– శైలజా మిత్ర
ఆడపిల్లండి
తాజా ఆడపిల్ల!
అమ్మకానికో ఆడపిల్ల
తెల్లగానే ఉందండి
బొద్దుగా, ముద్దుగా ఉంది ఒట్టు
జ్వరం లేదు, జబ్బు లేదు
తాజా ఆడపిల్ల
గంతులేసేందుకు
రెండు కాళ్ళున్నాయి
అన్నం తినేందుకని మేము అనుకున్నాం కాని
మీ భాషలో అడుక్కునేందుకు రెండు చేతులున్నాయి
ముఖం బాగానే ఉందండి
కన్నీరు నిండిన కళ్ళు ఉన్నాయి.
ఇంతకీ మీ సందేహం ఏమిటండి
ఆ పిల్ల బతికి ఉందా లేదా అనా?
దానికి మాత్రం హామీ లేదండి
అయినా అమ్ముతున్నది
అమ్మే కదండి
నమ్మండి కొనుక్కోండి!
ఏమిటీ వైకల్యం
– ఆకుతోట జయచంద్ర
ఏమిటీ వైకల్యం….?
ఎవరిదీ వైకల్యం …..?
ఎవరికీ వైకల్యం ……..?
నీదా, నాదా ……….!
నీకా, నాకా ………..!
అవును నేను
చూడలేను, మాట్లాడలేను, నడవలేను, నడిపించలేను
ఇదే అంగవైకల్యమా….!?
అవును నేను
సమాజంలోని చెడును చూడలేను
అన్యాయాలను, అత్యాచారాలను ఖండిస్తూ మాట్లాడలేను.
మరి
చూడగలిగి, మాట్లాడగలిగి, నడవగలిగి, నడిపించగలిగి
మీరు
చేసిందేమిటి, చేస్తుందేమిటి, చేసేదేమిటి…?
నిరాశ, నిస్పృహలతో చేష్టలుడిగిన మీరు
గాంధీ గారి మూడుకోతులను ఆదర్శంగా తీసుకున్నారేమో,
నేను కాదు
మీకు వున్నది సామాజిక వైకల్యమా లేక అంగవైకల్యమా…?
ఇపుడు చెప్పండి
ఏమిటీ వైకల్యం….?
ఎవరిదీ వైకల్యం …?
ఎవరికీ వైకల్యం….?
మలాలా
– డా|| బండారి సుజాత
‘మ’రుగున పడని మత చాందసులతో
‘లా’ లోకూడా తిరిగి రాయలేకపోతున్న
‘లా’ వణ్యమైన స్త్రీల నుదిటి రాతలను
మార్చాలనుకొన్న ‘మలాలా’ మనందరికి స్ఫూర్తి
అమ్మాయిల జీవితాలకు అన్నీ అవంతరాలె
మతాలు వద్దంటూనే హిత బోధ చేస్తున్నారు
అమ్మాయిలకు చదువు వద్దంటు
ఒకవేళ చదివినా తమకు ఇష్టమైన
విద్య నేర్చుకోనివ్వని తాలిబాన్ల చట్టాన్ని
మార్చలేని మతవ్యవస్థను
ప్రశ్నించిన ‘మలాలా’ మనందరి కాంతి
మత మందరికి సమాన హక్కులిచ్చిందని
తండ్రి ఇచ్చిన స్వాతంత్య్రంతో
మారు పేరుతో ‘మలాలా’ వ్రాసిన జీవితానికి
మరెందరో ఆకర్షితులైన!
మత చాందస వేటలో
మహిళలను లక్ష్యంగా ఎంచుకోరని
తండ్రికై తపన పడిన మలాలా
తనే వారి లక్ష్యమవుతుందని తెలియక
తాలిబాన్ స్త్రీ జీవితాలను ప్రపంచానికి
తెలియచెప్పిన ‘మలాలా’ నీకు వందనం
మృత్యువునే జయించి
నిరంతరం మృత్యుకూపంలో
బ్రతుకుతున్న తన వాళ్ళందరికి
స్వేచ్చా శ్వాసను రుచి చూపి
ప్రపంచంలో ప్రసిద్దిపొందిన
‘మలాలా’ నీకు జోహార్లు
వృద్ధాప్యం – వరమా? శాపమా?
