కృష్ణవేణి
(ఈ సంచికలోని గ్రామీణ మహిళా వరణ్యంలో మహబూబ్‌నగర్‌లోని మహిళా సమతా ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కేంద్రం లోని క్రిష్ణవేణి తను పెంపొందిం చుకున్న జీవన నైపుణ్యాల ద్వారా తనపై జరగబోయే అత్యాచార సంఘటనని ఎలా ఎదిరించ గలిగిందో తన మాటల్లోనే తెలుసు కుందాం.)
నేను, క్రిష్ణవేణి ఒక సంవత్సరం నుండి ఎం.ఎస్.కె. లో ఉంటున్నాను. ఇక్కడ చదువుతుంటూ 10వ క్లాస్ పరీక్షకు కట్టి పరీక్షలు వ్రాస్తున్నాను. ఏప్రిల్ 1వ తేదీ నాడు మాథ్స్ పేపర్ -2 పరీక్ష వ్రాసి నేను, ఇంకో ఇద్దరు ఎం.ఎస్.కె స్నేహితురాళ్ళతో కలిసి పరీక్ష సెంటర్ నుంచి బయటికి వచ్చాము. ఎం.ఎస్.కె.కు తిరిగి వెళ్లడానికి ఆటో కోసం చూస్తుండగా ఎదురుగా ఒక ఆటో కనబడింది. అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. మేము వెళ్లి జైలుకాడకు వస్తారా అని అడిగాను. ఆటో డ్రైవర్ ఎంత మంది అని అడిగాడు. ముగ్గురమని చెప్పాము. ఆటో ఎక్కినాము ఎక్కిన తర్వాత బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో రైట్‌సైడ్ ఎల్లమ్మ గుడి నుండి పోదామని ఆటోని రైట్‌సైడ్ తీసుకుని వేళ్ళాడు. నేను ఒకపక్క ఆటో గమనించాను, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అన్నయ్య అని అడిగినాను. ఈమెను దించిన తర్వాత మిమ్ములను దింపుతాను అన్నాడు. ఆమె ఇల్లు గుట్టల ప్రక్కల ఉంది. ఆటో నుండి దిగుతున్న ఆమెను డ్రైవర్ తన ఫోన్ నెంబర్ అడిగాడు. ఆమె చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమెను చూసుకుంటూ నిదానంగా ఆటోను మలిపిండు, ఆటో నడుపుకుంటు వస్తు దారిలో మెకానిక్ షాప్ దగ్గరనున్న ఇద్దరు వ్యక్తులను పిలిచాడు. వాళ్ళిద్దరూ బైకుమీద కూర్చొని ఉన్నారు. వాళ్ళలో మొదట ఒక్కరు వచ్చారు మమ్మల్ని చూసి నవ్వుకుంటూ డ్రైవర్ ప్రక్కల కుర్చున్నాడు. డ్రైవర్ రెండోవాడి కూడా పిలిచాడు. వాడు కూడా నవ్వుకుంటూ వచ్చి డ్రైవర్ ప్రక్కల కూర్చున్నాడు. నేను ఈ ముగ్గిరినీ గమనించి, ఏదో జరగబోతుందని గ్రహించి ఆటో నుండి దుంకిన (నా ఇద్దరు స్నేహితులు) కావేరి, జ్యోతి ఆటోలో ఉండిపోయారు. తర్వాత నేను కేకవేయ్యడంతో ఆటో డ్రైవర్ ఆటోను అపాడు. దగ్గరకు వచ్చి, ఆటో ఆపి నీకాళ్ళు చేతులు విరిగిపోతే అని తిట్టడం మొదలు పెట్టాడు. తర్వాత నేను నా స్నేహితులను దిగండి అని తిట్టాను. తర్వాత ఇద్దరు అబ్బాయిలనూ దింపితేనే మేము ఎక్కుతాము అని చెప్పాను. తర్వాత డ్రైవర్ వీళ్ళు మా అన్నయ్యలు అని ఎక్కించు కున్నాను, మీరు పోయే దారిలోనే వాళ్లు దిగిపోతారు, మీకెంది అని డ్రైవర్ మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టాడు. లేదు వాళ్లను