కొండవీటి సత్యవతి
”ఎడిటర్ అని బోర్డున్న రూమ్‌లోకి ఆమె ఆడుగుపెట్టింది ధాత్రి. కుర్చీ ఖాళీగా వుంది. ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. రూమ్ నిండా పుస్తకాలు నీట్‌గా సర్దివున్నాయి. టేబుల్ మీద బోలెడు పుస్తకాలు పరిచివున్నాయి. గోపాలం తన కిష్టమైన పుసత్కఆలన్నింటిని సేకరించుకున్నాడు అనుకుంటూ నవ్వుకుంది.
”అరే! ధాత్రి! నువ్వొచ్చాసావా?” అంటూ వచ్చాడు గోపాలం
”ఇప్పుడే వచ్చాలే. చాలా పుస్తకాలు సేకరించావ్ గోపీ” అంది నవ్వుతూ.
”ఎడిటర్ నయ్యాను కదా! నాగభూషణం గారి రూమ్‌లో పుస్తకాలన్నీ నా రూమ్‌లో కొచ్చాయి” నవ్వాడు.
”నిన్ను మొదటిసారి చూసింది పుస్తకాల కట్టతోనేగా. ఆ రోజు ఇంత కట్టపట్టుకొచ్చావ్ కదా”
”అవునవును ఎలా మర్చిపోతాను ధాత్రీ. ఆ అన్నట్టు శంకరం గారి పుస్తకం తయారైపోయింది. ఆహ్వాన పత్రిక కూడా” అంటూ టేబుల్ సొరుగులోంచి ఇన్విటేషన్ తీసిచ్చాడు.
”ఓ.. గ్రేట్… మా యూనివర్సిటీ క్కూడా మూడు రోజులు శెలవున్నాయి. బావ ఎపుడొస్తాడో అడగాలి” అంది ధాత్రి ఇన్విటేషన్‌ని పరిశీలనగా చూస్తూ.
”ధాత్రి! ఇప్పుడే వస్తా. చిన్న పనుంది. అది పూర్తి చేసుకుని ఇంటి కెళ్ళిపోదాం.” అంటూ ఓ నాలుగు పుస్తకాలు చేతపట్టుకుని గోపాలం హడావుడిగా వెళ్ళిపోయాడు.
గోపాలం వెళ్ళిన వేపే చూస్తూ కూర్చుంది. ఆమెకి తమ మొదటి పరిచయం గుర్తొచ్చింది.
………..
డోర్ బెల్ మొగుతోంది. రాజు ఎక్కడి కెళ్ళాడో! తనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గోపాలం. పుస్తకాల కట్టతో బయట నిలబడి వున్నాడు.
”శంకరం గారున్నారాండి ” అన్నాడు.
”వున్నారు. కూర్చోండి” అంది ఆమె
చేతుల్లోవున్న పుస్తకాలను టీపాయ్ మీద పెట్టి కుర్చీలో కుర్చున్నాడు.
”ఎవరూ!” అంటూ వచ్చాడు శంకరం
”నాగభూషణం గారు ఈ పుస్తకాలు మీకిచ్చి రమ్మన్నారండి”
”అలాగా! సంతోషం బాబూ”
”ఏం పుస్తకాలివి” అంటూ పుస్తకాలను పరిశీలించడం మొదలు పెట్టింది. చలం పుస్తకాలు.
”మీరు చలం గారి మీద వ్యాసం రాస్తున్నారట కదా! నాగభూషణం గారు చెప్పారండి..”
ఆమె తలెత్త తొలిసారి తని కళ్ళల్లోకి చూసింది. చేతిలో పుస్తకం వొణికినట్లయ్యింది.
ఎంత తీక్షణమైన కళ్ళు. అతని కళ్ళల్లోకి మళ్ళీ చూడలేక పుస్తకాలు చూస్తూ కూర్చుంది.
”నువ్వు నాగభూషణం దగ్గరి పని చేస్తున్నావా?”
”అవునండి . ఆయన పేపర్‌లో ఈ మధ్యనే చేరాను. వస్తానండి.” అంటూ వెళ్ళిఫోయాడు.
”జర్నలిస్ట్ అన్న మాట” అనుకుంది ఆమె
”ధాత్రి! ఈ పుస్తకాలు నా రూమ్‌లో పెట్టు నేను వాకింగ్‌కి వెళ్ళొస్తా.” అంటూ ఆయన బయటకు నడిచాడు.
