పి. అనురాధ
మహిళా సాధికారత అంటే అన్ని రకాలైన హక్కులను పూర్తిగా అనుభవిస్తూ అన్ని రంగాలలో పురోగమించడం.
అంటే స్త్రీలు తమకు నచ్చిన రీతిలో గడుపుత కుటుంబంలో, సమాజంలో ఆర్థికంగా, సాంస్కృతిగా, రాజకీయంగా విద్య, వృత్తి, వైద్యం వంటి అన్ని రంగాలలో సమాన గౌరవమైన హోదాను అనుభవిస్తూ స్వయంసమృద్ధిని సాధించడం.
కుటుంబం అనేది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి, వ్యక్తులకు ధైర్యాన్నిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలతో వ్యక్తి యొక్క అభివృద్ధికి తోడ్పడే వ్యవస్థ. అలాంటి కుటుంబమే స్త్రీల పట్ల చాలా వివక్షతతో వారిని హింసకు గురిచేస్తుంది. కేవలం స్త్రీ అన్న అంశంతోనే ఆమెకు చెందవలసిన అన్ని హక్కులను ఆమె అనుభవించకుండా అణచివేస్తూ అడుగడుగునా ఆమెను హింసకు గురిచేస్తుంది కుటుంబం. కుటుంబంలో స్త్రీలపై జరిగే హింస ఆమె కడుపులో ఉన్నప్పటినుండి కాటికి పోయేవరకు కొనసాగుతనే ఉంటుంది.
కుటుంబంలో జరిగే హింసను అందునా స్త్రీలపై జరిగే హింసను ఎవరూ గుర్తించడం లేదు. సరికదా సాంప్రదాయం, సంస్కృతి, మతం, సమాజం ఇవన్నీ దాన్ని సమర్ధిస్తున్నాయి. అంతేగాక అది పూర్తిగా వ్యక్తిగతమని ఒక కుటుంబానికి సంబంధించినదే తప్ప సమాజానికి ఎటువంటి సంబంధం లేనిదానిగా వ్యవహరించడం వల్ల స్త్రీలు తమపై జరిగే హింసను బయటికి చెప్పుకునే అవకాశమే వారికి కలగడంలేదు. తమ శరీరానికి, తమ మనసుకి, తమ వ్యక్తిత్వానికి తగిలిన గాయలను, బాధలను అనుభవించలేక, బయటికి చెప్పుకోలేక జనాభాలో సగమైన స్త్రీలు నిరంతరం నలిగిపోతనే ఉన్నారు. తీవ్ర మానసిక వేదనతో, ఆరోగ్య సమస్యలతో, శారీరక ఇబ్బందులతో ఆర్థికంగా పూర్తి పేదరికంతో మగ్గిపోతున్న స్త్రీలు సాధికారత దిశగా ఎలా సాగిపోగలరు?
వ్యక్తులు సాధికారత దిశగా సాగిపోవాలంటే వారు అన్ని విషయాల లోన పూర్తి స్వేచ్ఛను అనుభవించాలి, స్వంతంగా నిర్ణయలు తీసుకోగలగాలి. వాటిని అమలుపరిచే అవకాశం ఉండాలి. కుటుంబంలో నిరంతరం జరిగే హింస ఆడపిల్లలను, స్త్రీలను అన్ని కోణాలనుండి, అన్ని వైపులనుండి పూర్తిగా అణచివేస్తుంది. వారి మానసిక పరిపక్వతను, ఆరోగ్యాన్ని అన్నింటిని పూర్తిగా నాశనం చేస్తుంది. దానివల్ల స్త్రీలు అన్ని రంగాల్లోను వెనుకబడి ఉన్నారు.
కుటుంబం అనేది పూర్తిగా వ్యక్తిగత మని, దాని గురించి మాట్లాడడం, చర్చించ డం అనేది తమను తాము కించపరచు కోవడమే అని స్త్రీలకు వారు పుట్టకముందు నుండే నరిపోయడం వల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి తేడాలు లేకుండా అన్ని స్థాయిల, అన్ని వర్గాల స్త్రీలు ఎంత కుమిలిపోతున్నప్పటికి కుటుంబహింస గురించి మాట్లాడాలంటే వారి గొంతులు మూగబోతున్నాయి.
స్త్రీలు సమాజంలో సగభాగమని, ఒక భాగం అభివృద్ధి చెందక వెనుకబడి ఉంటే ఆ సమాజం ఆరోగ్యంగా అభివృద్ధి చెందదని, ఒకవేళ అభివృద్ధి చెందినా అది అసంపూర్ణంగా ఎదిగిన ఫలంతో సమాన మని గుర్తించాలి. స్త్రీలకూ హక్కులున్నాయనీ, వాటిని అనుభవించే అధికారమూ ఉన్నదని అదే సాధికారతకు మార్గమని, ఆ దిశగా పయనించాలంటే కుటుంబంలో స్త్రీలు అన్ని హక్కులు అనుభవించాలి. అందుకు కుటుంబం నుంచీ పనిచేయలి. అలా పనిచేయలంటే, కుటుంబహింసను గురించి మాట్లాడాలి. ఇది ఎవరికీ వ్యక్తిగతం కాదు. సమాజం మొత్తం ఇందులో భాగమని వ్యక్తి అంటే సమాజంలో భాగమని అందుకే కుటుంబంలో వ్యవహారాలన్నీ సమాజానికి సంబంధించినవే అని అర్థం చేసుకోవాలి.
