– –

– చింతనూరి కృష్ణమూర్తి

ఒక రచయిత రాసిన ఒకటి రెండు కథల ఆధారంగా ఆరచయిత వస్తు స్వీకరణ, దృక్పథాలను నిర్థారించడం కోసం ఈ కథలను మూల బిందువుగా తీసుకొని యశోదారెడ్డి గారి రెండు కథలను పలుమార్లు చదివాక, చదువుతూ ఉన్నప్పుడు కలిగిన ప్రతి స్పందనలే ఇవి. ధర్మశాల అనే కథా సంపుటిలోని మొదటి కథ ధర్మశాల. రెండో కథ ఈ సంపుటిలోని చివరి కథ ‘మాధవీలత నవ్వింది’. ఈ రెండు కథలు శీర్షికలు పాఠకుడిగా నన్ను ఆకర్షించాయి. ‘ధర్మశాల’ అనే పేరెందుకు పెట్టి ఉంటారనే ఆసక్తి మొదటి కథ చదవడానికి ప్రేరేపించింది. ‘మాధవీలత నవ్వింది’ అనే కథ స్త్రీల జీవితంలో ‘నవ్వు’ నిజంగా ఉందా? లేక రచయిత్రి ఆకాంక్ష ఫలితంగా నవ్విందా అనే సందేహం వల్ల చదివాను.

ఈ రెండు కథలు చదివాక యశోదారెడ్డి కథలు రాయటంలో ఆమె ఆశించిన ప్రయోజనం కొంత వరకు బోధపడింది. వ్యక్తికీ, వ్యవస్థకు మధ్య ఏర్పడే ఒక సంఘర్షణ, తలెత్తే సంక్షోభం, ఫలితంగా ఏర్పడే విలువలు, పాత విశ్వాసాలు క్రమేణా కనుమరుగు కావటం అనే ఒక చాక్రిక క్రమం పాఠకులకు తెలియజెప్పటం అనే లక్ష్యం వారి కథలకు ఉందని అర్థమైంది.

మొదటి కథ ‘ధర్మశాల’ చెల్లులు తన అక్కకు ఉత్తరం ద్వారా తెలియజేస్తున్న ఊరి విశేషాలతో కూడుకుని ఉంది. అక్కా చెల్లెళ్ల మధ్య ఉత్తరసాన్నిహిత్యం కూడుకుని ఉంది. అక్కా చెల్లెళ్ల మధ్య ఉత్తర సాన్నిహిత్యం వారి భౌతిక, మానసిక సాన్నిహిత్యాలను తెలియజేస్తూనే భవిష్యత్తు గురించి ఇద్దరికీ ఒక అవగాహనను కల్పించేందుకు ఉద్దేశించినట్లుగా కనపడుతుంద. అయితే ఈ అవగాహన అక్కాచెల్లుళ్లు కలిగించుకోవలసిందిగా అనిపిస్తూ – పాఠకులకు కలగవలసిన ఎరుకకు, కలిగించవలసిన ఆలోచనకు సంప్రదింపజేయటంలో యశోదారెడ్డి కథల నిజమైన లోతు దాగి ఉందనిపిస్తుంది.

”అక్కా! దాదాపు పదినెలల తరువాత నీకీ ఉత్తరం వ్రాస్తున్నా నంటే ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సుమా! అబ్బ అప్పుడే బుంగమూతి పెట్టకమ్మా తన ప్రణయక్రియత దానః, అంటే సారి అదే మా బావ, చూసి ప్రణయపుటలకేమోనని శరవేగంలో వచ్చిన మంచం అలంకరించగలరు” అంటూ మరీ వ్యక్తిగత విషయాలతో మొదలై క్రమేణా వ్యక్తి పరిధిని దాటి ఉత్తరం సామాజిక పరిధిలోకి ప్రవేశిస్తుంది.

ఈ ఉత్తరంలో తమ ఊరికి ఈశాన్య భాగంలో ఉన్న గున్న మాడి లోపులో ‘గణపతి’ ఇల్లు కటట్డం దానికి ధర్మశాల అని పేరు పెట్టడం, ఆ ఇంట్లోకి నాలుగు కుటుంబాల వారు చేరడం, ఆ వ్యక్తుల మనస్తత్వ చిత్రణ ఇందులో ప్రధానం.

