ఆంధ్రరాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం

మహాత్మ పూలే – పెరియార్‌ – డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ సిద్ధాంత వెలుగులో డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ సిద్ధాంత వెలుగులో భాషా పయ్రుక్త రాష్టాల్ర విభజనను సమర్ధిద్దాం నూతన ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాన్ని ప్రత్యేక గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్ట ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 16.2%/8.6%=24.8(25%) వాటా సాధించి దళిత ఆదివాసీ పల్లెలకు విద్య, వైద్యం, సాగుభూమి, రక్షిత మంచినీరు, నివాసగృహాలు, ఉపాధి, నూతన ఉద్యోగాలు, శిశు మహిళాభివృద్ధి, పౌష్టికాహారం, ఆరోగ్య మరుగుదొడ్లు, కరెంటు, పంట, ఇంధనం, మురికినీటి పారుదల, సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి కొరకు, అంటరానితనం, అత్యాచారాల నిర్మూలనకై కృషి చేద్దాం. నూతన ఆంధ్రరాష్ట్ర బడ్జెట్‌లో బీసీ, ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం సబ్‌ప్లాన్‌ ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేద్దాం. చైతన్యవంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ప్రజలారా (బహుజనులారా)!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చారిత్రాత్మక ఆవిష్కరణలకు పురుడు పోసుకుంటున్నది. సామాజిక, రాజకీయ సమీకరణలు మార బోతున్నాయ్‌. చరిత్రలో ఏ దశలోనైనా ఒక నూతన మార్పు జరిగే సమయంలో సమాజంలో ఘర్షణ, సంఘర్షణ, వాదోప వాదాలు, చర్చలు, ఆవేశకావేషాలు సహజం. విరుద్ధ సామాజికశక్తుల మధ్య యుద్ధం అనివార్యమే. ఆహ్వానించదగినదే. ఇటువంటి సంధియుగాన్నే ”వైభవోజ్వల యుగం – వల్లకాటి అధ్వాన్న శకం; వెల్లివిరిసిన విజ్ఞానం – బ్రహ్మజెముడులా అజ్ఞానం”గా ఒక ప్రఖ్యాత రచయిత అభివర్ణించాడు. ఈ కీలక తరుణంలో డా|| అంబేద్కర్‌ సిద్ధాంత వెలుగులో, వివేకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సమాజాల నుంచి ఎదిగిన బహుజన బుద్ది జీవులుగా శాస్త్రీయ వైఖరిని ప్రదర్శించవలసిన సమయం అసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా, 10 జిల్లాల తెలంగాణ (హైదరాబాద్‌తో కలిపి) రాష్ట్రంగా విభజించేందుకు ఒక రంగం సిద్ధమైంది. విభజన ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం కీలక వివాదంగా మారింది. దానితో పాటు కృష్ణా – గోదావరి నీళ్ళు, ఉద్యోగాలు, రెవెన్యూ ఆదాయల పంపకాల గురించిన చర్చను కొందరు ముందుకు తెస్తున్నారు. అంతేకాక ప్రాంతీయ విద్వేషాల గురించి, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్‌ గురించి ముఖ్యంగా ఉద్యోగులకు ఉద్యోగాలు పోతాయానీ, జీతాలు సక్రమంగా రావనీ, పెన్షనర్లకు పెన్షన్‌ అందబోదనీ… ఉద్వేగపూరిత, ఉద్రిక్తభరిత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భావోద్వేగ ప్రచారం, ఒక అబద్ధాన్ని పలుమార్లు చెబితే అది నిజమైపోతుందన్న మనువాద, హిట్లర్‌, ‘గోబెల్స్‌’ ప్రచారం నేడు 13 జిల్లాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ మొత్తం చర్చలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ప్రజల (బహుజనుల) భవిష్యత్తు, రక్షణ, సంక్షేమం గురించిన అంశాలు పూర్తిగా తెరమరుగైపోతున్నాయి.

భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనపై డా|| అంబేద్కర్‌ ఆలోచనలు

డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ ” భాషాప్రయుక్త రాష్ట్రాలపై ఆలోచనలు” (డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు – ప్రసంగాలు సంపుటం. 1-పేజీలు 180-258 రచనా కాలం 1955 సం||) గ్రంథం ప్రాధాన్యత ఎంతగానో వుంది. దాదాపు 2 లేదా 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం వుంటే పరిపాలనా సౌలభ్యం వుంటుందన్నది డా|| అంబేద్కర్‌ నిశ్చితాభిప్రాయం. ఆ విధంగా ఆలోచిస్తే ఆంధ్ర, తెలంగాణలు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించడం పాలనా సౌకర్యపరంగా ఒక చక్కని చర్య. ఆయన మాటల్లోనే చెప్పాలంటే” ఇలా విభజించ డమన్నది భాషా ప్రయుక్త రాష్ట్రాల మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వుండదు. ఎందుకంటే పై సూచించిన మాదిరిగా రాష్ట్రాలను విభజించినట్లయితే అప్పుడు ఏర్పడే ప్రతి రాష్ట్రమూ, ఒక భాషా ప్రయుక్త రాష్ట్రమే అవుతుంది కాబట్టి”. డా|| అంబేద్కర్‌ ఈ రచన చేసే సమయానికి తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా (హైదరాబాద్‌ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం) వున్నారన్న విషయాన్ని మనం మరువకూడదు.

రాష్ట్ర విభజన-డా||అంబేద్కర్‌ ముఖ్య సూత్రాలు

1. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చేసిన మాదిరిగానే ఒక భాష మాట్లాడే ప్రజలను పలు రాష్ట్రాలుగా విభజించవచ్చు.

2. ఒక భాష మాట్లాడే ప్రజలను ఎన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చు అనేది 1. పాలనా సామర్థ్య అవసరాలు, 2. వివిధ ప్రాంతాల అవసరాలు, 3. వివిధ ప్రాంతాల మనోభావాలు, 4. మెజారిటీ, మైనార్టీ (కుల) ప్రజల మధ్య ఉండే నిష్పత్తి పైన ఆధారపడి వుండాలి.

3. రాష్ట్ర విస్తీర్ణం పెరిగే కొద్ది మెజారిటీ, మైనారిటీ (కులాల) ప్రజల మధ్య వుండే నిష్పత్తి దెబ్బతిని క్షీణదశకు చేరుకుంటుంది. మైనారిటీల (కులాల) పరిస్థితి ఇంకా శూన్యంగా మారుతుంది. మైనారిటీల (కులాల)పై మెజారిటీ దౌర్జన్యాలు చేసేందుకు గల అవకాశాలు బాగా పెరుగుతాయి. అందువల్ల రాష్ట్రాలు చిన్నవిగా వుండాలి.

నూతన ఆంధ్ర రాష్ట్రంలో పెరగనున్న ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధిక్యత – బీసీ, ముస్లింల ప్రాధాన్యత

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యమైన జిల్లాలుగా పరిగణించే ఆరు జిల్లాల్లో (గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు) షెడ్యూల్డు కులాలు 50, 39, 682 జనాభాగా (అరకోటి) వున్నారు. రాయలసీమ 4 జిల్లాల్లో 25, 72,614 (పావు కోటి) షెడ్యూల్డు కులాల జనాభా వుంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 8, 32, 878 మంది ఎస్సీ జనాభా వుంది. మొత్తం దాదాపు 85 లక్షల జనాభా అదే విధంగా ఉత్తరాంధ్ర (3 జిల్లాలు), 6 జిల్లాల తీరాంధ్ర, రాయలసీమలలో 25 లక్షల మంది ఎస్టీ జనాభా వున్నారు. కోటి పది లక్షలుగా ఎస్సీ, ఎస్టీల ఉమ్మడి జనాభా వుంది. మరొక ముఖ్యమైన విషయమేమంటే రాష్ట్రంలోనే ఎస్సీ జనాభాలో మొదట 5 స్థానాలూ వరుసగా గుంటూరు (9, 57, 407), తూర్పు గోదావరి (9, 45, 269) కృష్ణా (8, 71, 063), పశ్చిమ గోదావరి (8, 11, 698), ప్రకాశం (7, 87, 861) ఆక్రమించాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎస్సీల ఆధిక్యత జనాభా రీత్యా ఎంతగానో పెరిగింది.

