల నురగ పువ్వులతో కలిసి చెలియకట్ట దాటి గెస్ట్‌హౌస్ దాకా ఎగిసెగిసి పడ్డాయి.
నీళ్ళల్లోనుండి బయటికి రమ్మంటే నవ్వు… లోపలికెళ్దాం రమ్మంటేనూ నవ్వే… నీళ్ళతోపాటుగా ఎగిసిన ఇసుక నడుందాకా ముంచెత్తితే నవ్వు… రెండు మీటర్ల ఎత్తున ఎగిసి పడిన కెరటం మమ్మల్ని కుదేస్తే నవ్వు… ఎంతకీ ఆ సముద్రతీరం నుండి తిరిగి వెళ్ళబుద్ది కాక ఒకటే నవ్వులే నవ్వులు…
అయిదింటికి సముద్రాన్ని వదల్లేక వదిలిపెట్టి ఒక్కొక్కళ్ళమే గెస్ట్‌హౌస్‌లో చేరుకుని వాళ్ళిచ్చిన వేడి వేడి ‘టీ’ త్రాగి తిరిగి బస్సెక్కాము. ఆ తడి తడి బట్టలతోనే నర్సాపురంలో మా బసకు చేరుకున్నాం…
హాస్టలు పిల్లలు పోటాపోటీగా బాత్‌రూముల కోసం పరిగెత్తినట్లుగా ‘క్యూ’లో నిల్చుని స్నానాలు పూర్తిచేసి గోదావరి గట్టుకు నడిచేటప్పటికి మసకచీకటి పడుతోంది… ఆ మసక మసక చీకటిలోనే నదికి కట్టిన రివెట్మెంటు గట్టుమీద (పేవ్మెంటు మీద) జంటలు జంటలుగా వరుసగా కబుర్లాడుకుంటూ ‘పంటి’ దాకా నడవడం ఒక అద్భుతమైన దృశ్యం.. వెనుకబడుతోన్న జంటల్ని ఎదురొస్తోన్న అపరిచితుడెవరో ‘మీ మేడమ్ తొందరగా రమ్మంటోంది… ‘పంటి’ కదలడానికి సిద్దంగా వుంది’ అంటూ హెచ్చరించి పోవడం మరో మరపురాని విషయం.
మళ్ళీ నవ్వులు… నవ్వులే నవ్వులు… ఆ నవ్వులన్నింటినీ మోసుకుంటూ మరికొందరు స్థానిక ప్రయాణీకులతో కలిసి సఖినేటిపల్లి గట్టువైపుగా సాగింది ‘పంటి’… అటువంటి రవాణా పడవల్ని ‘పంటి’ అంటారని సత్యవతి చెప్పింది.
‘నవ్వుల నదిలో పువ్వుల పడవా కదిలే
ఇది మైమరపించే హాయీ… యికరానే రాదీరేయీ’ అంటూ సమతారోష్ని పాటందుకుంది… అంత చీకట్లోనూ ఆ దృశ్యాలను బంధించడానికి చంద్రలత, శిలాలోలిత, నాగలక్ష్మిల కెమెరా ఫ్లాష్ల వల్ల గోదావరి మిలమిలా మెరుస్తోందనుకున్నాను కానీ నిజానికి విపరీతమైన మా నవ్వుల వెలుగులతో గోదావరి మెరుస్తోందని అర్థమైంది…
‘పంటి’ సఖినేటిపల్లి గట్టు దాకా వెళ్ళి ప్రయాణికుల్ని దించి తిరిగి నర్సాపురం ఒడ్డుకు చేరుకుంది… ఎవరికీ దిగబుద్ది కాలేదు… మరో రెండుసార్లు ఆ ‘పంటి’ మమ్మల్ని అటు, ఇటు నదిలోనే తిప్పితే బావుండునని అన్పించింది…
ఆ గట్టుమీద దిగి నర్సాపురం వీధుల్లో నడుచుకుంటూ కోవెల గుడికి వెళ్ళాం… నర్సాపురం వీధుల్లో మమ్మల్ని అత్యంత ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే వూరంతా అత్యంత ప్రశాంతంగా వుండడం… ఎక్కడా చిన్న గొడవలుగానీ, మితిమీరిన ట్రాఫిక్ చప్పుళ్ళు గానీ… ఆ మాటకొస్తే అంతులేని టి.వి సౌండ్లుగానీ లేకపోవడం… జీవితం ప్రశాంతంగా వుంటే వూరు కూడా ప్రశాంతంగా వుంటుందేమోనన్పించింది ఒక్కక్షణం.
