– జి. విజయలక్ష్మి

రాత్రుళ్ళు యాంఫీ ధియేటర్లో సినిమాలు, పగలు ఆడియో విజువల్‌ రూంలో భగవద్గీత, రోజూ ఉదయాన్నే భక్తి సంగీతం, సుప్రభాతాలు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, పేపర్‌ రీడింగ్‌, పరిశుభ్రమైన వాతావరణంతో ఇంటి భోజనం, ఇద్దరు నర్సులతో పాటు డాక్టర్‌ సదుపాయం, లిఫ్ట్‌ సౌకర్యం, టీవీ, గీజర్‌, కప్‌బోర్డ్‌, రైటింగ్‌ టేబుల్‌, యుపిఎస్‌, జనరేటర్లతో 24 గంటలు విద్యుత్‌ సదుపాయం, షాపింగులు, పిక్నిక్కులు, పండుగల రోజుల్లో ప్రత్యేక వంటకాలు, మినరల్‌ వాటర్‌ సౌకర్యం, ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు, కుల మత భాషా ప్రాంతాలు మరచి అన్ని పండుగలు సెలిబ్రేట్‌ చేసుకుంటూ గేమ్స్‌ ఆడుకోవటం, వారానికి రెండు రోజుల దగ్గర్లో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికో, చర్చికో వెళ్ళడం… ఇదంతా ఎక్కడబ్బా అని ఆశ్చర్యపోతున్నారా, వృద్ధాశ్రమాలన్నిటికీ తలమానికంగా నిలిచిన ఓల్డ్‌ ఏజ్‌ రిసార్ట్‌ ”స్మైల్స్‌”లో.

ఓల్డ్‌ ఏజ్‌ హోం అనే పదం విన్నారు కానీ ఓల్డ్‌ ఏజ్‌ రిసార్ట్‌ ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా, మీ ఆలోచన నూటికి నూరు శాతం కరెక్ట్‌. స్మైల్స్‌… ఇది వృద్ధులకి నిజంగా రిసార్టే. పైన వివరించిన సౌకర్యాలన్నీ ఉన్నపుడు అది రిసార్టు కాక ఇంకేమవుతుంది? సికింద్రాబాద్‌ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో మేడ్చెల్‌లోని జయదర్శిని టౌన్‌షిప్‌ ‘సి’ బ్లాకులో ఉంది స్మైల్స్‌.

ఒక సందర్భంలో ఇటీవల నేను స్మైల్స్‌కి వెళ్ళాల్సి వచ్చింది. బయలుదేరేటపుడు ”వృద్ధాశ్రమంలో చూసేదేముంటుంది?” అనుకుంటూ, ”చూద్దాం ఒకసారి…” అనుకుని బయలుదేరాను. తీరా వెళ్ళాక వావ్‌… అని ఆశ్చర్యపోయాను. వృద్ధాశ్రమానికి వెళ్ళడం అంటే అన్నీ కోల్పోయి చివరి రోజులకోసం ఎదురుచూడటానికే అనే భావన నా మనసులో ఏదో ఒక మూల ఉండేది. స్మైల్స్‌లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

స్మైల్స్‌లోని వాతావరణం నన్ను ఆకట్టుకుంది. ఫ్రిస్కీ, బ్లాకీలు ద్వారపాలకుల్లా స్మైల్స్‌ గేటుకు అటూ ఇటూ కూర్చొని వచ్చిపోయేవారికి భౌభౌమంటూ తోక ఊపుతూ స్వాగతం పలుకుతాయి. తోటలోని గణపతి పూబాలల నవ్వుల్ని చూస్తూ, పక్షుల మంత్రోచ్ఛారణ వింటూ, నెమళ్ళ నాట్యం తిలకిస్తూ, గంటకొట్టినా కదలక మెదలక చిరునవ్వులు చిందిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ తన్మయం చెందుతుంటాడు. భక్తులు అప్పుడప్పుడు వచ్చి గంట కొట్టి డిస్ట్రబ్‌ చేస్తే తప్పనిసరై ఆశీర్వదించి మళ్ళీ ప్రకృతిని తిలకించడంలో నిమగ్నమవుతాడు. పక్కనే ఉన్న మూడెకరాల సరోవరం లాంటి చెరువులో చేపలు ఎగిరెగిరి పడుతూ నీళ్ళు తాగడానికి వచ్చిన మేకల్ని పలకరిస్తూ, వలలు పట్టుకుని వచ్చిన జాలరుల్ని ఊరిస్తూ ఉంటాయి. ఇక స్మైల్స్‌ లోపలి ఫిష్‌పాండ్‌లో చేపలు పరుగుపందాలు పెట్టుకుంటాయి. విన్నర్‌ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.