ఆ పుస్తకాలన్నింటినీ జాగ్రత్తగా పొదివి పట్టుకుని తీసుకెళ్లి శంకరం రూమ్‌లో ఆయన రాసుకునే టేబుల్ మీద పెట్టింది. ‘మైదానం’ నవల మీద ఆమె దృష్టి పడింది. ఆ పుస్తకం తీసుకుని తనగదిలో కెళ్ళింది. రెండు గంటల దాకా ఆయన రారు. ఈ లోగా ఈ పుస్తకం చదవొచ్చు అనుకుంది.
”అమ్మా! వంట ఏం చెయ్యమంటారు?” అంటూ వచ్చాడు రాజు. ఏం చెయ్యాలో చెప్పి, పుస్తకం చదవడం మొదలు పెట్టింది. కొన్ని పేజీలు చదవిటప్పుటికి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఇదేంటిది ఇలా రాసారు. పుస్తకాన్ని మూసేసింది. ఆమె నరనరానా ఏదో అశాంతి బయలు దేరింది. గదిలో వుండలేక బయట కొచ్చి తోటలో నడుస్తుంటే, సాయంత్రం పుస్తకాలు తెచ్చిన అతని కళ్ళు గుర్చొచ్చాయి. ఆ వెలుగు, తీక్షణత మెరుపు రావడంలేదు. అమీర్ చూపులు రాజేశ్వరికి వెనక నుంచి గుచ్చుకున్నట్లు… చూపులు గుచ్చుకుంటాయా? అతని చూపులు తనకు గుచ్చుకున్నాయా? ఛీ… ఛీ… ఏంటి ఇలా ఆలోచిస్తోందివాళ. అలా ఎంతసేపు తోటలో తిరుగుతూవుందో.. శంకరం తిరిగి వచ్చినట్లు కూడా ఆమె చూడలేదు.
”అమ్మా! సార్ పిలుస్తున్నారు” రాజు పిలిచేవరకు ఆమె అలా నడుస్తూనే వుంది.
”వచ్చారా? నేను చూడనే లేదు”.
”మంచిదే. నడక మంచిదే కదా! బయటకు రమ్మంటే రావు” తన టేబుల్ మీదున్న పుస్తకాలను చూస్తున్నాడు.
”వారం రోజుల్లో వ్యాసం పూర్తి చెయ్యాలి. అయ్యో! మైదానం నవల పంపలేదే వీడు.”
”పంపారు. ఊరికే చూద్దామని పట్టుకెళ్ళాను” అంది ఆమె.
”సరేలే! చదువు. నేను అవసరమైనప్పుడు తీసుకుంటాను.” స్నానం చేసి శంకరం తన టేబుల్ ముందు కూర్చున్నాడు. భోజనం వేళకి కానీ ఆయన లేవడు. ఆమె మెల్లగా ఆ రూమ్‌లోంచి బయట పడింది.
………………
”శంకరం బావున్నాడామ్మా” ఆమె నాగభూషణం గారి పత్రికాఫీసులో అతని గదిలో కూర్చునుంది.
”బావున్నారండి”
”ఐనా వాడికి బుద్ధులేదా. ఫలానా పుస్తకాలు కావాలి అని ఫోన్ చేస్తే నేను పంపుతాను కదా! నువ్వెందుకు రావడం” కోపంగా అన్నాడు.
మళ్ళీ తనే అన్నాడు. వాడికి హార్ట్ ఎటాక్ రావడం, ఇంటికే పరిమితమవ్వడం, నాకు చాలా బాధగా వుంటుంది.”
ఆమె ఏమీ మాట్లాడలేదు.
”ఇవిగో సార్! మీరు చెప్పిన పుస్తకాలు ” అంటూ చేతుల్నిండా పుస్తకాలతో వచ్చాడతను.
ఆమెను చూసి ”నమస్కారమండి” అన్నాడు
”గోపాలం! వీరు నీకు తెలుసా?”
”మొన్న మీరే కదా సార్ వీరింటికి నాతో పుస్తకాలు పంపారు.”
”అవునవును మచ్చిపోయాను. ఈ పుస్తకాలు తీసుకెల్ళి కారులో పెట్టు. మంచిదమ్మా. వెల్ళి రండి అన్నాడు” ఆయనకి ఓ క్షణం కూడా ఖాళీ వుండదు.
