– వి. శాంతిప్రభోద
నేను పుట్టింది వరంగల్ జిల్లాలో అయినా పెరిగిందంతా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని బుద్దిపల్లిలో. మా పెద్దమ్మలు, మామయ్యవాళ్ళ ఊరు దండేపల్లి మండలంలోని తానిమడుగు వెళ్ళినప్పుడల్లా గోండులు, నాయకపోడ్, లంబాడా గిరిజనులను చూస్తూనే ఎదిగాను. అలా నడుచుకుం టూ గుట్టలకేసి సాగిపోయే వారిని గోండులు అంటారని అప్పుడే తెలిసింది. జాకెట్ వేసుకోకుండా చీర కొంగునే వక్షస్థలంపై చుట్టుకునే వారిని వింతగా చూసేదాన్ని. వారి ఆహార్యం భిన్నంగా ఉండడం నన్ను ఆకట్టు కునేది. వాళ్ళు ముక్కుకి, చెవులకి పెట్టుకునే పెద్దపెద్ద ఇత్తడి చెవిపోగులు, జాకెట్లు వేసుకోని చీరకట్లు, వెడల్పాటి పెదాలతో, చప్పిడి ముక్కుతో, చిన్న కళ్ళు, గుండ్రటి మొహం, నలుపు ఛాయతో ఉండే వారి ముఖకవళికలు నాకు గుర్తు. వారి గూడేనికి వెళ్ళింది లేదు. ఒకసారి వెళదామని మా అన్నవాళ్ళని అడిగితే వాళ్ళ గూడేనికా… అని, దాదాపు పది కిలోమీటర్లు నడవాలి. కనిపించే గుట్టలు ఎక్కి దిగాలి. వెళ్తే అక్కడ పదిహేనో ఇరవయ్యో కుటుంబాలు ఉంటాయి అంతే. దట్టమైన అడవిలో నువ్వు నడవగలవా… గుట్టలెక్కగలవా అంటూ నా ఉత్సాహాన్ని నీరసపరిచాడు. అంతే మరింకెప్పుడూ ఆ ఆలోచన చెయ్యలేదు. కానీ ఆ కోరిక చావలేదని ఇప్పుడే తెలిసింది. ఇదిగో ఇప్పుడు అనుకోకుండా…
మా ప్రశాంతిగారు (స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ) 18వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి, 22వ తేదీ సాయంత్రం దాదాపు 25 మంది రచయిత్రులు సమతానిలయానికి వస్తారని వారి ట్రిప్ గురించి చెప్పినప్పుడు నాకు తెలియకుండానే అనాలోచితంగా అడిగేశా. నేనూ రావచ్చా అని. వెంటనే ప్రశాంతి తప్పకుండా రావచ్చు అన్నారు. సత్యవతిగారు కూడా ఆనందంగా ఆహ్వానించారు. ఏదైనా నా కోసం అడగాలంటే మొహమాటపడే నేను ఎలా అడిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత ఆలోచిస్తుంటే…
ఆనందం నన్ను నిలువనీయలేదు. అయితే వచ్చే 25 మందిలో నాకు తెలిసినవాళ్ళు ఉంటారో… ఉండరో… అన్న సందేహం. ప్రశాంతి, సత్యవతి గార్లు ఉంటారు కదా, వారితోపాటు అమృతలత గారి బృందం ఉంటుంది కదా అని సర్దిచెప్పుకున్నా… ఇలాంటి ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు మనసులోని భావాలు కలబోసుకోవడానికి ప్రియమిత్రులు లేదా నా తరహాలో ఆలోచించేవాళ్ళతో కలసినట్లుగా కొత్తవాళ్ళతో కలవలేనేమోనన్న మీమాంస ఒకవైపు ఉన్నప్పటికీ, అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం వదులుకోకూడదనుకుంటున్న సమయంలో అమృతలత గారి నుండి ఫోన్ సాయంత్రం 6 గంటల వరకూ నిజామాబాద్ వచ్చేయ్యమని. ప్రోగ్రాం షీట్‌తో పాటు పార్టిసిపెంట్స్ లిస్టు పంపారు. ఆవిడ ప్లాన్ చేసిన షీట్ చూడగానే అమ్మ హేమలతాలవణం గుర్తొచ్చారు. ప్రతిదీ ఒక పద్ధతిగా చక్కటి ప్రణాళికతో చేయడం. ఎంత చిన్న విషయాన్నైనా వదలకుండా పర్యవేక్షించడం హేమలతగారి తర్వాత అమృతలత గారినే చూశాను. అందుకే ఆ నిర్వహణాసామర్థ్యమే విజయాసంస్థలు ఊడలమర్రిలా విస్తరించడానికి కారణమై ఉంటుందనిపించింది.
మధురమైన అనుభూతుల్ని, అనుభవాల్ని మదిలో పదిలపరుచుకున్నాను.
