అబ్బూరి ఛాయాదేవి 

”ఐనా, నేను ఓడిపోలేదు!” నా ప్రతిస్పందన

మిత్రులు శ్రీ జె.ఎస్‌.ఆర్‌. చంద్రమౌళి గారు కొద్దిరోజుల క్రితం ఈ దారిన వెళ్తూ, నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఒక పుస్తకం నా చేతికిచ్చి, ”చదివి మీ అభిప్రాయం చెప్పండి” అన్నారు. సాధారణంగా, ఆయన చదివిన కొత్తపుస్తకం ఏదైనా బాగా నచ్చితే, కొన్ని కాపీలు కొని, సన్నిహిత మిత్రులకు బహూకరించడం ఆయనకి అలవాటు. (అదొక రకమైన జ్ఞానదానం!) ఈసారి నాకు ఆయన పుస్తకాన్ని ఇచ్చిన పద్ధతిలో ఏదో ప్రత్యేకత కనిపించింది. ఆ పుస్తకం పేరు ”…ఐనా, నేను ఓడిపోలేదు!” ”మైలారంపల్లె నుంచి అమెరికా దాకా పోరాటమే ఊపిరిగా ఎదిగిన ఒక పేద యువతి ఆత్మకథ.” ఆమె జ్యోతిరెడ్డి. చుట్టూ ఉన్న పరిస్థితులతో ఎంతగా పోరాడినా, ఎన్ని జయాపజయాలు ఎదురైనా, ”…ఐనా, నేను ఓడిపోలేదు!” అంటుంది మందహాసంతో.

జ్యోతిరెడ్డిని ప్రముఖ టి.వి. ఛానల్‌ ”హెచ్‌.ఎమ్‌.టి.వి.”లో దాని అధినేత శ్రీ కొండుభట్ల రామచంద్రమూర్తి గారి సమక్షంలో ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. తరవాత రామచంద్రమూర్తి గారి స్ఫూర్తితోనే ఎమెస్కో విజయకుమార్‌ గారు జ్యోతిరెడ్డి ఆత్మకథని పుస్తకంగా ప్రచురించడానికి ముందుకి రావడం, ఆత్మకథని రాయడంలో ఆమెకి సహకరించడానికి ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ జి. వల్లీశ్వర్‌ గారిని ఒప్పించడం అపూర్వం!

”సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కానే కాదని” తెలుసుకోవడానికి జ్యోతిరెడ్డి ”విజయగాథ అవశ్య పఠనీయం” అని కొండుభట్ల రామచంద్రమూర్తి గారూ, ”భయాన్ని జయించడం మాత్రమే జ్యోతి జీవితం తాలూకు అంతఃసూత్రం” అని ఎమెస్కో విజయకుమార్‌ గారూ పుస్తక పరిచయంలో ప్రకటించిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకమైనవీ, అమూల్యమైనవీ.

ఈ పుస్తకం చదివాక, జ్యోతిరెడ్డి అసామాన్య వ్యక్తిత్వానికి విస్తుబోయాను. ఆమె ధైర్యసాహసాలూ, పట్టుదలా సామాన్యమైనవి కావు. ఆమె జీవితధ్యేయం అంత బలమైనది! ఆమె ఎప్పటికప్పుడు తనకి ఎదురైన నికృష్ట పరిస్థితుల్ని అధిగమించి, తను అనుకున్నవి సాధిస్తూ ముందుకి మరింత పట్టుదలతో సాగడం అనితర సాధ్యం. (నామటుకు నాకు పరిస్థితులతో వీలైనంత వరకు సర్దుకుపోవడమే అలవాటు – అందులోనే మనశ్శాంతి ఉందనుకుని!) ఈ పుస్తకం అట్టమీదా, పుస్తకం లోపలా ఉన్న ఫొటోల్లో జ్యోతిరెడ్డి నవ్వు ఆమె ధైర్యసాహసాలకూ, ఆమె సాధించిన విజయాలకూ ప్రతీక.