హఠాత్తుగా అతన్ని చూసి ఆమె తడబడింది. అతని కళ్ళ వేపు చూడకూడదనుకుంది.
”రండి” అంటూ ముందుకు వెళుతున్నాడు.
అతని వెనక ఆమె. ఎప్పుడూ పుస్తకాలతోనే కనబడతాడు కాబోలు. డ్రైవర్ పుస్తకాలందుకుని కారులో పెట్టాడు.
”థాంక్సండి” అందామె.
”ఫర్వాలేదండి” అంటూ ఆమె కళ్ళల్లోకి చూసాడు. కళ్ళు తిప్పుకోకపోయింది.
”డ్రైవర్ పద” అంది ఆమె. కారు బయలు దేరింది.
వెనక నుంచి అతని చూపులు గుచ్చుకుంటున్నట్లనిపించింది. తల తిప్పి చూస్తే అతనక్కడ లేడు.
………………….
తన రూమ్‌లో కూర్చున్న ధాత్రి… గోపాలం ఆలోచనలు ఆమె చుట్టూనే…
ఆమెను మొదటిసారి ఎప్పుడు చూసాడు? వాళ్ళింటికి చలం పుస్తకాలు తీసుకెళ్ళినప్పుడు తలుపుతీసి ప్రశ్నొర్థకంగా తన వేపు చూసినపుడు ఆమె కళ్ళు చాలా బావున్నాయనిపించింది. శంకరం గారు నాగభూషణం గారికి ఫ్రెండంటే ఆయన వయస్సే వుంటుంది. ఈవిడెవరో మరి. కాసేపట్లో ఆయన బయట కొచ్చాడు. ఖచ్చితంగా యాభై ఎళ్ళుంటాయి. ఆవిడ అక్కడే కూర్చుంది కానీ ఆయన ఆమెను పరిచయం చెయ్యలేదు. వొంటి మీదున్న ఆభరణాలు చూస్తే ఆమెకి పెళ్ళైంది. ఈవిడ శంకరంగారి భార్యా? ఇద్దరికీ ఇంత తేడానా వయస్సులో. ఆమెకి ఇరవై అయిదులోపే! పుస్తకాలు తిప్పుతూ హఠాత్తుగా తలెత్తి తన కళ్ళల్లోకి చూసినపుడు ‘అబ్బ! ఎంత పెద్ద కళ్ళు’ అనుకున్నాడు.
ఆ తర్వాత ఆమె ఆఫీసుకొచ్చింది.
ఆమె మాట్లాడిన తొలిమాట ‘థాంక్సండి’ అని. మూడోసారి ఆమెని చూసింది మళ్ళీ వాళ్ళింట్ళోనే. సాయం సంధ్యవేళ పుస్తకాలు తీసుకుని శంకరంగారింటికి వెళ్ళేడు. ఆయన ఇంట్లో లేడు. వాకింగ్‌కి వెళ్లాడు. ఆమె ఒక్కతే వుంది. బయట తోటలో వుంది. రాజు వచ్చి అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి తోటలోకి తీసుకెళ్ళాడు.
”రాజూ! టీ తీసుకురా?” అని పురమాయించి ”కూర్చోండి.” అంది.
”మీ తోట బావుందండి.”
”థాంక్స్! మీరెపుడూ పుస్తకాలతోనే కనబడతారా?”
”ఏం చెయ్యమంటారు. మాసారు చెప్పిన పని చెయ్యాలి కదా!”
”ఈయన వ్యాసం పూర్తయ్యే వరకూ మీకు ఈ పుస్తకాల మోత తప్పుదనుకుంటాను.”
‘మీ తోటలోంచి సూర్యాస్తమయం చాలా బాగా కనిపిస్తోంది. మీరు రోజు చూస్తారా?”
”నాకు వేరే పనేముంది. ఈయన వాకింగ్‌కి వెళ్ళిపోతారు. సాధారణంగా నేను ఈ సమయంలో ఇక్కడే వుంటాను”.
తను అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ కూర్చున్నాడు.
”ఆఫీసులో మీరు ఏంపని చేస్తారు” అడిగిందామె.
