– కుప్పిలి పద్మ
వారం వారం వచ్చే ఆంధ్రప్రభ కోసం మా యింట్లో మా అమ్మమ్మగారు, బామ్మగారు, మా అమ్మమ్మగారి ఆడపడుచులు, తోడికోడళ్లు, మా అమ్మగారు యిలా అన్ని వయస్సుల వాళ్లు తెగ యెదురు చూసేవారు. సీరియల్స్‌తో పాటు వీళ్లందరి మాటల్లో ఆ వారం ప్రమదావనంలో యేమేమి వుంటాయనే మాటలు వినపడుతుండేవి. మా అమ్మగారి నాలుగో మేనత్తని నీకు మాలతిగారు బాగా తెలుసు కదా యీ వారం యేం వస్తుందో తెలుసాని అడగటం కూడా వినిపిస్తుండేది. ఆమె తరచుగా తల్లితోడమ్మ నాకేం తెలియదు అంటుండేవారు. అప్పటికే సీరియల్స్ పాటు ప్రమదావనాన్ని యింట్లోవాళ్లు కట్ చేసి బైండ్ చేయించి ఆ పుస్తకం మీద యే నెల నుంచి యే నెల వరకుదో రాసి భద్రపరచేవారు. మరో విషయం కూడా నా చిన్న బుర్రకి గుర్తున్న దేమిటంటే యింట్లో మగవాళ్లు సీరియల్స్ గురించి మాటాడటం వినలేదు కానీ ప్రమదావనం గురించి మాటాడేవారు. అలాగే ఆమె యింగ్లీష్ నవలలూ చదువుతారని చాల చక్కని రీడరని ఆమె గురించి చాలా గౌరవంగా మాట్లాడేవారు. పుస్తకాలని పిప్పరమెంట్స్‌లా చదివేసే అలవాటున్న నేను వో వేసవి సెలవల్లో బైండ్ చేసిన ప్రమదావనాలని చదవవటం మొదలు పెట్టాను. వేసవిలో మల్లెపువ్వులని మించిన ఫెర్‌ఫ్యూమ్ లేదని రాయటం నచ్చితే అనేకమంది సమస్యలని ఆమె యిచ్చే సమాధానాలు చదువుతుంటే కథల్లో చదివేలాంటి సమస్యలు మనుష్యులకీ నిజంగా వుంటాయన్న మాట అని నా చిన్న మనసులోకి వచ్చిన ఆలోచన. యిదే విషయం మా అమ్మమ్మగారికి చెపితే ‘ఆమె అలా జవాబులు చెప్పగలిగే ప్రమాదావనాన్ని ప్రభవాళ్లు యివ్వకపోతే చాలామందికి వాళ్ల సందేహాలు, సమస్యలు వాళ్లలోనే వుడిపోతాయని యిలా యింకా యేమేమో చెపుతుంటే మొత్తానికి అదేదో చాలా మంచి విషయమని అర్ధమవుతుండేది.
