జులై నెల ‘భూమిక’లో ”యుద్ధ సమయంలో రాయటమంటే” అన్న అమీనా హుసేన్ (శ్రీలంక) వ్యాసం అద్భుతంగా వుంది.
స్త్రీలు రాస్తున్నపుడు ఎంత సెన్సార్షిప్ వుంటుందో మనందరికీ తెలుసు.. దీని గురించి మనమంతా యిదివరకే చర్చించి వున్నాం కూడా…
మొదటగా మనం రాస్తున్నపుడు మనల్ని మనమే సెన్సార్ చేసుకుంటూ వ్రాస్తాం… ఆ తర్వాత కుటుంబ సభ్యుల నుండీ, చుట్టూ వున్న సమాజం నుండీ వివిధ రకాలుగా సెన్సార్షిప్ మన మీద పెత్తనం చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ…అందునా ముస్లిం రచయిత్రిగా తాను లోపల వుండి బయటి వ్యక్తిగా వ్రాయడమనే సున్నితమైన పరిస్థితిని గురించి ప్రస్తావిస్తుందామె ఈ వ్యాసంలో…
”నా కథల సంపుటిలో ముస్లిం కమ్యూనిటీలో పితృస్వామ్యం గురించిన కథ కూడా వున్నప్పటికీ నేను భయపడ్డట్టుగా ఆ కథలకు సామూహిక వ్యతిరేక స్పందన రాలేదు. బహుశా నన్ను నేను విజయవంతంగా సెన్సార్ చేసుకున్నానేమొ” అంటుందామె. ఈ వాక్యాలు చదువుతున్నపుడు ఏదో గొంతుకడ్డంపడి దు:ఖాన్ని దిగమింగడం కష్టమవుతుంది.. అంతేకాకుండా ‘విశ్వాసం కలిగిన ముస్లింగా వుంటూ ఆ మతంలో వైరుధ్యాలు, అసంబద్ధతలు చూస్తున్న వ్యక్తిగా మతాన్ని విమర్శిస్తే నన్ను ముస్లిం వ్యతిరేకిగా, శత్రువుగా చూస్తారు. నేను మాట్లాడకుండా నిశ్శబ్ధంగా వుంటే నాకు నేనే శత్రునవుతాను..” అన్న వాక్యం నిద్రపోనివ్వదు. ఏదిఏమైనా ‘వుమెన్స్ వర్ల్డ్” వారు జరిపిన రచయిత్రుల సదస్సులోని ఇతర దేశాల రచయిత్రుల వ్యాసాలని ఒక్కొక్కటిగా అనువాదం చేసి మనకందిస్తోన్న ఓల్గాగారికి తెలుగు రచయిత్రులందరి తరఫునా ధన్యవాదాలు.. ఇవి ఇవ్వాళ నిజంగా మనకెంతో అవసరమైనవి…
వి. ప్రతిమ, నెల్లూరు
ఓల్గాగారి ‘పట్టపగటి చీకటి’ కథ కసుగాయలు తిన్న అనుభూతిని కలిగించింది. చెప్పదలుచుకున్న అంశాన్ని అనేక సందర్భాలద్వారా పోషించకుండా, పాత్ర మనోభావాలను బలంగా చిత్రీకరించకుండా టూకీ టూకీగా కథ చెప్పడం, అల్లికలో బిగువు లేకపోవడం ఇందుకు కారణం కావచ్చును. తెలుగులో స్త్రీవాద ఉద్యమానికి స్త్రీవాద సాహిత్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓల్గా గారు ఈ ఉద్యమానికి దోహదం కలిగించే కథలు రాయాలనే ఉద్దేశ్యంతో రాయడం సహజమే. అయితే ఏదో ఒక వాదాన్ని లేదా ఉద్యమాన్ని బలపరిచేందుకు రాసే కథలో కథాకళ కుంటుపడి వుండడం , కథలు ఒకే మూసలో నుండి వచ్చినట్లు అనిపించడం మాములుగా చూస్తువుంటాం. అలా జరిగేటప్పుడు అవి పాఠకుల్లో తప్పని సరిగా కలిగించవలసిన సంవేదన కలిగించలేవు. సంవేదన కలిగించలేనప్పుడు ఏ ఉద్ధేశ్యంతో కథలు రాయడం జరుగుతుందో ఆ ఉద్దేశ్యం నెరవేరదు. అందువలన ఉద్యమకారులు మాకు సందేశమే ప్రధానం కథల్లోని కళాత్మకత కాదు అనుకుంటే వారి కృషి ఫలించదు. ఓల్గా గారి స్త్రీవాద కథల విషయంలో, అనేక ఇతర రచయిత్రుల స్త్రీవాద కథల విషయంల్లోనూ అదే జరుగుతుందని అనుకుంటాను. తెలుగు స్త్రీవాద కథలు చదివేటప్పుడు కొంత హిందీ చదువుకున్న నాలాంటి వాళ్ళు హిందీలో వస్తున్న స్త్రీవాద కథలతో వీటిని పోల్చకుండా వుండలేరు. అది కూడా నా ఈ అసంతృప్తికి కారణం కావచ్చు. ఓల్గాగారి కథలన్ని ఈలాంటివేనని నేను చెప్పడం లేదు. ఆమె గుర్తించుకొనే కథలు కూడా రాశారు. ఉదా. అయోని కథ.
