జ్యోతిరెడ్డి

ఐనా, నేను ఓడిపోలేదు

2012 మే 1

హైదరాబాద్‌లో ఒక ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌ నన్ను ఇంటర్వ్యూ చేస్తోంది.

”మీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది?”

”నా కుటుంబ పరిస్థితులు…” అంటూ ఎలాంటి దుర్భరమనిపించిన స్థితిలో నేను నా పిల్లలతో సహా చచ్చిపోవాలనుకున్నానని వివరించాను.

…తలుచుకుంటే ఏడుపొస్తోంది. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

టి.వి. ఛానల్‌ యాంకర్‌ నన్ను సంబాళించుకోమంటున్నాడు.

జరిగింది గుర్తొస్తే ఏడుపొచ్చింది. కాని, ఇంటికొచ్చాక కూడా గత జీవితం వాసనలు వెంటాడతాయనీ, మళ్లీ ఏడవాల్సి వస్తుందనీ అనుకోలేదు!

ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ అడుగుతున్నాడు…

”అమెరికాలో మీ కంపెనీ టర్నోవర్‌ 2011లో ఎంత మేడమ్‌?”

”అయిదు మిలియన్‌ డాలర్లు (రూ. 25 కోట్లు)…”

జవాబిస్తున్నాను. కానీ గత స్మృతుల్లోంచి ఇంకా తేరుకోలేదు.

ఇంటర్వ్యూ అయిపోయింది.

హైదరాబాద్‌ సిటీలో నన్ను బాగా అభిమానించే స్నేహితురాలు ఉష దగ్గరికి వెళ్లాను. ఇంటర్వ్యూ గురించి చెప్పాను. చాలా ఆనందపడింది.

”నీ గురించి అందరికీ ఎంత గర్వంగా చెబుతుంటానో తెలుసా?” అంది.

నాకు నవ్వొచ్చింది (?). చాలాసేపు పాత విషయాలు మాట్లాడుకున్నాం. టెలివిజన్‌లో నా ఇంటర్వ్యూ వస్తోంది. చూసుకున్నాను. ఇంటికొచ్చాను. అక్కడ రెడ్డి కూర్చొనివున్నారు. ఆయన కూడా అప్పటికే టెలివిజన్‌లో నా ఇంటర్వ్యూ అంతా చూసినట్లున్నారు. పక్కన ఇంకెవరో వున్నారు.

నన్ను చూస్తూనే రెడ్డి కోపంతో ప్రశ్నల వర్షం కురిపించాడు.

మళ్లీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

రెడ్డి నన్ను ప్రశ్నించినందుకు కాదు,

చచ్చిపోవాలనిపించిన నా పాతరోజులు గుర్తొచ్చి.

”నేను ఇంటర్వ్యూ ఇవ్వటంలో తప్పులేదు. అది నా వ్యక్తిగత విషయం, నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు” అన్నాను ఆవేశంగా.

”ఎందుకు లేదు?” అంటూ రెడ్డి ప్రశ్నించాడు.

అవును ఎందుకు లేదు? – నాలోనే ఒక ప్రశ్న! నేను ఇప్పుడు అమెరికా దేశస్థురాలైనంత మాత్రాన భారతీయ మహిళకాకుండా పోతానా? భారతీయురాలు అంటే – పురుషాధిక్య సమాజాన్ని గౌరవించి తీరాలికదా!

సమ్మిరెడ్డి నాకు భర్త, నా పిల్లలకి తండ్రి…

జ జ జ

1981లో వినాయక చవితి రోజు.

హన్మకొండలో అనాథ బాలికల హాస్టల్‌ ‘బాలసదన్‌’లో నేనూ, నాతోపాటు బాల, రామేశ్వరి, శాంతి, పద్మ అమ్మాయిలం కలిసి సూపర్నెంట్‌ని అడిగి, వెయ్యికాళ్ల మంటపం చూసొస్తామని బయల్దేరాం.

కానీ మా అందరికీ మంటపం కన్నా ఎక్కువగా మనస్సులో ఊరిస్తున్నది – కొత్తగా విడుదలైన ‘సీతాకోక చిలుక’ సినిమా.