ఈ పుస్తకాన్ని ఇక్కడ నాతోపాటు ‘హోమ్‌’లో ఉంటున్న కొందరు మిత్రుల చేత కూడా చదివించాలనిపించింది. మొదట శ్రీ కె. సారయ్య గారికి ఇచ్చాను. ఆయన వరంగల్‌కి చెందినవారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌. ప్రస్తుతం ఇక్కడ ఉంటూ రకరకాల సోషల్‌ సర్వీస్‌ చేస్తున్నారు. ఆయన ఈ పుస్తకం మీద జ్యోతిరెడ్డి పేరు చూడగానే, ”ఈమె గురించి విన్నాను. తప్పకుండా చదువుతాను” అని తీసుకున్నారు. పుస్తకం చదవడం ఒక్కరోజులోనే పూర్తిచేసి, ఎంతో ఉత్సాహంగా వచ్చి, ”అద్భుతమైన పుస్తకం!” అంటూ, తమ స్పందనని – కాగితం మీద రాసినదాన్ని పట్టుకొచ్చి ఇచ్చారు.

”ఈ పుస్తక రచయిత్రి జీవితంలో అత్త, మామ, భర్త, అధికార్ల ఆర్థిక, సామాజిక బలహీనతలతో, తనలోగల శక్తిసామర్థ్యాలను తప్పుడు అంచనా వేసుకుని, దుర్భర జీవితానికి బానిసలై బతుకు వెళ్ళబోస్తూన్న సర్వజనస్త్రీ (ముఖ్యంగా విద్యార్థినులు) సమాజం జీవిత సుగమనానికి నేడు స్త్రీజాతి ముందు వెలుగుచున్న ఒక బ్రహ్మాండమైన ఆశాకిరణం! ఈ పుస్తకం ముఖ్యంగా గ్రామీణ (కోయ) ప్రాంతాల స్త్రీలకు, ముఖ్యంగా విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకువస్తే ఆయా ప్రాంతాల స్త్రీలలో మంచి మార్పును చూడగలమని నా అభిలాష.” అంతే కాదు, ”నేను కొన్ని కాపీలు కొని, నాకు తెలిసిన కొందరిచేత చదివిస్తాను” అన్నారు.

తరవాత, అభ్యుదయ భావాలున్న ఇద్దరు స్త్రీలకు ఇచ్చాను. వాళ్ళు మంచి పుస్తకపఠనప్రియులు. కానీ నేనాశించిన స్పందన రాలేదు. ఒకామె ముందుగా, ”దళితురాలైతే ఆ పేదరికం, కష్టాలూ సహజం అనిపిస్తాయి, కానీ ఆమె రెడ్డి యువతి కదా” అన్నారు. నేను వెంటనే, ”అగ్రకులాలవారిలో నిరుపేదలు ఉండరా?!” అన్నాను. దానికి సమాధానం చెప్పకుండా, ”డబ్బు సంపాదనకీ, పైకి రావడానికీ అమెరికా వెళ్ళాలా?” అని ప్రశ్నించారు. రెండవ ఆమె ”పుస్తకం బావుంది కానీ…” అంటూ వాక్యాన్ని పూర్తిచెయ్యలేదు. ”అంత మొండి పట్టుదలతో అన్ని అవస్థలు పడటం ఎందుకు!” అన్న భావం స్ఫురించింది ఆమె అసంపూర్ణ అభివ్యక్తిలో. వాళ్ళకి నా అభిప్రాయాలు చెప్పాను – ఏ విధమైన దుర్భర పరిస్థితుల్లో ఇద్దరు చంటిపిల్లలతోపాటు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదో, ఆఖరి క్షణంలో ఒక పిల్ల ఏడ్చేసరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, ఎంత మొండి ధైర్యంతో, పట్టుదలగా పిల్లలకి మెరుగైన జీవితాన్ని ఆమె అందించాలనుకున్నదో, భర్త ఎటువంటివాడైనా, అత్తవారింట్లో ఎలాంటి పరిస్థితులున్నా, తను బయటపడి, కొంతమంది తెలిసినవారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలోనే బతుకుతెరువు చూసుకోవడానికి ప్రయత్నించి, పిల్లలకి చదువుకోగలిగే ఏర్పాటు ఎలా చేసిందో, ఎన్ని పాట్లు పడిందో రాసింది. ఆమె ఎట్టి పరిస్థితిలోనూ అవినీతికరమైన మార్గాన్ని అనుసరించలేదు. అమెరికా వెళ్ళినా అది తన పిల్లల అభివృద్ధికోసం, తన కుటుంబ సంక్షేమం కోసమే కదా” అన్నాను. వాళ్ళు మళ్ళీ వాదించలేదు.

