టి.టాన్య
నేటి సమాజంలో యువతకు, విద్యార్థులకు, విద్యాధికులకు రాజకీయాలపట్ల సరయిన అవగాహనకాని ఆసక్తికాని ఉండవలసినంతగా లేదనిపిస్తోంది. అధికభాగం ప్రజల్లో రాజకీయాలపట్ల వ్యతిరేకభావం అనాసక్తత ఎక్కువగా ఉంది. ఇంతో అంతో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారిలో 90% మంది స్వలాభం కోరేవారే! వీరు రాజకీయాలను వంశపారంపర్య ఆస్తిగా పరిగణించేవారు, ధనబలం భుజబలంతో గూండాగిరీ చేసేవారు, తమ తమ వ్యాపారాలు ఆస్థులు పెంచుకోగోరే వారే తమ ప్రాంతానికీ, సమాజానికి ఏం చేయగలమోనని ఆలోచించేవారు లేరు. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తదనంతరం రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉండేవి. ఏ రాజకీయ పార్టీ అయినా – వారి ధ్యేయం దేశంకోసం, సమాజం కోసం సేవ చేయటమే!
మన రాష్ట్రంలో 1940 కు ముందునుండే కమ్యూనిస్టు పార్టీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విద్యార్ధులు, యువత, విద్యాధికులు ఈ వామపక్ష భావాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ ముఖ్యోద్దేశం రాజకీయపరమైనవే కాక, దేశంలోనూ, సమాజంలోనూ మార్పుతేవటం, అన్నిరంగాల్లోనూ మార్పుతేవటం. సనాతన భావాలనుండే విప్లవాత్మక భావాలవైపు ఆకర్షితులను చేయటం, సంఘసంస్కరణలు, స్త్రీ విద్య, కార్మిక కర్షకులలో వారి హక్కుల గురించి అవగాహనం కలిగించటం ముఖ్యమయినవి.
కమ్యూనిస్టు భావాలతో ఉన్న కుటుంబాలల్లో జీవనవిధానం చాల విశాలదృక్పథంతో ఉండేది. కుటుంబ జీవనంతో స్త్రీలకు గౌరవం, విలువ ఉండేది. ఆంక్షలు లేవు. సమదృక్పథంతో చూసేవారు. నా బాల్యానుభవాలు చాలా వరకూ నా తరం పిల్లలు అనుభవాలే!
మా నాన్న 1934 నాటికి గ్రాడ్యుయేట్. అమ్మకు నాన్నకూ ఆస్థిపాస్తులు బాగానే ఉండేవి. అమ్మవైపు బంధువుల్లో, నాన్న బంధువులలోనూ నాన్నంత చదువుకొన్న వారు లేరు. నాన్న చాలా చురుకైన వాడని, తెలివైన వాడని అందరూ అనుకునేవారు. మంచి ఉద్యోగంలో స్థిరపడి బాగా పైకి వస్తాడని అందరూ ఆశించారు. నాన్న పుట్టగానే నానమ్మ తన 16వ ఏట వితంతువు అయ్యింది. ఆస్థికి ఏకైక వారసుడు ! ఆస్థిపాస్తుల విషయాలు నాన్న బంధువులే అజమాయిషీ చేసే వారు ! తరువాత క్రమంలో ఆస్థి సగానికి కూడా మిగలలేదు. నాన్న చదువులో ఉండగానే వామపక్ష భావాలకు ప్రభావితులవటం – చదువుకాగానే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ప్రవేశించారు. నాన్న లాగానే చాలామంది విద్యాధికులు కూడా! వీరంతా కమ్యూనిజం, లెనినిజం, మార్కి ్సజం గురించి క్షుణ్ణంగా చదివారు. పార్టీ ప్రచారంలో ఆ జ్ఞానం చాలా అవసరం. ప్రజలకు వారి భావాలను తీసుకు వెళ్లాలి కదా!