‘సబ్-ఎడిటర్ నండి. ఎడిటోరియల్ కూడా నేనే చూస్తాను. బహుశ రేపటి నుండి నా డ్యూటీ ఇక్కడేనండి.”
అతని కళ్ళల్లో అస్తమిస్తున్న సూర్యుడి తాలూకు ఎరుపు కనబడతోంది. చిలిపితనం కూడా కనబడింది ఆమెకి.
”ఇక్కడ డ్యూటీ ఏంటి?” కొంచం తీవ్రంగా వుంది ఆమె గొంతు.
”అయ్యో! అపార్ధం చేసుకోకండి. శంకరం గారు పుస్తకాలన్నీ చదివి నోట్స్ రాసుకున్నారట. డిక్లేట్ చేస్తే ఎవరైనా రాస్తారా అని అడిగారట. మా సార్ నన్నడిగారు వెళతావా అని. చలం గురించి వ్యాసం కదా! నాకూ ఇష్టమే కాబట్టి వెళతానని చెప్పాను. అదండీ డ్యూటీ అంటే”
రాజు టీ, బిస్కెట్లు తెచ్చాడు.
‘టీ తీసుకోండి”
ఆమె టీ కప్పు అందిస్తున్నపుడు అతని దృష్టి పొడవాటి ఆమె చేతి వేళ్ళ మీద పడింది. నాజూకుగా, సున్నితంగా వున్నాయి.
”మీరు బొమ్మలు వేస్తారా”
”మీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అంది ఆమె
”పొడవాటి వేళ్ళుంటే బొమ్మలేస్తారని ఎక్కడో చదివానండి.”
ఆమె ఫక్కున నవ్వింది.
గేటు చప్పుడైంది. శంకరం లోపలి కొస్తూ కనబడ్డాడు.
అతను వెంటనే లేచి నిలబడి ‘నమస్కారమండి’ అన్నాడు.
”ఏమోయ్ గోపాలం. నిన్ను ఇబ్బందిపెట్టేస్తున్నానయ్యా”.
”ఎంత మాట. ఇబ్బంది ఏమీ లేదండి. మిగిలిన పుస్తకాలు తెచ్చాను. నన్ను ఎప్పటి నుండి రమ్మంటారు”
రాజు తెచ్చిన మంచినీళ్ళు తాగుతూ రేపటి నుండి రాగలవా? సాయంత్రాలు అయితేనే బావుంటుంది.”
”అలాగేనండి. వెళ్ళొస్తాను” అని చెప్పి ఆమె వైపు చూడకుండానే గేటు వైపు వెళ్ళిపోయాడు.
………………………….
అతను వెళ్ళిపోయాక తన పొడవాటి వేళ్ళను తదేకంగా చూస్తూ కూర్చుంది ఆమె. శంకరం తన గది లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తన గదిలోకి వెళ్ళి పేపర్, పెన్సిల్ తీసుకుని అతని కళ్ళని స్కెచ్ చెయ్యడం మొదలు పెట్టింది. లోతైన, తీక్షణమైన చూపు. ఎప్పుడూ తనని వెంటాడుతున్నట్టుంటుంది. పూర్తి చేసిన స్కెచ్‌ని పరుపు కింది దాచింది.
ఏమిటిది? తనకేమవుతోంది. ఎందుకతని గురించి ఆలోచి స్తోంది. ఇలా ఆలోచించడం కరక్టేనా? కొన్ని రోజుల పాటు సాయంత్రాలు ఇంటి కొస్తాడంటే ఎందుకు తనకు సంతోష మనిపిస్తోంది.
మర్నాడు సాయంత్రమవుతుండగా అతను ఎప్పుడొస్తాడా అని ఎదురుచూడసాగింది. పుస్తకాలేమీ లేకుండా ఖాళీ చేతులతో వచ్చాడు. శంకరం వాకింగ్‌కి వెళుతూ చెప్పి వెళ్ళాడు అతన్ని తన రీడింగ్ రూమ్‌లో కూర్చోబెట్టమని మొదటి సారి అతను ఇంటి లోపలికి వచ్చాడు. పూలమాలవేసిన నిలువెత్తు స్త్రీమూర్తి చిత్రపటం ముందు నిలబడిపోయాడు.
”మా అక్క రెండేళ్ళ క్రితం చనిపోయింది ఏక్సిడెంట్‌లో”
అతనికి లీలగా అంతా అర్థమైపోయింది. అక్కపోయిందని, బావకి మరదల్నిచ్చి పెళ్ళి చేసేసారన్నమాట. అందుకే అంత ఏజ్ గేప్.
