– డా|| యు. ఝాన్సీ
సమాజంలో అట్టడుగువర్గంగా పిలవబడుతున్న షెడ్యూల్ తెగలలో ఉపకులమైన యానాదుల జీవితాన్ని ఆవిష్కరించిన నవలన ‘ఎన్నెల నవ్వు’. యానాదుల జీవనవిధానం, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, విశ్వాసాలు… ఒక్కమాటలో చెప్పాలంటే యానాదుల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక జీవిత చిత్రణే ఎన్నెల నవ్వు. ఈ నవల రచయిత ఏకుల వెంకటేశ్వర్లు. ఇది సెప్టెంబర్ 2011న వెలువడింది.
1. ప్రధాన పాత్రలు
మంగమ్మ-పోలయ్య (భార్యాభర్తలు). వీరి కూతురు అలివేలు. అలివేలు భర్త పోలయ్య. వీరి కొడుకు చెంచులు. కోటిరెడ్డి (పొగాకు కంపెని సూపర్‌వైజర్), అనసూయమ్మ (చెంచులు స్నేహితురాలు), నర్సయ్య-పర్వతాలు, అంజయ్య-రత్తమ్మ… మొదలైనవారు.
2. ఎన్నెలనవ్వు – ఇతివృత్తం
ఆహార సేకరణే జీవిత పరమావధిగా బ్రతికే యానాదుల జీవితగాథే ఎన్నేల నవ్వు. హైటెక్, బయోటెక్, నానోటెక్… అంటూ ముందుకు పోతున్న నేటి సమాజంలో ఇంకా ఏ పూటకాపూట రెక్కాడితే కాని డొక్కాడని బడుగుజీవుల దయనీయ పరిస్థితులు, వారి నిష్కల్మషమైన నవ్వు, కల్తీలేని ప్రేమ, ఉన్నతవర్గాల చేతిలో దోపిడికి గురవ్వడం… ఈ నవలలో ప్రధాన ఇతి వృత్తాంతం.
3. ప్రధాన కథ
ఈ నవలలో అలివేలు ప్రధానపాత్ర. ఈమె మంగమ్మ, పోలయ్యల కూతురుగా పిలవబడుతుంది. కాని పోలయ్యకి పుట్టిన బిడ్డ కాదు. మంగమ్మ యౌవ్వనంలో వున్నప్పుడు ఉన్నత కులానికి చెందిన భావనారాయణ చేతిలో శారీరక, మానసిక దోపిడికి గురై, ఒక బిడ్డకు తల్లై, అతని ఆదరణకు నోచుకోక, ఒంటరిగా జీవచ్ఛవంలా మిగులుతుంది. ఆ సమయంలో నెల్లూరులోని నక్కలదిబ్బ సంఘానికి వలసకూలీగా వెళ్తుంది. అక్కడ పోలయ్య తారసపడతాడు. పోలయ్య భార్య అప్పటికే ఇద్దరు పిల్లల్ని కని, బాలింత జబ్బుతో చనిపోతుంది. మంగమ్మ, పోలయ్యలు ఒకరి కష్టాలు ఒకరు వెల్లబోసుకుంటూ, కలసి బ్రతకాలని నిర్ణయించుకుంటారు. ఇక అప్పటినుండి ఒకరికోసం ఒకరన్నట్లు జీవిస్తుంటారు. ఒకరి బిడ్డల్ని ఒకరు కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అందువల్ల అలివేలుమంగమ్మ, పోలయ్యల కూతురుగా పిలవబడుతుంది. అలివేలుది చక్కని రూపం. నాలుగో తరగతి వరకు చదువుకుంటుంది. అందరు ఆమె అందాన్ని చూసి, ”యానాదోలల్లో జారి పుట్టిన్నట్లున్నావే” అంటుండేవారు. అలివేలు ఆ వూరికి దగ్గర్లో వున్న పొగాకు కంపెనీలో పనికి వెళ్లేది. ఆ కంపెనీ సూపర్‌వైజర్ కోటిరెడ్డి అలివేలు అందానికి