కార్తీక్‌, ముచ్చర్ల అరుణ హీరో, హీరోయిన్‌లు.

ఆ సినిమా చూస్తున్నంతసేపు నన్ను మైకం కమ్మేసింది. సినిమాలో పేద హీరోని బాగా డబ్బున్నఅమ్మాయి ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది.

సినిమా అయ్యేసరికి పేద హీరో స్థానంలో నేనున్నట్లు, నాకోసం ఎవరో బాగా ఆస్తిపరుడైన, అందగాడైన హీరో కారులో ఎక్కి వస్తున్నట్లు, ”మాటే మంత్రమూ, మనసే సొంతమూ…” అంటూ మేం డ్యూయెట్‌ పాడుతున్నట్లు ఊహల్లో తేలిపోయాను.

ఊహ ఎంత అందమైనది!

మనకి ఎలా ఇష్టమో అలాంటి భావనలు, ప్రకృతి, చుట్టూ అందరూ మంచి మనుషులే కనిపిస్తుంటారు ఊహల్లో.

”ఏమిటే ఆలోచిస్తున్నావ్‌?” నా హాస్టల్‌ నేస్తం శాంతి అడిగింది.

నా ఊహల గురించి చెప్పాను.

అది నవ్వింది.

”అమ్మానాన్న లేని వాళ్లమని మనకి ఈ హాస్టల్‌లో సీటిచ్చిన్రు. ఈ సీటు లేకపోతే మనం ఈ మాత్రం హైస్కూలు చదువు కూడా చదువుకోలేం. అలాంటి నీకోసం ‘సీతాకోకచిలుక’ హీరో లాంటి రాకుమారుడు వచ్చేస్తడా? జర ఎక్కువ చేస్తున్నవ్‌లే?” అంది.

నాకు మనస్సు చివుక్కుమంది.

నా గుండెల్లో ఎవరో చేయిపెట్టి కెలికినట్లనిపించింది. నా 13 ఏళ్ల వయసుకి నేను ‘అనాథ’ని అన్న భావన ఆ రాత్రంతా నా మనస్సు తొలిచేస్తోంది. రాత్రంతా ఏడ్చాను.

నా ఏడుపు – అనాథల హాస్టల్‌లో వున్నందుకు కాదు, ‘అనాథ’ని కాకుండానే ‘అనాథ’ అని చెప్పుకోవాల్సి వచ్చినందుకు.

జ జ జ

నాకు అమ్మ వుంది. నాన్న వున్నాడు. చెల్లి వుంది, తమ్ముళ్లు వున్నారు. వరంగల్‌ జిల్లాలో హన్మకొండ దగ్గర్లోని నర్సింహులగూడెం గ్రామంలో నాన్నకి 30 గుంటల పొలం (ఎకరంకన్నా తక్కువ) వుంది. ఊళ్లో ఎలిమెంటరీ స్కూలు వరకూ చదివించారు. అంతకుమించి చదువు నాకు అక్కర్లేదని నాన్న అనుకొంటుండేవాడు.

నాకు చదువుకోవాలని ఉంది.

నన్ను చదివించటం మీద నాన్నకి ఆసక్తిలేదు. అసలు నా మీదనే నాన్నకి ప్రేమ తక్కువ అని నాకు అనిపిస్తూ ఉండేది. చెల్లిమీద, తమ్ముడిమీద చూపించినంత ప్రేమని నాపట్ల చూపించేవాడు కాదు. ఒక కోరిక – నేను కోరితే నాన్న స్పందన ఒకలా వుంటుంది. అదే- చెల్లి అడిగితే మరోలా వుంటుంది.

ఒకసారి పండగ వస్తోందంటే చెల్లి కొత్త గౌను కావాలని మారాం చేసింది. అంతకుముందే నేనూ అడిగాను. నేను అడిగితే నాన్న కసురుకున్నాడు. చెల్లి అడిగినప్పుడు మాత్రం – ”సర్లేవే, కొంటాలే” అన్నాడు.

ఇలా చాలాసార్లు జరిగింది.