”నేను బి.ఎస్‌సి చదువుతున్నప్పుడు జరిగింది.” అతను అడక్కుండానే ఆమె చెప్పుకుపోతోంది.
మొదటిసారి ఆమె వేపు తేరిపారా చూసాడు. ఛామన ఛాయ, కోటేరు లాంటి ముక్కు, నొక్కుల జుత్తు. మంచి పొడగరి. అతనలా చూస్తూంటే ఆమెకు వొళ్ళు జలదరించినట్లయ్యింది.
”కూర్చోండి. ఆయనొస్తారు” అంటూ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.
…………………………………..
ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళినపుడు కన్పించిన స్త్రీమూర్తి ఫోటో చూసాక తనకి ఆమెపట్ల చెప్పలేని భావమేదో కలిగింది. అది జాలా? వృద్ధుడిలా కన్పిస్తున్న అతనికి ఆమె భార్య ఎలా అయ్యింది? ఎంత అన్యాయం. శంకరం గారికి చాలా ఆరోగ్య సమస్యలున్నాయని నాగభూషణం గారు చెప్పారు. వయస్సులో తన కన్నా సగం వయస్సున్న పిల్లని పెళ్ళి చేసుకున్న పెద్దమనిషి చలం మీద రాయడమేంటి? దానికి తను సహకరించడమేమిటి?
ఆమె అతన్ని రూమ్‌లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాకా అతనికి కల్గిన ఆలోచనలివి. కోపంగా ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. పది నిముషాలు గడిచాక శంకరం వచ్చాడు. ఆయన ముఖం చూడగానే గోపాలం చటుక్కున లేచి నమస్కారం పెట్టాడు. ఎంత ప్రశాంతమైన ముఖం ఆయనది. తను చేసిన పనికి అతనికి బాధగా లేదా?
”నా భార్య రాజ్యలక్ష్మి. రెండేళ్ళ క్రితం పోయింది”. అన్నాడు ఫోటో వేపు చూస్తూ.
”ధాత్రి ఆమె చెల్లెలే”
ధాత్రి, ధాత్రి ఆమె పేరు ధాత్రి అన్నమాట.
”గోపాలం. ఇదిగో చూడు ఈ నోట్సంతా రాసాను. మనం రెండు మూడు రోజులు కూర్చుంటే సరిపోతుంది.”
‘అలాగేనండి’ అన్నాడు కానీ లోపలి నుంచి ఏదో వ్యతిరేకత తన్నుకొస్తోంది.
శంకరం చెబుతున్న దాన్ని యాంత్రికంగా రాయడం మొదలు పెట్టాడు.
………………..
ఆ మర్నాడు అతను రాలేదు. మూడో రోజు వచ్చాడు. అతను రాడనుకుని శంకరం బజారు వేపు వెళ్ళేడు. శంకరం బజారు కెళ్ళాడంటే రెండు మూడు గంటలదాకా రాడు.
అతను వస్తూనే ”నాకు మీ ఇంటికి రావాలన్పించడం లేదండి. ఆయన చెప్పింది రాయాలని కూడా అన్పించడం లేదు. కాని మా సార్ వినడం లేదు.”
”ఎందుకు? ఏం జరిగింది?”
అతను తల వొంచుకున్నాడు. ”శంకరం గారు మీకు చాలా అన్యాయం చేసారు. అక్క చనిపోతే చెల్లెలిని చేసుకోమని ఎవడండీ చెప్పింది. చేసింది ఇలాంటి పని, రాస్తున్నది చలం మీద. చేతకి, రాతకి పొంతన లేకపోవడం మంటే ఇదేనండి” కోపంగా అన్నాడు.
”ఆపండి మీ మాటలు. నన్ను ఆయన చేసుకోలేదు. మా వాళ్ళు బెదిరించి బలవంతంగా ఈ పెళ్ళి చేసారు. ఆయన ఎంత మొత్తుకున్నా, ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించినా మా వాళ్ళు వినలేదు. ఈయన తల్లి, మా వాళ్ళు అందరూ ఏకమై మా పెళ్ళి చేసారు. ఆయన తప్పేంలేదు.” ఆమె.
