-(హెర్బ్ గోల్డ్‌బర్గ్ ఆంగ్ల వ్యాసం నుంచి కొంతభాగం) అనువాదం: మన్మధరావు
మనిషిగా నాకు కొన్ని అనుభూతులున్నాయి. కానీ వాటిని బైటపెట్టినప్పుడల్లా నా పుట్టుక ప్రశ్నార్థకమైపోతుంది. ఉదాహరణకి నాకు పూలజడంటే యిష్టం. రంగురంగుల గౌన్లంటే యిష్టం. బిడ్డకి పాలిచ్చే అనుభవం యిష్టం. చిన్నప్పుడు మా అమ్మ నాకు కృష్ణుడి జడవేసి మల్లెపూలు చుట్టేది. అక్క గౌను తొడిగి బుగ్గన చుక్కపెట్టి ‘అచ్చం ఆడపిల్లలా వున్నాడమ్మా’ అనేది. మగపిల్లాడెవడూ అంత అందంగా వుండటానికి వీల్లేనట్టు గొంగళి పురుగుకీ, సీతాకోకచిలకకీ ప్రాణం ఒకటే. అమరికలోనే తేడా. మగాడినై పుట్టినందుకు అలంకరణ, ఆకర్షణా లేని ప్రాణిలా వుండటానికి మానసిక సంఘర్షణ చాలా పడ్డాను.
పెద్దవుతున్నకొద్దీ నా భావోద్రేకాల మీద కూడా ‘మగతనం’ వత్తిడి తెచ్చిపెట్టింది. ఎంత చీకటిలో అయినా అక్కమాదిరి భయపడ్డానికి లేదు. ఎంత దుఃఖం వచ్చినా ఏడవటానికి లేదు. ఎంత బరువైనా కింద పడెయ్యడానికి లేదు. ఓడిపోవడానికి లేదు. బలహీనపడ్డానికి లేదు. గెలవాలి, గెలవాలి. గెలుపు ఒక్కటే నా ధ్యేయం. ఈ ప్రపంచాన్ని జయించాలి. కావలసినంతగా అనుభవించాలి. ఇందుకు ఏమాత్రం సందేహించినా మొదట దెబ్బతినేది నా మగతనమే. మగతనాన్ని ఒక గాయం మాదిరి ఈగవాలకుండా చూసుకోవాలి.
ఈ ప్రపంచం ఆరాధించే మగవాడెప్పుడూ ఏకాకిగా, స్వతంత్రుడుగా, దేనికీ లొంగని ధృఢశాలిగా, వుంటాడు. ఏ కాలంలో అయినా హీరోని తయారుచేసే దినుసులు యివే.
స్త్రీల మనసుతో స్నేహం చెయ్యడానికి నాకుండే భయమల్లా నా అంతరంగ ప్రపంచం ఎక్కడ బైటపడుతుందోనని మాత్రమే. కాబట్టి నా వ్యక్తీకరణలోని తీవ్రత వేగంగా బండినడపడంలోనో, ఆటల్లోనో, చూపిస్తూ వుంటాను. నా ఇష్టాఇష్టాలకంటే కోరిక చాలా బలవత్తరమైనదని నన్ను నేను మభ్యపెట్టుకుంటూ అవతలివాళ్ళను సమర్థవంతంగా నమ్మిస్తాను. కాబట్టి నా దృష్టిలో స్త్రీ అంటే ఒక శరీరం. ఆ శరీరాన్ని నేనెప్పుడూ జయిస్తూనే వుండాలి.
నేను మరమనిషిలా వుండటానికి ఈ సమాజం ఎంత వత్తిడి చేస్తుందంటే నా ప్రతీ కోరిక, ఆలోచన, కల, బలప్రదర్శనకు తూగవేమోననే భయంతో వాటిని ఆదిలోనే తుంచేస్తాను. పెద్దవాడవుతున్నకొద్దీ కుటుంబంపట్ల చాలా భావశూన్యత కలిగి సంపాయించే యంత్రంగా మారిపోతాను. నన్ను, నా భార్య ఎక్కువసేపు ఇంటిలో గడపమని కోరుతుంది. కానీ అలా గడపడం ప్రారంభించగానే నాపట్ల ఆసక్తి పోతుందనే తీవ్రమైన అసహనం ఆమెకి దూరంగా విసిరేస్తుంది. పనికట్టుకుని ఎప్పుడైనా ఇంట్లో వున్నాగాని ఆడవాళ్ళంతా సోమరిగా కూచుని కాలం గడుపుతున్నట్టూ, మగవాళ్ళంతా నన్ను విపరీతంగా పరిశీలిస్తున్నట్టూ అనిపించి చేతికి దొరికిన వస్తువు విసిరేసి అందరిమీదా అరిచి అక్కడ్నించి పారిపోతాను.
చాలా చిన్నప్పుడు మా అక్క నా లాగూ చొక్కా తొడుక్కుని క్రాఫింగ్ చేయించుకుని ‘మగరాయుడి’లా పొందే గౌరవం గుర్తొస్తుంది. అదే సమయంలో తలుపులు మూసుకుని అక్క గౌను వేసుకుని అద్దంలో రహస్యంగా చూసుకుని సంబరపడ్డమూ ఎందుకో అర్థమౌతుంది.
నిరంతరం నాలోపల ఒక గొంతు “లే, నుంచో, ఏదో ఒకటి చెయ్యి, వూరికే కూచోకు, కలలు కనకు నువ్వు మగాడివి” అని సతాయిస్తూ వుంటుంది. దాన్ని జయించే నేపథ్యంలో నాలో ద్వైదీభావాలు నాటుకొంటాయి.
మగవాడంటే ఎవరి సహాయం ఆశించని వాడుకదా కాబట్టి నా శరీరంగురించి నాలో కలిగిన సందేహాలు ఏదయినా వ్యాధి ప్రబలినప్పుడు సెక్సు స్పెషలిస్ట్ తో తప్ప యింకెవరితో చెప్పుకోలేను.
నిద్రలో కూడా నేను ఉచ్ఛరించకూడనివి “నాకు చాతకావడం లేదు దయచేసి సహాయం చెయ్యండి” అనే వాక్యాలే.
పెద్దవాడినవుతున్నకొద్దీ స్పర్శకు దూరమవుతాను. అమ్మ, నాన్న, అక్క, స్నేహితురాలే కాదు సాటి మగవాళ్ళు కూడా నన్ను ముట్టుకోవడానికి యిష్టపడరు. మహా అయితే భుజం తట్టడం మాత్రం చేస్తారు. నాకు ఆపాదించిన స్వతంత్రత అచ్చోసిన ఆంబోతులా మార్చి వుంటుందని స్త్రీలంతా శంకిస్తారు. వారి అనుమానాల్ని ఖండించే దశలోనూ నేను ‘మగవాడ్ని’ కాకుండా పోతున్నానా అనే భయం వెంటాడుతూ వుంటుంది. విముక్తి చెందిన స్త్రీ మగవాడ్ని అనుకరించినట్టు, విముక్తి పురుషుడు ‘ఆడతనాన్ని’ అనుకరించలేడు.
మృదువుగా, కరుణగా, అనుభూతిగలవాడిగా మగవాడ్ని వుండమని కోరడం కాళ్ళు లేనివాడిని పరిగెత్తమనడంలానే వుంటుంది. సగటు మగవాడిమీద వివక్ష తీవ్రత అతని శరీరం తాలూకు అస్వస్థతలాగే, అప్రకటిక దుఃఖంలాగే కరుడుకట్టిపోతుంది.