జ్యోతిరెడ్డి ఒకచోట ఒక అడ్వకేట్‌కి టైపిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి అతను అసభ్యంగా ప్రవర్తించబోతుంటే చాచి లెంపకాయ కొట్టి బయటికి వచ్చేస్తుంది! అమెరికాలో ఇటువంటి అనుభవాలు ఎదురైనట్లు లేదు. ఎవరినైనా ఎదుర్కోగల ధైర్యసాహసాలూ, ఆత్మవిశ్వాసం ఆమెకున్నాయి.

ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు చదువుకుంటానని మొండిపట్టు పడితే, తండ్రి తన కూతుర్ని ”తల్లిలేని పిల్ల” అని అబద్ధం ఆడి, ‘బాలసదన్‌’లో చేర్పించాడు. అయినా, ఈ పుస్తకాన్ని ఆ ‘నాన్న’కే అంకితం ఇచ్చింది! ఆమె పెద్దయాక, తన కూతుళ్ళకి ఆ గతి పట్టనివ్వకుండా మంచి స్కూళ్ళలో చేర్పించి, పెద్దచదువులు చెప్పించింది – అమెరికాలో కూడా. భర్త ఎటువంటివాడైనా, అతనితోనూ, అత్తింటితోనూ బంధం తెంచుకోలేదు, ఆర్థికంగా సహాయం చేస్తూ. భర్తని కూడా అమెరికా పిలిపించి, కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చూసి, సంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసింది. ఇవన్నీ నమ్మలేని నిజాలు. భర్తకి వాళ్ళ ఊళ్ళోనే ఏదో వ్యాపారంలో భాగస్వామ్యం ఇప్పించింది ఒక మిత్రుని ద్వారా. ”మానవ సంబంధాలు ఎంత బాగుంటే అంత మంచి ఫలితాలను సాధించగలం – కుటుంబంలోనయినా సరే, వ్యాపారంలోనైనా సరే…” అని ఆమె నమ్మకం. అంతేకాదు. ”ఆశావాదం, పట్టుదల, పరిశ్రమ గెలిచి తీరతాయి” అనీ, ”కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడకుండా సంపాదించే మార్గాల పట్ల నాకు కోరికా లేదు, విశ్వాసమూ లేదు. కష్టపడి తీరతాను. పూర్తిగా కోలుకోలేనంతగా, కింద పడిపోయేదాకా కష్టపడతాను” అని చెప్పింది ఇంటర్వ్యూలో. ”అమెరికాలో నేను నరకం అనుభవించిన మాట నిజమే” అంటూనే, అక్కడికి వెళ్ళబట్టే తన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురాగలిగిందనీ, ”జీవితంలో ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడే శక్తి వస్తోంది!” అనీ చెప్పుకుంది. కానీ భర్తకోసం, పిల్లలకోసం ఎంత చేసినా అతను ఆమెని చూసి గర్వపడినట్లు కనిపించడు. పైగా, టి.వి. ఛానల్‌లో ఇంటర్వ్యూలో చెప్పిన వివరాలు విని కోప్పడ్డాడుట. ”అది నా వ్యక్తిగత విషయం. నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని జ్యోతి ఆవేశంగా అంటే, ”ఎందుకు లేదు?” అని రెడ్డి ప్రశ్నించాడుట. ”అవును, ఎందుకు లేదు? – నాలోనే ఒక ప్రశ్న! నేను ఇప్పుడు అమెరికా దేశస్థురాలైనంత మాత్రాన భారతీయ మహిళ కాకుండా పోతానా? భారతీయురాలు అంటే – పురుషాధిక్య సమాజాన్ని గౌరవించి తీరాలి కదా! సమ్మిరెడ్డి నాకు భర్త, నా పిల్లలకి తండ్రి” అనుకుంటుంది.

