జూపాక సుభద్ర
మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,
వదినెలు, అక్కలు, బావలు ”సిన్నా బాగ సదువాలె, కిలాసుల ఫస్టు రావాలె, లేకుంటె బొక్కలిరుగుతయి” అనెటోల్లు.
గీల్లందరు నా మీద చాన స్ట్రిక్టు. ”గా బెస్తోల్ల రజిత ఎట్ల సదువుతది, గా సాకలోల్ల పిల్ల ఎంత మంచిగ వుషారుగుంటద” ని
వాల్లకు నచ్చినోల్ల బుద్దులన్ని నా మీద రుద్దెటోల్లు. ఏంగొనిచ్చినా వాల్లకు యాదొచ్చినపుడు తిరిగి ఆల్లకు మల్ల సపియ్యలె,
వాల్లయితె మంచిగ యింట్లుండి బాగతిని యిష్టమొచ్చినట్లు ఆడుకొని నన్నేవె గీ బడికి బోవాలె, అన్నిట్ల ఫస్టురావాలె అనుడు బాగ
కోపమొచ్చేది. యింకా పండుగలప్పుడు సుట్టాలొచ్చి నప్పుడు అందరు మంచిగ కల్లు తాగుదురు కలిసి. నాక్కొంచెం కల్లు
బొయ్యుండ్రని అక్కను సాటుకడిగినా ‘ఏ..వద్దే కల్లు దాగితే నాలిక దొడ్డయితది సదువు రాదన్నది’. ఒక్కసుక్కగడ
తాగనిచ్చెటోల్లుగాదు ఆల్లే పండుదాటి కల్లని పరుపుదాటి కల్లని మూతులన్ని నాక్కుంట తాగెటోల్లు. దొంగతనంగా తాగుదామన్నా
అక్కసెప్పిన మాట యదికచ్చి నాగ్గూడ మనసిరిగింది.
స్కల్లు మొదలైనప్పుడే నాలుగు స్కూలు యూనిఫాములు, ఒక బ్యాగు పుస్తకాలు, సరిపోయే నోటు పుస్తకాలు, టెక్ట్స్ పుస్తకాలు,
రెండు పెన్నులు, నాలుగు పెన్సిల్లు, రెండు జతల చెప్పులు, మూడు జతల రిబ్బండ్లు యడాదికని లెక్క జెప్పి తెచ్చేది.
‘పంటన్న యడాదికి రెండుసార్లింటికొస్తది’ నా బతుక్కు మాత్రం యడాదికి వొక్కసారే. ఒక్కసారే దిక్కుమొకం లేకుంటగొని పారేసి
మల్లా యడాద్దాక ‘గది లేదు గిది లేదని అడుగొద్దు’. గిదీ మా ఇంట్లోల్లు నాకిచ్చిన సౌలతు.
తెచ్చినప్పుడు చాన సంబుర పడేది. మా క్లాసోల్లు, దోస్తులు కూడా ‘అబ్బా వొక్కసారే అన్ని కొనిబెడ్తరు మీవోల్లు మంచోల్లు
గొప్పోల్ల’ ని మొకాలు పెద్దగ జేసెటోల్లు. నేనో పెద్ద పుడింగులాగ పొంగిపోయేది. ఒక్కసారి గవన్ని ఒక్కకాడ సూసుడు మంచిగనే
వుండేది. కాని వాటిని యడాదంత దాసుకునుడు, కాపాడుకునుడు వశంగాకపోయేది.
యింట్ల, క్లాసుల దొంగ దొర కొట్టకుంట కాసుకోవాలె. దానికోసం యింట్ల అక్కపిల్లల, అన్నపిల్లల కన్నుబడని జాగల దాసుకునేది.
పెన్ను పెన్సిల్లను గోడ సర్ల, బియ్యం బస్తాలల్ల, దుర్గమ్మ తొట్టెల, బోనం కుండల్ల దాసుకునేది. పాత బట్టలు, సినిగిన
బట్టలతోని మూటగట్టిన మెత్తల్ని యిప్పి అండ్ల కొన్ని అండ్లకొన్ని నోటు పుస్తకాలు పెట్టి మల్లా ఎప్పటాటె కట్టి ముడేస్తుంటిని. యిన్ని
జేసినా గూడ పోతనే వుండేయి.
మెత్తల సీమలున్నయని యిప్పినప్పుడు నోట్సులుంటే అవ్వి తీసి బైటేసుడు, బోనం కుండల్ల దాసుకున్నయి గడ పండుగలప్పుడు బైటేసి
ఏడ బడ్తె ఆడ బెట్టడం వల్ల నోట్సులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు పోయేవి. యిక క్లాసుల కూడ బాగ
దొంగతనాలు జరిగేయి. ఇది వరకు ఒకటిబొయి ఒకటన్న వుండేది ఈసారి ఆర్నెల్ల పరిక్షలకే కొనిచ్చిన మూడు పెన్సిల్లు, రెండు
పెన్నులు పొయినయి.
మైసమ్మ మాయం జేసి నట్టు బోయే నా వస్తువుల్ని ఎట్ల గాపాడుకోవాల్నో తెలువకపోయేది. ఆర్నెల్ల పరిక్షలు యింకా
రెండ్రోజులేవున్నయి. ‘పరీక్ష ఎట్ల రాయాలె ఏంజెయాలె దేవుడా గీ పెన్ను ఎక్కన్నుంచన్న పుట్టియ్యి దేవుడా’ అని బుక్కుల్లల్ల దేవుని
బొమ్మల పేజీల నెమలీకలు పూలు బెట్టి మొక్కుకునేది. పరిక్ష రాయనీకి అందరికి పెన్నులు అవసరమే, ఎవరిత్తరు? ఎవరికన్నా
రెండు పెన్నులుంటె బాగుండు. ఎవరికున్నయని పేరు పేరునా తీసిన. పెన్నుబొయిన సంగతి యింట్ల దెలిస్తె నీ తెలివి తక్కువతోని
బొయినయని, గింత సోయి లేదని కొట్లు, తిట్లు. అవి పడుడు నా వశంగాదు. పోనీ మావోల్లు సద్వు కున్నోల్లు గూడ గాదు.
సద్వితే వీళ్ళ దగ్గెర పెన్నులుండేయి. దొంగ తనంగానైనా కొట్టేద్దును. ఆల్లకు అంత సీను గూడ లేకపాయె…….
ఏంజెయ్యాలె ఎట్ల జెయ్యాలెనని క్లాసుల జనార్దన్, శంకర్, జమున, యదమ్మల దగ్గర రెండ్రెండు పెన్ను లుండంగ చానసార్లు
జూసిన. మిగతోల్ల దగ్గర ఒక్కొక్క పెన్నే వుండేది.
రవి, జమున, శీను వాల్లిండ్లు శాన దూరం మాయింటికి. యాదమ్మ యిల్లు మా యింటెన్కనే. పొయి అడుగుదాము.
యీమె యియ్యకుంటె వాల్ల దగ్గెరికి పోవచ్చని నిర్ణయించుకొని యింట్ల ‘మా క్లాసామె యదమ్మింటికి పోతన్న’ అని చెప్పి పొయిన.
పొయెవరకు యాదమ్మ గిన్నెలు తోముతంది కూసొని. నన్ను జూసి ‘ఏంది సద్వుడయిందా, నీకేంది నువ్వు క్లాసుల ఫస్టాయె.
నీకు పరీక్షలప్పుడె సద్వాలనేమున్నది’ అన్నది పీసుతోని బడిద్దీసుకుంట. వాల్లమ్మ యింట్లున్నది నేనటిటు చూసి యదమ్మ దగ్గరికి
బొయి వట్టిగనే కాల్లమీన కూసున్న. గిన్నెల్ని దగ్గెరికి జరుపబొయిన, యింకా ఆమెను మెహర్బాని సెయ్యనీకి. ‘వద్దు మామ్మ
జూస్తె గిన్నెలు ముట్టుడైనయని మల్లా తోమ్మంటది. దూరమే కూచో’ అన్నది. క్లాసుల నేనెట్ల చెప్తె అట్ల వినే యాదమ్మ, బైట
నేను కొరికిన రేక్కాయ తినే యాదమ్మ, వాల్లింటికాడ నన్ను దూరముండనుడు నచ్చలేదు. అయినా ‘నువ్వెట్ల సదువుతున్నవ్
అన్ని నేర్సుకున్నవా’ అన్న మామూలుగ.
”నాకు సద్వుడే అయితలేదు సుట్టాలచ్చి పనెక్కువైంది యింకా వూడ్సుడు, తోముడు, కడుగుడు, అలుకు పూతలు గింత
తీర్తలేదు యింట్ల” అన్నది యాదమ్మ…
యాదమ్మవాల్ల నాయిన సద్వుకున్నడు సింగరేనిల మీది పనే చేస్తడు, జేబుకు పెన్నువెట్టుకోని తిరుగుతడు. ఆమెకు యిద్దరన్నలు
పదో తరగతి ఇంటరు సదువుతుండ్రు. వాల్లు సదివిన, రాసిన నోట్సులు, పెన్నులు, బుక్కులు అన్ని యాదమ్మకే.