ముగ్ధుడై, ఆమెను ఏదోల వశపరచుకోవాలని ప్రయత్నించి, అనుకున్నది సాధిస్తాడు. అది గమనించిన మంగమ్మ, కూతురి జీవితం తన జీవితంలా కాకూడదని, తన దగ్గర బంధువైన మునయ్యకిచ్చి వివాహం చేస్తుంది. అలివేలు – మునయ్యల కొడుకే చెంచులు. చెంచులు పుట్టిన కొంతకాలానికి మునయ్య ఎటో వెళ్ళిపోతాడు. ఎప్పటికి తిరిగి రాడు. కోటిరెడ్డి ఇదే అదునుగా భావించి, అలివేలుతో మళ్ళీ దొంగ సంసారం మొదలుపెడతాడు. కొంతకాలానికి అలివేలుని పూర్తిగా తన కుటుంబానికి దూరం చేస్తాడు. కోటిరెడ్డికి మోజు తీరాక ఆమె జీవితం కాకులు చింపిన విస్తరైపోతుంది.
అలివేలుకి పుట్టిన చెంచుల్ని మంగమ్మే పెంచి పెద్ద చేస్తుంది. బడికి కూడా పంపిస్తుంది. చెంచులు చదువులో ముందున్నప్పటికి, అనుక్షణం కులవివక్షకి గురయ్యేవాడు. ఎవ్వరు అతనితో స్నేహం చేసేవారుకాదు. తద్వారా చెంచులు తమ జాతిపట్ల సమాజానికి వున్న చిన్నచూపును, వున్నత కులస్తుల చేతిలో తన ప్రజలు ఎలా దోపిడికి గురౌతున్నారో గ్రహిస్తాడు. చెంచులు పదవ తరగతికి వచ్చేనాటికి కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితుడవుతాడు. అనేక విప్లవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వుండేవాడు.
అలివేలు జీవితం అనేక చేతులు మారి, రోగగ్రస్తురాలై చివరి రోజుల్లో ఇంటికి చేరి మరణిస్తుంది. చెంచులు తన జాతిని వుద్ధరించాలనే వుద్దేశంతో అడవుల్లోకి వెళ్లిపోవడంతో కథ ముగుస్తుంది.
4. యానాదుల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక స్థితిగతులు
(అ) ఆర్థిక స్థితి
నవల ప్రారంభంలోనే రచయిత యానాదుల ఆర్థికస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. యానాదుల ఇళ్ళను వర్ణిస్తూ ”చింతచెట్ల కింద అక్కడక్కడ దూరం దూరంగా సజ్జ సొప్పతో కప్పిన సిన్న సిన్న పూరిగుడిశెలు. మోకాలెత్తు మట్టి గోడలు. నేలబారు గుడిశెలు. వాటిని చూస్తే టక్కున చెప్పవచ్చు ఇవి యానాదోళ్ళ గుడిశలు అని.” ఈ వాక్యాలు యానాదుల ఆర్థికస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు. వాళ్ళకు గుడిసె వేసుకోవడానికి సొంత స్థలం ఉండదు. ఆ ఊరి పెద్దల దయాదాక్షిణ్యాలతో గుడిసెలు వేసుకుంటారు.
దీన్నిబట్టి యానాదులు తలదాచుకునే గూడు ఎంత దుర్భరంగా వుందో అర్థమౌతోంది. గుడిసెలు చిన్నవే కావచ్చు కాని వాళ్ళ ఆత్మాభిమానం ఆకాశమంత. అందుకే ఆ నాలుగు గుడిసెలను గౌరవంగా చింతతోపు సగం అని పిలుచుకుంటారు.