ఎలిమెంటరీ స్కూలు చదువయిపోగానే నేను ఇంకా చదువుకొంటానన్నాను. హైస్కూలు చదువు కావాలంటే వరంగల్లు వెళ్లాలి. వస్తే ఎక్కడ వుండాలి? ఎవరు చదివించాలి? ఫీజులు ఎవరు కట్టాలి?

నాన్న తనకి స్తోమత లేదన్నాడు.

నేను పట్టుబట్టాను. మొండికేశాను. ఏడ్చాను…

అసలు ఏమీ చదువుకుని ఎరగని అమ్మ నాకు మద్ధతుగా నిలబడింది. ”ఎలాగైనా చదివించాలయ్యా ఏదో మార్గం చూడు” అంటూ నాన్నమీద వత్తిడి తెచ్చింది.

చివరికి నాన్న అయిష్టంగా ఒప్పుకున్నాడు.

కాని, ఆర్థికంగా నన్ను హాస్టల్‌లో పెట్టి ఫీజులు కట్టి చదివించే శక్తి నాన్నకి లేదు. ఉన్నదల్లా ముప్పావు ఎకరం పొలం, 2-3 బర్రెలు. వీటితో సంసారం అంతా నడవాలి కదా!… ఇది నాన్న సమస్య.

1978లో…

నాన్న వాళ్ల ద్వారా, వీళ్ల ద్వారా వాకబు చేసి, చివరికి నన్ను తీసుకువెళ్లి వరంగల్లు ‘బాలసదన్‌’ హాస్టల్‌లో చేర్పించాడు. అక్కడైతే వాళ్లే చదువు కూడా చెప్పిస్తారట.

అమ్మానాన్న వుంటే అనాథ పిల్లల హాస్టల్‌లో ఎలా చేర్చుకుంటారు?

అందుకని, నన్ను చేర్పించేటప్పుడు నాన్న హాస్టల్‌ సూపర్నెంటు వత్సలాదేవికి చెప్పాడు :

”మా అమ్మాయి జ్యోతి. తల్లిలేని అనాథ. నాకు శక్తి లేదు. మీరే ఎట్లన్నా సదివించాల.”

ఒక్కసారిగా నేను రాయిలా బిగుసుకుపోయాను.

నాకు అమ్మలేదా?

”అబద్ధం. నాకు అమ్మవుంది, వుంది” అని గొంతెత్తి అరవాలనిపించింది… అలా అరిస్తే, నాకు హాస్టల్‌లో సీటు ఇవ్వరు. అది లేకపోతే నేను చదువుకోలేను.

చదువు… చదువు… చదువు!

చదువుకోవాలంటే నాన్న చెప్పిన అబద్ధాన్ని నిజమని నా చుట్టూ అందర్నీ నేను కూడ నమ్మించాలి.

ఏడుపొచ్చేస్తోంది.

గొంతులోంచి తన్నుకొస్తోంది ఏడుపు.

”అమ్మా, నువ్వు నాకు వున్నావమ్మా! నువ్వువున్నా లేవని చెప్పాల్సివస్తోందమ్మా” అనుకుంటూ హాస్టల్‌లో చేరిన మొదటిరాత్రి అంతా కన్నీళ్లతోనే నా పక్క తడిపేశాను.

పోతూపోతూ నాన్న నన్ను మరీమరీ హెచ్చరించి వెళ్లాడు.

”మీ అమ్మలేదని చెబితేనే ఇక్కడ సీటిచ్చిన్రు. తొందరపడి నోరు జారితే నీ సదువు అక్కడితోనే బంద్‌.”

ఏడుపొచ్చేస్తోంది. ఆపుకోలేనంత ఏడుపు.

నన్ను తన గుండెల్లో పెట్టుకుని అమ్మ పెంచిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఎన్నివేలసార్లు అర్థరాత్రి నేను పాలకోసం ఏడిస్తే అమ్మ తన నిద్రమానుకుని నన్ను పాలిచ్చి సముదాయించింది?

ఊహ తెలీనప్పుడు ఎన్నిసార్లు నేను రెండు చేతులూ ఎత్తి అమ్మకేసి చూసినప్పుడల్లా తను ఎలాంటి పనిలోవున్నా విసుక్కోకుండా నన్ను ఎత్తుకుని లాలించింది?

