<అనితాథంపి
నా రచనా వ్యాసంగపు తొలిరోజుల నుంచీ రచయిత్రిగా ప్రచురణలో నేనెప్పుడూ స్పష్టమైన వెలికి గురి కాలేదు. ఆ అనుభవం నాకు లేదు. ఇటీవలి కాలంలో, నా భాషలో సాహిత్యంలో స్త్రీయైన కారణంగా రచయిత్రిగా ఎలాంటి స్పష్టమైన కనిపించే వెలిని ఎదుర్కొనటం లేదని చెప్పవచ్చు.
సాధారణ పరిస్థితయితే అదే. దీనికి బదులుగా సాహిత్యరంగంలో యిటీవలి కాలంలో రచయితలకు స్త్రీలుగా, దళితులుగా గుర్తింపు దొరకటమనేది క్రమంగా పెరుగుతోంది. పక్కకు నెట్టివేయబడిన గ్రూపుల అనుభవాలకు, వారి రచనలమీద ఆ అనుభవాల ముద్రలకు ఉన్న ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆ తేడాల మీద ఆసక్తి, శ్రద్ధ పెరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంటే రచయిత్రుల రచనలు ప్రచురణ కావటం యిప్పుడు సులభతరమైంది. సాహిత్య మార్కెట్‌లో దళిత సాహిత్యంలాగే స్త్రీల సాహిత్యం ఎంతోమంది కోరుకునే సరుకైంది.
ఐతే ఇలా సాహిత్య స్రవంతిలో సమ్మిళితమై పోవటమనేది ప్రచురణతోనే ఆగిపోతోంది. ఇక అక్కడనుంచి కనిపించని అనేక రూపాలలో సాహిత్య ప్రపంచంలో రచయితలుగా ఎక్కే ఉమ్మడి వేదికల నుంచి దూరంగా నెట్టటమనేది ప్రారంభమవుతుంది. రచయిత్రుల సాహిత్యాన్ని పరిశీలించేటపుడు, అంచనావేసేటపుడు, విమర్శనాత్మక అధ్యయనం చేసేటపుడు ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. సామాన్యరీతిలో సాగే సాహిత్య విమర్శ రచయిత్రులను తన ప్రధాన చర్చలలో ఎన్నడూ కలుపుకోదు. రచయిత్రులందరిని గంపగుత్తుగా కలిపి చివరి పేరాలలో కొన్ని వాక్యాలలో ప్రస్తావిస్తారంతే. దీని ఫలితంగా సాహిత్యపు ప్రధాన స్రవంతిలో రచయిత్రులు చేసిన కృషిని అంచనావేసి సరియైన స్థానం యివ్వటంలో తక్కువచేసి బలహీన పరచటానికీ దారి తీస్తుంది. నేనీ అభిప్రాయన్ని ఒక స్పష్టమైన ఉదాహరణతో చెబుతాను. మలయాళ సాహిత్యంలో గత శతాబ్దిలో ఐదుగురు ఉత్తమకవులలో సుగతకమారి ఒకరని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. మలయళ భాషా సాహిత్యాలలో ఆమె రచనల సంకలనాలు చాలా ప్రాముఖ్యత గలవి అవుతాయి. అలాంటి సంకలనానికి ఒక పరిచయం, సీరియస్ అధ్యయనం, మొత్తం సాహిత్య సందర్భంలో సరైన స్థానంలో ఉంచటం యివన్నీ తప్పనిసరి అవుతాయి. మిగిలిన పురుష కవుల సంకలనాలలో అలాంటి పరిచయ పద్ధతిని అనుసరిస్తనే ఉన్నారు. ఐతే సుగతకుమారి విషయంలో ఈ పద్ధతి పాటించటం లేదు సరిగదా, తోటి కవి ఒకరు రాసిన సంక్షిప్త వాక్యాలలో ప్రత్యేకంగా యిలా పేర్కొన్నారు. ”కాలం ఆమెకు ప్రపంచ కవయిత్రుల సరసన సగౌరవ స్థానాన్ని అందించింది”. అంతేకాదు ఆమె సంకలనానికి వేసిన ముఖచిత్రం ఆమె రచనలను ఎంత తక్కువ స్థాయిలో అంచనా వేశారో తెలిపేందుకు తిరుగులేని ఉదాహరణ.
నేను గట్టిగా నొక్కి చెప్పటానికి ప్రయత్నిస్తున్న విషయమేమిటంటే ఇవాళ్టి ప్రపంచంలో సమ్మేళనాలనేవి స్పష్టంగా నిర్వచించబడి, బలంగా స్థిరంగా ఉన్నాయి. ఐతే దూరంగా ఉంచే పద్ధతులు మోసపూరితంగా, ఆకార రహితంగా, అస్పష్టంగా జారిపోతూ దాదాపు అదృశ్యంగా ఉంటున్నాయి. అందువల్ల వాటిని గుర్తించటం, ప్రతిఘటించటం కష్టమవుతున్నది. ఫలితంగా అలాంటి మోసపూరిత మైన సమ్మేళనాలు వెలివేసే పద్ధతులను కొనసాగించేందుకు పదునైన పరికరాలవుతున్నాయి.