అలా రాను రాను ప్రమదావనాన్ని చదివేస్తుండేదాన్ని. కనిపించినవన్నీ చదువు కుంటూ పోతున్న నాకు మాలతీ చందూర్ గారు మంచి పుస్తకాలని యెలా చదవొచ్చనే విషయం మీద రాసినవి భలే వుపయోగ పడ్డాయి. మనకి స్వాతంత్య్రం రాకముందు స్త్రీ విద్య చాలా తక్కువగా వుండే రోజుల్లో యస్‌యస్‌సి వరకూ ఏలూరులో చదువుకొన్న మాలతీ చందూర్‌గారు యింగ్లీష్ సాహిత్యాన్ని విపరీతంగా చదవటమే కాకుండా ఆ నవలలని మూలకధని ఆ వొరిజినల్ నవలలోని సారం యేమాత్రం తగ్గిపోకుండా తిరిగి చెప్పటం అరుదైన కళ. ఆమె వలన తెలుగు పాఠకలోకానికి అందిన శతాబ్ధి సూరీడు, హృదయనేత్రి, శిశిరవ సంతం యిలా ఆమె రచనలు యేం తీసుకొ న్న అవి తనవైన రచనలు. అంత సాహిత్యం చదివినప్పుటికి ఆమె తనలోని పాఠకురా లిని, రచయితని కలిపేయకుండా యెవరికి వారిని స్వతంత్రంగానే వుంచుకొన్నారు. చదువుకోవాలనే ఆకాంక్ష, వుద్యోగం చేయ్యాలనే స్వతంత్ర ఆలోచన వున్న స్త్రీల ఆశయాలని ఆమె తన సాహిత్యమంతా వొతైన పచ్చికలా పరిచేవారు. అప్పటి సమాజ చైతన్యానికి చేరువగా, వొక్కోసారి కాస్త యెక్కువ చైతన్యంతో ఆ పాత్రలుండేవి. వారంతా ఆ కాలానికి ఆ సమాజానికి ప్రతిబింబాలు. ప్రతినిధులు. ఆమె ప్రశ్నలకి జవాబులు యెంత సూటిగా వుంటాయో అంతే సూటిగా వుండే వాక్యం ఆమె నవలల్లో కధల్లో వుంటాయి. ఆమెకి యెలాంటి భేదాలు లేవు. ఆమె యెంచుకొన్న యితివృత్తం వాటిలోని అన్ని పాత్రలు ఆమెకి సరిసమానమే. ఆమె ప్రత్యేకంగా యేవొక్కరి పక్షానో నిలబడరు. పెద్దగా హంగులుండవ్. ఆ యితివృత్తం అందులోని వ్యక్తులతో చదివేవారు ఐడెంటిపై అవుతారు. రచనలోని ఆ సూటితనం, ఆ స్వతంత్ర ఆకాంక్ష, నేల విడిచి సాముచేయని సన్నివేశాలతోనే ఆమె బోల్డంతమంది పాఠకులకి అభిమాన రచయిత్రి అయ్యారు.
మైదానాన్ని, ముక్తని రాసిన ధైర్యవంతురాలైన అమ్మాయిని చూడాలనిపించింది…. అని ఆమె అనగానే మీవంటివారు వేసిన దారి చదువు, వుద్యోగంలాంటి వాటి కోసం మేం పోరాటం చేయనక్కరలేదు. మిగిలిందంతా యిప్పటి సమాజంలో అమ్మాయిలు కోరుకొట్టున్న జీవనపు ఆకాంక్షలు… అంతే మా ముందు తరం రచయితలు వేసిన బాటలోనే మం నడుస్తున్నాం. అంతే…. అన్నాను. ఆమె వొక్కసారైనా చూడాలనుకొనేవారెందరో… యెంతో ఫాలోయింగ్… సాహిత్యానికి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ బోల్డంత. అటువంటి మాలతీచందూర్ గారు అప్పటికి పట్టుమని యేభై కథలు కూడా రాయని పిల్లరచయితని మెచ్చుకోవటం ఆమెకి భవిష్యత్ తరాలపై వున్న ఆత్మీయతకి నిదర్శనం. ఆమె ఆ తరువాత కూడా కొత్తగా రాస్తున్న వారికి మెచ్చుకొని ప్రోత్సహిస్తునే వున్నారు. జగతికి యేమైనా రాయమని చందూర్‌గారు అడిగారు. జతి పోస్ట్‌లో వస్తుండేది. అప్పుడప్పుడూ చందూర్‌గారు కార్డ్స్‌లో రచనలకి సంభందించిన యేమైనా ముఖ్య విషయాలుంటే రాస్తుండేవారు. వారిద్దరూ మంచి స్నేహితుల్లా సాహిత్యం, స్నేహితులు లోకంగా జీవించారు.
మాలతీ చందూర్‌గారు ప్రమదావన ంలో నిత్య మాలతీ పరిమళమే యెప్పటికి….