ఇక్కడ గాలి, నీరు, చుట్టూ వున్న వాతావరణం కూడా స్వచ్ఛంగా నవ్వుతున్నట్లనిపించింది నాకు. బాల్కనీలో నుండి ఉదయం సూర్యోదయాన్ని చూస్తున్నపుడు సూర్యుడు చిరునవ్వుతో నన్ను పలకరించినట్లనిపించింది. సాయంత్రం పిల్లగాలి తోడుతో వాకింగ్‌ చేస్తుంటే సూర్యుడు చిరునవ్వులు చిందిస్తూ కొండల చాటున దోబూచులాడుతూ నాకు అందకుండా మాయమవుతాడు.

ఇక్కడ అన్నింటికంటే పెద్ద ఎక్సర్‌సైజ్‌ వీక్లీ మోనూమీద జరుగుతుంది. ఆయిల్‌ ఫుడ్‌ తగ్గించాలనే ఉద్దేశంతో పూరీ, వడ లాంటి నూనె వస్తువుల్ని నెలకి ఒకసారి మాత్రమే తయారుచేస్తారు. ఇడ్లీలో ఆయిల్‌ వాడకం ఉండదు కనుక వారానికి మూడుసార్లు ఉండాలని కొందరు, అన్నిసార్లు ఇడ్లీ తినాలంటే బోర్‌ కొడుతుందని కొందరు, సాయంత్రం స్నాక్స్‌లో బిస్కెట్లు, సమోసాలు, కేకులు ఉండాలని మరికొందరు, జంక్‌ ఫుడ్స్‌ వద్దని ఇంకొందరు, అటుకులు తినలేకపోతున్నామని కొందరు, బొబ్బర్లు వద్దని కొందరు… ఇలా రకరకాల అభిప్రాయాలను మేళవించుకుని చివరికి ఆ వారం మెనూ తయారవుతుంది. ఫుడ్‌ కమిటీలో మేనేజ్‌మెంట్‌తో పాటు రెసిడెంట్స్‌ కూడా పాల్గొని తయారుచేసిన మెనూలో ఉన్న పదార్థాలు నచ్చనివారికి ప్రత్యామ్నాయంగా ఎల్లవేళలా బ్రెడ్‌, ఓట్స్‌, కార్న్‌ఫ్లాక్స్‌ అందుబాటులో ఉంటాయి. రోజంతా మజ్జిగ, పాలు ఉంటాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్లు తింటామంటే కుదరదు. వారి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మాత్రమే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఉదయం ఆరున్నరకు పాలు/టీ/కాఫీ/జావ, ఎనిమిదింటికి బ్రేక్‌ఫాస్ట్‌, పదింటికి ఫ్రూట్స్‌, మధ్యాహ్నం పన్నెండున్నరకి లంచ్‌, సాయంత్రం నాలుగింటికి స్నాక్స్‌, టీ, ఏడింటికి సూప్‌, ఏడున్నరకి డిన్నర్‌, డిన్నర్‌ పూర్తయి రూంకి వెళ్ళేప్పుడు ఫ్లాస్క్‌లో పాలు – ఇదీ స్మైల్స్‌లో ఆహార సదుపాయం. అంతా శాకాహారమే. మాంసాహార ప్రియుల కోసం ప్రతినెల రెండవ శుక్రవారం స్మైల్స్‌ బయట ఉన్న పెద్ద రావిచెట్టు కింద నాన్‌వెజ్‌ పార్టీ జరుగుతుంది. ఈ పార్టీలో పదార్థాలను బయటినుంచి తెప్పించి సర్వ్‌ చేస్తారు.