నా బాల్యంలో జరిగిన సంఘటనలు, విషయాలు పూర్తి గుర్తులు లేవు. నా 4 వ సం||లో ఏలూరులో ఉన్నాము. మా ఇల్లేకాకుండా, మిగతా స్నేహితులు, కార్యకర్తల ఇళ్ళు కూడా ఎప్పుడూ సందడిగా ఉండేవి. ఏదో కారణంగా కుటుంబాలతో సహా కలుస్తూ ఉండేవారు. అమ్మ లాగానే మిగతా స్నేహితుల కుటుంబాలలోని స్త్రీలు కూడా అంతంత మాత్రపు చదువుకున్నవారే. అందుచేత నాన్న, తదితరులు ముందుగా తమ తమ ఇళ్లలోని స్త్రీలను చైతన్యవంతులను చేసారు. అంటరానితనం సనాతన భావాలు, చదువు ఆవశ్యకత, కుల వివక్షత మొదలయిన విషయాలపట్ల అవగాహన కలిగించారు. చాలామంది స్త్రీలు వారి భర్తలతోపాటు చురుకుగా రాజకీయాల్లో తిరిగేవారు. మహిళా సంఘాలు, రాజకీయ తరగతులు పల్లె పల్లెనా నిర్వహించేవారు అమ్మకూడ తరచూ వారితో కలసి వెళ్లేది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న అర్థవంతమయిన జీవితం అది. ఒకరంటే ఒకరికి ప్రేమ, విశ్వాసం, బాధ్యత ఉండేది. ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరూ కలసి పరిష్కార మార్గాలు చూసేవారు. అది ఒక సమిష్టి జీవితం, సంతోషం ఉండేది, తృప్తి ఉండేది. అంతే కష్టాలూ ఉండేవి. జీవితం చాలా సీదాసాదాగా ఉండేది. ఆర్భాటాలు లేవు. నాలుగో సం||లో దుబ్బు జుట్టుతో గంతులు వేస్తున్నానని చూసి శ్రీ చండ్రరాజేశ్వరరావు గారు నన్ను మంగలి దగ్గరకు తీసుకువెళ్లి మగపిల్లల్లా అంట కత్తిరింపు చేయించి ‘టాన్యా’ అని పేరు పెట్టారట. తరువాత 7, 8 సం|| వచ్చేవరకూ నాకు మగపిల్లల బట్టలు, క్రాపూను.
నా ఏడవ ఏట మేము విజయవాడ ప్రజాశక్తి నగర్‌కు మారాము. ఇక్కడ కూడా ఇంచు మించు అదే జీవితం. అందరూ తెలిసిన వారే! కొత్తగా నిర్మించిన తాటాకు పాకలు, ఒక కాలనీలో ఉన్నట్లు. నేను రెగ్యులర్ స్కూలుకు వెళ్తున్నా – 2 లేక 3 వ తరగతిలో. తరచూ పోలీసులు సమీపంలో కనబడుతూనే ఉండేవారు. భయం తెలిసేది కాదు, తరచూ మాముందు వరుసలోనున్న పాకలో ప్రజానాట్యమండలి వారు బుర్రకథ, నాటకాలు సాధన చేస్తూ ఉండేవారు, స్వాతంత్య్రం వచ్చిందని ఒకరోజు సంబరాలు చేసారు. అర్థం తెలియకపోయినా పిల్లలం అంతా గంతులు వేసాం. ఒకరోజు అక్కడ ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. నాన్న తెల్లవారేసరికి లేరు. కారణం అమ్మకు తెలుసు. బహుశా కమ్యూనిస్టు పార్టీ మీద నిషేదాజ్ఞలు వచ్చాయనుకుంటా, కొద్దిరోజుల్లోనే అమ్మ మా ముగ్గురి పిల్లలతోటి మా గ్రామానికి ప్రయాణం చేసింది. పసితనంలో మా ఊరు చూసానో లేదో గుర్తు