ఆ ఇంటి గురించి చెల్లెలు ఉత్తరంలో ఇట్లా వివరిస్తుంది. ”ఆ ఇల్లు చతురస్రాకారంలో ఉంది. అంటే నాలుగు ఆశ్రమాలకు నాలుగు అవస్థలకు, నాలుగు కోణాలకు, నాలుగు వేదాలకు, దిక్కులకు చివరకు నాలుగు జాతులకూ ప్రతీకగా నిలిచినట్లు ఆ ఇల్లు ముచ్చటగా ఉంది” అని వ్యాఖ్యానిస్తుంది.

ఆ ఇంట్లోకి నలుగురు నాలుగు భాగాల్లోకి చేరారు. వారిలో గవర్నమెంటు ఉద్యోగి పరమేశంగారి సతీమణి ఒకరు ఆమె ”గవర్నమెంటు ఉద్యోగంలో నెలకు పన్నెండు వందలు సంపాదిస్తూ ధర్మశాలల్లో వుండవలసిన ఖర్మను నకేమొచ్చిందని” అంటూ నొసలు బాదుకుందట అని ఉత్తరంలో రాస్తుంది. అన్నారం నుంచి వచ్చిన రైతు రామయ్య భార్య పార్వతమ్మ ”అయ్యోకతా దేవుడు ఇచ్చినట్లు అంతో ఇంతో పాడీ పంటా, మర్యాదమన్నన వుంట ప్రాణాన్ని కొలకుల్ల నెట్టుకున్నట్ల ఊళ్ళో ఇండ్లు కరువైనట్లు నన్ను పిల్లలను దెచ్చి సత్రంలో దింపుతుండరేందయ్యా అంటుంది. ఇక రామనాథ శాస్త్రి గారి ఇల్లాలు ”ఏమండి! మిమ్మల్నే అసలా కొంప అగ్రవర్ణల పాదం మోపదగ్గదేనా? పేరే ఇలా ఏడుస్తూ వుంటే లోపల చాపకూడు వడ్డించి చస్తున్నారేమో? అనాచారపు కొంపలా, ఏ మూల జూసినా!” అందిట. నాయుడు గారి అర్థాంగి తాయారమ్మ నాయుడ్ని మాట్లాడనివ్వకుండా ఇంటి యాజమాని గణపతితో ఇట్లా అంటుంది. ‘డబ్బుచ్చుకొని అద్దెకిచ్చే కొంపలకు ”ధర్మశాల’ అనిపేరెడ్తే అందులో కాపురం తగలబడి చచ్చే వాళ్ళ పరువు ఏ గంగపాలు కావాలని మీ ఉద్దేశం” అంటూ అడుగుతుంది. గణపతి తన ఆధర్శాలు విశదపరిచాక! పేరులో ఏముందిలే ఇల్లు సౌకర్యంగా ఉంటే చాలు” అని ఒక భాగంలో దిగిపోతుంది. ఈ కథలో ఒక ఉద్యోగి భార్య, ఒక రైతు భార్య, ఒక శాస్త్రిగారి భార్య ఒక నాయుడుగారి భార్య వారి వారి సామాజిక అంతస్తు, హోదా కులం, ఆర్థికాంశాలను బట్టి ప్రవర్తించడం కనిపిస్తుంది. అయితే ఈ అందర్నీ ఒక చోట చేర్చి రచయిత్రి ఏం చప్పదలచారనేది కథలో ప్రధానాంశం.