‘కోవెల గుడి’ తమిళనాడు దక్షిణ ప్రాంతం నుండి ఎప్పుడో గోదావరి జిల్లాలో స్థిరపడిన తమిళులెవరో కట్టించారనీ… అందుకే కోవెల అన్న పేరు స్థిరపడిపోయిందనీ చెప్పారు… గుడి చాల విశాలంగా, ప్రశాంతంగా, గుడిలోని విగ్రహాలు ఎంతో కళగా వున్నాయి.
అక్కడికి దగ్గరలోనే విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్న పాఠశాలని చూపించారు… అయితే బాగా చీకటి పడిపోవడంతో మేము లోపలికెళ్ళలేకపోయాం…
అక్కడ్నుండి అలా అలా ఆ వీధుల్లో నడుచుకుంటూ మెల్లిగా మా బసని చేరుకున్నాం. ఆ.. అన్నట్టు మధ్యలో నిమ్మకాయ వేసిన గోలీసోడాలని పోటీలు పడి తాగాం. షాపతను ‘సుయ్’ మని కొడుతూనే వున్నాడు. మేం గోలగోలగా తాగుతూ నిశ్శబ్దంగా వున్న నర్సాపురం రోడ్లని గలగలలాడించేం. రాగానే మాకు మంచి ఉపాహారం వడ్డించబడింది…
వేడి వేడిగా విందార గించాక తొమ్మిదిన్నరకే పక్కలు పరిచేసుకున్నాం.. మాకు కేటాయించబడిన రెండు విశాలమైన గదుల్లో ఒక్కో గదిలోనూ రెండు మంచాలు మాత్రమే వున్నాయి…
మా గదిలోని మంచాలను శారదా శ్రీనివాసన్, కె. వర లక్ష్మి, కొండేపూడి నిర్మలలకు కేటాయించి మేమంతా వరుసగా కింద పరుచుకున్నాం. నాకు ఒకవైపు గిరిజ మరోవైపు విష్ణు పడుకోగా విష్ణుప్రియకి ఆవలివైపున పి. సత్యవతిగారి చెల్లెలు అనూరాధ పడు కున్నారు… పడుకున్నావిడ పడుకోకుండా హఠాత్తుగా లేచి తాను తెచ్చిన కజ్జికాయల్ని అందరికీ పంచడం మొదలుపెట్టారు…
మళ్ళీ అంతా లేచి కూర్చోడం, కజ్జికాయలను ఆరగించడం… నవ్వులతో…
మా తల వద్ద కొండవీటి సత్యవతి, గీత, కల్పన పక్కలేసుకున్నారు. కిందివైపుగా అందమైన అమ్మాయి నాగలక్ష్మి… అందరం చాలాసేపు కూచుని, ఆ తర్వాత మెల్లిగా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రకొరిగాం….వేరే గెస్ట్‌హౌస్‌లు బుక్ చేసుకున్నా ఎవరి గదుల్లో వాళ్ళం కాకుండా అలా అందరం ఒకేచోట ఒక పెళ్ళి ప్రయాణంలో బంధువులంతా సత్రంలో పడుకున్నట్లు చాలా దగ్గరగా అన్పించింది…
***
రాత్రి త్వరగా పడుకోవడంతో ఉదయం అయిదింటికే మెలకువ వచ్చేసింది… అప్పటికే విష్ణుప్రియ లేదు. వాకింగ్ కి వెళ్ళినట్లుంది… నేనూ లేచి అటు, ఇటూ తిరిగి కాసేపయ్యాక బ్రష్ తీసుకుని టాప్ టెర్రెస్ మీదికి వెళ్ళాను. అక్కడ నాకోసం అంత అద్భుతమైన దృశ్యం కాచుకుని వుందని నేను ముందుగా ఊహించలేదు…
ఆ గెస్ట్‌హౌస్ చుట్టూ మూడు వైపులా సింధు, గోదావరి ప్రవహిస్తోంది… ఇంకా చీకట్లు వీడని ఆకాశం… ఇంకా స్విచ్ఛాఫ్ చేయని పంచాయితీ లైట్ల వెలుతురులో గోదావరి మిలమిలమని మెరుస్తూ గలగలమని పాడుతోంది…
‘గలగలమని వీచే చిరుగాలిలో కెరటమై
జలజలమని పారే సెలయేటిలో పాటనై’ ఆ దృశ్యాన్ని గుండెల నిండా నింపుకునే క్రమంలో హృదయంలోనో, కళ్ళల్లోనో తెలీదుగానీ నీటి తెమ్మెర… అప్పటికే మొదలైన వర్షపు తుప్పరతో కలిసి ముత్యాలై జారింది.