రచయిత అలివేలుకి ప్రదానం జరిగే సందర్భాన్ని వివరిస్తూ ”ఇంట్లో ఒక్క విత్తు కూడా లేదనే సంగతి మంగమ్మకు మాత్రమే తెలుసు. ఎవరి దగ్గరన్న కాసిని అప్పు తీసుకుందామా… అంటే ఏ పూటకాపూట తెచ్చుకుని కాసుకునేవాళ్ళే గదా… మరి వీళ్ళ దగ్గర బదులిచ్చే బియ్యం ఎందుకుంటాయ్…” వేమన చెప్పినట్లు ‘పుత్తడి గలవని పుండు బాధైనను/వసుధలోన చాలా వార్తకెక్కు/పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు. ఈ మాటలు ఈ సందర్భానికి చక్కగా సరిపోతాయి. యానాదోల్లు ఏపూటకాపూట కష్టపడి తెచ్చుకుని తినడమే తప్ప వేరే దారిలేదు. చివరికి పెళ్ళి జరిగే రోజున కూడా అదే పరిస్థితి వుందంటే, వారు ఎంతటి దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారో తెలుస్తోంది.
ఒక సందర్భంలో పోలయ్య మంగమ్మ ఇచ్చిన అన్నంలో చేయిపెట్టి ”ఈ కూడు మెత్తబడిందే” అంటాడు. దానికి సమాధానంగా మంగమ్మ ”ఆకలైనప్పుడు మనమసుంటోళ్ళకి కావల్సింది రుసికాలు కాదెమ్మే. పాసిపోయిన పిసురైనా సరే పరమాన్నంలాగ తినాల్సిందే. ఈ పూటకి ఆ దేవుడు ఇచ్చింది ఇదేనని తినాలి” అని చెప్తుంది. ఆ మాటలకు పోలయ్య మారుమాటాడకుండా ఆ పాసిపోయిన అన్నాన్ని మౌనంగా తినేస్తాడు.
యానాదుల నిత్యజీవితంలో ఏపూటకాపూట ఆహారం వెతుక్కోవాలి. ఇక కరువు వచ్చిందంటే ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిందే. చెంచులు జీవితంలో ఇదే సంభవిస్తుంది. మంగమ్మ తండ్రి చెంచులు కాలంలో కరువు సంభవిస్తుంది. ఆ కరువుకి తోడు చెంచులు వ్యాధిగ్రస్తుడై తినడానికి తిండి లేక మరణిస్తాడు. ఈ పరిస్థితులను బట్టి యానాదుల ఆర్థికస్థితిగతులను మనం అంచనా వేయవచ్చు.
(ఆ) సంస్కృతి
(ఎ) ఆహారం
యానాదులు ఉదయాన్నే తినే ఆహారాన్ని (తినే ఆహారాన్ని అనడం కంటే తాగే నీళ్ళు అంటే బావుంటుంది) పులినీళ్ళు అంటారు. పులినీళ్ళ కుండ యానాదోళ్ళకు ఆకలితీర్చే అమ్మ. అన్నం వండేటప్పుడు వంచే గంజి, రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఒక కుండలో పోస్తారు. అవి తెల్లవారేసరికి పులుస్తాయి. కాబట్టి ఆ కుండను పులినీళ్ళ కుండ అని పులినీళ్ళబువ్వ అని అంటారు.
ఇతర కులస్తులు ఉన్నప్పుడు యానాదులు తమ ఆహారానికి మారుపేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఎలుకల కూరని, తంగేడు జింకల కూర అని, ఎండ్రకాయల పులుసని, గెనంకేకల పులుసని, కుందేళ్ళని, సెవల పిల్లుల కూర అని పిలుచుకుంటారు. ఈ మారుపేరుల వెనుక సామాజిక నేపథ్యం వుంది. ఉన్నత కులస్తులు యానాదులను సాటి మనుష్యులుగా కూడా గుర్తించరు సరికదా ఏహ్యభావంతో చూస్తారు. మనుష్యులనే హీనంగా చూస్తున్నారు, ఇక తమ ఆహారాన్ని ఇంకెంత అసహ్యించుకుంటారో అనే భావనతో తమ ఆహారాన్ని మారుపేర్లతో పిలుచుకుంటారు. సాటి మనిషి తినే ఆహారాన్ని గౌరవించే సంస్కారం నేటి నాగరిక సమాజానికి ఎంతైనా అవసరం.