ఎన్నివేలసార్లు నేను నిద్రలో పక్క తడిపేసినా, ఖరాబు చేసినా విసుక్కోకుండా, లేచి శుభ్రం చేసింది! నేను అనాకారిననీ, బలహీనంగా వుంటానని అసహ్యించుకోకుండా పెంచింది.

నా ఆకలి, అల్లరి, అనారోగ్యం, ఆనందం… అన్నీ పంచుకున్న అమ్మ, తన సౌకర్యంకన్నా నా అవసరానికి విలువిచ్చిన అమ్మ నాకు ”లేదు” అని నేను చెప్పాలా? ఈ హాస్టల్‌లో వున్నంతకాలం చెబుతూనే వుండాలా?

…ఆ హాస్టల్‌లో మొదటిరాత్రి అంతా అమ్మని తలుచుకుని ఏడుస్తూనే ఉండిపోయాను.

జ జ జ

హాస్టల్‌ సూపర్నెంట్‌ సార్‌ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టడం అలవాటైంది. పండగలొచ్చినా, ఆదివారాలొచ్చినా మేం ఎక్కడికి వెళ్లటానికి లేదు. (మా బంధువులమని ఎవరన్నా వచ్చి సెలవులకి తీసుకువెళితే తప్ప…) అయినా ఎక్కడికి వెళ్తాం? మమ్మల్ని ఎవరు తీసుకువెళ్తారు?

మేమంతా ‘అనాథలం’ కదా!

అమ్మలేనివాళ్లు కొంతమంది, అమ్మానాన్న కూడా లేనివాళ్ళు కొంతమంది. మాకున్న ప్రపంచం అంతా ఆ హాస్టలూ, మేం చదివే స్కూలూ.

‘బాలసదన్‌’ లో చేరిన కొత్తలో ఆ వాతావరణం వెగటు పుట్టించేది.

సరైన మరుగుదొడ్లు వుండేవికావు.

పరిసరాలు పరిశుభ్రంగా అనిపించేవికావు.

చాలామంది పిల్లలు ఒకేచోట కలిసుంటున్నారు.

పిల్లలు వందమంది వుంటే, స్నానాల గదులు 2-3 వుండేవి.

పిల్లల శారీరక పరిశుభ్రత అంతంత మాత్రమే.ఏవన్నా రోగాలొస్తేనే అధికారులు సీరియస్‌గా తీసుకుంటారు. లేదంటే అంతే!

మరుగుదొడ్లు తగినన్ని లేకపోవటం నాకు ఏవగింపు కలిగించేది. అలాగని నర్సింహులుగూడెంలో మా ఇంట్లో సెప్టిక్‌ ట్యాంకు లెట్రిన్‌లు వున్నాయని కాదు. కాని గ్రామాల్లో మరుగుదొడ్ల గురించి ఆలోచించటం తక్కువ. అందరం పొలాల్లోకి, చెరువుగట్టుకి పోతుంటాం. కాకపోతే, ఒకే అపరిశుభ్ర ప్రదేశాన్ని వందమంది వాడుకునే పరిస్థితి లేదు.

హాస్టల్‌లో పిల్లలకి పేలు పడితే, పట్టించుకోవడానికి అమ్మా, నాన్న వుండరు. జలుబు చేస్తే, అది పెద్ద జబ్బు కాదు, కాబట్టి ఎవరూ అడగరు…

నాక్కూడా శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోవటం వల్ల తరచూ చేతులమీద కురుపులు పుడుతుండేవి. ఏదో ఆయింట్‌మెంట్‌ ఇచ్చి రాసుకోమనేవాళ్లు.

ఇంటి దగ్గర చెల్లితో ఆడుకోవడం, తమ్ముళ్లని ఎత్తుకొని ఆడించడం, ఇరుగుపొరుగు పిల్లలతో గడపటం అలవాటయిన నాకు ఆ హాస్టల్‌లో ఏకాకిగా వుండాలనిపించలేదు.

కాని రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ‘బాలసదన్‌’లో వుండక తప్పదని అర్థమవుతోంది.