ప్రతిరోజూ ఉదయం ఏడున్నరనుండి ఎనిమిదిన్నర దాకా ”హోం” భక్తిగీతాలతో తన్మయమవుతుంది. మధ్యాహ్నం భోజన సమయంలో వాయిద్య సంగీతం, సాయంత్రం నాలుగింటికి స్నాక్స్‌ సమయంలో పాత పాటల మాధుర్యం, ఐదున్నరనుంచి ఎఫ్‌ఎం హోరు, మళ్ళీ ఏడింటికి మధుర గీతాలు. వారానికి రెండుసార్లు రాత్రి ఎనిమిదింటికి తెలుగు/హిందీ/ఇంగ్లీషు సినిమా. అన్ని భాషల మాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం.

నర్సులు రోజూ ఉదయం బీపీ చూస్తారు. వారానికి ఒకసారి బరువు తూస్తారు. వృద్ధులు వేసుకునే మందుల్ని వారి వారి పేర్లతో ఉన్న బాక్సుల్లో పెట్టి డెస్పిన్సరీలో ఉంచి టైం ప్రకారం ఇస్తూ ఉంటారు. అవసరమైన వారికి వేడినీటి కాపడం పెడతారు. ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. వారానికి రెండుసార్లు డాక్టర్‌ వస్తారు. అత్యవసర సమయంలో వెంటనే వస్తారు.

అందరి బట్టలూ కలగాపులగంగా కలపకుండా ఎవరివి వారికే విడివిడిగా ఉతికి ఇచ్చే సదుపాయం, తమకు దూరంగా ఉన్న పిల్లలు, బంధువులు, స్నేహితులను వెబ్‌కామ్‌లో చూస్తూ మాట్లాడే అవకాశం, ప్రతి రూంలో గీజర్‌, టీవీ, నర్స్‌ కాలింగ్‌ సిస్టం, అవసరమైన వారికి అటెండెంట్‌ సదుపాయం, ఎక్కడా ఏ లోటూ రాకుండా చూడటం స్మైల్స్‌ ప్రత్యేకత. ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంతో సిటీ నుంచి వచ్చినవారితో కలిసి ఎంజాయ్‌ చేయడం ఇక్కడి వృద్ధులకి ఎంతో రిలీఫ్‌ని కలిగిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగింటికి జరిగే రెసిడెంట్స్‌ మీటింగ్‌. మీటింగ్‌ ప్రారంభంలో ట్రస్టీల సమక్షంలో సజెషన్‌/కంప్లెయింట్‌ బాక్సుని తెరుస్తారు. ఇక్కడి సమస్యలు, పరిష్కారాలమీద వివరమైన చర్చ జరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలను తర్వాతి ఆదివారంలోపు అమలుపరచడం స్మైల్స్‌ ప్రత్యేకత.

నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం అని ఒక కవి అంటే… నవ్వు, నవ్వించు, నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు అని మరో కవి అన్నారు. చిన్నారి పాపల్లె నవ్వు, సిరిమల్లె పువ్వల్లె నవ్వు అని మరొకరన్నారు. ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయని ఓ మహానుభావుడన్నాడు. నిజమే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా కళ్ళలో వచ్చేవి నీళ్ళే. దుఃఖాశ్రువులు లేదా ఆనందబాష్పాలు ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. కాని మానవజన్మలో ఇవి ముఖ్యమైన అంశాలు. నవ్వనివాడు మనిషి కాడు అలాగే కన్నీళ్ళు రానివాడు అసలు మనిషే కాదు. ఈ రెండు అంశాలకు స్పందించినవాడే అసలైన మనిషి.