(బి) వివాహం
యానాదుల వివాహ వ్యవస్థ ప్రత్యేకమైనది. పెళ్ళికి ముందురోజు పెళ్ళికొడుకు తరపు పెద్దలు, పెళ్ళికూతురికి ప్రదానం తెస్తారు. కులపెద్దలందరిముందు ప్రదానం విప్పుతారు. ప్రదానానికి తెచ్చే ప్రతి వస్తువు పదకొండు చొప్పున తేవాలి. ఆ వస్తువులలో ఒక వస్తువుకి బదులు మరొక వస్తువు మార్చుకునే అవకాశం పెళ్ళికూతురు తరపువాళ్ళకి వుంటుంది.
యానాదుల పెళ్ళిళ్లలో ‘గంజి కావిడ’ మరొక విశేషం. అలివేలు పెళ్ళి సందర్భంలో ఒక పెద్దావిడ లేచి ”ఇక్కడున్నవాళ్ళు అందరు చూడండి. మేము పేదోళ్లం. మాకు కలిగింది ఈ గంజిబువ్వే. ఈ గంజినీళ్ళే మేం తాగుతాం. నువ్వు కూడా ఈ గంజినీళ్ళను సంతోషంగా పంచుకుంటాను అని అంగీకరిస్తే ఈ గంజినీళ్ళు తాగు” అని తమ స్థితిని ఆచరణ ద్వారా అలివేలుకి, అక్కడున్న పెద్దలందరికి స్పష్టంగా తెలియజేసే ప్రయత్నమే ఈ గంజికావిడి.
నేటి భారతీయ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడానికి ప్రధాన కారణం వివాహ సమయంలో నిజాయితీ లేకపోవడం. నిజాయితీతో కూడిన యానాదుల వివాహం నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.
(ఇ) సామాజిక పరిస్థితి
సామాజిక పరిస్థితిలో గమనించదగినది కులం. ఉన్నత కులస్తులు అడుగడుగున యానాదులను పరిహసిస్తూ, అనేక హింసలకు గురిచేస్తూ వుంటారు. అలివేలు పెళ్ళిసమయంలో మంగమ్మ చౌదరిగారి దగ్గరకు అప్పుకోసం వెళ్తుంది. ఆ సందర్భంలో చౌదరి మంగమ్మతో ”మీ యానాదోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఏందే… ఒకళ్ళునొకళ్ళు తగులుకోని కాపురాలు చెయ్యడమేగదే” అంటాడు. ఆ మాటలకు అక్కడున్నవాళ్ళందరు పగలబడి నవ్వుతారు. మంగమ్మకు అరికాల్లో మంట నడినెత్తికెక్కి, పైకి ఏమి అనలేక స్వగతంలో ”అవునులేరా… మీలాగ మాకెట్టా కుదురుద్ది. వాకిలి దగ్గర చెప్పులు చూసి బయట మనిషి బయటనే ఎళ్తారు మీరు. మా యానోదోళ్లని అనేవాళ్ళా. మీలా చెడుతిరుగుళ్ళు మాకు చేతగావులే… ఏ కులపోడయినా ఒకళ్ళకొకళ్ళు నచ్చితే వాళ్ల్నే నమ్ముతాం. వాళ్ళకే నిజాయితీగా కాపురం చేత్తాం. మీరు మా యానాదోళ్ళకి పేర్లు పెడతారా… రండిరా రండి… ఎవరెవరెందో తెల్చుకుందాం రండి…” అని తొడగొట్టి వాళ్ళందరితో సవాల్ చెయ్యాలనే ఉక్రోషం పెల్లుబికింది. కాని ఏమి చెయ్యలేని నిస్సహాయతతో బాధను దిగమింగుతుంది.