ఒక్క మాటలో చెప్పాలంటే జనాభాలో 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు మొత్తం జనాభాలో 25 శాతంగా వున్నారు. నూతన ఆంధ్రరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల జనాభా 72%గా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బహుజన జనాభా 80% వరకు ఉండబోతుంది. అన్ని రంగాల్లో ఎస్సీ, బీసీ, ముస్లింలు ఆధిక్య కులాలతో పోటీపడే పరిస్థితి వచ్చే అవకాశం వుంది. దీంతో ఇప్పటి వరకూ పౌరసమాజం లో ఆధిపత్యం కలిగిన కులాలు బెంబేలెత్తి నూతన ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు నానా రకాల దుష్ప్రచారానికి దిగుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అడ్డా హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరాన్ని తమ స్వంత జాగీరుగా, పెట్టుబడుల కేంద్రంగా గుత్తాధిపత్యాన్ని ఇన్నేళ్ళుగా నిరాటంకంగా సాగించుకున్న సమైక్యావాదులు లగడపాటి, రాయపాటి, సుబ్బిరామిరెడ్డిల గురించి సాక్షాత్తూ శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించింది.

రాజధాని నగరం పరిపాలనా కేంద్రంగా కాక వ్యాపార కేంద్రంగా మారింది. ఇందులో ముఖ్యమైన వ్యాపారం రియల్‌ ఎస్టేట్‌. ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో సీమాంధ్ర కుల (కమ్మ, రెడ్డి) పెట్టుబడిదా రులు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని స్థలాలపై, భవన నిర్మాణంపై పెట్టారు. రెండు రాష్ట్రాల విభజన జరిగితే నగర ప్రాధాన్యత తగ్గి తమ వ్యాపారం దెబ్బ తింటుందన్నది వారి హైదరా’బాధ’. అందువల్లే హైదరా బాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధాని (చండీఘఢ్‌ తరహాలో) చేయాలని, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, డా|| అంబేద్కర్‌ చెప్పినట్లు దేశానికి రెండో రాజధాని చేయాల ని వింత వింత గందరగోళవాదనలను ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ వాదన అర్ధం లేనిది. చండీఘఢ్‌ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి పాలనా సౌకర్యం కుదిరింది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటుచూసినా కనీసం 200 కి.మీ. తెలంగాణలో ప్రయాణిస్తే కానీ ‘ఉమ్మడి’ రాజధాని చేరుకోలేరు. (కేవలం డబ్బున్న కుల పెట్టుబడిదారులు మాత్రమే అతి వేగంగా ఆకాశ మార్గంలో ‘ఉమ్మడి’ రాజధాని చేరతారు). చుట్టూ ‘తెలంగాణ’ రాష్ట్రం వున్న ‘ఉమ్మడి’ రాజధానిని, తన నీటి, విద్యుత్‌ అవసరాల కోసం ఎప్పుడూ ‘తెలంగాణ’పైనే ఆధారపడే ‘ఉమ్మడి’ రాజధానిని కేవలం తెలివితక్కువ వాళ్ళు మాత్రమే కోరతారు. కేవలం రియల్‌ ఎస్టేట్‌ మాఫియా మాత్రమే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలని డా|| అంబేద్కర్‌ అన్నట్లు కూడా వీరు చెబుతున్నారు. ఉత్తరాది – దక్షణాది ఉద్రిక్తతని తొలగించేందుకు ఆ ప్రతిపాదన డా|| అంబేద్కర్‌ చేశారు. డా|| అంబేద్కర్‌ ఆ ప్రతిపాదన చేసిన సమయంలో తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా (హైదరాబాద్‌, ఆంధ్ర) వున్నారన్న విషయం మనకందరికీ తెలుసు. డా|| అంబేద్కర్‌ ఏ సందర్భంలో అన్నారో, ఆ సందర్భాన్ని మరుగుపరచి వక్రీకరిస్తున్నారు డా|| అంబేద్కర్‌ వ్యతిరేకులు.

10 సంవత్సరాలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా వుండే పక్షంలో అక్కడి ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఉద్యోగులు తమ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చక్కగా పనిచేయవచ్చు. రిటైర్‌ కావచ్చు. ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు లేదా ప్రజలకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో వివక్ష ఎదురౌతుందనే ఒక వింత వాదన కూడా రియల్‌ ఎస్టేట్‌ మాఫియా ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ తమ పెట్టుబడితోనే అభివృద్ధి చెందిందని ఈ మాఫియా ప్రచారం చేస్తోంది.