జె.ఎల్. రెడ్డి, న్యూఢిలీ్
రాష్ట్రపతికాదు రాష్ట్రసతి
ప్రతిభాపాటిల్ గారు అత్యున్నతమైన ప్రధమ భారతీయ పౌరురాలు గౌరవం పొందడం మనకందరికీ గర్వకారణం.
ఇప్పటిదాకా పురుషులే ఆ పదవిని అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టయ్యింది. ఉత్తరాది వాళ్ళకు రాష్ట్రమంటే దేశమనిఅర్ధం. మనకు స్టేట్ అని అర్ధం. ఇక నుంచి పురుషాధిపత్యంతో చలామణి అవుతున్న ‘రాష్ట్రపతి’ పదాన్ని ఇక నుంచి ‘రాష్ట్రసతి’ అని వ్యవహరిస్తే సముచితంగా జెండర్పరంగా గౌరవంగానూ ఉంటుందని భావిస్తున్నాను. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే ‘రాష్ట్రసతి’ శబా0్దన్ని వాడుకోవచ్చు. ఆలోచించండి.
డా. ఎండ్లూరి సుధాకర్, రాజమండ్రి
సంపాదకవిదుషీమణికి, శుభాశీస్సులు. స్త్రీల సమస్యలను ప్రాచీన కావ్యాల్లో స్త్రీకి యిచ్చిన స్థానం గురించి పరిశోధనలు చేసిన పేపర్స్ రావాలి. మహాభారతంలో దాంపత్యధర్మాన్ని వెతకటం వృధా ప్రయాస. ఏపిక్ సొసైటీ పురుష సమాజం మహాభారతం, మనుధర్మ శాస్త్రాల్లో భార్యతో కలవడానికి రుతుకాలమని నిర్ణయించారు. (10 రోజులు) వ్యభిచారాన్ని దూషిించినా వేశ్యలను నిషేధించలేదు.
భోగలాలసులు ప్రజలు. దాంపత్యాన్ని ధర్మంగా ఎవడూ భావించలేదు. భోగైశ్వర్యసుఖపాప్తిరస్తు అని దీవించడం కనిపిస్తుంది. ఇతి హాసాల్లో స్త్రీ సరియైన జీవితం గడపలేకపోయింది. మహా భారతం మొత్తంలో ఒకే ఒక్క వెలుగు రేఖలా సులభ కనబడింది. తగిన వరుడు దొరక్క పెళ్ళి చేసుకోలేదు. తాత్విక విదుషీమణి, యోగిని, భిక్షుకి. జనక సులభ సంవాదం శాంతి పర్వంలో తెలుగులో వుంది. మైత్రేయి గార్గి వంటివి కాదు సులభ, ఆనాటి పురుషునితో సమానంగా భౌద్దికంగా, యౌగికంగా సాధించిన ఘనత ఆమెది. మంచి వ్యాసాలు భూమికలో రావాలి.
శివలింగం,చర్లపల్లి