మొదట ఈ నలుగురూ వారి వారి మనస్తత్వాల మేరకు అభ్యంతర పడ్డప్పటికీ ఒకే చోట సహజీవనం వల్ల ‘సామాజిక సర్దుబాటు’ అనే మార్పుకు గురికావడమే కాకుండా వర్గమనస్తత్వం, కులతత్వం ఆర్థిక ఆధిపత్యంలాంటివి, సంస్కృతి వైవిధ్య వైరుధ్యాలను అర్థం చేసుకోవడం కథలో కనిపిస్తుంది. రైతు భార్య పార్వతమ్మ మొదట్లో ఇంటిని సత్రంగా భావించింది. తరువాత ఆమె ”మా గణపతన్న శానా మంచోడు, కడుపు నిండా ప్రాణవార్తికమే దీపి దప్పకుటిలంగాని, కువ్వారంగాని, ఏ కేశోన గాన్రాదు. ఇంత వసతున్న ఇల్లు యాడదొర్కవోయింది మీరే జెప్పండి. చిప్పెడు సోటుంటె జాలు కోళ్ళ గూళ్లోలె కలందాన్‌ అరలోలె అన్న ఇండ్లు మర్పి కిరాయికిస్తె కూసుంటే గోడదగిలె లేస్తే దూలం దగిలెనని ఇర్కుటం పడాల్సి వొస్తది.” అని సాకుకూలపడింది. నాయుడు అర్ధాంగి తాయారమ్మ ధర్మశాలకు తానే ధర్మకర్తగా భావించేస్తుంది. అక్కడొక మహిళ సభను చేసింది. ‘ధర్మశాల’ అనే పేరుపట్ల అభ్యంతరం మొదట ఉన్నా అది పోయింది. శాస్త్రి భార్య వెంకటమ్మ కొంతకాలం ‘యానాది కొంపల్లో పడి ఈ కంపులు భరించలేను’ పెనుగులాడినా ఆమె కూడా మారింది. అన్నారం రైతు భార్య ”చూడుండి తల్లీ! మీరేమన్నా అనుండి నడమంత్రపు సిరొచ్చి అద్దమరేయి చెత్తరి దెమ్మన్న కతోలె నా మాట ఇడ్సి మీ యాస నేర్చుకోవాలంటే నా తరంగాదు” అని తన ప్రాంతీయతను, స్థానికతను వదులుకోలేనంది.

మొత్తం మీద కథలో ”ఆ నాల్గు వాటాలల్లో ఉన్న వాళ్ళు తగువులూ, రాద్దాంతాలు, గుసగుసలు సూటిపోటీ మాటలు, చిల్లర చేతలూ, అన్నీ విడిచి సమాభావంతో లసి ఉండటం ప్రారంభించారు. ఈ పరిణామం చూసి గణపతి ‘మర్దన చెయగా చేయగా కట్టెల్లోంచి నిప్పుపుడుతుందన్నారు. దేనికైనా ప్రారంభం – ప్రయత్నం ముఖ్యం” అంటాడు. ఈ వాఖ్య కేవలం కథకే కాకుండా రచయితకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రారంభం – ప్రయత్నం’ ద్వయానికి నాంది అన్నట్లుగా ఒక ప్రేమ కథ కూడా ఇందులో ఉంది. ధర్మశాలలోనే ఉన్న రామనాధశాస్త్రి వెంకటమ్మల కొడుకు చంద్రశేఖరశాస్త్రి – కాశీ విశ్వవిద్యాలయం నుంచి తిరిగొస్తాడు. అతను ఒకానొక సందర్భంలో పార్వతమ్మ కుమార్తె వెన్నలను చూడటం జరుగుతుంది. ‘వెన్నెల’ పాడిన పాటకు ఆకర్షితుడై ఆమెతో ప్రేమలో పడతాడు. రామయ్య, పార్వతమ్మలను తానే అడుగుతాడు వెన్నెలను పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడూ వెన్నెల తల్లిదండ్రుల ప్రతిస్పందన ఈ విధంగా ఉంటుంది.

వెన్నెల తండ్రి రామయ్య ”చూడు శేఖరయ్యా!” మేము రైతోండ్లము. మీరు బాపనోండ్లు, భోజన బాజినాలల్ల, పొందికలుల్ల పోవళ్లల్ల మీకు మాకు పొత్తు ఎట్లగలుస్తది. అంతెందుకు ఒక కులం అనుకునే మా వోండ్లల్లనే వడ్ల తెగలు జూడు రెడ్ల శాఖలు జెప్పు అని కంటినలుసు బేదాన ఎన్నొ పేర్లు” ముల్లె, మూట, కట్నం ఖదర్‌ ఖాందాన్‌ ఎన్నొ జూస్తరు జోడు గలిసేటందుకు. మరి అసొంటప్పుడు మీకు మాకు పొత్తెట్ల కుదర్తదయ్యా?” అని అడుగుతాడు.