నీటిలో నిప్పు పుడుతోంది. నిప్పు నీటితోనే ఆరుతుంది. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. వృద్ధాప్యం శాపమా? వరమా? అని ఎన్నో చర్చలు కూడా జరిగాయి. మనిషికి అన్ని అవయవాలు ముఖ్యమే. ఏ అవయవం లేకపోయినా అతను వికలాంగుడే. అలాగే శరీర భాగాలన్నీ సరిగా ఉన్నా అతని హృదయం సంకుచితంగా ఉంటే అతను మానసిక వికలాంగుడే. ఒక అవయవం పనిచేయకపోయినా జీవించవచ్చు కాని అసలు హృదయమే స్పందించకపోతే ఎలా జీవించగలం. కాలచక్రానికి గ్రీష్మం, శిశిరం, వసంతం, హేమంతం ఇలా అన్ని ఋతువులు ఎలా ముఖ్యమో మానవ జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాక్యం అన్ని దశలు ఆమోదయోగ్యమే. వాటిని సంతోషంగా ప్రతి మనిషీ తన జీవితంలోకి ఆహ్వానించాలి. వాటివల్ల ఎదురయ్యే పరిస్థితుల్ని తట్టుకోవటానికి సంసిద్ధం కావాలి. సూర్యుడు చంద్రుడు ఎవరు రమ్మన్నా రారు. ఎవరు ఆగమన్నా ఆగరు. ఎవరూ ఆపలేరు. మనిషి జీవితంలో కూడా సూర్యచంద్రులు, చీకటి వెలుగుల్లా కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఏది ఏమైనా మన పెదవులపై చిరునవ్వుని చెదరనివ్వకూడదు. మనిషి దుఃఖాన్ని జయించగలిగే ఆయుధం చిరునవ్వే. అంతేకాదు. ఎదుటి మనిషి ఎంత బాధలో ఉన్నా మనం ఎదురైనప్పుడు ఒక చిన్న చిరునవ్వుతో విష్‌ చేశామనుకోండి, ఆ మనషి తన బాధలన్నిటినీ పూర్తిగా కాకపోయినా ఒక్క క్షణం మరచిపోతాడు. అందుకే కాబోలు ఇక్కడ సీనియర్‌ రిసార్ట్స్‌కి స్మైల్స్‌ అని పేరు పెట్టారు.

గతంలో రాజులు కొంతకాలం రాజ్యాన్ని ఏలిన తర్వాత పిల్లలకి రాజ్యాభిషేకం చేసి రాజ్యాన్ని వదిలి దూరంగా వనాల్లోకి వెళ్ళి నిరాడంబరంగా, ప్రశాంతంగా జీవించేవారట. రాజరికాలు పోయి ప్రజా పరిపాలన వచ్చినా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి మంచి, చెడు, విద్యాబుద్ధులు, సంస్కార జ్ఞానం నేర్పేవారు. మొత్తంగా కుటుంబంలో కౌన్సిలర్స్‌గా పనిచేసేవారు. సామ్రాజ్యవాద సంస్కృతిలో భాగంగా ఉమ్మడి కుటుంబాలు కూలిపోయి వ్యష్టి కుటుంబాలు వచ్చాయి. అత్తాకోడళ్ళ మధ్య అవగాహన లేకపోవడం, పెళ్ళి అవగానే భర్త ఒక్కడే తన స్వంతం అనుకునే భార్యలు, అప్పటివరకు అమ్మ కొంగు వెనకాల ఉన్న అబ్బాయి పెళ్ళికాగానే భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని తల్లడిల్లే తల్లులు. ప్రస్తుతం భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లలు స్కూళ్లకి వెళ్ళిపోతే, బిక్కుబిక్కుమంటూ ఇళ్ళలో ఒంటరిగా మిగిలిపోయే వృద్ధులు. పిల్లల్ని బాగా చదివించి లక్షలు ఖర్చుపెట్టి విదేశాలకు పంపి, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి జీవించడానికి వీలులేక ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయే వృద్ధులు. పిల్లలు పంపిన డాలర్లతో ఆస్తులు అంతస్తులు పెంచి వాటిని కాపాడుకుంటూ ఇక్కడే పిల్లలకు దూరంగా మిగిలిపోయే తల్లిదండ్రులు.