‘బాలసదన్‌’ నచ్చకపోతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? మళ్లీ ఇంటికి వెళ్లి, ”నేనిక్కడ చదవను నాన్నా” అన్ని చెప్పాలి. చెబితే నాన్న ఏమంటాడు?

”అట్లైతే చదువు మానెయ్‌” అంటాడు

మానేసి, మళ్లీ ఇంట్లో అమ్మకి పని సాయం చేసుకుంటూ, బర్రెలకి కుడితి పెడుతూ, పేడ ఎత్తి పిడకలు చేసుకుంటూ…

భయమేసింది. చదువు లేకుండా ఇలా ఇంట్లో పనికే అంకితమైపోవాలా?

కష్టమైనా సరే ‘బాలసదన్‌’లోనే వుండి చదువుకుంటాను తప్ప, ఇంటికి వెళ్లను.

‘బాలసదన్‌’లో అలవాటు పడిపోయాను. పిల్లలందరితో కలిసిపోతున్నాను. అందరిలోకీ నేనే బలహీనంగా వున్నానేమో అన్న భావన నన్ను ఎప్పుడూ వెంటాడుతూ వుండేది.

నాకన్నా చిన్నపిల్లలు కూడా ‘బాలసదన్‌’లో వుండేవాళ్లు. వాళ్లు నాలాగే ‘ఉత్తుత్తి అనాథ’లు కారు. నిజంగా అనాథలు. వాళ్లని చూస్తే జాలి వేసేది. పిలవటానికి అమ్మా, నాన్న, అన్నయ్య… ఎవరూ లేనివాళ్లే ఎక్కువ.

అప్పుడప్పుడు వాళ్లల్లో కొంతమంది ‘బాలసదన్‌’లో వుండలేక పారిపోయేవాళ్లు. బయట అడుక్కొని తిని ఎంతకాలం తిరుగుతారు? అలాంటి వాళ్లని మళ్లీ పట్టుకొని తీసుకువచ్చి ‘బాలసదన్‌’లో పెట్టేవారు. లేకపోతే అలా పారిపోయిన ఆడపిల్లలకి రక్షణ వుండదని సూపర్నెంట్‌ పదేపదే మమ్మల్ని హెచ్చరించేవారు.

చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా సెలవు రోజుల్లో ఆడించటానికి పిలిచేదాన్ని. అలాంటప్పుడు వాళ్లకి ఆసక్తి కలిగించటానికి ఏమన్నా పెట్టాలి కదా? మా బాలసదన్‌ వీధిలోనే ఒక డాక్టరు గారి ఇంట్లో జామచెట్టు వుండేది. అది వీధిలోకి తొంగిచూస్తుండేది. నేను వెళ్లి ఆ చెట్టుకాయలు – ఇంట్లో వాళ్లకి తెలీకుండా – కోసి తెచ్చి పిల్లలకిచ్చి, ఆడించేదాన్ని.

అప్పుడప్పుడు నాన్న ద్వారా అమ్మ నాకు శనక్కాయలు పంపేది. ఆ శనక్కాయల కింద ఆఠణా (అర్ధరూపాయి) పెట్టేది. అలా దాచుకున్న పైసల్తో చిన్నపిల్లలకి ఐస్‌ఫ్రూట్‌ కొనిచ్చేదాన్ని.

‘నాకు అమ్మా నాన్న వున్నారు. వాళ్లకి లేరు’ – ఈ భావనే నేను వాళ్ల పట్ల అభిమానం పెంచుకోవటానికి కారణమైంది.

అమ్మ, నాన్న!

నాన్నకి నేనంటే అంత ఇష్టం లేదని నాకు అనిపిస్తున్నా, ‘నాకు నాన్న వున్నాడు’ అన్న భావనలో ఎంతో ధైర్యం వుండేది. అమ్మ – మంచి అమ్మ. అమ్మ పట్టుబట్టి వుండకపోతే హైస్కూలు చదువుకోసం నాన్న నన్ను బాలసదన్‌కి తీసుకువచ్చేవాడా?

అమ్మ లేకపోతే నాకు అన్నం ఎవరు పెట్టేవారు? జడ ఎవరు వేసేవారు? బట్టలు ఎవరు తొడిగేవారు?… కాని ఈ పిల్లలకి ఆ ఇద్దరూ లేరు కదా!