లేదు. ఇప్పుడు ఆ ఊరి ప్రయాణం ఒక మంచి జ్ఞాపకం. సామాను బస్సుస్టాండులో పెట్టి అమ్మ, పిల్లలం కాలినడకన పామర్రు నుండి ఊరికి బయలుదేరాము. తమ్ముడు అమ్మ చంకన, అన్న పెద్దవాడు. నాకే ఆ నడక కష్టం. చేలల్లో నుంచి కాలిబాట నడక. కొంతదూరం పోయేసరికి అడ్డంగా పెద్ద లంక కాలువ. నిండుగా ఎర్రటి బురద నీటిలో జోరుగా ప్రవహిస్తోంది. అది దాటటానికి దానిమీద అడ్డంగా సుమారు 10 గజాల పొడవున్న తాటి బోదెలు. అది దాటగలిగితే నాకు మరో జన్మేనన్నంత భయం. క్రింద నీటిని చూస్తూంటే గుండె జారి పోయేంత భయం. ఎలాగో అన్న చొక్కా గట్టిగా పట్టుకుని వెనుకనుండి అమ్మచేయి పట్టుకుని నెమ్మదిగా నెమ్మదిగా దాటగలిగాను. గుండె దడ తగ్గింది. ఇంక జన్మలో ఈ ఊరు రానని అమ్మకు చెప్పా! ఇంకో 10 నిమిషాలు నడిచామో లేదో గట్ల ప్రక్కన పాకలు కనబడుతున్నాయి. ఊరికి దగ్గర చేరాం అని సంతోషం కలిగింది. ఎదురుగా పెద్ద చెరువు, చెరువు నిండుగా నీరు. చిక్కగా ఎర్రటి తామర పూలు తేలియాడుతున్న గుండ్రటి పళ్లేలలాంటి తామరాకులు చూడముచ్చటగా, కన్నుల పండుగగా అనిపించింది. ఆ చెరువుచుట్టూ ఎత్తయిన రావి, ఇంకా ఏవో చెట్లు, చెట్లకు తలకిందులుగా వేలాడుతున్న పక్షులు. అప్పటివరకూ ఇంతటి సుందరమయిన ప్రదేశం నే చూడలేదు. ఇప్పటికీ నా మనస్సుకు గుర్తుకు వచ్చే అందమైన దృశ్యం. చెరువుకు నాలుగు ప్రక్కల రాతిపలకలతో కట్టిన విశాలమయిన మెట్లు. గబగబా రాతి మెట్లు దిగి చల్లని, పాచివాసనతోనున్న నీటితో ముఖాలు తడుపుకున్నాం. హాయిగా ఉంది. చెరువునానుకునే మూడు ప్రక్కల మా ఊరు, ఊరు చాలా చిన్నది. ఊరి మధ్యగా మట్టి రోడ్డు. అటూ ఇటూ కొన్ని డాబా ఇళ్లు, పెంకుటిళ్లు. చివరకుపోతే పెద్ద ఆవరణలో ఎప్పుడో కట్టిన దేవాలయం. లోపల ఆవరణలో పసుపు పచ్చని గన్నేరు పూలచెట్లు. మాది వరుస నాలుగు పెద్ద పెంకుటిళ్లల్లో రెండోది. తాతలనాడు కట్టిన ఇల్లు. ద్వారానికి అటూ ఇటూ ఎత్తయిన పెద్ద అరుగులు. నగిషీ చెక్కిన చెక్క స్తంభాలు. చిక్కగా నగిషీలతో నిండిన దర్వాజా. దానికి ఒంటి రెక్క తలుపు నగిషీ తోటి, ఇత్తడి గుబ్బల తోటి! అన్నీ కొత్తే! నా కంటికి అన్నీ అందంగానే ఉన్నాయి. ఇప్పటివరకూ నానమ్మ ఒక్కతే అక్కడ. ఇల్లు విశాలంగా ఉంది. వరుసనే అందరూ బంధువులు, దాయాదులే. నాన్న అంటే ఊళ్లోవారికీ బంధువులకు చాలా ప్రేమ గౌరవం. అందరికీ నాన్న గురించి ఆందోళన. అమ్మను అందరూ చాలా ప్రేమగా ఆప్యాయంగానే చూసుకునేవారు. అమ్మ పరిస్థితి చూసి సానుభూతి చూపేవారు, అదంతా చూస్తూంటే నాకేదో భయమూ, అభద్రతా భావం కలిగేది. నాన్న స్నేహితులు చాలా ఆసరాగా ఉండేవారు. నన్ను వారు పనిచేస్తున్న మిడిల్ స్కూలులోనూ అన్నను పామర్రు హైస్కూలులోనూ చేర్చారు. రోజూ స్కూలుకు వెళ్లిరావటం నాకు ఆనందంగానే ఉండేది. చెరువు కట్ట పొలాలు, పైరు కాలవలు చూస్తూ పోవటం, రావటం బాగుండేది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నానమ్మ మరో నానమ్మ బయట కూర్చుని రాట్నం తిప్పుతూ, దూది ఏకుతూ, చేయి పైకి క్రిందకూ తిప్పుతూ ఉంటే సన్నగా దారం చరకాకు చుట్టుకుంటూ ఉంటే చూడబుద్ధయ్యేది. ఆ దారాన్ని మరల పొరలు పొరలుగా, లెక్కగా ఆసులో వేసి తిప్పి చిలపలుగా మెలిపెట్టి పెట్టేవారు, వాటితో ఖద్దరు బట్ట నేస్తారని నానమ్మ చెప్పింది. రాట్నం ఒడుకుతూ గాంధీ పాటలు పాడుతూ ఉండేవారు. ఒక సం|| సాఫీగానే గడిచింది. అన్న పెద్దవాడవుతున్నాడు. చదువుమీద శ్రద్ధ చూపటం లేదని, అమ్మ నాన్న స్నేహితులు కలసి నానమ్మతో సహా మా కుటుంబాన్ని విజయవాడ మార్చారు. మామయ్యలు ఒక పాడి గేదకి పనివానిని పంపి అప్పుటప్పుడూ వచ్చి చూసి పోతూ ఉండేవారు. నాన్న ఎవరో తెలియని పద్ధతిలో మేము ఉన్నాం, పిల్లల చదువు నిమిత్తమే విజయవాడ కాపురం అని అందరూ అనుకునేవారు.
ఒకరోజు అర్థరాత్రి జీపు మోత, టక టకా బూట్ల మోతతో తలుపులు ధన ధనా బాదుడు వినిపించింది. ఇంట్లో అందరం బిక్కుబిక్కుమంటూ తలుపు తీస్తే ఇంటిచుట్టూ పోలీసులు అమ్మను నానమ్మను పశుబలంతో బయటకు లాక్కునిపోయి, నాన్నగురించి ఇంకా పార్టీ వారిగురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. నిజంగానే నాన్న ఎక్కడ ఉన్నారో అమ్మకు నానమ్మకు తెలియదు. అంతకుముందు అప్పుడప్పుడు నాన్న క్షేమ సమాచారాలు స్నేహితుల ద్వారా తెలుస్తూ ఉండేది. వారికి కావలసిన సమాధానం రాకపోవటంతో ఎవరో ఆఫీసరు నన్ను ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని మంచిమాటలు చెబుతూ రకరకాల ప్రశ్నలు అడిగాడు. ”నీ పేరేమిటి?” అని అడిగితే నేను తెలివిగా ‘టాన్యా’ అని కాకుండా ‘బేబి’ అని చెబితే ఆయన నవ్వుతూ ”కమ్యూనిస్టు పిల్లలు మరి” అన్నాడు. మా సమాధానాలతో విసిగి వాళ్లు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేసారు. మంచాలు విరగ్గొట్టి, నవ్వారు కోసి, కుర్చీలు టేబిలు తునాతునలు చేసేసారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బియ్యం, సం||నికి సరిపడా ఉన్న పప్పులు కలిపి పారబోసి, పచ్చడి జాడీలు మొత్తం పగులగొట్టి నానా ధ్వంసం చేసేసారు. అది మొదలు ఎప్పుడుబడితే అప్పుడు రాత్రిపూట వచ్చి విచారించి పోయేవారు. వార్త తెలిసి మామయ్యలు చూడటానికి వస్తే పోలీసులు వచ్చి వారిని తీసికొని పోయి ఒక రోజు లాకప్పులో పెట్టారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. పార్టీకి సంబంధించిన చాలామంది యువకులు, నాయకులు చంపివేయబడినారు. సాయుధ పోరాటంకు అతివాద ధోరణికి వ్యతిరేకంగా నాన్నతోపాటు చాలామంది నాయకులు బయటకు వచ్చేసారు. పార్టీ వారిని బహిష్కరించింది కూడా. పార్టీమీద నిషేధం కూడా ఎత్తివేయబడింది. నాన్న ఇంటికి చేరారు 3, 4 సం|| తరువాత !
ఆ తరువాత మరో జీవిత పోరాటం. నాన్న మానసికంగా చాలా కుంగిపోయారు. నాన్న ఆస్తి చాలావరకు అయిపోయింది. అమ్మకు కొంతపొలం మిగిలింది. పెరుగుతున్న ఖర్చులు, మా చదువులు, రాబడి లేదు. నాన్న బాగా చదువుకున్న వారే అయినా దాదాపు 40 సం|| వయస్సులో ఉద్యోగాన్వేషణ అంత సులువు కాదు. పైగా కమ్యూనిస్టు నేపథ్యం, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటం కూడా కారణమే. స్నేహితులతో కలసి వ్యాపార ప్రయత్నం చేసారు. కుదరలేదు. 2, 3 సం|| తరవాత మునిసిపల్ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేరారు. ఈ కథ నాన్నదే కాదు. నాన్న స్నేహితులు కొంతమంది ఇంకా చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నారు. నాన్న స్నేహితుడు ఒకాయన చిన్నవయస్సులోనే సర్దార్ భగత్‌సింగ్ గ్రూప్‌తో కలసి పనిచేసారు. తరువాత కమ్యూనిస్టుగా మారి అరెస్టు అయి అండమాను జైలుకు పంపిస్తూ ఉండగా పారిపోయారు. నిషేధం ఎత్తివేసిన తరువాత బయటకు వచ్చారు. ఆయన హిందీలో ‘సాహిత్యరత్న’ చేసారు. కాని ఆయనకు ఎక్కడా చిన్న ఉద్యోగం దొరకలేదు. గతిలేక తిరిగి ఉత్తరహిందూస్తాన్ వెళ్లి ఒక చిన్న ఉద్యోగంలో చేరి అక్కడే చనిపోయారు. ఇలా నాకు తెలిసే చాలామంది తరువాత బ్రతుకు తెరువుకోసం నానా అగచాట్లు పడినారు. ఇవన్నీ నా బాల్యంలో నాకు గుర్తున్న సంఘటనలు. ఇవన్నీ నా మానసిక ఎదుగుదలపై చాలా ప్రభావం చూపినవే! అప్పటికీ ఇప్పటికీ జీవన విధానంలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. అయినా నాకు అప్పటి జీవిత విధానం మీద చాలా గౌరవం. అప్పటి కుటుంబ జీవితం, స్నేహబాంధవ్యాలు, బాధ్యతలు గమనిస్తూ ఉంటే, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆనాటి జీవితమే విలువయినది అని అనుకుంటాను.