ఇలాంటి మోసపూరితమైన వాటికి మరో స్పష్టమైన అనుభవపూర్వకమైన ఉదాహరణ స్త్రీలు పనిచేసే చోటు. నేనొక ఫ్యాక్టరీలో ఇంజనీరుగా పనిచేస్తాను. ఇంజనీరింగు పురుషుల రంగంగా భావిస్తారు. ఇటీవల వచ్చిన మార్పులవల్ల ఉద్యోగాలలో స్త్రీలను చేర్చుకుని వృత్తులలో తేడాలను తగ్గించటంతో ఈ రంగంలో కూడా స్త్రీలు ఉండే అవకాశం కలిగింది. ముఖ్యంగా ఫ్యాక్టరీ వాతావరణంలో స్త్రీలు ప్రవేశించారు. ఇది ఒక సానుకూలమైన మార్పుగానే చూడాలి. ఐతే నేను ఉద్యోగానికి తప్ప రచయిత్రిగా యితర కార్యకలాపాలకు సమయన్ని కేటాయించటం కష్టంగా ఉంటుంది. ఇక్కడ కనపడకుండా ఉండే భావం ఏమిటంటే స్త్రీలు ఉద్యోగం తర్వాత తమ సమయాన్ని ఇంటికే పరిమితం చేయాలి. రచయితల సమావేశానికి వెళ్ళటానికంటే కుటుంబ వ్యవహారాలకు సెలవు దొరకటం తేలిక. ఇది ఉద్యోగం చేసే చోట ఒకరకమైన గృహ వాతావరణాన్ని తెస్తోంది. నాలో క్రమంగా ఒక అపరాధ భావనను కల్పిస్తోంది. అదీగాక నామీద నేను అదనపు భారాన్ని పెట్టుకునేందుకు ఒత్తిడి తెస్తోంది. ఉద్యోగంలో నన్ను నేను నిరూపించుకోవటానికి చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తోంది. సాహిత్య కార్య క్రమంలో నేను లేకపోతే ఈ అదనపు కష్టం అవసరం లేదు.
ఆశ్చర్యకరంగా ఇంట్లో వాతావరణం కూడా పనిచేసేచోట ఉన్నట్లే ఉంటుంది. ఐతే పనిచేసేచోట ఒక వ్యక్తిగా నేను ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాను. ఇంట్లో ఉద్యోగపరంగా చేసే ప్రయణాలను సహజమైనవిగా చూసి వెంటనే ఆమోదిస్తారు. కాని రచనలకు సంబంధించిన ప్రయాణా లను తప్పించుకోగలిగిన పనులుగా చూస్తారు. ఇంట్లో, ఆఫీసులో కూడా అది పూర్తిగా నా వ్యక్తిగత ఆసక్తిగానో హాబీగానో మాత్రమే పరిగణిస్తారు. అలాంటి గృహిణిత్వ, భారాన్ని ప్రతిఘటించి రచయిత్రిగా నా ఉనికిని బతికించుకోటానికి అదనపు శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా నన్ను గృహ సంబంధిత బాధ్యతల్లో మరింత బాగా పనిచె య్యాలని ఒత్తిడి తెచ్చి, నా సాహిత్య పొరపాట్ల కారణంగా జరిగిన నష్టాన్ని పూరించి ఎలాగో జస్టిఫై చేసుకునేలా చేస్తుంది. కానీ వాస్తవానికి అలాంటి నష్టమేమీ జరగదు.
పనిచేసేచోట, ఇంట్లో అలాంటి శ్రమ, ఒత్తిడి ఏ మనిషి శక్తినైనా భౌతికంగాను, మానసికంగాను హరించివేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రచయిత్రులందరూ, ఎంతో నిరాశాపూరితమైన క్షణాలను, ఒంటరితనాన్ని అనుభవిస్తారని, తమ వాతావరణంలోని అలాంటి నిస్పృహ ను జయించటానికి, తగ్గించుకోటానికి అంతులేని పోరాటాలు చేస్తుంటారని నేను అనుకుంటాను.
మగ రచయితల విషయంలో ఇది పూర్తి భిన్నంగా జరుగుతుంది. ఇలాంటి ఆసక్తులకు కుటుంబంలో, పనిచేసేచోట సమయాన్ని కల్పించటం అనేది ఎంతో భిన్నంగా ఉండి చాలాసార్లు మగవాళ్ళకు మరింత శక్తినిస్తుంది. సామాజిక చైతన్యంతో రాయటమనేది వ్యక్తి తనను తాను నిరూపించుకోవటం. స్త్రీలు వ్యక్తులుగా నిరూపించుకోవటమనేదాన్ని సమాజం సహించదు. కాబట్టి మగవాళ్ళ దారి స్పష్టంగా సుగమం.
నాకు గనక అవకాశం యిస్తే నేను నా ప్రస్తుత జండర్‌కే అంటిపెట్టుకుని ఉంటానని అసలు అనుకోను. స్త్రీగా ఉండ టానికి గర్వపడటమంటే పశ్చిమాన ఉండే నీగ్రో తన నీగ్రిట్యూడ్ గురించి గర్వపడటం లాంటిదే. ఆమె గర్వం నిజమైనదే, వాస్తవమైనదే, సౌందర్యాత్మకమే, చారిత్రకమే, పురాతనమే,రాజకీయంగా కరక్టే. ఐనా ఎంత హీనంగా జీవించారు!!!