ఇటువంటి వాదనకు కూడా డా|| అంబేద్కర్‌ తన రచనలో తగిన సమాధానం చెప్పారు. గుజరాతీ వ్యాపారస్తులు బొంబాయి నగరాన్ని తామే పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేశామని అందువల్ల బొంబాయి నగరం గుజరాత్‌ రాష్ట్రానికే చెందాలనీ, మహారాష్ట్రకు చెందకూడదనీ వాదించినపుడు డా|| అంబేద్కర్‌ ఇలా సమాధానమిచ్చారు ”బొంబాయిని మహారాష్ట్రలో కలపాలా, వద్దా అన్న సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి బొంబాయిలో వాణిజ్యాన్ని, పరిశ్రమలను నిర్మించిదెవరన్న అంశానికి ఎటువంటి సంబంధమూ లేదు. వాణిజ్యం పైనా, పరిశ్ర మలపైనా గల గుత్తాధిపత్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని చేస్తున్న వాదన నిజంగా రాజకీయవాదనే. యజమానులే కార్మికులను పాలించాలి కానీ కార్మికులు యజమానులను పాలించడానికి అనుమతించకూడదనేదే ఆ వాదన అర్ధం. ఈ వాదన చేస్తున్న వారికి తాము దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నదీ తెలుస్తున్నట్లు లేదు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేసామని చెబుతున్న కుల పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా డా|| అంబేద్కర్‌ వ్యాఖ్యానిం చినట్టు ”వ్యాపా రులే కానీ పారిశ్రామిక వేత్తలు కారు”.

ఇక నదీజలాల పంపిణీ, హైదరాబాద్‌లో ఆంధ్ర, రాయలసీమ ప్రజల రక్షణ వంటి అంశాలు. ఈ విషయాలపై కూడా డా|| అంబేద్కర్‌ చాలా స్పష్టంగానే విశ్లేషణ చేశారు. ”మెజారిటీ వర్గాలు, మైనారిటీల పట్ల విపక్షత చూపే అవకాశాలున్నాయనే అంశాన్ని భారత రాజ్యాంగం గుర్తించింది. దానిని నిరోధించ డానికి గాను తగినన్ని నిబంధనలను రూపొందించింది. ప్రాథమిక హక్కులు న్నాయి. విపక్ష చూపడాన్ని నిరోధించే నిబంధనలున్నాయి. నష్ట పరిహార చెల్లింపుకు నిబంధనలున్నాయి. వ్యక్తుల నుండి కాని, ప్రభుత్వాల నుండి కాని ఏ పౌరుడికీ ఎటువంటి హాని అన్యాయమూ, వేధింపూ లేకుండా నిరోధించడానికి గాను ప్రత్యేక రిట్‌లు జారీ చేయగల హైకోర్టులు న్నాయి. వివక్షతావకాశాల నిరోధానికి బొంబాయికి చెందిన గుజరాతీ పారిశ్రామికవేత్తలూ, వ్యాపారస్తులూ ఇంతకు మించి ఏమి రక్షణ లు కావాలని కోరుతున్నారు?”. వివక్షత నిర్మూలించేందుకు, జల వివాదాలు పరిష్క రించేందుకు సుప్రీంకోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లు, అప్పీళ్లు వున్నప్పుడు అవసరమైన ఊహాగాన రాద్దాంతాలు ఎందుకు? ఆంధ్ర, రాయలసీమ కులపెట్టుబడిదారులు లేవనెత్తు తున్న అపోహాలకు పై సందర్భంలో డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ చెప్పిన సమాధానాలు సరిపోతాయి.

రాష్ట్ర విభజనతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నీళ్ళు రావని, సహారా ఏడారిగా మారబోతుందని, విద్యుత్‌ లభించదని చిమ్మ చీకటిలో మగ్గాల్సిందేనని సమైక్యాంధ్ర వాదులు పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజన రాజ్యాంగ ప్రక్రియ. ఏ ఒక్కటి ప్రైవేటు వ్యాపారం కాదు. ఈ దేశంలో పౌరుల, ప్రాంతాల రక్షణ కోసం డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలులో వున్నది. రూల్‌ ఆఫ్‌ లా, కన్వెన్షన్స్‌, అంతర్రాష్ట జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్స్‌… తదితర రాజ్యాంగ బద్ధ, చట్టబద్ధ రక్షణ వ్యవస్థల సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సమైక్యాంధ్ర వాదులు ప్రచారం చేసే అపోహలు, భయాలకు తావేలేదు. వారి వారి స్వార్థ ప్రయోజనాలు తప్ప, కేవలం అతి కొద్ది మంది కుల పెట్టుబడిదారుల అభద్రతని, బాధని ప్రపంచ బాధగా మార్చే సమై క్యాంధ్రుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఒక వైపు రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ నుంచి నీళ్ళు, విద్యుచ్ఛక్తి రావని వాదిస్తూ మరోవైపు హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే అభ్యంతరం లేదని సమైక్యాంధ్ర వాదులు అసంబద్ధంగా వాదిస్తున్నారు. వీరి బాధ అంతా హైదరా’బాధ’ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తప్ప నీళ్ళు విద్యుచ్ఛక్తి కాదని వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు.