”నిజమాండి ఆయన్ని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను. క్షమించండి” అన్నాడు అతను.
”ఆస్తులు బయటకు పోతాయని మావాళ్ళు నన్ను చదువు మాన్పించి మరీ ఈ పెళ్లి చేసారు. నన్ను చదువుకోమని, యూనివర్సిటీలో చేరమని ఈయన చెబుతూనే వుంటారు.” అతనికి అన్ని విషయాలు చేప్పేస్తోంది. ఏమిటిది? ఆమెకి చాలా ఆశ్చర్యంగా వుంది.
”మరి చదువుకోవచ్చు కదా! నన్నెవరన్నా చదివిస్తానంటే ఎగిరి గంతేసి జాయినయిపోతాను.”
రాజు టీ తెచ్చాడు.
”శంకరం గారు వాకింగ్‌కి వెళ్ళిపోయారా?”
”వాకింగ్‌కి కాదు బజారుకెళ్ళారు. ఇంకో గంట పడుతుంది రావడానికి”
”అయితే నేను వెళతానండి. రేపోస్తానని చెప్పండి” అంటూ వెళ్ళిపోయాడు.
………………….
చలం వ్యాసం పూర్తయ్యేసరికి పదిరోజులు పట్టింది. మధ్యలో శంకరం ఆరోగ్యం చెడడం, గోపాలానికి వేరే పనులు తగలడంతో రాసే పని క్రమపద్ధతిలో జరగక ఆలస్యమైంది. ఈ పదిరోజుల్లో ధాత్రి, గోపాలం మధ్య చాలా చనువేర్పడింది. ఒకరోజు అతడు రాకపోయినా ఆమెకి ఏమీ తోచేదికాదు. అతడొచ్చే సమయానికి శంకరం ఇంట్లో లేకపోయినా ఇద్దరూ కబుర్లలో మునిగితేలేవాళ్ళు. ఒక్కోసారి గోపాలం రాత్రి భోజనం కూడా చేసివెళ్ళేవాడు. ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళు. శంకరం తన గదిలోకి వెళ్ళిపోయాక గోపాలం తన రూమ్‌కి బయలు దేరేవాడు.
……………..
గోపాలానికి ఆమెని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా వుంటోంది ఒక సాయంత్రం తను స్కెచ్ చేసిన తన కళ్ళ బొమ్మని చూపించింది.
”ఏంటిది?” ఆశ్చర్యపోయాడు.
”మీ కళ్ళు”
”నా కళ్ళింత తీక్షణంగా వుంటాయా”
”మీకు తెలియిదా?”
”నా కెవరూ చెప్పలేదు ఇంతవరకు”
చిలిపిగా నవ్వుతోంది. ఆ నవ్వు చూస్తుంటే …. అలాగే చూడాలన్పిస్తోంది.
”ఏంటి అలా చూస్తున్నారు?”
”ఏమీ లేదు” తడబడ్డాడు.
శంకరం రావడంతో ఆయనతో కలిసి ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
…………………………
ఆగకుండా దగ్గు వస్తోంది. లేచి మంచి నీళ్ళు తాగాడు శంకరం. గడియారం వేపు చూస్తే మూడు గంటలైంది. తలుపు తీసుకొని బయటకొచ్చాడు. బయట చల్లగా, నిశ్శబ్దంగా వుంది. ధాత్రి రూమ్ వేపు చూసాడు. తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. నిద్రపోతూ వుంటుంది. రెండు సంవత్సరాల నుంచి తమ పడకలు వేరు వేరు గదుల్లోనే. ధాత్రిని చూస్తే ఒక్కోసారి చాలా బాధగా వుంటుంది. తనకి సంపదకి లోటు లేదు. రాజిని తనెంతో ప్రేమించాడు. ఏక్సెడెంట్ ఆమెని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ తన మనసులో రాజీయే వుంది. ఎంత బీభత్సంగా తనను లోంగదీసి, ధాత్రితో పెళ్ళి జరిపించారు. తన తల్లి ఎంత అఘాయిత్యం చెయ్యబోయింది. ఒక్కరూ ధాత్రి గురించి ఆలోచించలేదు. తనెంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. ఇంట్లోంచి పారిపోయాడు. తన తల్లి బెదిరింపులకి లొంగిపోయాడు. ఫలితం ధాత్రిలో పెళ్ళి. పెళ్ళయ్యింది కానీ ఆమెతో భర్తలాగా వుండలేకపోయాడు. పడక గదులు వేరయ్యాయి. ఆమెను చదువు పూర్తి చేయ్యమంటే వినడం లేదు. తనకు రచయితగా మంచి పేరుంది. తన వ్యాపకం తనకుంది. తన దిగులంతా ఆమె గురించే. రాజి గురించి తన దుఃఖం తగ్గనేలేద. తన గుండె కూడా బలహీనంగా తయారైంది.
అతని ఆలోచన గోపాలం మీది కెళ్ళింది. చక్కటి కుర్రాడు. బాగా రాస్తాడు. ధాత్రితో చాలా దగ్గరగా మసలడం గమనించాడు. తను లేప్పుడు కూడా రావడం, గంటల తరబడి మాట్లాడుకోవడం చూసాడు. అతనితో మాట్లాడుతున్నపుడు ధాత్రి చాలా సంతోషంగా వుండడం చూసాడు.
ఎక్కడో కోడి కూసింది. శంకరం ఆలోచిస్తూనే తన గదిలోకొచ్చాడు. ఎదురుగా నిలువెత్తు ఫోటోలో నవ్వుతున్న రాజ్యలక్ష్మి. నిశ్శబ్దంగా ఆ ఫోటో ముందు నిలబడ్డాడు. అలా చాలా సేపు నిలబడ్డాడు. ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా తల పంకిస్తూ వెళ్ళి తన రాతబల్ల ముందు కూర్చున్నాడు.
………………………
”శంకరం! ఎందుకు రా! గోపాలం గురించి అన్ని వివరాల డుగుతున్నావ్? ఏమైనా పొరపాటు చేసాడా? చెప్పు. శంకరం నాగభూషణం ఎదురుగా కూర్చుని వున్నాడు.
”లేదు భూషణం. అతనేమీ తప్పు చెయ్యలేదు. నాకు చాలా సహాయం చేసాడు. అతని గురించి నీ అభిప్రాయం చెప్పు”.
”చాలా మంచివాడు. బాగా కష్టపడతాడు. ముందూ వెనకా ఎవరూ లేరు. తల్లి ఇటీవలే పోయింది.”
”భూషణం! నేను రాజినీ మర్చిపోలేను. ధాత్రికి చాలా అన్యాయం చేసాను. ఇంకొంత ప్రతిఘటించి వుండవలసింది. సరే! పెద్ద తప్పే జరిగిపోయింది. దానిని దిద్దుకోవాలనుకుంటున్నాను.”
”ఏం చేద్దామనుకుంటున్నావ్ రా?”
”వాళ్ళిద్దరూ వొప్పుకుంటే గోపాలం, ధాత్రికి పెళ్ళి జరిపిద్దామనుకుంటున్నాను”.
”శంకరం! నీకేమైనా మతిపోయిందా? తెలివుండే మాట్లాడుతున్నావా? అదెలా కుదురుతుంది?”
”నా బాధని నువ్వైనా అర్ధం చేసుకుంటావనుకున్నాను. ఎందుకు కుదరదు? మ్యూచ్యువల్ డైవోర్స్ చేసుకుంటాం. వాళ్ళిద్దరినీ ఎక్కడికైనా పంపించేస్తాను. నాకు డబ్బుకు లోటు లేదురా! లేనిది మనశ్శాంతి”.
నాగభూషణం తన కుర్చీలోంచి లేచి వచ్చి శంకరం భుజం మ్మీద చెయ్యివేసాడు.
”భూషణం! ధాత్రిని చూస్తే నాకు కడుపులో దేవినట్టుగా వుంటుంది. ఏ అచ్చటా, ముచ్చటా లేదు. నేను ఆమెకు తగను. ఆమె జీవితం అడవి కాచిన వెన్నెలవుతోంది. నోరు విప్పి ఏ రోజూ కంప్లయింట్ చెయ్యలేదు. బావగా నాతో ఎంతో చనువుంది తన అక్కను నేనెంత ప్రేమించానో ధాత్రికి తెలుసు.” శంకరం కళ్ళల్లో సన్నటి నీటి పొర.
ఆఫీసులోకి ఎవరో రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. వచ్చిన మనిషిని చూసి శంకరం ఆశ్చర్యపోయాడు. ధాత్రి…
………………………..
గోపాలం, ధాత్రి తలలు వొంచుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శంకరం హుషారుగా కబుర్లు చెబుతున్నాడు. రాజు వడ్డిస్తున్నాడు.
”రాజూ! మేం తింటాంలే. నువ్వెళ్ళిపో”
రాజు వెళ్ళిపోయాడు సంతోషంగా.
”మీరిద్దరూ ఎందుకు తలొంచుకుని కూర్చున్నారు ధాత్రి! నువ్వు నాగభూషణం ఆఫీసుకొచ్చినందుకు నా కేమీ కోపం లేదు. ఎందుకలా భయపడుతున్నావ్”
ధాత్రి ఏమీ మాట్లాడకుండా అన్నం కెలుకుతోంది.
”మీరు తలవొంచుకునే పనేమీ చెయ్యలేదు. మీరిద్దరూ ఒక్క మాటమీది కొచ్చి నేను చెప్పేది అంగీకరిస్తే నేను హాయిగా శాంతినికేతన్‌కి వెళ్ళిపోతాను. శాంతినికేతన్ కెళ్ళి వుండాలని నాకెప్పటి నుంచో కోరిక.”
”మీకు మా మీద కోపం లేదా?” గోపాలం భయంగా అడిగాడు.
”ఊహూ!!! అస్సలు లేదు. పైగా సంతోషంగా వుంది. నేను స్వేచ్ఛగా నాదారిలో వెళ్ళిపోతున్నందుకు.”
ధాత్రి గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది.
”బావా! నన్ను క్షమించు”
”లేదు ధాత్రి! నువ్వే నన్ను క్షమించాలి. నీకు నేను చేసిన అన్యాయం చిన్నది కాదు. మీ అక్కను నేను మర్చిపోలేను. ఆ సంగతి నీకూ తెలుసు. రండి! ఇద్దరూ ఇటు రండి.” చేతులు చాస్తూ పిలిచాడు.
గోపాలం, ధాత్రి లేచి వెళ్ళి శంకరానికిటూ అటూ నిలబడ్డారు. ఇద్దరినీ చెరోపక్క పొదువుకుంటూ
”నాకివాళ గొప్ప సంతోషంగా వుంది” అన్నాడు.
……………….
మూడు నెలలు గడిచాయి. శంకరం, ధాత్రి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. శంకరమే దగ్గరుండి ధాత్రి, గోపాలం పెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో చేయించాడు.
ఈసారి బంధువులెవ్వరినీ ఇంట్లో అడుగు పెట్టనీయలేదు.
నా యిష్ట ప్రకారం చేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఖరాఖండీగా చెప్పేసాడు. తన స్వార్జితమంతా ధాత్రి పేరు మీద రిజిస్టర్ చేసాడు.
……………
ఆ రోజు సాయంత్రమే శంకరం కలకత్తా వెళుతున్నాడు. ధాత్రి, గోపాలం కూడా అతనితో బయలుదేరారు. శాంతినికేతన్ చూస్తామంటూ. రైలు బయలుదేరడానికి ఇంకా టైముంది. నాగభూషణం శంకరంతో మాట్లాడుతున్నాడు.
‘భూషణం! ఇంత సంతోషం నేను ఎప్పుడూ అనుభవించలేదు. స్వేచ్ఛలో ఇంత సంతోషమంటుందని తొలిసారి తెలుస్తోంది. బంధాలు లేని జీవితం భలేబాగుంది”.
”శంకరం! నువ్వెళ్ళి పొతుంటే దిగులుగా వుంది కానీ నువ్వు ఆనందంగా వున్నందుకు తృప్తిగా వుంది. ఎంతైనా చలం శిష్యుడివి కదా! ఆయనదారే పట్టావ్”
శంకరం గట్టిగా నవ్వాడు. రైలు బయలు దేరబోతున్నట్టుగా గ్రీన్ సిగ్నల్ పడింది.
”వెళ్ళొస్తానురా” అంటూ మితృణ్ణి కౌగలించుకుని రైలెక్కేసాడు. ముగ్గురూ చెయ్యాపుతుంటే నాగభూషణం తనూ చెయ్యూపుతూ తన మితృడిది ”ఎంత విశాల హృదయం” అనుకుంటూ స్టేషన్ బయటకి నడిచాడు.