– హైమా శ్రీనివాస్
వృద్దాప్యమన్నది, ఒక మందులేని రోగమన్నాడు’ మనువు.
మనువు అనుభవించే చెప్పాడా! చెప్పేక అనుభవించాడా?!
ఏదైతేనేం ? ఐనా అదో పెద్ద సందేహం!
మనస్సు మాట వినదు, –
జిహ్వచాపల్యం చావదు!
పటుత్వం పాటుతప్పినా –
‘నవత్వం’ నాదే నంటుంది.!
నడుం వంగిపోయినా
అహం మాత్రం కుంగదు.!
‘ముసలి మనస్సు ‘మహా, మహా చెడ్డది!
అన్నీ కావాలని కోరి – చివరకు నవ్వుల పాలవుతుంటుంది.
కళ్ళు కనిపించకున్నా
వళ్ళు నిలువరించకున్నా,
‘మాకాలంలో…’ మాటలు మాత్రం – మరుగున పడవు.
అరవైలో ఇరవై కావాలని –
ఆయుర్లాదాయం ఆరురెట్లు పెరగాలనీ —
తెల్ల మీసాలకు సంపెంగ నూనె రాచి –
తలకట్టుకు రంగువేసినల్లం గాచేసి,
స్వీట్ సిక్స్ టీనైపోయి-
చూపరుల కళ్ళు కుట్టాలనీ,
ఉషస్సుకై ఉరకలు వేస్తుంటుంది.
ఉట్టికట్టుకుని ఊరేగాలంటుంది.
ఊరుపొమ్మంటున్నా–
కాడు రమ్మంటున్నా,
‘అప్పుడే ! ఏమంత తొందర?-
ఆగాగు మరి కాస్త కాలం ! ‘అంటుంటుంది.!
మనస్సే మనిషికి (పెద్ద) బద్ధ శతృవుకదా!
ఐతేకానీ…
మాట వింటే మంచి మితృడూనూ!! —
వృద్ధాప్యం – వరమా?
శాపమా?
జీవిత మంతా సవ్యంగా ఉపయోగించి ఉంటే వరమే!
మాయిగా విశ్రాంతి పొందే కాలం!!
అపసవ్యపు జీవనమైతే పరమ శాపమే మరి?
మొహం చూసే దిక్కులేక, ముఖం వాయాల్సిందే!
మానవత్వపు హృదయ కవాటాలు మూసేసుకుంట-
మృగంలా వంటరిగా బ్రతికేయాల్సిందే!
ఉతికి ఉతికి వాడేసిన చొక్కా ఇంకా ఎన్నాళ్ళూ!
వెతికి వెతికి చూసిన నేత్రాలింకా ఎన్నాళ్ళూ!
జ్ఞాననేత్రాన్ని వెతికి చూసే ప్రయత్నం చేసి,
విజ్ఞాన విహార తీరాన్ని చేరే మార్గం చూసి,
పక్షులను చూసి డిటాచ్ మెంటూ —
పశువులను చూసి స్వతంత్ర జీవనమూ,
చెట్లనుచూసి త్యాగభావమూ —
నదులను చూసి సేవాభావమూ,
ప్రకృతి బడిలో పాఠాలునేర్చి-
స్వార్ధాన్ని విడనాడి సమాజానికి మేలుచేస్తే,
అంతా నీవారే అవుతారు! –
అందరూ ఆదరిస్తారు.
మనస్సు పరిపక్వత చెంది మనకు మంచి మితృడౌతుంది.
వృద్దాప్యమూ ఒక వరమే అవుతుంది. మరి!
వృధ్ధాప్యం -వరమా?శాపమా? –కవిత చాలాబావుంది. వృధ్ధులమనో భావాలను కళ్ళకు కట్టారు,మంచికవితను ప్రచురించినందుకు కృతఙ్ఞతలు .
దేవీ రాం .