ఈ గెస్ట్‌హౌస్‌లోనే ‘మూగమనసులు’ సినిమా లోని రెండు పాటల చిత్రీకరణ జరిగిందని సిబ్బంది చెప్పిన విషయం గుర్తొచ్చింది…. గౌరి, గోపి, రాధ ఒకరి తర్వాత మరొకరు ఆ మెట్లమీది నుండి ఎక్కి పైకి వస్తున్నట్లుగా తోచింది…. గోదావరిలో సుడిగుండాలు రేగి గోపీ, రాధ మునిగి పోతున్న దృశ్యం కళ్ళముందు నిలిచి ఆవేదన కలిగింది నిజంగా అదొక కళాఖండం…
వెండి వెలుతురొచ్చి వర్షపు తుప్పరలో పూర్తిగా తడిచిపోయేదాకా నేను కిందికి దిగలేదు.. అప్పటికే బృందమంతా చాలావరకు స్నాన కార్యక్రమాలు పూర్తి చేశారు…
అందరం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని సత్యవతి పుట్టి పెరిగిన ఊరు సీతారాంపురం బయల్దేరాం… సీతారాంపురం గురించి గతంలో సత్యవతి ఒక వ్యాసంలో వ్రాసిన విషయం అందరికీ గుర్తుంది. అందుకే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం…
సీతారాంపురంలో సత్యవతి తమ చిన్ననాటి యింటిలో తన తల్లి పేరుతో కొండవీటి అన్నపూర్ణ స్త్రీ శిక్షణాలయం ఏర్పాటు చేసింది… ఆ శిక్షణాలయం పనులతో తను ప్రతినెలా సీతారాంపురం వెళ్తుందట… నేనెప్పుడూ కూడా ఈ ఊరితో నా సంబంధాలను తెంచుకోలేదు అంటూ సత్యవతి తమ యింటి చుట్టుపక్కలవారిని, చిన్ననాటి స్నేహితురాళ్ళనీ పరిచయం చేసింది…
ఆ వూరి పచ్చదనం… తోటలూ మమ్మల్నెంతగానో అలరించాయి… ఆ తోటలో ఒక కొమ్మకున్న చిన్న చిన్న కాయల్ని… మరో చెట్టులోని ఆకుని కలిపి నమిలినట్టయితే నోరు పండుతుందని తిని చూపించింది సత్యవతి…. నిజంగానే తన నాలుక ఎర్రగా పండింది… మరి వాటి పేర్లు చెప్పమంటే నవ్వుతూ ‘వాటిని మేము లండన్ కాయలనేవాళ్ళం’ అంది సత్యవతి స్నేహితురాలు నవ్వుతూ…
నవ్వులే నవ్వులు…
సత్యవతి పెదనాన్నగారి యింటి ఎదురుగా ఒక జువ్వి చెట్టుంది.. ఆ వూరి మంచి చెడులకు ఒకటిన్నర శతాబ్ధి సాక్షీభూతం అట అది… ఆ జువ్విచెట్టుకింద నిల్చుని మేమంతా ఫోటోలు దిగడం ఒక ఎత్తయితే… ఆ చెట్టుకి అతి దగ్గరగా బోలెడు పిచుకలు వాలిన పచ్చని చెట్టొకటి మాకంట బడడం మరో ఎత్తు.
“ఎంత కాలమయింది పిచ్చుకల్ని చూసి..? అసలింకా పిచ్చుకలు బతికే వున్నాయా? అందరం నిశ్శబ్దంగా ఆ చెట్టుకి ఒకింత దూరంలో నిల్చుని చూడసాగాం.. మిత్రులంతా తమ తమ కెమెరాల్లో ఆ దృశ్యాన్ని బంధించి తీసుకొచ్చారు…
సీతారాంపురం అంతా కలియదిరిగి నవ్వుల పువ్వుల్ని, ఆనందపు రేఖల్ని ఊరంతా పంచిపెట్టి… సత్యవతి బాల్య స్నేహితుల వద్ద… అక్కడ మిగిలివున్న కుటుంబ సభ్యుల వద్ద వీడ్కోలు తీసుకుని తిరిగి మా బస్సెక్కాం…
సీతారాపురం నుండి నర్సాపురం వెళ్తోన్న దారిలో లేస్ పార్క్ వద్ద మా బస్సాగింది… ఇది మాకు ముందు చెప్పకుండా సత్యవతి మా బృందానికి ప్లెజెంట్ సర్ప్రయిజ్ యిచ్చింది. మా అందరి హృదయాలూ సన్నని దూదిపింజలయి గాలిలోకెగిరి లేసులల్లసాగాయి.
<< మొదటి భాగం ( 1 2 3 4 5 ) మూడవ భాగం >>
మీ సాహితీ యాత్ర బావుంది.అంతమంది రచయిత్రుల్ని కదిలించి,యాత్రను విజయవంతంగా నిర్వహించిన సత్యవతి గారికి అభినందనలు.