– లత (మున్ని)
సత్య & గ్రూప్‌తో ఆదిలాబాద్ టూర్‌కి వస్తావా అని గీతక్క అడగ్గానే కర్నూల్ ట్రిప్ గుర్తొచ్చింది. ప్రకృతి ఒడిలోకి ప్రయాణం. అందుకే వెంటనే వస్తానన్నాను. ప్రయాణపు మొదటి మజిలీ అమృతలత గారి సొంత గృహం. అమృతలత గారు, వారి గ్రూప్ యొక్క ఎదుర్కోలు, ఆతిథ్యం మరుపురానివి. వారు ఆడించిన ఆటలు, వారాడిన ఆటలు, పాటలు, నాటికలు, రమగారి జోక్స్, ఆంకరిం గ్ (బుర్కరేగడి గ్రామానికి ట్రాక్టర్‌లో వెళ్ళి, వచ్చేటపుడు) మధురానుభూ తిని మిగిల్చాయి. ఆలయాలు, విద్యాసంస్థలు నడపడం, వృద్ధాశ్రమం నడపడం, రచనా వ్యాసంగం, అడపాదడపా ఎంతో మంది కవులూ, కళాకారులూ, మేధావులు, రచయిత్రులూ… ఇలా ఎందరికో ఆత్మీయ ఆతిథ్యమివ్వడం ఇవన్నీ అమృతలత గారు, తన సైన్యం (సైన్యం అని ఎందుకన్నానంటే ఎంతో క్రమశిక్షణతో జీవితాన్ని లీడ్ చెయ్యకపోతే ఇవన్నీ సాధ్యం కావు కనుక) ఎక్కడా వాగాడంబరాలు ప్రదర్శించకుండా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈ గ్రూప్‌తో పరిచయం నేనూహించనిది. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం అని ఏమీ అడగకుండా వెంటబడి వచ్చాను కదా! అందుకే అమృతలత గారిని, వారి సైన్యం రమాదేవి గారు, ప్రభ గారు, సుజాత గారు, వసంత గారు, సునీత గారు మొదలైన అందరినీ వారి ఉత్సాహాన్నీ, చైతన్యాన్ని నోరెళ్ళ బెట్టుకొని చూడటమే సరిపోయింది. అందుకే తీరా టూర్ ముగించి ఇంటికొచ్చాక వారితో సరిగా ఇంటరాక్ట్ కాలేకపోయానే అని అనిపించింది. వీరే కాదు నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అడవి మధ్యలో ఇల్లు కట్టుకొని (మొండి గుట్టలో) జనారణ్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఏకాంత వాసం చేస్తూ ఇంత గుంపుకు చక్కని ఆతిథ్యమిచ్చిన వినత గారి కుటుంబం, బుర్కరేగడి గ్రామంలో కొమరం భీం స్మారకస్థలి, ఝరీ, కెరమెరిలో గోండు తెగ ప్రజల పరిచయం, అల్పాహార విందు, లంచ్, మరియు సమత ఆధ్వర్యంలో నడుస్తున్న పిల్లల ఆశ్రమం, పిల్లల ఆతిథ్యం, వారి మనోస్థైర్యం ఇలా ఈ ట్రిప్‌లో పరిచయం చేయబడ్డ ప్రతి ఒక్కరూ నాకు నేను నేర్చుకోవలసినది ఎంతో ఉంది అనే విషయాన్ని పదే పదే గుర్తుచేసాయి. అందుకే ఈ ట్రిప్ ఒక ఎడ్యుకేషనల్ టూర్‌లా ఉంది నాకు. కృతజ్ఞతలు.