శివరాత్రి వచ్చిందంటే గొప్ప ఉత్సాహం వచ్చేది. చాలామంది పిల్లలు శివరాత్రినాడు జాగరణ చేస్తామనేవాళ్లు. ఏవో భజనలు చేస్కుంటూ, పాటలు పాడుకుంటూ రాత్రంతా జాగరణ మొదలెట్టి, నిద్ర వచ్చేదాకా చేసి పడుకుంటాం. కాని పగలు చాలామంది ‘ఉపవాసం’ చేస్తున్నాం అనేవాళ్లు. ఉపవాసం వుంటామంటే, హాస్టల్‌ వాళ్లకేం నష్టం.

”మీ ఇష్టం” అంటారు.

పిల్లలకి సాయంత్రమయ్యేసరికి ఆకలేసేది. వుండలేకపోయేవాళ్లు. అప్పుడు నేను వాళ్లకి ఎర్రగడ్డ (చిలకడదుంపలు) కొనిపెట్టేదాన్ని. వాళ్లు ఆత్రంగా తింటుంటే తెలీని ఆనందం పొందేదాన్ని.

నాకు పాటలన్నా, నృత్యం అన్నా ఇష్టం. నాకు ఆ రెండూ రావు. పాటలు – ఏదో కూనిరాగాలు తీస్తాను. అందుకని బాలసదన్‌లో గానీ, స్కూల్లో గానీ బృందగానాల్లో పాల్గొనేదాన్ని. సూపర్నెంట్‌ గారి కొడుకు అప్పట్లోనే దూరదర్శన్‌లో కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అతనొచ్చినప్పుడల్లా మాకోసం గ్రూపు పాటలు, డాన్స్‌లు, నాటకాలు చేయించేవాడు.

నేను అందంగా కనబడను, బొద్దుగా వుండను. కాబట్టి నాకోసం ప్రత్యేకంగా ఒక అయిటమ్‌ చేస్తానని అడగలేను. కాని గ్రూపులవారీగా అతను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రతిదానిలో ‘నేనుంటా’ అంటూ పరుగెత్తేదాన్ని… ఆడపిల్లలకి ఇలాంటి సరదాలన్నీ పెళ్లయ్యేవరకే గదా!

అమ్మ నాకు దగ్గరలేదన్న బాధ మర్చిపోవటం కోసం సెలవరోజుల్లో వార్డెన్‌ ఇంట్లో చిన్న చిన్న పనిసాయాలు చేస్తూ గడిపేదాన్ని.

సూపర్నెంట్‌, ఆవిడ భర్త లక్ష్మీనారాయణ మంచివాళ్లు. వాళ్ల పిల్లల్ని ఎత్తుకోవటం, ఆడించడంలాంటి పనులు చేస్తూ, వార్డెన్‌ ముంతాజ్‌ బేగంలోనే అమ్మని ఊహించుకునేదాన్ని.

అలా హాస్టల్‌లోనే వుంటూ, ఎప్పుడన్నా నాన్న కనికరించి పండక్కి తీసుకెళితే ‘అమ్మలేని’ ఇంటికి వెళ్లి, మళ్లీ నాన్న దింపితే, వరగంల్లు కొచ్చేసేదాన్ని.

‘బాలసదన్‌’లో నన్ను చేర్చిన మరుసటి ఏడాదే చెల్లి లక్ష్మిని కూడా నాన్న చేర్చారు. అది కూడా నాలాగే ‘అమ్మలేని’ అనాథగా వర్ణించబడింది. అది ఆరోక్లాసులో చేరింది. నాలాగే రెడ్డికాలనీలో బాలసదన్‌ నుంచి లష్కర్‌బజార్‌లో సర్కారుబడికి వెళ్లి చదువుకోవాలి. ఒక ఏడాది కాగానే, అది ఓ రోజు నా దగ్గరకొచ్చి చెప్పేసింది.

”నేనిక్కడ వుండలేను. ఇంటికి పోతా.” నేను నచ్చజెప్పాలని ప్రయత్నించాను. వినలేదు. వెళ్లిపోయింది.