భర్త చనిపోయి ఒంటరిగా మిగిలిన భార్యలు, భార్య చనిపోయి ఒంటరిగా మిగిలిన భర్తలు, పిల్లల చేతుల్లో మోసపోయిన తల్లిదండ్రులు, పిల్లల సుఖసంతోషాల్ని దృష్టిలో పెట్టుకొని దూరంగా వచ్చేసిన తల్లిదండ్రులు, వయసులో ఉన్నపుడు ఆవేశాలకు పోయి అభిప్రాయభేదాలు పెంచుకొని ధైర్యంగా ఒంటరిగా జీవించి చివరికి ఒంటరితనం భరించలేక ఆశ్రమాలని ఆశ్రయించేవారు – ఇలా కారణాలు ఏవైనా రకరకాల సమస్యలతో వృద్ధాశ్రమాలకు వస్తున్నారు. అందువల్లే ఇవాళ హైదరాబాదులో వృద్ధాశ్రమాల సంఖ్య మూడు వందలు దాటింది. వీటిలో సేవాభావంతో కొన్ని, వ్యాపార దృక్పథంతో మరికొన్ని.

ఈ రెండింటికీ అతీతంగా తండ్రి, గౌరా వెంకటరత్నం గారి ఆశయం కోసం కొడుకులు గౌరా లక్ష్మీప్రసాద్‌, గౌరా అనిల్‌ కుమార్‌లు స్మైల్స్‌ పేరుతో సీనియర్స్‌ రిసార్టుని నిర్మించారు. స్మైల్స్‌లో ఉంటున్న అందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి ఏలోటూ రాకుండా ప్రతి ఆదివారం తమ కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి వృద్ధులతో సంతోషంగా గడిపి వెళ్తుంటారు ట్రస్టు సభ్యులు. డబ్బు ఎంతోమంది సంపాదిస్తారు. కాని దాన్ని సరైన మార్గంలో మంచి పనికోసం, మానవసేవ కోసం వినియోగించే విశాల హృదయం ఎందరికి ఉంటుంది? ”మానవసేవే మాధవసేవ” అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ స్మైల్స్‌లో వున్న వృద్ధుల్ని స్వంత తల్లిదండ్రులకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ట్రస్టు సభ్యులు.

మధ్య తరగతి, ఆపై తరగతి వారికి మాత్రమే వృద్ధాశ్రమాల అవసరం, అవకాశం కలుగుతోంది. కింది తరగతుల వారు ఇంట్లోవాళ్లంతా పనిపాటలకు వెళ్ళిపోతే వంటావార్పు చూసుకుంటూ వృద్ధులు ఇంట్లోనే వుండాలి. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో వృద్ధులు ఆ ఇంటికి ఎంతో ఆసరాగా, పెద్ద దిక్కుగా ఉంటారు. కొట్టుకున్నా తిట్టుకున్నా వారికి కలిసి ఉండటం తప్ప వేరే మార్గం లేదు.

ఏది ఏమైనా ఎవరి సమస్య ఏదైనా ఒంటరితనంతో, అనారోగ్యంతో, డిప్రెషన్‌తో కుమిలి నరకయాతన అనుభవించకుండా, గతంలో సుఖంగా బ్రతికినా బ్రతక్కపోయినా ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా గడుపుతూ పసిపిల్లల్లా కేరింతలు కొట్టడం చూస్తుంటే వృద్ధాప్యం స్మైల్స్‌లో ఉన్నవారికి వరమే.

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు నేటికీ నవయువకులు అని శ్రీశ్రీ ఎందుకన్నారో స్మైల్స్‌కి వచ్చాక నాకర్థమైంది. మనిషి జీవించడానికి డబ్బు కావాలి. కానీ మనిషి జీవితమే డబ్బు కాకూడదు. ఓ పెద్ద డబ్బు మూటను మన పక్కన పెట్టుకొని దాన్ని చూస్తూ కూర్చున్నంత మాత్రాన అది మనకు కావాల్సిన సేవలు అందించలేదు. కొంతమంది డబ్బే ప్రపంచంగా బ్రతుకుతారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేశామనే ఇగోలతో అందర్నీ దూరం పెడతారు. ప్రతిదీ స్టేటస్‌ సింబల్‌ అంటారు. కానీ మనకి కష్టకాలంలో సేవ చెయ్యాలంటే మనిషికి మనిషి మాత్రమే చెయ్యగలరు. అందుకే

నూరు పువ్వులు వికసించాలి

కోటి కాంతులు విరజిమ్మాలి

మానవతా పరిమళాలు ప్రతి మనిషి హృదయాన్నీ తాకాలి

ప్రతీ మనిషీ నవ్వాలి.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో