కొండవీటి సత్యవతి
కుటుంబహింస? పవిత్రమైన కుటుంబంలో హింస? రెండు దశాబ్దాల క్రితం వరకు మనం ఈ ప్రశ్నార్థకాలను విన్నాం.
స్త్రీలకు అత్యంత రక్షణ స్థలాలుగా కీర్తించబడిన కుటుంబంలో హింస గురించి, హింసాయుత సంబంధాల గురించి, స్త్రీల ఉద్యమం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తడం, ఈ హింస నుండి స్త్రీలను రక్షించడం కోసం ఒక చట్టాన్ని రూపొందించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో భారత స్త్రీల ఉద్యమం సఫలమైంది. గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 05 గత సంవత్సరం అక్టోబరులో ఒక జమ్ము కాశ్మీర్ తప్ప దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
గృహహింసలో కునారిల్లుతున్న స్త్రీలకు ఈ చట్టం ఓ ఆశాకిరణం. ఇంతకుముందు స్త్రీలకు సంబంధించిన చట్టాల్లో లేని ఎన్నో మంచి అంశాలు ఈ చట్టంలో వున్నాయి. వాటన్నింటి గురించి గ్రామీణ స్థాయి స్త్రీల నుండి మొదలు పెట్టి నగరాల్లోని చదువుకున్న స్త్రీల వరకు ప్రచారం చేయల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కుటుంబాల్లో నాలుగుగోడల మధ్య జరిగే హింస నేరమని, ఆ నేరాన్ని రక్షణాధికారికి ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయం పొందవచ్చని తెలియచెప్పాల్సిన బాధ్యత స్త్రీల సంఘాలకు, స్త్రీల అంశాలమీద పనిచేసే సంస్థలకు వుంది. నారికేళ పాకంలా వుండే మన చట్టాల్లోని వివిధ సెక్షన్లను అవి అందించే రిలీఫ్‌లను అర్థం చేసుకోవడం మామూలు స్థాయి ప్రజలకు చాలా కష్టం. గృహహింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టంలోని అంశాలను, ఈ చట్టం అందించే సహాయలను సరళమైన భాషలో విశ్లేషిస్త వచ్చిన పుస్తకం ‘ఆలంబన’.
అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లు చట్టంలోని వివిధ సెక్షన్ల గురించి చక్కటి తేట భాషలో రాయడంలో వనజ కృతకృత్యురాలయ్యింది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుండి, డి.వి. కేసులు ఫైల్ చేయడంలో ఎంతో కృషి చేస్తున్న వనజ తన అనుభవాన్ని కూడా రంగరించి ఈ పుస్తకం రాసారు. గృహహింస నెదుర్కొంటున్న స్త్రీలు దాని నుండి బయటపడటానికి ఈ చట్టం సాయన్ని ఎలా తీసుకోవాలి? రక్షణాధికారికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? రక్షణాధికారి బాధ్యతలేమిటి? కోర్టులో కేసు ఎవరు వేస్తారు? ఎన్ని రోజుల్లో తీర్పులు వెలువడతాయి లాంటి అంశాల వివరణ బావుంది. అలాగే సెక్షన్ 498 ఏ లాగా కాకుండా ఇది సివిల్ చట్టమని, ఈ చట్టం అమలులో ప్రాధమిక దశలో పోలీసుల పాత్రలేదని, ఎవరైనా రక్షణాధికారికి ఫిర్యాదు చేయవచ్చని వివరించడం బావుంది. ముఖ్యంగా స్త్రీలకు అత్యంత అవసరమైన ‘నివాసహక్కు’ ను ఈ చట్టం గుర్తించిందని, తాను నివసించే ఇంటినుండే ఆమె కేసు ఫైల్ చేయవచ్చనే అంశాన్ని బాగా ప్రచారం చేయల్సివుంది. ఎందుకంటే హింసకు గురౌతున్న స్త్రీలు ఇల్లు వదిలి ఎక్కడికెళ్ళాలనే సందిగ్ధం వల్లనే ఆ హింసను భరిస్తూ వుంటారు. అలా కాకుండా మీరుండే ”ఇంటిమీద మీకు చట్టబద్ధమైన హక్కుంది, ఆ ఇంటిలో వాటా అడిగి, అక్కడే వుండి న్యాయపోరాటం చేసే వీలుందని” స్త్రీలకు పెద్ద ఎత్తున వివరించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకంలో గుర్తించడం సంతోషం.
ఈ పుస్తకంలో మరో విశేషమేమిటంటే ఇందులో ప్రచురించిన కొన్ని కేస్‌స్టడీలు, ఆ కేసుల పరంగా వచ్చిన తీర్పులు. వీటిని ప్రచురించడం వల్ల ఏఏ నేరాలకి ఈ చట్టం కింద న్యాయం పొందొచ్చు, ఎలాంటి తీర్పును ఆశించవచ్చు లాంటి విషయలు అర్థమౌతాయి. అలాగే కుటుంబహింస అంటే ఏమిటి? ఎలాంటి వేధింపులు ఈ కుటుంబహింస కిందకు వస్తాయి అనే అంశాలను బొమ్మలు కూడా వేసి వివరించడం వల్ల రోజువారీ జీవితంలో తాము ఎదుర్కొనే తిట్లు, తన్నులు, వేధింపులు ఈ చట్టం ప్రకారం నేరమనే విషయం ఈ పుస్తకం చదివిన స్త్రీలకు అర్థమౌతుంది. అలాగే ”తరచ తలెత్తే సందేహాలు” అనే విభాగంలో ప్రశ్నలు సమాధానాల రూపంలో అనేక సందేహాలకు సమాధానాలు పొందుపరిచారు. ఇంకా నమూనా దరఖాస్తులు, రక్షణాధికారులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఫోన్ నెంబర్లు చేర్చారు.
గృహహింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టానికి సంబంధించి సమగ్రమైన సమాచారంతో వెలువడిన ‘ఆలంబన’ స్త్రీల అంశాలమీద పనిచేసే కార్యకర్తలకి, చాలా ఉపయుక్తమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ‘సన్నిహిత’ ఉషారాణికి, అలాగే సరళమైన భాషలో సంకలనం చేసిన వనజకి అభినందనలు.
ఈ పుస్తకానికి అభినందన వాక్యం రాసిన ఇందిరాజైసింగు ‘ఈ చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుంది’ అనడంలో బహుశ వనజ లాంటి వాళ్ళ కృషే వుందనుకుంటా. హింసలేని జీవితాలు గడిపేందుకు ఈ చట్టం ఈ రంగంలో ఆయుధం కావాలని, చట్టాన్ని అర్ధం చేయించడంలో ఇలాంటి పుస్తకాల అవసరం చాలా వుందని చెబుత క్షేత్ర కార్యకర్తలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమని రికమెండ్ చేస్తున్నాను.