ఇది జరిగిన ఓ ఏడాది తరువాత సంక్రాంతి పండుగ వచ్చింది. పండక్కి నాన్న వచ్చి తీసుకెళ్లలేదు. కాని నాకు వెళ్లాలనిపించింది. నా నేస్తం శాంతితో కలిసి బస్సులో వెళ్లాను. శాంతిది మామునూర్‌క్యాంప్‌ అనే గ్రామం. దాని తర్వాత ఊరే మా నర్సింహులు గూడెం. అందుకే ఇద్దరం ఒకరికొకరం తోడుగా వెళ్లాం.

నేను ఇంటికి వచ్చే సమయానికి నాన్న ఇంట్లో లేడు. సాయంత్రం వచ్చాక నన్ను చూస్తూనే నాన్నకి కోపం వచ్చేసింది. నేను హాస్టల్‌నుంచి వచ్చేయటం తనకి ఇష్టం లేదు.

నా మీద అరిచాడు. నామీదకాని, అన్నయ్య, చెల్లి, తమ్ముళ్లు… ఎవరిమీద కోపం వచ్చినా ఆ కోపం అంతా అమ్మమీద చూపించడం నాన్నకి అలవాటు.

అవ్వాళా అంతే! ”దీన్నెందుకు రానిచ్చావ్‌. ఒక పిల్ల వచ్చేసి కూర్చుంది. యాదిలే! ఇప్పుడిది కూడ వచ్చేస్తదా!” అంటూ అమ్మమీద నాన్న నిప్పులు కురిపించాడు.

అమ్మని తిట్టాడు.

అమ్మని కొట్టాడు.

అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అమ్మ సరిగ్గా అన్నం తినలేదు.

నాకూ ఏడుపొచ్చింది.

నిజానికి నేను చెల్లిలా హాస్టల్‌ వదిలేసి పారిపోయి రాలేదు. కాని, చెల్లి విషయంలో జరిగిన అనుభవంతో నాన్నకి నామీద అనుమానం వచ్చేసింది. నేను కూడ చెల్లిలాగా వచ్చేశాను, లేదా వచ్చేయాలని ఏర్పాటుచేసుకుంటున్నాను – అని నాన్న నమ్ముతున్నాడు. నేను వచ్చింది సంక్రాంతి పండక్కి ఇంటికి రావాలనిపించి వచ్చాను. కాని నమ్మటం లేదు.

రాత్రి నిద్రపోయేముందు ఆలోచించుకున్నాను. నా కారణంగా అమ్మ దెబ్బలు తినటంతో నాకు కూడా ఏడుపు వచ్చింది.

రాత్రి పడుకున్నాగానీ, సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లవారుఝామున 3-4 గంటల మధ్య నిద్రలేచాను.

అమ్మకి చెప్పాను:

”అమ్మా, నేను బాలసదన్‌కి పోతన్న”

అమ్మ వద్దనలేదు.

నాన్న నిద్రలోనే వున్నాడు.

నా బట్టలసంచీలో అమ్మ ఇచ్చిన శనక్కాయలు పెట్టుకొని, నర్సింహులుగూడెం ఊరి బయట రోడ్డుమీద కొచ్చాను.

వరంగల్లుకి కూరగాయలు తెచ్చే ఎడ్లబండ్లు కనిపించినయ్‌. నన్ను వరంగల్లు చేర్చమని బ్రతిమాలుకుంటే, ఒకళ్లు బండి ఎక్కించుకున్నారు.

ఆరుగంటల ప్రాంతంలో వరంగల్లు మార్కెట్‌ దగ్గర దిగాను. అక్కడ్నుంచి హన్మకొండ ఎలా వెళ్లాలి? బాలసదన్‌కి ఎటు పోవాలి?

తెలీదు… తెలీదు!

ఏడుపొచ్చింది. ఏడుపు దిగమింగుకొని, వాళ్లనీ వీళ్లనీ అడుగుతూ, సిటీబస్సెక్కి హన్మకొండ వచ్చి, బాలసదన్‌ చేరాను.