అది జ్యోతిరెడ్డిలోని బలహీనత కాదు. సంస్కారం. జ్యోతిరెడ్డి వ్యక్తిత్వంలోని మహనీయత!

మరణం ఏ సమస్యకీ పరిష్కారం కాదని నమ్మి, కష్టాల్ని ఎదుర్కోవడానికీ, తనకి నచ్చిన మార్గంలో బతకడానికీ తోటి మానవులకు (స్త్రీలకే కాదు, ర్యాంకులు రాలేదని ఆత్మహత్య చేసుకోవాలనే యువకులకూ, ప్రేమించి మోసపోయిన యువతులకూ, అప్పుల బాధలు ఎదుర్కోలేని రైతులకూ, బలహీన మనస్కులైన పురుషులకూ) వెలుగుని చూపిన ”జీవనజ్యోతి” జ్యోతిరెడ్డి.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

3 Responses to

  1. Raaji says:

    దళితురాలైతే ఆ పేదరికం, కష్టాలూ సహజం అనిపిస్తాయి కష్టాలు మనిషి అన్నతరవాత ఎవరికైన ఒకటె కదా!
    అవి వర్గాలను బట్టి , కులాలను బట్టి, సామజి క అంతస్తులను బట్టీ ఉంటాయనటమ్ ఎభ్భెట్టుగా వుంది. కష్టాల్లో కూడా సమాజిక అంతస్తులు అనుభవించడం, ఆ అంతస్తును బట్టి సానుబూతి చూపించడం ఏమిటి? మనిషిని మనిషి గా చూస్తే గీత గారు గొప్పవారె! గీ తా రెడ్డీ గా చూస్తే ఆమె గొప్పతనమ ఏమి లేదు. ఆమె లాంటి మరెందరో అంతకు రెండంతల కష్టాలనుభవిస్తున్నారు? ఏమంటారు?

