– అల్లూరి గౌరీ లక్ష్మి
ఇంకా చిన్న పిల్లవి కావు, మాటకి మాట తప్పు
నాన్నమ్మేమన్నా అమ్మలా మౌనమే మందు
పెళ్ళీడు కొచ్చావు శాంతం నేర్చుకో
పెళ్ళయ్యిందిక… పక పకలు మానుకో
భర్తొకమాటన్నా నిమ్మళించు
అత్తింట్లో ఎవరేమన్నా ఓర్పు వహించు
తల్లి వైనావింక…. సహనం ఆభరణం
పిల్లల మీద అరవకు…. ఓపిక తెచ్చుకో
వాళ్ళు విసిగిస్తారు అరవబాకు
మొండికేస్తారు, భూదేవవ్వాలి
కూతురి పెళ్ళిది… కిమ్మనకు
వియ్యపురాలితో సమ ఉజ్జీవా?
పిల్లనిచ్చినందుకు తప్పదు తగ్గడం
కొడుకు తల్లివని కొమ్ములా?
అత్తవైనావు… నిదానించు
కొత్తకోడలు పిల్ల… కనికరం చూపు
నా కోడలే అని దిద్దబాకు…. నచ్చకున్నా….
ఆమె అలిగిదంటే పరువేది?
కొడుకు వదిలేసినా వేళ్లాడు పో…
లేదంటే నీకు ఆధారమేది?
బ్రతుకంతా అణిగిమణిగేనా!
వ్యక్తిత్వానికి పాతరేనా?
అతి సహనం హద్దులు దాటి
మది ఇనుప ముక్కలు కూరిన బాంబైతే
మరి విస్ఫోటనాగ్రహం అనివార్యమే!
ఇప్పుడిక వ్యవస్థాహంకారం హతమే!