నెల్లుట్ల రమాదేవి
జనవరి ఇరవై రాత్రి ఏడూ – ఎనిమిది మధ్య సమయం
విజయ్ హైస్కూల్ నిజామాబాద్ ఆవరణలో మేం
చూసేది భూమిక ఆధ్వర్యంలో వస్తున్న మిత్రుల కోసం ఆరాటం ఎంతకీ రాని బస్సుకోసం
గేటుకు చూపుల్ని అతికించాం
కళ్ళను వాచీలకు అంటించాం
మధ్య మధ్య నిట్టూర్పులు విడిచాం
ఎనిమిదింటికి బస్సు రాగానే ఎదురెళ్ళాం
బిలబిలమంటూ దిగిన మిత్రబృందం
ఎవరి శైలి వారిదే ప్రత్యేకం
నూటెనభై మైళ్ల ప్రయాణం
అయినా ఎవరి ముఖంలోనూ అలసట ఎరుగం
కరచాలనలూ, కుశలప్రశ్నలూ
కాఫీలూ, టీలూ అయిందనిపించాం
తలుపులు మూస్తారనే భయంతో గుడివైపు కదిలాం
ఆనందం – అపురూప స్వామి దర్శనం
అనంతరం ‘సాంత్వన’లో ఉన్నామో క్షణం
అంతలోనే హడావుడిగా ‘లాలన’ వైపుకు తిరిగాం
ఆశ్రమంలో వృద్ధులకు సగం సంతోషం
మిగతా వారు నిద్రపోయారు పాపం
ఆ రోజటి మజిలీ ‘ఆహ్లాద’ను చేరాం
అమృతలత గారి అపూర్వ అతిథ్యం
షడ్రసోపేత భోజనం
తెప్పించింది భుక్తాయాసం
అయినా తగ్గలేదు ఏ మాత్రం ఉత్సాహం
ఆట పాటల్తో సాగింది సంబరం
అందులో కొందరిది నృత్య కౌశలం
వెన్నెల్లో హాయిగా తడిసామందరం
వేకువనే లేవాల్సి ఉందని పక్కలపై ఒరిగాం
జనవరి ఇరవైఒకటి ఉదయం
ఆహ్వానించింది పోచంపాడు జలాశయం
క్రిందా పైనా ఒకటే నీలి సాగరం
ఉరకలేసింది ప్రతి హృదయం
నీటికీ, కన్నీటికీ మనిషితోనే కదా బంధం
మళ్ళీ కదిలింది వాహనం
ఈసారి పొచ్చెర జలపాతం
తనువూ మనసూ ఏకమై తడిసాం
ధారాపాతపు జడుల్లా కురిసాం
విద్యుత్ జలపాతాలమై మెరిసాం
కొందరి కొంగుల్ని కొంటెగా ముడులేసాం
ఆ దృశ్యాల్ని ఫోటోల్లో బంధించి మురిసాం
వీడలేక ఆగలేక వదిలాం
కథలూ, కబుర్లూ విన్నాం
నవ్వుల్నీ, నారింజల్నీ తిన్నాం
కాసేపట్లో కుంటాల చేరాం
మోకాళ్ళూ, పాదాలూ మొరాయించిన వాళ్ళను వదిలాం
మిగతా వాళ్ళు చూసాక వెనుదిరిగాం
అంతలోనే మొండిగుట్ట చేరాం
అడవి మధ్యలో అందమైన గృహం
జింక పిల్లల్ని చూసాం
పిల్ల జింకలుగ మారాం
ఎలుగుబంట్లని చూసాం
ఎదుటివారి స్నేహితులంటూ వెక్కిరించాం
నిజామాబాద్ ‘విజయ్’ బృందం
ప్రదర్శించారు జానపద నృత్యం
ప్రశంసించాం ప్రతి ఒక్కరం
మధ్యాహ్న భోజనం మహాద్భుతం
అది అడవిలో అమృతమన్నది సత్యం
మెప్పు పొందారు కరుణ కల్పన సోదరీద్వయం
రాంరెడ్డి గారిది గొప్ప నిర్వహణాసామర్థ్యం
కాదు లేదంటూనే మెండుగా లాగించాం
ట్రాక్టర్లవైపు నడక భారంగా సాగించాం
చిక్కని అడవి గుండా ప్రయాణం
ఆకుల సందుల్లోంచి జారిన సూర్యకిరణాల్ని దోసిట పట్టాం
వాగులూ, వంకలూ దాటుతూ కేరింతలు కొట్టాం
నవ్వుల నదిలో కదిలే పడవలమయ్యాం
ఆదివాసీల అచ్చమైన ఊరు ‘బురకరేగడి’ చేరాం
గోండుల నృత్యానికి మైమరిచాం
కొందరం అందులో అడుగులు కదిపాం
ఆ గుడిసెలూ, మనుషులూ, పచ్చదనం అంతా స్వచ్ఛం
అయినా ఏ సౌకర్యమూ లేక ఎలా వుంటారని ఆశ్చర్యం
వాళ్ళతో ఆడిపాడుతూంటే తెలియలేదు సమయం
చూస్తూండగానే వచ్చి వాలింది సాయంత్రం
మొత్తం అందరం
మొండిగట్టు చేరాం
‘బంద్ బంద్’ నృత్యం
బలే బలే అన్నారు బృందం
మళ్ళీ భోజన కార్యక్రమం
కొనసాగింది సత్వరం
కాలం రెక్కల గుర్రం
ఆగదుగా ఏ క్షణం
కదలక తప్పని తరుణం
అందుకే వెనుదిరిగాం తక్షణంను
‘భూమిక’ బృందానికి వీడ్కోలు చెప్పాం
వారు ఉట్నూరు, మేము ఆర్మూరు దారులు పట్టాం
అందమైన అనుభూతులెన్నో మూట కట్టాం
అందరితో పంచుకోవాలని అక్షర మాల కట్టాం.