పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి

-రమణి

నేను నల్గొండ జిల్లాలో పల్లెటూర్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. ఒక అక్క, నేను ఇద్దరే అమ్మాయిలం. మా ఫాదర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయింది. అంతకుముందు అన్ని స్టేట్స్ తిరిగినాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళితే అక్కడికి పోయాం. ఆరు ఏళ్ళనుంచి అక్కడే సెటిల్ అయ్యాం. నాకు 17 ఏళ్ళపుడు ఇంటర్ చేస్తున్నపుడు ఒకతను కాలేజీలో చూసి మా మామయ్యతో వచ్చాడు. ఈ అమ్మాయి బాగుంది. ఎవరమ్మాయి అనిచెప్పి ఈ అమ్మాయినిపెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను అన్నాడు. మా అమ్మని వాళ్ళు వచ్చి అడిగారు. మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లమ్ వుంది. ఆమెకేమైనా అయితే నాకు పెళ్ళి చేసేవాళ్ళు ఎవ్వరూ వుండరు అని పెళ్ళి చేసారు.మా హస్బెండ్ ఆర్‌టిసి లో డ్రైవర్. గవర్నమెంట్ జాబ్ వుంది. తెలిసిన అబ్బాయి వూరిలోని అబ్బాయి అని చేశారు. వూరులో వున్నపుడు చాలా మంచివాడుగానే తెలుసు అందరికి. ‘వాళ్ళకు ఆస్తి వుంది. అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది’ అని నా పెళ్ళి చేశారు.