దింపితేనే మేము ఎక్కుతాము, లేకుంటే వేరే ఆటోలో ఎక్కిపోతాము నేను అంతదూరం నుండి ఎక్కించుకొని వచ్చాను. డబ్బులు ఇవ్వాలి అని అన్నాడు. తర్వాత తిట్టుకుంటూ వాలిద్దర్ని దిగమన్నాడు. అప్పుడు మేము ముగ్గురం ఆటో ఎక్కినాము. ఎక్కిన తర్వాత ఆయన డ్రైవర్ అడ్డం మలిపి ఆటోనడుపుతూ కొద్దిగా ముందుకు వచ్చాక ఆటోను ఆపి సెల్‌ఫోన్‌లో ఏదో మెసేజ్ పంపాడు. ఫోన్ చేసి వెనుక బైకుమీదగా రండి అని ఫోన్ చేశాడు. మాటలు గమనించి డ్రైవర్‌ను నేను గట్టిగా బెదిరించి డైరెక్టుగా జైలు దగ్గర తీసుకుపోతేనే సరి లేకపోతే మా అక్కయ్య వాళ్లకు ఫోన్ చేసి చెప్తాము అని బెదిరించాము. అతను వినిపించుకోలేదు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్‌ఫెక్టర్ జ్యోతి మేడం గార్కి చెప్పాతాము అని అన్నాము. మేము చెప్పేది లెక్కచేయక, వినకుండా మళ్ళీ అద్దం మలిపి తిట్టడం మొదలు పెట్టాడు. నేను ఉర్కే ఉంటే ఇంకా చాలా బెదిరిస్తాడు అని నేను గట్టిగా మాట్లాడినాను. అట్టే జైలుకానకు తీసుకోనిపో అని గట్టిగా చెప్పాను. జైలుకాడ దింపాడు. తర్వాత ఆటో దిగగానే రూపాయలు ఇవ్వకుండా వద్దామనే ఆలోచన మాకు రాలేదు. తొందరగా ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి భయంతో గేటులోనికి వచ్చేశాము.
ఎం.ఎస్.కె.కు వచ్చి అక్కయ్య వాళ్ళకు జరిగిందంతా చెప్పాము. మణి, పుష్ప్క వెంటనే స్టేట్ ఆఫీస్ అక్కవాళ్లకు చెప్పారు. ఎం.ఎస్.కె అక్కయ్య వాళ్ళు డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వకుండా వచ్చుంటే వాడిపని చెబుతుంటిమి అని అన్నారు. తర్వాత అక్కయ్య వాళ్ళకు చెప్పడంతో ఇంక ధైర్యం వచ్చింది. ఎం.ఎస్.కెలో చదివినందుకు మాకు చాలా ధైర్యం వచ్చింది. నా స్నేహితులుకు నాకు ఇలాంటి సమస్యలు ఎదురైన మనం భయపడకూడదు అని ధైర్యం పెంచుకోవాలి. ఎదుర్కోవాలి అని చెప్పాను. ఎం.ఎస్.కెలో చదివినందుకు చాలా విషయాలను తెలుసుకున్నాను.
అక్క వాళ్లు నేను చేసిన పనిని మెచ్చుకున్నారు. అందరూ ఇలా ధైర్యంగా ఉండాలని మళ్లీ చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మనం భయపడకూడదు. ధైర్యంగా తెలివితో ఎదుర్కొనాలి అని స్నేహితులకు చెప్పాను. ఎం.ఎస్.కె కు రావడం వల్ల నేను చదువుతోపాటు ఆటలు, పాటలు, చేతిపనులు, జూట్ బ్యాగ్‌లు తయారీ, కరాటే, ఇంకా చాలా విషయాలు నేర్చుకొన్నాను. అమ్మాయిలందరూ కూడా ధైర్యంగా, నమ్మకంతో ముందుకు రావాలి. ఎం.ఎస్.కె కు రాలేని అమ్మాయిలకు ఇలాంటి విషయాలన్నీ తెలపాలి అని అనిపిస్తుంది. నాలో ఇంత ధైర్యాన్ని తెప్పించిన ఎం.ఎస్.కె. అక్కయ్యలకు, మహిళా సమత అక్కయ్యలకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను.