సీతారాం
నిజమే!
అయిడియాలు జీవితాల్ని సమూలంగా మార్చేస్తాయి. మార్పును కోరుకునే వాళ్లు కొత్త ఐడియాలతో ముందుకు పోతారు.
మన జీవితాలను మార్చుకునే ఏ ఒక్క అయిడియా మనకు తట్టనే తట్టదు. జీవితాలు స్తంభించిపోవడానికి అయిడియాలు ఆగిపోవటమే కారణం.
నన్నపనేని రాజకుమారి గారికి వచ్చే అయిడియాలు కవిత్వరపంలో వ్యక్తమవుతాయి. వీటిని కాసేపు సామాజిక ఐడియాలు అందాం. ఆమెకొచ్చే రాజకీయ అయిడియాలు తిట్లరపంలో వస్తాయేమో! దూషణలుగా దూసుకు పోతాయేమో! ఆ మధ్య గంగాభవానీ గారు రాజకుమారిగారి ఇంటి గేట్లు ఎక్కడానికి కారణం ఈ ఐడియాలను కొట్టేయడానికి అయ్యుంటుం దని మా మిత్రుడొకడు చమత్కరించాడు. వీరిద్దరి ఐడియాలు ఇట్లా ఉంటే రోజాకి ప్రెస్‌క్లబ్‌లో మరో ఫ్లాష్‌లాంటి ఐడియా వచ్చి సభలో చెప్పేసింది. కె.సి.ఆర్. పట్ల అట్లాంటి ఐడియాని పబ్లిక్‌గా చెప్పినందుకు చాలా మంది చాలా చాలా ఐడియాలతో ప్రతిస్పందించారు.
ఆ మధ్య ఎప్పుడో విజయశాంతికి హఠాత్తుగా ఓ అయిడియా వచ్చి తాట తీస్తానందిట. ఈ ఐడియా నచ్చక మరెవరో తోలుతీస్తా, కోస్తా అని ప్రతి ఐడియాలు పలికారని పత్రికలు రాశాయి కూడా.
తెలంగాణా కోరుతున్న వారందరికీ మనకొక్క తల్లి ఉంటే బావుంటుందని ఐడియా వచ్చింది. వెంటనే తెలంగాణా తల్లి విగ్రహం రపుదిద్దుకుంది. ఆ విగ్రహమో, బొమ్మో చూసిన వాళ్లకి తెలంగాణ తల్లి కనిపించలేదు. కాని ‘తెలంగాణా దొరసాని’ కనిపించింది. ఎవరికి వచ్చే అయిడియా స్థాయిని బట్టి తెలుగు తల్లి అయినా, తెలంగాణా తల్లి అయినా స్ఫురిస్తుంది.
ఏమైనా సరే ఐడియా ముఖ్యం. మొన్నీ మధ్య కె.సి.ఆర్.కి వచ్చిన అయిడియా చూశారుగా! నిజాం గురించి. అయిడియాలు అందరికీ వస్తాయి. వచ్చిన వెంటనే బైటపెట్టకూడదని కె.సి.ఆర్. తాజా ఉదంతం తెలియజేస్తుంది. కె.సి.ఆర్. ఐడియాపై గద్దరన్న గరం గరం కార్యక్రమమే తీసుకున్నడు. అంటే ఏమిటంటే ఐడియాలు ఐడియాలకి తల్లులవుతాయని అర్థం.
ఐడియా కంపెనీ వాడికి బ్రహ్మాండ మైన ఐడియా వచ్చి మనుషు లందరికీ నెంబర్లు కేటాయించాడు. ఒక ప్రకటనలో అభిషేక్ బచ్చన్ వెనకాల నిలబడి భుజాలు వినయంగా వంచి సేట్జీ వ్వాట్టాన్ ఐడియా అని ప్రశంసించే మనిషి ముఖమే నాకు గుర్తొస్తోంది. కార్పోరేట్ పెట్టుబడి ఫ్యూడల్ వేషంలోకి మారింది చూశారా? ఏ రూపంలోకి అయినా ఇట్టే ప్రవేేశించగల సర్వాంతర్యామి పెట్టుబడి. అది తన లాభాన్ని తాను వెతుక్కోగలదు. లాభాన్వేష ణలో అది ఎంత దూరమైనా పోగలదు. కానీ, మనమేమిటి వాటికి లాభాలు సంపాదించిపెట్టే విశాల వర్కెట్లమయ్యాం. బిగు బజార్లమయ్యాం. షాపింగు వల్స్‌మయ్యాం. నెక్లెస్ రోడ్లమయ్యాం, ‘రిలయన్స్ ఫ్రెష్’ లమయ్యాం, ఇంకా ఏదో అయ్యాం. సామాజిక పరివర్తన కోసం, మెరుగైన సమాజాల నిర్మాణం కోసం, మిల్లీనియం డెవలప్‌మెంట్లకోసం స్వచ్ఛంద సంస్థలకు అసంఖ్యాక ఐడియాలు వస్తనే ఉంటాయి.
ఎవరి ఐడియాలో మనల్ని నడుపుతున్నాయి. వాటికి అనుకూలంగా మనల్ని రూపుదిద్దేశాయి. యు.పి. నుంచి వచ్చిన బిపిన్ ఓ హోటల్‌లో మూడు వేలకు మాత్రమే పనిచేస్తున్నాడు. బిపిన్ స్కూల్ డ్రాపవుట్. బిపిన్ పనిచేస్తున్న నగరంలోనే నెలకు లక్ష రపాయలు సంపాదిస్తూ యువత పనిచేస్తూ ఉన్నది. మన ఆంధ్ర దేశం నుంచి కూడా అనేక రాష్ట్రాల్లోకి, దేశాల్లోకి, ఖండాల్లోకి ఖండాంతరాలకూ వెళుతూనే ఉన్నాం అనేక అయిడియాలతో.
సంక్షేమ వసతి గృహాల్లో చలి ఎక్కువని తెలుగుదేశం దుప్పట్లు పంచటం ఇన్నోవేటివ్ అయిడియా కాక మరేమిటి, అనధికార అయిడియాలతో ప్రతిపక్షం ఆ విధంగా మున్ముందుకు పోతున్నది.
చిరంజీవికి రాజకీయల్లోకి రావాలని ఐడియా ఎప్పుడొచ్చిందో తెలీదు కాని, ఆయనింకా తటపటాయిస్తున్నారు. చిరంజీవి అయిడియా క్లిక్ అయితే మరో ముఖ్యమంత్రిని చూడగలుగుతామని ఆంధ్రప్రదేశం అభిలషిస్తోంది.
నిన్నటి వరకు నువ్వు నీలాగా ఉన్నావ్. ఇక నేడు, రేపూ నువ్వు నీలాగా ఉండవు. ఎందుకంటే అయిడియాలు అడుగంటి పోయాయి. నీ బ్రాండెడ్ చొక్కాలో నువ్వు బాండెడ్ లేబర్‌వి. తృతీయ ప్రపంచదేశపు ఒకానొక కుక్కవి. ఇది ఎవడి IDEA?