ఆయనకు హైదరాబాద్‌లో జాబ్ అని ఇక్కడికి రావలసి వచ్చింది. ఇక్కడికి వచ్చాక బేగంపేట్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీకోసం జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిన ఆరు నెలలకి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఆర్.టి.సి హాస్పిటల్లో చూపించుకొని అన్ని టెస్ట్ లతో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా రాశారు. నాకు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించారు. పెళ్ళయిన ఒక నెలకి చాలా ఫీవర్ వచ్చింది. అపుడు మా ఫ్యామిలి డాక్టర్ సూర్యాపేటలో టెస్ట్ చేయించారు. ఏం లేదని వచ్చింది. వీళ్ళు టైం పాస్ కోసం చేస్తున్నారు. చేసుకోని అని చెప్పి ఎంతో హ్యాపీగా స్కానింగ్ కి అన్ని బ్లడ్ టెస్ట్ లకి ఇచ్చాను. తరువాత అమ్మవాళ్ళు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని వూరు తీసుకెళ్ళారు. ఒక నెల అక్కడే వున్నాను. డైరెక్ట్ గా వూరినుంచి హాస్పిటల్ వచ్చి రిపోర్ట్స్ తీసుకున్నాను. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ అబ్బాయి మీకు చుట్టాలా? ఏదైనా రిస్క్ బిహేవియర్ వుందా? మీవారికుందా? మీకుందా? అని అడిగారు. ఏంలేదు ఎందుకేంటి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి అని రిపోర్ట్స్ తీసుకున్నాను. హెచ్ఐవి ఫస్ట్ రియాక్టర్ అని వుంది. ఇంటర్‌లో, డిగ్రీలో బి.పి.సి గ్రూప్ కానీ అంత అవగాహన లేదు. నాకు వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంటోలే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏంటి డాక్టర్ నాకు హెచ్ఐవి అని వచ్చింది నిజమేనా. నేను చూడ్డానికి మంచిగా వున్నాను. రాంగ్ రిపోర్ట్స్ కూడా అయి వుండొచ్చు అని డాక్టర్ అన్నాడు. నాకు హెచ్ఐవి వచ్చే ఛాన్స్ వుండదు. నేను ఇంతకు ముందు హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఎపుడూ బ్లడ్ ట్రాన్స్‌మిషన్ కాని, ఇంజక్షన్ కాని తీసుకోలేదు. ఇంజక్షన్ అంటే భయం. ఎపుడూ వేయించుకోలేదు. నాకు ఎలాంటి రిస్క్ బిహేవియర్ కూడా లేదు. ఇది తప్పు అని గొడవచేసి ఏడ్చాను. మీ హస్బెండ్ వల్ల కూడా రావొచ్చుకదా అన్నాడు. ఆయనవల్ల ఎందుకు వస్తుంది. ఈ రిపోర్ట్ అంతా తప్పు అని మళ్ళీ వెంటనే బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాను. తెల్లారి వచ్చి చూసుకున్నాను. మళ్ళీ అదే హెచ్ఐవి రియాక్టివ్ అని వచ్చింది. అపుడు నమ్మాల్సి వచ్చింది. అపుడు స్టార్ట్ అయింది దీనిగురించి వివరాలు ఎవరు ఇస్తారు అని నేను బుక్స్ కోసం చూశాను. 10వ తరగతిలో ఏదో పోర్షన్‌లో వుంటే అపుడు నేను ఇంట్రెస్ట్ గా చూడలేదు. ఇపుడు వెళ్ళి వేరే పిల్లలను అడిగి తీసుకుని చదివాను. అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను ప్రెగ్నెంట్‌గా వున్నాను. నా పిల్లలకు వస్తుందేమో, ఏం చేయాలో. 19 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ, పైగా పాజిటివ్ అని తెలిసింది. మా హస్బెండ్‌ను గట్టిగా అడిగాను. ప్రస్తుతం నాకు ఎలాంటి రిస్క్ బిహేవియర్ లేదని చెప్పారు. నాలుగేళ్ళ బ్యాక్ ఏదో చేశారట, అపుడు చేస్తే ఇపుడు వస్తుందని తెలియదు. డిగ్రీ చదివారు గాని హెచ్ఐవి మీద అవగాహన లేదు. హెచ్ఐవి ఎలా వస్తుంది? ఏంటి? అని. హెచ్ఐవి సెక్స్ ద్వారా వస్తుందని తెలియదు. ఆయన నన్ను అడుగుతున్నారు ఇంకా ఎలా వస్తుంది నీకేమైనా తెలుసా? అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చాను. నేను ఇపుడు ప్రెగ్నెంట్‌గా వున్నాను. నా లైఫ్ అయిపోయింది. నేను ఏం చేయాలి అని ఏడ్చాను. సిటీలో నాలుగు హాస్పిటల్స్ వున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చెబుతారు. బేబీని వుంచాలా? తీసేయాలా అని చెపుతారు అన్నాడు. నయాపూల్ జిఎంఎస్ కి పోయాను. కౌన్సిలర్స్ దగ్గరికి పోయి కలిశాను. మావారికి, నాకు పాజిటివ్ అని వచ్చింది. తరువాత ఏం చేయాలి. తను కౌన్సిలింగ్ ఎలా ఇచ్చిందంటే 50: 50 ఛాన్స్ వుండొచ్చు. కడుపులో వున్న బేబీకి ఎలా రాకుండా వుంటుంది హెచ్ఐవి. తల్లి బ్లడ్ కదా, వస్తుంది. పుట్టగానే చనిపోతుంది అని చెప్పారు. కౌన్సిలింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అపుడు అబార్షన్, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకున్నాను. 19 సంవత్సరాలకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయి పోయింది. నేను చాలా బాధపడ్డాను. మా ఆయనతో మా కట్నం మాకు ఇచ్చేయ్యండి అని చెప్పి అమ్మ వాళ్ళింటికి పోయాను. అందరూ ఏదో ప్రాబ్లమ్ వుండి విడిపోయాం అనుకున్నారు. తార్నాకకు వెళ్ళినపుడు తెలిసింది నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్స్ గురించి. వీళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని వెళ్ళాను.నేను వెళ్ళేటప్పటికి అక్కడ సపోర్ట్ మీటింగ్ జరుగుతోంది. నేను అపుడు అక్కడ 100 మందిని చూశాను, పిల్లల్ని చూశాను, రకరకాల వాళ్ళను చూశాను. హెచ్ఐవి వచ్చిన పిల్లల్ని చూశాను. ఇంకా నయం నాకు పిల్లలు లేరు. వాళ్ళు వుండి వాళ్ళకు వచ్చివుంటే? ఇంకా కొంతమందికి భర్త కూడా లేడు. నాకు నయం మా హస్బెండ్ వున్నాడు. తరువాత మేడంతో మాట్లాడినాను. నేను చాలా ఆలోచించాను. మేడం కూడా చాలా చెప్పారు.

ఒక సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. ఇపుడు నా భర్త నేను కలిసి వుంటున్నాం. ఇక్కడికి వచ్చాక హెచ్ఐవి గురించి చాలా నేర్చుకున్నా. నయాపూల్ హాస్పిటల్‌లో నాకు సరిగ్గా కౌన్సిలింగ్ ఇవ్వలేదు. హెచ్ఐవి గురించి చాలా తెలుసు కోవాలని వుండేది. జాబ్ చేయాలని ఆసక్తి లేదు. చనిపోయేవాళ్ళకు ఎందుకు అనుకునేదాన్ని. ఇన్ఫర్మేషన్ కోసం పిపిటిసి ట్రైనింగ్ కి వెళ్ళాను. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ విన్నాను. నాకన్నా చిన్న వయస్సు వాళ్ళు వున్నారు. నేను ఎందుకు మావారికి దూరంగా వుండాలి. ఆయన ఇపుడు బాగానే వుంటున్నాడు. ఆయనకు ఇన్ఫెక్షన్స్ ఏం లేవు. సిడి కౌంట్ తగ్గింది. ఎ ఆర్ వి స్టార్ట్ చేస్తున్నారు. ఇపుడు బాగానే వున్నారు. నన్ను అత్తయ్యవాళ్ళు, అమ్మవాళ్ళు బాగా చూసుకుంటున్నారు. హెల్త్ కాపాడుకోండి అంటారు. హాస్పిటల్‌లో కూడా ఎవ్వరూ డిస్క్రిమినేషన్ చేయలేదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివాను.

ట్రైనింగ్ అయ్యాక ఒ.ఆర్.డబ్ల్యు (Outreach Worker) గా చేశాను. జాబ్ ఇచ్చారు. నేను 300 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను ఇక్కడికి వచ్చి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. హాస్పిటల్‌లో టైము వుండదు వాళ్ళు కౌన్సిలింగ్ సరిగ్గా ఇవ్వరు. నేను మూడు లేక నాలుగు ఫ్యామిలీలను కలిపాను. తరువాత వాళ్ళు వచ్చి మా హస్బెండ్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు.

ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళే ఇన్ఫెక్ట్ అవుతున్నారు. చాలామంది 18-35 సంవత్సరాల మధ్యవాళ్ళే వున్నారు. మగవాళ్ళు కూడా కౌన్సిలింగ్ కి వస్తారు. కొంతమంది ఆడవాళ్ళు మొదట్లో కౌన్సిలింగ్ కి రారు. వాళ్ళు మూడు, నాలుగు సెషన్‌ల తర్వాత రావడం మొదలుపెడతారు. మేం చేసేది సోషల్ సర్వీస్. ఏ టైములో అయినా మేడం పిలిస్తే వచ్చి వర్క్ చేస్తాం. పండగలపుడు కూడా వస్తాం. మేము పటాన్చెరువు దగ్గర వుంటాం. ఈమధ్య డా|| బాలాంబను కలిశాను పిల్లల కోసం ప్రయత్నించాలని. కొంచెం వెయిట్ పెరిగాక రమ్మని చెప్పారు. నేను ఇపుడు హెల్తీగానే వున్నాను కాబట్టి వెయిట్ కూడా పెరిగాను.

మేం మంచి డైట్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తీసుకోము. క్యారెట్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఉసిరి, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడతాను. టిఫిన్ తినను. ఉదయం ఒక గ్లాసు పాలు, మొలకెత్తిన ధాన్యాలు తింటాను. ఎక్కువగా ఫ్రూట్స్, ఫ్రూట్ జూస్ తీసుకుంటాను.

మావద్దకు వచ్చే పాజిటివ్‌లకు గర్భం వుంటే దాని గురించి చెబుతాము. తరువాత వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తాం. వాళ్ళ ఇష్టం వుంటే వుంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు.

హెచ్ఐవి వచ్చినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. మననుండి ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవాలి. లైఫ్ అయిపోయింది అనుకోకుండా మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మంచి ఆహారం తింటూ, మంచి పనులు చేస్తూ వుంటే మనకి ఏం కాదు. ఇలా వుంటే మన జీవితకాలం ఇంకా 10-20 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఇది వచ్చింది అని తెలిసిన తరువాత అయినా మగవాళ్ళు మారితే బాగుండును. నాకు ఇప్పటివరకు జలుబు, చిన్న చిన్న జబ్బులు వచ్చాయి. ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. హెచ్ఐవి/ ఎయిడ్స్ వచ్చినవాళ్ళకు ప్రివెన్షన్ ఇవ్వాలి. మేం ఎపుడైనా డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకు చెపితే వాళ్ళు బాధపడి చాలా కేర్‌గా చూస్తారు. ఎక్కువగా హెచ్ఐవి సెక్స్ ట్రాన్స్‌ఫార్మ్ ద్వారా వస్తుంది. సిరంజీ, బ్లడ్‌ల వల్ల తక్కువ. మేం బైట ఎక్కువగా ఈ విషయాలు చెపుతాం. ఒకటికంటే ఎక్కువ సంబంధాలవల్ల, రక్తం కలుషితం కావడం వల్ల, సిరంజీల వల్ల, తల్లినుండి బిడ్డకి వస్తుంది. వాళ్ళకి సేవలు చేయడం ద్వారా రాదు. హాస్పిటల్స్ లో ఎవరైనా వుంటే గ్లౌష్లు వేసుకొని చేయండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి వివరించి చెపుతాం. మా ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళందరికి తెలుసు ఇది పాజిటివ్ వాళ్ళ ఆఫీస్ అని. ఓనర్స్ చాలా మంచివాళ్ళు. ఇక్కడ పనిచేసేవాళ్ళందరం అక్కాచెల్లెళ్ళుగా వుంటాం. అపుడపుడు కోపం వస్తుంది. మేం మా ఇంట్లో కూడా చెపుతాం, ఇలా వున్నవారికి కోపం ఎక్కువ వుంటుంది అని.

నేను చెప్పేదేమంటే పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు వున్నాయో విచారించి వాళ్ళకు హెచ్ఐవి టెస్ట్ చేసాకే పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాను. లేకుంటే వాళ్ళనుండి చిన్న వయస్సులో వున్నవాళ్ళు, వారి పిల్లలు హెచ్ఐవి / ఎయిడ్స్ బారిన పడతారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.