  2. Jyothi Reddy says:

    ముందుగా మాతౄ సమానులైన చాయా దెవి గారికి నా హౄదయ పూర్వక పాదాబివందనాలు.
    మీ అబిప్రాయము చదివిన తరువాత ఒక్క పది నిమిశాలు కన్నీళ్ళు ఆగడము లేదు…ఒక్కసారి 28 సంవత్సరాలు గిర్రున తిరిగాయి,ఆవెదన,ఆవేశము,సంతొషము అన్ని కలకలిసిన భావాలు ఒక్కెసారి….ఆ తరువాత నా ముఖ చిత్రములొ పెట్టాను,ఎ బాద ఐనా అక్కడ పంచుకొవడము నాకు అలవాటు…మీకు తిరిగి రాయకుండా ఉండలేక పొయ్యాను…ఒక స్త్రీ భర్త సహకారము లేకుండా బతికితే,మన సమాజములొ మగ వాళ్ళు మాత్రమె కాకుండా ఆడవాళ్ళు కూడా చాలా హింస పెడతారు….ప్రతి తల్లి దండ్రులు వాళ్ళ పిల్లల కొసము ఎంత దూరమైన కూడా మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి వెళతారు కదా నెను అదె చేశాను… నా పిల్లలిద్దరు ఎలాంటి లోటు లేకుండా..నేను పేదరికము వల్ల అనుభవించిన కష్టాలు అనుభవించకూడదు అనేది మాత్రమే కాకుండా..నేను ఎక్కడైతే అవమానాల పాలు అయ్యానో అక్కడ నేను, నా పిల్లలు వాల్లకు అందనంత ఎత్తుకు ఎదిగి చూపించాలనే కసి,కోపం,బాద నన్ను ఎక్కడ ఎలాంటి కష్టాలు నన్ను ఆపలేదు…ఎప్పుడైతే నేను నిర్నయము తీసుకున్నానో ఆ తరువాత ప్రతి అవమానము నాలో మరింత శక్తినిచ్చాయి….అదే కసి ఇప్పటికి ఉంది.
    నా పిల్లలిద్దరు అమెరికా లాంటి అగ్ర దేశములో అతి ఉన్నత స్తానములో ఉన్న తరువాత…నా లాగ అనాదల ఆశ్రమములో పెరిగే పిల్లల జీవితాలాకు అర్థాన్నివాలనె దిశకు పరుగులెత్తడము ప్రారంభించాను.వాళ్ళ హక్కుల కొసము పొరాటము చేస్తున్నాము అందులో నేను బాగస్తురాలిని,ఇండియా ఆర్ఫన్ రైట్స్ కి కార్యాధికారిణి గా బాద్యతలు చేపట్టాను.నేను సఫలీకృతము కావాలని నన్ను ఆశీర్వదించండి ప్లీజ్…
    అమెరికా నుండి ఇండియాకు ప్రతి యేటా 3 సార్లు ఇండియాకు వచ్చి….మహిళలను ఉత్తేజ పరిచే కార్యక్రమాలు ఎన్నో చేసాను…అందులో భాగంగానే,ఆంద్ర యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం,లయన్స్ క్లబ్ సహకారముతో రాజమండ్రీ లో ప్రభుత్వ పాటశాలలన్ని ఒక్క దగ్గర తీసుకువచ్చి ఒక కార్యక్రమము,సీతం కాలేజ్ విజయనగరం లో,గాయత్రి విద్యా పరిషత్ లో,నిజామాబాద్ ట్స్ కాలేజ్,క్రిశ్నా కాలొని,అళ్ళూరి కాలేజ్,ఆరోరా కలేజ్,గీతాంజలి కాలేజ్, లాంటి వాటిల్లో ప్రోగ్రాంస్ చేసాను.
    వందే మాతరం లాంటి సంస్థలతో కలిసి పని చేస్తున్నాను..
    ప్రభుత్వ సంస్తలు ఐనటువంటి ఐకెపి గ్రూప్స్, ద్వాక్రా గ్రూప్సతొ మహిళా కార్యక్రమాలు చెయ్యడము జరిగింది…
    కరీం నగర్ లో మహిళా కలెక్టరు శ్రీమతి స్మితా సభర్వాల్ … స్త్రీ కి విద్య,వివాహము,పొదుపు అనే విశయాల అవగాహణకు నాతో ఒక ప్రోగ్రాము చేసారు…
    అంతే కాదు ఈ మద్యనే డాక్టర్ కలాం గారితో కలిసి లీడ్ ఇండియా 2020 అనే ఆర్గనైజేషన్ లో చేరాను … మన రాస్ట్ర బాద్యతలు చేపట్టాను…ప్రతి ఉన్నత పాటశాలలో మానవతా విలువలు,నాయకత్వ లక్షనాలతో పాటు,పరిపూర్ణ వ్యక్తిత్వముతో బయటికి రావాలనే ప్రయత్నమె ఆ సంస్థ లక్ష్యము…
    నేను ఇప్పుడు కూడా గొంతెత్తి అరవాలనుకుంటున్నాను…ఏ స్త్రీ కూడా …. ” ఐనా వోడి పూకూడదు “….పత్తుదలే పెట్టుబడిగా ఎదాలని ఆశిస్తూ .. అందరు నా అవేదనను అర్థం చేసుకంటారని ఆశిస్తూ..మీ శ్రేయోభిలాషి..మీ జ్యోతి రెడ్డి…:)

    • Jyothi Reddy says:

      పైన రాసిన నా స్పందనలొ … కన్నీళ్ళతొ రాయడము వల్ల కొన్ని తప్పులు టైపు చెయ్యడము జరిగింది దయ యుంచి మన్నంచగలరు…”ఐనా ఎవ్వరు వొడిపొకూడదు”… “పట్టుదలనె పెట్టుబడిగా పెట్టి ఎదగాలి”… “ఆసక్తి ఉంటె ఎలాంటి శక్తి ఆపలెదు కదా” … జ్యొతి రెడ్డి…:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.