నాక్కూడ అట్లుంటే పెద్దవాల్లుంటే బాగుండనుకునేది. యాదమ్మకు ఈ పనిపాటలే యిష్టం. సదువు పెద్దగ పట్టించుకొనేది గాదు.
ఒక్కతే బిడ్డని పావురం. ‘ఏదో పేపరు తెల్సేవరకన్న సదివితే సాలు, ఆడిపిల్లకు సదువెందుకు పనిమంతురాలు కావాలె. రేపు
ఎవనికన్న యిత్తె ‘మీ అమ్మ నీకేంపని నేర్పిందే’ అని నన్ను దిడ్తరు’ అని వాల్లమ్మ అమ్మలక్కలతోని అంటుంటది.
యిట్లాంటియన్ని యిని యాదమ్మ ఏదో టైంపాస్‌కన్నట్లు క్లాసుకొచ్చేది. చాన డాబు గొచ్చేది. సేతులనిండ గాజులు, తలనిండ
పూలు, మెడగ్గొలుసు, కాల్లకు పట్టగొలుసులు మంచి బట్టలేసుకొని వచ్చేది. బ్యాగునిండ పుస్తకాలు, ఒక బాక్సునిండ
పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు నింపుకొని వచ్చేది. అవన్ని జూసి మాసారు ‘బ్యాగునిండా పుస్తకాలు, బాక్సునిండా పెన్నులు
గాదు తలనిండా అక్షరాలుండాలె’ అనెటోడు. మొత్తానికి క్లాసంతా యాదమ్మను ‘సుద్దమొద్దు’ అని సాటుకు అనుకునెటోల్లు.
కాని యాదమ్మకు రాసిన నోట్సు యిచ్చి ఆడిపిచ్చుకునేది క్లాసుల నేనొక్కదాన్నే.
ఆ స్నేహంతోనె మెల్లగ ‘యాదవ్మ నా పెన్నులు పొయినయెయ్…’ అన్న మొకం దీనంగ బెట్టి…
‘పొయినయ పోతేంజేస్తవ్ కొనుక్కో ఎల్లుండినుంచే గద పరీక్షలు’ అన్నది కడిగిన గిన్నెలు తీస్కుంట…
‘పొయినయని చెప్తె యింట్ల కొడ్తరు గద యాదమ్మ నీకు తెల్సు గద మా అన్నలెట్లాంటోల్లో’…
‘మరేంజేస్తవు’ యాదమ్మ అయెమయంగ….
‘నీ దగ్గర చాన పెన్నులుంటయిగద, నాకొక పెన్నియ్యవా మంచిగ పడేది’ అన్న ఆశగ…
‘నా దగ్గెర మా అన్నలయి, నాయినయి పెన్నులు చాన్నే వున్నయి గనీ అన్ని మంచిగ పడయి’ యాదమ్మ గిన్నెల్ని అరుగుమీద
బోర్లిస్త….
‘రెండుమూడన్నా మంచిగ పడయ’ అన్న అరుగుమీన కుసుంట… ‘పూర్తిగ కాదు పరిక్షలయిపోంగనే యిస్త’ అన్న యింకా
కొంచెం జాలిగ…
‘వుత్తగనే యియ్యల్నా’ యాదమ్మ నా కండ్లల్లకు జూస్త ఏదో ఆశిస్తున్నట్లు…
‘మల్లిస్త గద నీకే’ అన్నాను.. నేను గూడ అట్లనే జూస్తు…
‘రాసినంక యిస్తవు’ ‘రాసేటప్పు డేమిస్తవు’ యాదమ్మంది కండ్లు కిందికేసి…..
‘ఏమియ్యలె పెన్నిచ్చి నా పరిక్షల గండం గట్టెక్కిస్తె ఏమియ్యమన్నా యిస్త’ అన్న…
‘ఏంలేదు పరీక్షరాసేటపుడు నువ్వు రాసేది నాకు సూపియ్యలె’ అన్నది…
‘ఓ దాందేమున్నది పేపరు మొత్తం నీ ముందట బెడ్తతియి’ అని ఒప్పుకున్న.
పెన్ను పొయిన బాదముందు, టెన్ష్‌న్ ముందు, యింట్ల చెప్పుకోలేని మాట ముందు గీ పరీక్ష పేపరు సూపిచ్చుడు ఒక లెక్కా….
