యీ ఆధునిక కాలంలో ప్రచార సాధనాలుగా ‘సినిమాలు’ ఎంతో బలీయ మైన శక్తిగా ఎదిగి – నేటి బాల బాలికలపై, యువతపై ఎంతో ప్రభావాన్ని కలుగ జేస్తున్నాయి.
ఎక్కువ శాతం కళాసేవ పేరుతో, ధనార్జనే పరమావధిగా ప్రేమే ప్రధానాంశంగా – జగమంత ప్రేమ తప్ప మరొక అంశం లేదన్నట్లు వస్తున్న నేటి సినిమాలు మన దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. ప్రేమ, హింస, శృంగారాలకే పెద్ద పీట వేసి ప్రాధాన్యత కల్పిస్తున్న సినిమాల్లో ముక్కు పచ్చలారని బాలబాలికలు, యువతీ యువకులు తమ విలువైన విద్యాకాలాన్ని, భవిష్యత్ ప్రణాళికను వదిలి తప్పుదారి పడుతున్నారు. ప్రేమే జీవిత ధ్యేయంగా కనిపెంచిన తల్లిదండ్రులను, కుటుంబాన్ని, బాధ్యతలను విస్మరించి, విలువైన విద్యను వదిలి, ఏ విధమైన ఆర్ధిక స్వావలంబన లేకుండా ప్రేమ వివాహాల పట్ల పరుగులు తీస్తున్నారు.
ప్రేమ, వివాహం- ఇవే జీవితం కాదు, జీవితంలో అవి భాగాలు మాత్రమే. మన దేశం ఎంతో విశాలమైంది. ఈ దేశంలో అనేక మతాలు, భాషలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయలున్నవి. భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది.
మన నేటి సినిమాలలో విద్యాలయ లను, ఉపాధ్యాయులను ఎంతో చౌకబారుగా చిత్రీకరించి చూపిస్తున్నారు. తల్లిదండ్రులు, పెద్దల పట్ల హీరోలచేత యితర నటీనటుల చేత ఎంత చెత్త డైలాగులు చెప్పిస్తున్నారో, అగౌరవ ప్రధానంగా చూపిస్తున్నారో నిత్యం మనం గమనిస్తూనే వున్నాం.
యిటీవల ఒక ప్రముఖ హీరో కుమార్తె ప్రేమ పేరుతో యిల్లు వదిలి తల్లిదండ్రులకు తెలియకుండా కులాంతర వివాహం చేసుకున్న తీరుపట్ల సదరు కుటుంబీకులతో పాటు, అభిమానులను కంట తడి పెట్టించింది. నూటికి నూరు శాతం నేటి ప్రేమ సినిమా ఫలితమే సదరు హీరో గారి కుమార్తె ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం. మరి ఆ హీరో గారు నటించిన సినిమాలు, హీరోగారి బావగారు తీసిన సినిమాల్లో…. ప్రేమ, పెళ్ళి.. పెద్దల నెదిరించి ఒక తొట్టి గ్యాంగు స్నేహితులతో వివాహం జరిపించడం చూపించలేదా? అభిమానులంతా సదరు సినిమాలను విజయవంతం చేయలేదా?
ఒక మోటార్ బైకు, చేతిలో సెల్ వుంటే చాలు… అంతా హీరోలే. కని, పెంచి, పెద్దచేసి.. .. వేలు, లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రుల కంటే యీ స్నేహితులు అనబడే తొట్టిగ్యాంగు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ, వేధిస్తూ, చివరకు ప్రేమగా మలచి, పెద్దల నెదిరించి వివాహం జరిపించడం.. శుభం కార్డు చూపడం, ఇంతకు మించి నేటి సినిమాలు ఏం తెలియజేస్తున్నాయి.
ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు మాత్రమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయ? సమాజ వికాసానికి అవరోధాగాలుగా ఎన్నో రుగ్మతలు … నిరక్షరాస్యత, అస్పృశ్యత, అవినీతి, వరకట్నం, లంచగొండితనం, పురుషాధి పత్యం, సోమరితనం, పేదరికం, మధ్య పానం, వ్యభిచారం, ఎన్నో అంశాలు కారణాలు. యీ సమస్యల కారణంగా సంఘ జీవన సౌందర్యం అంతరిస్త, మానవ సహజ జీవనం అస్తవ్యస్తంగా తయరైంది. యిన్ని రుగ్మతలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రేమే జీవితంగా సినిమాల్లో చొప్పించడం ఎంత వరకు సమంజసం?
తమ పిల్లల భవిష్యత్‌కై విలువైన విద్య నందింపజేస్త వేలు, లక్షలు ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు వారికి తగిన వదూవరులను ఎంచలేరా? తమ బిడ్డల ఆనందం తమదిగా భావించలేరా? ఎందుకీ అభద్రతా భావం? విద్యను, మధ్యలోనే వదిలి, ఎటువంటి ఆర్ధిక స్వావలంబన లేకుండా, ఉజ్వల భవిష్యత్ కాలదన్నుకుంట, జీవితానికి ఓ లక్ష్యం, ధ్యేయం… ఇవేవి కాదంటూ ప్రేమ పెళ్ళిళ్ళ పేరిట పరుగులు తీస్తున్న యువతీ యువకులపై మన సినిమాల ప్రభావం కాక మరేంటి? ఆకర్షణ ముసుగులో ప్రేమ పేరు పెట్టుకొని తమని తాము మోసం చేసుకుంటూ తమ తల్లిదండ్రులకు ఎంతటి మన:క్షోభ కలుగ జేస్తున్నారో ఒకసారి ఆలోచించి చూడాలీ యువత. యీ సినిమాల నాదరిస్తున్న అభిమానులు ఆ సినీహీరో గారి యింట జరిగిన ప్రేమ పెళ్ళి, మిడిమిడి జ్ఞానంతో సదరు అమ్మాయి ప్రవర్తించిన తీరు జీర్ణించుకోలేక పోతున్నారు… అవునా? ఇది ఏయింట జరిగినా, తల్లిదండ్రుల క్షోభ యిలాగే వుంటుంది. వెలికి రాని వెతలు ఎన్నో … ఎన్నెన్నో… ఆరోగ్యపరంగా, ఆర్ధికపరంగా క్షోభించిన, క్షోభిస్తున్న కుటుంబాలెన్నో… తర్వాత సంతతి వారికి వివాహం జరగడం ఎంత కష్టం.ప్రపంచం ఎంతో విశాలమైంది. అందరికీ జీవించే హక్కు వుంది. ఇతరుల జీవితాలపై, కుటుంబాలపై మరొకరి ఆధిపత్యం, అలజడి కలిగించే విధంగా జీవితాల్ని అస్తవ్యస్తం చేసే హక్కు ఎవరిచ్చారీ స్నేహ బృందానికి…
మంచిని తెలుపునది, మేలు చేయునది వినోదాన్ని, విజ్ఞానాన్ని తెలియజేసే విధంగా సినిమాలుండాలి తప్ప ప్రేమే పరమాధిగా ప్రేమ, ప్రేమ… జగమంతా ప్రేమ మయంగా సినిమాలొద్దు.. యికనైనా దర్శక నిర్మాతలు, నటీనటులు ఆలోచించండి… కర్తవ్య బోధనలో యువతను, సమాజాన్ని ప్రక్షాళనం చేసే సినివలు తీయమని బాధాతర్పిత హృదయంతో.
ఓ ఒంటరి తల్లి