వెన్నెల తల్లి పార్వతి ”సూడు నాయినా? నిన్ను జూస్తె ఆకలి దుపవాసీటట్లుండవు. సదువూ సందె కులం గిలం అన్నీ వుండని గని యియ్యమైనా కయ్యమైన సరిబరి తూపినపేడే” అని తేల్చిచెపుతుంది. అట్లాగే ఆమె! అంటకు, ముట్టుకు’ మనుకుంట నిప్పుతున్కోరె మసులుకుంటున్న మీ అమ్మ ఎన్నలను కోడలని జేస్కొని, కడుపుల పెట్టుకుంటాదా? ఉరి వేసుకోదూ? మరి నా బిడ్డ అంత ఎట్టికొచ్చిందా? తూ, సీ, అనంగా మీ కాళ్ళమీద పడేసేటందుకు? వద్దు నాయినా! నిండు నూరేళ్ళు బతుకు” అని సూచిస్తుంది.

ధర్మశాల కథ వ్యవస్థ ధర్మాన్ని, ప్రవృత్తిని చిత్రిస్తూనే వ్యక్త ధర్మాన్ని, వ్యక్తుల ప్రవృత్తులను పట్టి ఇస్తుంది. వారిలో రావలసిన, వస్తూ మార్పులను కూడా చిత్రించించింది కథలో. వెన్నెలను చంద్ర శేఖరశాస్త్రి వివాహం చేసుకుంటాడు. అటు శాస్త్రి కుటుంబం ఇటు రైతు కుటుంబం ఈ వివాహాన్ని ఆమోదించటం అనే ముగింపును ఇచ్చినా దీనికి పూర్వరంగంగా ‘ధర్మశాల’లోకి ప్రవేశించిన కుటుంబాలు కొంత సంఘర్షించిన తరువాతనే ఒకచోట జీవించటానికి ‘సామాజిక సర్దుబాటు’ను ఆశ్రయించాయి.

ఇక మాధవీలత నవ్వింది కథ ఇద్దరు భార్యభర్తలు తొలుత తమ తమ వ్యక్తిత్వాలను నిలుపుకునేందుకు కొంత ప్రయత్నించి, కేవలం వ్యక్తిత్వం నిలుపుకోవటం కొరకే అయితే వ్యవస్థ వర్ధిల్లదు అనే ఆమోదంలోకి వారంతట వారే ఒకరు ఇంకొకర్ని అర్థం చేసుకోవడానికి ఉపక్రమిస్తారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అహంకారాలుగా వర్ధిల్లి మనుషులను దూరం చేయడం అనే విధ్వంసం జరుగుతుందని రచయిత్రి భావించడం జరిగింది. ఈ కథలో శేఖర్‌ కథా రచయిత, కథలో భాగంగా భార్యతో ఈ విధంగా చెపుతాడు. ”అవునా డియర్‌! కథ ఎక్కడో మిన్నులు పడ్డతావు నుంచి రాలదు. అది నీ పరిసరాళ్లోంచి, నీవు పుట్టిన మట్టిలోంచి, నీవు అహర్నిశలు మెదిలే మనుషుల్లోంచి పడుతుంది.జీవితంలోంచి పోట్టరిల్లిన కథ, ఆ జీవితమే కేంద్రంగా వృద్ధిని పొందుతూ చివరకు ఆ జీవితానికే కేంద్రంగా వృద్ధిని పొందుతూ చివరకు ఆ జీవితానికే పాఠాలు చెబుతూ పరిసమాప్తి పొందుతుంది. ఇంత స్పష్టమైన అవగాహన ఉన్న డా|| సి. యశోదారెడ్డి కథలు జీవితాన్ని చూసి జీవితానికే ఆ కథలను కానుక చేశారు. అవి ప్రాంతీయతను, స్థానికతను, కులాన్ని, మతాన్ని, మమతను, సామరస్యాన్ని, భిన్న పాఠ్యాలనుంచి స్పర్షించాయి. ఈ కథల్లో ఒక నింసాదితనం, స్పష్టత సరళతలున్నాయి. శిల్పరీత్యా యశోదారెడ్డి ఒక వొడుపును కూడా ప్రదర్శించారు. రాసిన ప్రతి కథకు సంఘటనను మూలంగా తీసుకొని ఆ సంఘటన, ఒక సంఘర్షణలోకి ప్రవహించి ఆ సంఘర్షణ జీవితావగాహనగా పరిణమించటం ఆ కథల ప్రత్యేకత. విశిష్టత కూడా యశోధారెడ్డి కథల్లో మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.