ఈ కుటుంబంలో స్త్రీలపై జరిగే హింస వల్ల స్త్రీలు ఎంత నష్టపోతున్నారో తెలుసు కోవాలి అంటే అసలు కుటుంబహింస ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ కుటుంబ హింస అనేది అనాదికాలంగా ఒక పద్ధతి ప్రకారంగా స్త్రీలను అణచివేసే సాధనంగా ఉపయెగిస్తున్నారు. ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్’ వారి జాతీయ ఆరోగ్య సర్వే కింద డిసెంబరు 2001న దేశవ్యాప్తంగా 90,000 మంది స్త్రీలతో నిర్వహించిన బేస్‌లైన్ సర్వేలో గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అని భేదం లేకుండా దాదాపు 60 శాతం అన్ని మార్గాలకు చెందిన స్త్రీలు భర్తలు భార్యల్ని కొట్టడం తప్పులేదు అని చెప్పారు. అసలు భర్తలు భార్యల్ని ఎందుకు కొడతారో కారణాలు చూస్తే ముఖ్యంగా భార్య ఇంటిని నిర్లక్ష్యం చేసిందనో, ముందుగా భర్త లేదా ఇంట్లో పెద్దవారి అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్లిందనో, అత్తమామలకు మర్యాద ఇవ్వకపోతేనో, నమ్మకంగా లేకపోతేనో, సరిగ్గా వంట చేయకపోతేనో, డబ్బులు మరియు ఇతర వ్యవహారాల గురించి మాట్లాడిందనో, ఆడపిల్లల్ని అయితే మగపిల్లలతో కలిసి ఆడుకుందనో, గట్టిగా పెద్దగా నవ్విందనో, మాట్లాడిందనో కొడుత, తిడుత ఉంటారు. ఇలా చిన్నచిన్న మాటలతో అవమానపరచడం, వ్యక్తిత్వాన్ని చులకన చేయడం, ఆర్థికంగా వారిని నిస్సహాయుల్ని చేయడం, ప్రతీ చిన్న విషయనికి స్త్రీలు, ఆడపిల్లలు ఇంట్లోని మగవారిపై ఆధారపడేలా చేయడం, తారాభాయి షిండే అన్నట్లు ”స్త్రీలు ఇళ్ళు దాటిపోకూడదు, కనీసం వారి ఆలోచనలు అయినా కుటుంబపరిధిని దాటిపోకూడదు. స్త్రీలు, ఆడపిల్లలు అదే నిజమని, తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని, తమ స్థానం ఇదే కాబోలు అని భావించేలా చేయడం” కుటుంబహింస యొక్క ప్రధాన లక్షణం మరియు లక్ష్యం.
ఇలాంటి భావనలతో స్త్రీలు తమను తాము తక్కువ అంచనా వేసుకుని ఆత్మన్యనతా భావంతో, అభద్రతా భావంతో సమాజంలో ముందుకు అడుగువేయలేక వారు నిజంగానే అసమర్ధులమేమో, ఎందుకూ పనికిరాని వారిమేమో అనుకుంట మరింత వెనుక బడి పోతున్నారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నించి ముందడుగు వేస్తే వారి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన అని, కుటుంబాన్ని ధిక్కరిస్త కుటుంబం పరువు ధిక్కరిస్తున్నారని ఎన్ని రకాలుగా వారిని అణచివేయలో అన్ని రకాలుగా అణచివేస్తున్నారు. దీనివల్ల స్త్రీలతో పాటు పురుషుల ఎంతో నష్టపోతు న్నారు. ఒక ఇంట్లో స్త్రీ రోగిగా, అజ్ఞానిగా, అసమర్ధురాలిగా ముద్రించబడితే, అలా తయరుచేయబడితే ఆ ప్రభావం ఖచ్చితంగా కుటుంబంపై పడుతుంది. కుటుంబంలో పురుషుల భాగమే కాబట్టి ఈ ప్రభావం స్త్రీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, ఎలాంటి నష్టాల్ని కలిగిస్తుందో పురుషులకీ అంతే నష్టం కలిగిస్తుంది. తద్వారా సమాజం మొత్తం మీద ఈ ప్రభావం నష్టం ఉంటుంది.
ఉపయుక్త గ్రంథాలు
1. ఓల్గా – 2004, ”కుటుంబ వ్యవస్థ, మార్క్సిజం – ఫెమినిజం”, స్వేచ్ఛ ప్రచురణలు, హైదరాబాద్.
2. తారాబాయి షిండే – 1882, ”పురుషాహంకారానికి సవాల్”, శ్రీ శివాజి ప్రెస్, పూణే. అనువాదం సి.ఎల్.ఎల్. జయప్రద, హైదరాబాద్ బుక్ ట్రస్ట్.