ఆంధ్రరాష్ట్ర వనరులను స్వాహా చేసిన కుల పెట్టుబడిదారులు

ఆంధ్ర రాష్ట్రం అనేక సహజవనరులు కలిగిన ప్రాంతం. రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాలు అపారమైన ఖనిజ వనరులకు పెట్టింది పేరు. ప్రకాశం జిల్లా గ్రానైట్‌, పల్నాడు సున్నపురాయి ఇలా మెట్ట ప్రాంతంలో అనేక ఖనిజవనరులున్నాయి. 972 కి.మీ. తీరాంధ్ర ప్రాంతం దేశంలోనే రెండో అతి పెద్ద సముద్రతీర ప్రాంతం కలిగి నది. సంవత్సరానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన మత్స్య వ్యాపారం మన ప్రత్యేకత. కృష్ణా-గోదావరి బేసిన్‌లో మొత్తం దేశానికే 100 సంవత్సరాలు సరిపోయే సహజ వాయు (గ్యాస్‌) వనరులున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో (ఉత్తరాంధ్ర) ఆదివాసులు నివసించే ప్రాంతాల్లో అతి విలువైన బాక్సైట్‌, ఇతర ఖనిజ నిక్షేపాలున్నాయి. నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్న 55% ఆటవీ ప్రాంతంలో (ముఖ్యంగా నల్లమల) అత్యంత విలువైన ఔషధ, ఖనిజ వనరులున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధానమైన రేవులున్నాయి. ఇవిగాక ఐటి, బయోఫార్మా, టెక్స్‌టైల్స్‌, లెదర్‌, గోల్డ్‌, మాంసం… తదితర వ్యాపార, వాణిజ్య అంశాల్లో దేశీయ, విదేశీయ మారక ద్రవ్యం సాధించగలిగిన సత్తా పెంపొందించుకునే అత్యద్భుత సహజ వనరులు, మానవ వనరులున్నాయి. లెదర్‌, టెక్స్‌టైల్‌, గోల్డ్‌ ఆర్నమెంట్‌, మత్స్య రంగం, పాలు – మాంస రంగం… తదితర ఎస్సీ, బీసీ కుల వృత్తి రంగాలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ సాధించగలిగిన రంగాలు అయితే ”అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని”. మన వనరులన్నీ కుల పెట్టుబడిదారుల ‘ప్రైవేటు’ హస్తాల్లో ఇరుక్కుపోయాయి. రాయలసీమలోని అనంతపురం, కడప కర్నూల్‌ జిల్లాల్లో ఇనుప ఖనిజం, సున్నపు రాయి గనులు, బెరైటీస్‌… వంటి ఖనిజవనరులన్నీ రెడ్డి పెట్టుబడి దారులు దోచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర రాష్ట్రంలోని ఖనిజవనరులన్ని కమ్మ, రెడ్డి రాజ్యాలు ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేశాయి. ఈ ప్రైవేటీకరణ కోసం ఉత్తరాంధ్ర లోని ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తున్నారు. జిందాల్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ఖనిజాలను దోచుకుపోతున్నాయి. ఇక కృష్ణ, గోదావరి బేసిన్‌లోని చమురు సహజ వాయువు సంపదను రిలయన్స్‌ కంపెనీకి కమ్మ, రెడ్డి రాజ్యాలు ధారాదత్తం చేసాయి. అక్కడ లభ్యమౌతున్న సహజ వాయువు దాదాపు 100 సంవత్సరాల పాటు మొత్తం దేశ గ్యాస్‌ అవసరాలు తీర్చగలిగిన సత్తా కలిగిన వనరు. పెట్రో, కోస్టల్‌ కారిడర్‌, వాన్‌పిక్‌, పోర్టుల పేరుతో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు గల సముద్ర తీరప్రాంత వ్యవసాయ భూముల న్నింటిని అగ్రకులాలు ఆక్రమించుకున్నాయి. ఈ భూములన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యవసాయ భూములు, అసైన్డ్‌ భూములు. పర్యవసానంగా కోస్తా తీర ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, వృత్తి కులాలుగా వున్న మత్య్స కార్మికులు, యాదవ, గౌడ, చేనేత కులాలు… తదితర బహుజన కులాలు నిర్వాసితులుగా, నిరాశ్రయులుగా జీవించే హక్కును కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలాయి. ఇలా ఆంధ్ర ప్రాంత సహజ వనరులన్నీ దోచుకున్న ఘన చరిత్ర ”సమైక్యాంధ్ర” కమ్మ, రెడ్డి కుల పెట్టుబడిదారులదే.