అలాగే ఇంకోసారి, నాకు అరచేతిలో పెద్ద గడ్డ లేచింది. భరించలేని నొప్పి, బాధ. నాన్న వచ్చి, డాక్టరుకి చూపించి, సర్జరీ చేయించాడు. అమ్మమీద బెంగతో ”అమ్మని చూడాలీ” అంటూ ఏడ్చాను. అప్పుడు నాన్న అమ్మని తీసుకొచ్చి రహస్యంగా హన్మకొండ లాడ్జిలో వుంచి, నన్ను తీసుకెళ్లి చూపించాడు. అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. అమ్మ రూపాయి ఇచ్చింది. అలా అమ్మ ఇచ్చే చార్‌ అణా, ఆఠ్‌ అణా పైసలే నాపాలిట అమృతంలా వుండేవి.

ఆ పైసలతోటే ‘సీతాకోకచిలుక’ సినిమా చూసి కలల్లో తేలిపోయాను. నా కలలు ఎక్కువ సంవత్సరాలు సాగకుండానే నన్ను వెతుక్కుంటూ ‘అతను’ వచ్చాడు.

జ జ జ

నేను బలహీనంగా ఉంటాను. అయినా చదువుకోవాలన్న నా కోరిక చాలా బలమైంది.

నేను అందంగా వుండను. కాని హాస్టల్‌ సూపర్నెంటు కుటుంబంతో కలసిమెలసి తిరిగాక అందంగా మాట్లాడటం నేర్చుకున్నాను.

హాస్టల్‌ జీవితం నాకు చాలా విషయాలు నేర్పింది. నలుగురితో కలసి వుండాల్సి వస్తే ఎలా వుండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నలుగుర్నీ కలుపుకోవాలి?…

సూపర్నెంట్‌ ఇంట్లో పూజలు చేస్తుండేవాళ్లు. అప్పుడప్పుడు వాళ్లు గుడికి వెళ్తుండేవాళ్లు. దేవుడు, నమ్మకం, భక్తి… ఇలాంటి చాలా విషయాల్లో ఆ కుటుంబం నామీద ప్రభావం చూపించింది. పూర్తిగా తెలంగాణ పల్లెజీవిత నేపథ్యంలోంచి వచ్చిన నాకు బయట ప్రపంచంలో మసలగలగాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలని అక్కడే బాగా అర్థమైంది.

ముఖ్యంగా కుటుంబం అంటే ఏమిటో మొదటిసారిగా అక్కడే చూశాను.

భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా వుండాలి?

తల్లీ పిల్లల మధ్య ఆత్మీయతానురాగం ఎలా కుటుంబాన్ని కట్టి వుంచుతుంది?

భార్యగా, తల్లిగా స్త్రీకి ఎలాంటి బాధ్యతలుంటాయి?

భర్తగా, తండ్రిగా మగవాడు ఎలా వుంటే పిల్లలు బాగా పెరుగుతారు?

…ఇలా చూస్తున్నాను. చదువుకుంటున్నాను! పేదరికం కారణంగా మంచి బట్టలు వేసుకోవాలనీ, మంచి కమ్మలు కొనుక్కోవాలనీ వగైరా కోరికలన్నింటినీ నాలోనే అణిచేసుకుంటూ చదువుకున్నాను – అయిదేళ్లు.

హాస్టల్‌లో లక్ష్మీనారాయణ సార్‌ ఎప్పుడూ చెప్పేవారు :

”చదువుకొంటేనే మీ ఆత్మగౌరవానికి విలువ వస్తుంది. చదువుకొంటేనే మీ కుటుంబానికి న్యాయం చేయగలుగుతారు. చదువు నిర్లక్ష్యం చేయకండి…” అంటూ హెచ్చరించేవారు.

చదవాలి.

ఎదగాలి.

నా కాళ్ల మీద నేను నిలబడాలి. చెల్లిని చదివించాలి. తమ్ముళ్లని చదివించాలి. అమ్మకి మంచిమంచి చీరలు కొనిపెట్టి, బాగా చూసుకోవాలి.

నేను బాగా చదువుకుంటే ‘సీతాకోకచిలుక’ సినిమా హీరోలాంటి హీరో వచ్చి నన్ను చేసుకుంటాడు… ఎంత చిన్న ఆశ

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.