మరొక సందర్భంలో అలివేలు, అతని భర్త మునయ్య పోలెరమ్మ పండక్కి వెళ్తారు. ఉన్నత కులస్తులంతా కలసి మునయ్యపై దొంగతనం చేశాడనే నేరం మోపి, ఇంటినుండి రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయి, చిత్రవధ చేసి కొనప్రాణంతో విడిచిపెడతారు. ఆ దెబ్బకు మునయ్య భయంతో వణికిపోతాడు. ఇక అక్కడుంటే బతకనీయరని నెమ్మదిగా లేచి, చెంబు తీసుకుని చేలవైపు వెళ్తాడు. అలా వెళ్లిన మునయ్య ఎప్పటికి తిరిగి రాడు. ఏమైపోయాడో ఎవ్వరికి అంతుపట్టదు. అలా అలివేలు జీవితం నాశనమైపోతుంది.
ఇలా అడుగడుగునా అగ్రకులస్తుల అహంకారానికి అమాయక యానాది జీవితాలు ఎన్నో బలైపోయాయి. యానాదులకు సమాజంలో ”మనిషి” అనే హోదా కూడా లేనట్లుగా మనకు అర్ధమౌతోంది.
5. ఎన్నెల నవ్వు – స్త్రీ జీవితం
ఈ నవలలో ప్రధానమైన స్త్రీ పాత్రలు – మంగమ్మ, మంగమ్మ కూతురు అలివేలు. తల్లీకూతుళ్ల జీవితాలు దాదాపు ఒకేరకంగా వున్నాయనే చెప్పవచ్చు. ఇద్దరి జీవితాలు ఉన్నతకులస్తుల కామదాహానికి, కుల అహంకారానికి బలైపోయాయి.
(ఎ) మంగమ్మ
మూడుతరాలకు ప్రతినిధిగా కనిపిస్తోంది. ఉన్నతకులస్తుడైన భావనారాయణ చేతిలో మోసపోయి, ఒక బిడ్డకు తల్లైంది. మోసపోయానని గ్రహించి, తన కూతురు కోసమైన బ్రతకాలని నిర్ణయించుకుని, జీవితాన్ని ముందుకు కొనసాగించిన ధైర్యశాలిగా కనిపిస్తోంది. మోడుబారిన మంగమ్మ జీవితంలో పోలయ్య ఒక వసంతంలా ప్రవేశించాడు. ఒకరికొకరుగా జీవించాలని నిర్ణయించుకున్నాక జీవితాంతం నమ్మకంగా అతనితో కాపురం చేస్తుంది.
(బి) అలివేలు
మంగమ్మ తన కూతురి జీవితం తనలాగ కాకూడదని విశ్వప్రయత్నం చేస్తుంది. కాని ఆమె ప్రయత్నం విఫలమైంది. ఉన్నత కులస్తుల కుల అహంకారానికి అలివేలు భర్త మునయ్య బలైపోయాడు. తద్వారా అలివేలు జీవితం నాశనమైపోయింది. దీనికి బాధ్యులెవరు?! బాధ్యులైనవారిని ఎవరు శిక్షించాలి?! అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
నవలలో మూడు తరాలు మనకు కనిపిస్తాయి. కాని వారి బ్రతుకుల్లో మార్పు లేదు. మొదటితరంవారు ఎలా అయితే ఉన్నతవర్గాల చేతిలో బైలపోయారో అలాగే మూడోతరం కూడా బలైపోతుంది. ఈ వ్యవస్థ మారినప్పుడే అట్టడుగువర్గాల జీవితాల్లో నిజమైన ‘ఎన్నెల నవ్వు’ విరబూస్తుంది.