నూతన రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

1. నలభై రెండు డిపార్ట్‌మెంట్‌లతో కూడిన సచివాలయం, హైకోర్టు, హైకోర్టు బెంచ్‌లు, ట్రిబ్యునల్స్‌ ఆదనంగా అనేక వందల కోర్టుల ద్వారా వేలాది నూతన ఉద్యోగాల సృష్టి.

2. పదమూడు జిల్లాలను 50 జిల్లాలుగా, సుమారు 600 మండలాలను దాదాపు రెట్టింపుగా 1200 మండలాలుగా, ఎస్సీ, ఎస్టీ అవాస ప్రాంతాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ఏర్పరచడం ద్వారా ఏర్పడే దాదాపు 25 వేల గ్రామాలలో నూతనంగా ఏర్పడే పంచాయితీ ఆఫీసు, ఎండివో, ఎమ్మార్వో, ఆర్టీవో కలెక్టర్‌ ఆఫీసుల ద్వారా మొత్తం లక్ష ఉద్యోగాలను నూతన రాష్ట్రంలో సృష్టించడమే కాక పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లే అవకాశం.

3. నూతన రాష్ట్ర పునర్నిర్మాణ క్రమంలో ఏర్పాటయ్యే కట్టడాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు.

4. నూతనంగా వచ్చే లక్ష రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం యువతకు ఉద్యోగాల్లో వాటా.

5. నూతనంగా ఏర్పడే దాదాపు పదివేల నూతన ఎస్సీ, ఎస్టీ గ్రామపంచాయితీలలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం వచ్చే 25 శాతం ధనాన్ని ఖర్చు పెట్టి విద్య, వైద్యం, భూమి వంటి ముఖ్యమైన 22 మౌలిక సౌకర్యాలను మానవాభివృద్ధి సూచకలో అట్టడుగున వున్న ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అందించడం. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రామ పంచాయితీల ఏర్పాటుతో దాదాపు 50 వేల మంది నూతన ఎస్సీ, ఎస్టీ గ్రామీణ నాయకత్వం (వార్డు మెంబర్‌ నుంచి సర్పంచ్‌ వరకు) పుట్టుక.

6. భూమి లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వ్యవసాయ కూలీ కుటుంబాలకు కుటుంబానికి 5 ఎకరాల సాగు భూమి.

నూతన రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ప్రజలకు (బహుజనులకు) సామాజిక – ఆర్ధిక రంగాలలో ఒక పెనుమార్పు కల్గించే అవకాశాలు ఎంతో హెచ్చుగా వున్నాయి. అందుకే కుల పెట్టుబడిదారీ మాఫీయా ఈ సామాజిక పరివర్తనా క్రమాన్ని ”సమైక్యాంధ్ర” పేరుతో అడ్డుకునే కుట్రలు పన్నుతోంది. ఈ కుట్రను తెలుసుకుని విద్యార్థులు, మేధావులు, ఉద్యో గులు, రచయితలు, కవులు, కళాకారులు యావత్‌ బహుజన సమాజం మహాత్మ పూలే, పెరియార్‌, డా|| అంబేద్కర్‌ సమతా సిద్ధాంత స్ఫూర్తితో – నూతన రాష్ట్ర నిర్మాణ ఫలాలలో సమస్త జీవన రంగాలలో సరియైన వాటాకై ఉద్యమిద్దాం…

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.