ఆక్స్‌ఫామ్ ఇండియా ఆర్ధిక సహకారంతో 2006, మార్చి 8న మొదలైన భూమిక హెల్ప్‌లైన్ సమస్యల్లో వున్న ఎన్నో వేలమంది స్త్రీలకు ఆసరా అయ్యింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు హెల్ప్‌లైన్ నిర్విరామంగా మోగుతూనే వుంటుంది. భిన్నమైన సమస్యలు, దుఃఖగాధలు, కన్నీటి ధారలు… కౌన్సిలర్స్ నిరంతరం వింటూనే వుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఠక్కున గుర్తొచ్చేది భూమిక హెల్ప్‌లైన్. ఆపదలో వున్నప్పుడు హెల్ప్‌లైన్ గుర్తుకు వచ్చేలా చెయ్యడానికి ఏడు సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలుపెరుగని కృషి చేసాం. ఆంధ్రదేశంలో మారుమూల గ్రామాలకు కూడా హెల్స్‌లైన్ నెంబర్ చేరవేసాం. తొమ్మిదో తరగతి సోషల్ స్టడీస్ టెక్ట్స్‌బుక్‌లో ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబరు ముద్రించి ”మీకు ఎలాంటి సమస్య ఎదురైనా భూమిక హెల్ప్‌లైన్‌కి ఫోన్ చెయ్యండి.” అని విద్యార్ధులకు భరోసా ఇచ్చే స్థాయికి హెల్ప్‌లైన్‌ని తీసుకెళ్ళగలిగాం. దీని వెనక మాతో పాటు, వాలంటీర్లు, అడ్వకేట్లు, వ్యక్తులుగా మీ అందరి సహకారం ఎంతో వుంది.
అలాంటి హెల్ప్‌లైన్ ఫిబ్రవరి 2014 నుండి… ఆగిపోబోతోందని చెప్పడానికి, రాయడానికి నేనెంత మానసిక క్షోభకు గురౌతున్నానో… ఎలా చెప్పను.? కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతో మందిని కలుస్తున్నాం. హెల్ప్‌లైన్‌ని కొనసాగించండి అని వేడుకుంటున్నాం. ఆక్స్‌ఫామ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందిన రాష్ట్రమట. డోనర్స్ అందరూ చెబుతున్న మాట ఇది. ఇక్కడ హింస ఏ స్థాయిలో పెరిగిపోతోందో మీకు తెలియని విషయం కాదు. మండల స్థాయిలో హెల్ప్‌లైన్‌లు పెట్టాల్సిన అవసరమున్న వేళ మన హెల్ప్‌లైన్ ఆగిపోబోతోంది.
హెల్ప్‌లైన్ ఎట్టి పరిస్థితుల్లోను ఆగిపోకూడదు అంటూ నాకు కొండంత ధైర్యాన్ని నూరిపోసి నా చేతిలో లక్ష రూపాయలు చెక్కు పెట్టారు సుజాతా మూర్తిగారు. వారి కోడలు చింతపల్లి పద్మగారు అమెరికాలో హెల్ప్‌లైన్ కొనసాగించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుజాతామూర్తి గారికి మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ… హెల్స్‌లైన్ కొనసాగడం కోసం సహకరించాల్సిందిగా మిత్రలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. – సత్యవతి
భ్భూమిక నెలసరి బద్జ్తత ఎంత?