మహిళా సమతే ధ్యేయం

ఇంటర్వ్యూ సేకరణ: హసేన్‌

ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.

మరింత ప్రశాంతంగా మాట్లాడతారు. గ్రామీణ మహిళల గురించి పనిచేసే ఒక సంస్థకి డైరెక్టర్‌ కావడం సంతృప్తినిస్తుందని ఆమె అంటున్నారు.
మహిళా సమత రాష్ట్ర విద్యాశాఖలో భాగంగా పనిచేస్తుంది, కాని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. 12 జిల్లాల్లో 71 మండలాల్లో పని చేస్తున్న ఈ సంస్థ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లోని మహిళల కోసం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎన్నో సంస్థలున్నప్పటికీ గ్రామీణ మహిళల గురించి పనిచేసేవి చాలా తక్కువ. గ్రామీణ మహిళల జీవితాలు అనామకంగా ముగిసిపోకుండా వారి అభివృద్ధి గురించి, వారిని స్వశక్తివంతుల్ని చేయడం ఎంతైనా అభినందనీయం. అంతే కాకుండా వారిని పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయించి 1,874 మంది స్త్రీలను వివిధ పదవులకు ఎన్నికయ్యేలా పాటుపడటం మహిళాసమత సాధించిన అత్యుత్తమ విజయాలలో ఒకటి. అలాంటి సంస్థలో భాగమై తనే సంస్థగా సంస్థే తనుగా అహర్నిశలు సంస్థ గురించే ఆలోచిస్తూ మునుముందుకు వెళ్తున్న పోలవరపు ప్రశాంతితో ఇంటర్వ్యూ..
మీరు మహిళా సమత లో ఎలా చేరారు?
ఎమ్‌.ఎస్‌.డబ్ల్యు.లో ఫ్యామిలీ అండ్‌ చైల్డ్‌వెల్‌ఫేర్‌ స్పెషలైజేషన్‌ చేశాను. డిగ్రీలో కూడా సోషల్‌వర్క్‌ ఒక సబ్జెక్‌గా చదివాను. ఆ ఆసక్తితోనే మహిళా సమతలో చేరాను. రిసోర్స్‌ పర్సన్‌గా మొదట కరీంనగర్‌లో పనిచేశాను. జిల్లా ఇన్‌చార్జ్‌నయ్యను. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వహించాను. ఆఫీసు సిబ్బంది ఎక్కువ లేనందున మూలాల్లోంచి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలిగింది.
మహిళా సమత గురించి చెప్తారా…?
వెనుకబడిన జిల్లాల్లోని మహిళల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. 1986లో జాతీయ నూతన విద్యావిధానం లోంచి ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాల్లో. అందులోను వెనుకబడిన మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మహిళలను విద్య ద్వారా స్వశక్తివంతుల్ని చేయడమే మా సంస్థ లక్ష్యం.
స్వశక్తివంతుల్ని చేయడమంటే…?
పూర్తి స్థాయిలో సామాజిక స్వశక్తి సాధించాలంటే ఒక్క ఆర్థికంగా మెరుగు పడటం ద్వారానే అది సాధ్యం కాదు. విద్య కూడా అత్యవసరం. విద్య అంటే కేవలం అక్షరాస్యతగా చూడటం లేదు మేము. అంతకంటే పెద్ద ఫ్రేములో చూడాలి. ఎలా అంటే స్త్రీలు ఎవరయితే సమాచారానికి, అవకాశాలకి దూరంగా ఉన్నారో అలాంటి స్త్రీలంతా సంఘంగా ఉండి, సంఘటితంగా వారి సమస్యలనుంచి బయటపడటానికి సమాచారం తెలుసుకోవడం, వాటిని వ్యక్తిగతంగా గానీ, కలిసికట్టుగా గానీ అమలు చేయడం, దాని ఫలితాలను పునఃపరిశీలించుకోవడం ఈ మొత్తం ప్రాసెస్‌ని విద్యగా చూడటం జరుగుతుంది.
ఈ క్రమంలో గ్రామీణ స్త్రీలు ఆలోచనని పెంచుకుంటున్నారు. సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. విశ్లేషణా శక్తిని పెంచుకుంటున్నారు. దీని ద్వారా సంఘటిత శక్తి పెరుగుతుంది. ఈ సంఘటిత శక్తి ద్వారా చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. స్త్రీలకు అనుకూలమైన ప్రణాళికల్లో మార్పు రావడం కానీ, ప్రభుత్వం తీసుకురావాలని కానీ అడిగే క్రమంలో వీరి పాత్ర ముఖ్యమైనదిగా మారుతుంది. ఈ క్రమాన్నే స్వశక్తిగా చూస్తున్నాం. ఈ విద్యాక్రమం ద్వారానే సాధికారత సాధ్యమవుతుంది అనే విషయన్ని మహిళా సమత నమ్ముతుంది, పాటిస్తుంది. ఇల్లు, వంట, పిల్లలు అంతవరకే పరిమితం కాకుండా వనరుల మీద ఆధిపత్యం సంపాదించుకోవడం, నిర్ణయత్మక పాత్రల్లో మహిళలుండటం, దానికోసం పంచాయితీల్లో పోటీ చేయడం… గ్రామాభివృద్ధికి అవసరమైన విషయాలేవైతే ఉన్నాయె వాటన్నింటినీ కలిపి అందరూ అందుకునేలా సంఘం పనిచేస్తుంది. స్త్రీల సంఘాలంటే కేవలం స్త్రీల గురించే పాటుపడతాయి అనుకోవడం అపోహ. అందరి గురించి పాటుపడతాయి. ఈ క్రమంలో స్త్రీల కీలక పాత్ర గురించి కృషి చేసేవిగా గుర్తింపు పొందాయి. సంఘాలు ఇట్లా కృషి చేసి, మండల స్థాయిలో ఫెడరేషన్‌ (సవఖ్య)గా ఏర్పడి, ప్రస్తుతం స్వతంత్రంగా పని చేసే
స్థాయికి చేరుకోవడం దానికి ఉదాహరణ.
పంచాయితీల్లో పోటీచేయడం అంటే…?
ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇప్పటికే రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మా సంఘం స్త్రీలు జెడ్‌పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్‌, వార్డ్‌మెంబర్‌ స్థానాలకు 4,272 మంది పోటీ చేశారు. అందులో 8 మంది జెడ్‌పి టిసిలుగా, 123 మంది ఎంపిటిసిలుగా, 192 మంది సర్పంచ్‌లుగా, 1,551 మంది స్త్రీలు వార్డ్‌మెంబర్స్‌గా గెలిచారు.
మహిళా సమత మీలో ఒక భాగమయి పని చేస్తున్న ట్లున్నారు.
మహిళా సమతలో పనిచేసే వారంతా చేసే పనిని ఉద్యోగంగా చూడటం లేదు. మహిళల్ని స్వశక్తివంతుల్ని చేసే క్రమంలో ఎవరికి వారు స్వశక్తులయ్యే క్రమంలో మహిళాసమతకి దగ్గరవడం వల్ల పని గంటలు తదితర సమస్యలనెవర పట్టించు కోరు. ఇందులో ఏమైతే నమ్ముతున్నామో ఇంట్లో కూడా అదే ఆచరించడంతో ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్‌ ఉంటుంది. మహిళా సమత మా అందరి జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగం వేరు, జీవితం వేరుగా లేవు మాకు.
మహిళా సమత ఇప్పుడు ఎన్ని జిల్లాల్లో పని చేస్తుంది?
నేను స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఎసిపి డి) గా జాయిన్‌ అవకముందు ఏడు జిల్లాల్లోని 32 మండలాల్లో పని చేసేది. ఇప్పుడు 12 జిల్లాల్లోని 71 మండలాల్లో పని చేస్తోంది. 11వ ప్రణాళికలో, అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేయాలనేది మహిళా సమత ఆలోచన. పూర్తిస్థాయిలో మహిళల సామాజిక స్వశక్తి కోసం పనిచేసే మొదటి కార్యక్రమంగా మహిళా సమతని చెప్పుకోవాలి.
మీ హాబీలు….
చదవడం! అన్ని రకాల పుస్తకాలు చదువుతాను. చాలా విషయాలు అర్ధం చేసుకోవడానికి, ఆలోచనా పరిధి పెంచుకోవడానికి చదవడం ఒక్కటే మార్గం అని నేననుకుంటాను. రాయడమంటే కూడా చాలా ఇష్టం..
మీ లక్ష్యం..
ఎప్పటికైనా ఒక ఓల్డేజ్‌ హోమ్‌ పెట్టాలనేది నా కోరిక. ఎక్కడయితే వెనుకబాటుతనం ఉందో ఆప్రాంతంలోనే పెట్టాలని ఉంది. అయితే దానికి అనుబంధంగా ఒక అనాధ శరణాలయం కూడా పెట్టాలని ఉంది. వీరి అవసరం వారికి, వారి అవసరం వీరికి ఎంతో ఉంటుంది. వృద్ధులు చాలా ఏక్టివ్‌ అయ్యేటట్లు, ఏదో కోల్పోయామనే భావనలో కాకుండా ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉండేట్లుగా చేయాలని ఉంది. వారిలో చాలా శక్తి వుంది. దాన్ని బయటకు తీసుకురావాలి. వారిని వృద్దులు అనడం కూడా నాకిష్టం ఉండదు. ఎందుంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనేది మనకు తెలిసినదే!
కొత్తతరం గురించి మీ భావాలు….?
కొత్తతరం అన్ని భావాలను స్వీకరించడం అంత కష్టం కాదు. అందుకోసం మహిళా సమత యుక్త వయస్సు బాలబాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయడం ద్వారా వారి ఆలోచనా ధోరణిలో వర్పు తీసుకురాగలుగుతోంది. వారిలో నూతన దృక్పధానికి నాంది పలికింది.
యువతకు మీరిచ్చే సూచనలు….?
సమస్యల నుంచి పారిపోకూడదు. ఎదుర్కో వాలి. జీవితమంతా సాఫ్ట్‌వేర్‌లో లేదు. సమా జంలోన, మనుష్యుల తో తిరగడం, పనిచేయడం వలన జీవిత విలువలేంటో తెలుస్తాయి. దాని ద్వారానే వ్యక్తిత్వ వికాసం, మేధోపరమైన ఆలోచనా ధోరణి, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడతాయి. మెటీరియలిస్టిక్‌గా ఉండటం కాకుండా, జీవితాన్ని జీవితంలాగా తీసుకోగలిగితేనే గుణాత్మకమైన యువత తయారవుతుంది.
మీకు స్పర్తి ఎవరు?
నాకు వ్యక్తి స్పర్తి కాదు, సమాజం, సమాజంలోని లోటుసాట్లు, మంచి చెడులు.
సహచరుడు రాంబాబుగారిది కూడా ఇదే మాట, ఇదే బాట! ఇదే వృత్తి, ప్రవృత్తి!
అమ్మ అనూరాధ, నాన్న ఉమా మహేశ్వరరావు గారు చిరునవ్వులతో తెలిపే ప్రోత్సాహం, అందరి సహకారంతో ఒక నిశ్శబ్ద విప్లవం… మున్ముందుకు సాగిపోవాలని ఆశిద్దాం!

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.