అందులో యాదమ్మమా యింటికి రాదు వచ్చినా చెప్పదని గ్యారంటి. నాలాగ అందరిండ్లకు బోదు, వాల్లోల్లు యింట్లకాలు బైట
పెట్టనివ్వరు చలో ఏదయితే అదయింది. పెన్ను దారి దొరికింది. యీడికింతే నేను బంగారు కొండననుకున్న. ‘యిస్తవా
యిప్పుడు’ అడిగిన వెంటనే ఓ దిగులు తీరిందని ఆనందంతోని… యాదమ్మ మొకం గూడా ఏదో దిగులు దించు
కుంటున్నట్టున్నది.
‘మా అమ్మ యింట్లున్నది ఆమె లేనప్పుడు యిస్త’ అని చెప్తే ఏ అనుమానం లేక యింటికి బొయిన.
తెల్లారి వాల్లమ్మ లేందిజూసి పొయి పెన్ను తెచ్చుకున్న.
ఎర్రమూత పెన్ను చాలా బాగుంది మంచిగ పార్తంది పెన్నుపొయినప్పట్నించి బాగ దిగులుండె. యాదమ్మ దయవల్ల యింట్ల పెన్ను
సంగతి తెల్వకుంటయింది.
యింకోటి పరీక్షలు ఎట్ల రాసి గట్టెక్కాలనే టెన్షన్ బొయింది. పరీక్షలైపొయినంక ఏసంగతైన తర్వాత జూడొచ్చు. యిప్పుడైతే గీ ఆపతి
తీరింది. అని హాయిగ ముర్సుకొంటు పరిక్షలకు సదువుకున్న. జవాబులు గూడ మరుపులేకుండా కండ్లల్ల మెరుస్తున్నయి.
మొదటి రోజు తెలుగు. సార్ ఆన్సర్ పేపరు కొచ్చెన్ పేపరిచ్చిండు. నా యెన్క యాదమ్మ కూసున్నది. నా చేతిల పెన్నువైపు
యాదమ్మచూ స్తుంది. నాకర్దమైంది ఆ చూపుకుండే అర్దం. ‘నువ్వు జెప్పినట్టే చేస్త’ అని ఒక్క నవ్వు నవ్విన యాదమ్మను
జూసి.
పెన్ను నాకన్న ముందే వుర్కుతంది తెల్సిన ప్రశ్నలొచ్చినయని అట్లా తెలుగు, ఇంగ్లీషు పరిక్షలు నేను రాసిందంతా ఎక్కించింది
యాదమ్మ.
‘అదృష్టవంతురాలు ఏంజద్వకుంటనే రాసి మార్కులు దెచ్చుకోబోతుంది పెన్ను పుణ్యాన’ అని అనుకున్న ఇంగ్లీషు, హింది
పద్యాలు, ఆన్సర్స్, గ్రామర్ అంతా బట్టి పట్టేది. అంత బట్టి పట్టి ‘ముక్కున వుంచుకున్న నరాలబాద, ఎవరికి చెప్పుకోలేని
సదువు కోత’ చాలా అవస్థనిపించింది. కడుపునిండా తింటె నిద్రొస్తదని కడుపు సంపుకొని కొంచెమే తిని నిద్రగాసి అర్దంగాని దాన్ని
బలవంతంగా మెదట్ల ముండ్లను నాటినట్లు నాటుకునేది. పరిక్షలప్పుడు పీకేసేదానికి.
యింతకష్టపడి సద్వుకొని నేను రాస్తే….. ‘యాదమ్మ మాత్రం సద్వుకోకుంట మంచిగ తిని, నిద్రబొయి నీట్‌గ తయరై బొట్టు బోనం
దిద్దుకొనొచ్చి మొత్తం నా పేపరంత కాపి కొడ్తంది’ అని తిట్టుకున్న. నేను చేసిన లెక్కలన్ని ఎక్కిస్తుంది వెనకనుంచి. నాకు చాలా
జెలసి ఎగదన్ని కోపమొచ్చి రకరకాల సలుపులు శరీరమంత నిండి ‘పెన్ను ఒప్పందం’ మర్సిపొయిన. రాసే పేపరు మీద యింకో
పేపరు పెట్టి రాస్తున్నా…..
‘పేపరు తియి’ మామూలుగన్నది యాదమ్మ నేను పట్టించుకోనట్లుగా నటిస్త రాస్తున్నాను అట్లనే….
‘నా పెన్నియ్యబ్బ’ అంది కొంచెం గట్టిగ…
ఆ మాటకు నా దిమ్మ దిరిగింది ‘పెన్నిస్తే ఏం రాస్తానింక….’ అని అడ్డు పేపరు తీసేసిన అసహాయంగా…
* * *