ట్రాక్టర్‌పై మా ప్రయాణం గులకరాళ్ళు, బండరాళ్ళతో కూడిన పాములా మెలికలు తిరిగిన బాటలో గుట్టలు, వాగులు వంకలు పెద్దపెద్ద చెట్లు దాటుతూ సాగింది. విప్ప, నల్లమద్ది, తెల్లమద్ది, టేకు, మోదుగ, తునికి, కుంకుడు, ఉసిరి, దిరిశెన, జువ్వి, మామిడి, ఈరికి వంటి ఎన్నో మొక్కలు, చెట్లు, వృక్షాలు… ఈరికి చెట్టు చూడగానే మా పొలాన్ని వొరుసుకుంటూ పారే ఒర్రే అది దాటగానే ఉండే ఈరికి చెట్టు, ఆ చెట్టెక్కి మేం కోసుకు తిన్న ఈరికిపళ్ళు గుర్తొచ్చాయి. కాస్త జిగురుజిగురుగా ఉండే ఆ పళ్ళు కోసం మేం పోట్లాడుకున్న క్షణాలు, అవి తింటూ చెట్లపై గెంతే కోతులకు మేం పోటీ అయ్యామని మమ్మల్ని గుర్రుగా బెదిరిస్తూ చూడడం. మావెంట మా బూంటి (పెంపుడు కుక్క) లేకపోతే అవి మాపై పడి కసి తీర్చుకునేవే… మా పొలం వెనక ఉన్న వాగుల్లో, వొర్రెల్లో ఈతకొట్టడం, ఆ నీళ్ళలో తిరిగే బుల్లిబుల్లి చేప పిల్లల్ని దోసిట్లోకి పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలూ… చెలిమెలు తీసి ఆకులతో చేసిన దొప్పలతోనో, దోసిటతోనో నీళ్ళు తాగడం వంటి జ్ఞాపకాలు నన్ను ముసిరివేస్తుండగా… మాటలు… పాటలు… కలబోసుకుంటూ… ఒక్కోరకం చెట్టు చూస్తూ దాని గురించి చెప్పుకుంటూ విప్పచెట్టుకోసం కళ్ళతో అన్వేషిస్తూ… రకరకాల ఆకులు గమనిస్తూ… ఆకాశంకేసి చూసే చెట్ల కొమ్మల ఆకుల మధ్య నుండి తొంగిచూసే ఆకాశాన్ని, ఆకారాలు మార్చుకుంటూ సాగే మబ్బు తునకల్ని… అడవి మల్లెల వాసనల్ని ఆస్వాదిస్తూ… ఆ వృక్షాల మధ్య కన్పించిన బాదం చెట్టు చూసి ఆశ్చర్యపోతూ… అంత్యాక్షరి ఆడుతూ వెళ్తోంటే మధ్యలో పత్తి, గోధుమ, శనగ పైర్లు గమనిస్తూ… ఖానాపూర్ మండలంలోని బుర్కరేగడి చేరాం… అంతా తమతమ పనులు ఆపి మమ్మల్ని వింతగా, చిత్రంగా చూస్తూ… ఏ పల్లెకు వెళ్ళినా ముందుగా పలకరించే కల్లు దుకాణం కాకుండా, పిల్లలూ-పెద్దలూ… గోవులూ… మేకలూ… మాకు ఆహ్వానం పలుకుతూ.
ఒకే ఒక వీధి. మా పెద్దమ్మవాళ్ళ ఊరు తానిమడు గులాగే. ఆ వీధికి అటూ ఇటూ ఇళ్ళు. అన్నీ తూర్పుకు నడిచే విధంగా… ఆ ఇళ్ళ ముందు నాగలి, గొర్రు, ఎడ్లబండి, బండిచక్రాలు. వాటిని చూస్తుంటే నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎప్పుడో కోల్పోయినవాటిని పొందిన భావన.
ఇంటి ముందున్న దడికి కాసి ఎండిపోతున్న చిక్కుడుకాయలు, 8 ఆకారంలో ఉన్న సొరకాయలు… కొత్తలు పండుగ చేసుకునేవరకూ వాళ్ళు వాటిని కోయరట! తినరట!!
ఇళ్లన్నీ దగ్గరదగ్గరగా… 58 కుటుంబాలు, ఎక్కువగా కూన, రేకుల ఇళ్లే. ఒకే ఒక గది. ఇటుకగోడలతోపాటు, టేకువంటి కర్రల్ని గోడలకి వాడడం చూస్తే వాటి విలువ తెలియదనిపించింది. ఒక్క గదిలోనే కుటుంబమంతా. ఒకప్పుడు అన్నీ గుడిసెలే ఉండేవట. ఊళ్ళో విద్యుత్ సౌకర్యం ఉంది. ఊరంతా కలసి విద్యుత్ లైన్ వేసుకున్నారట. ఎవరికీ మీటర్లు లేవు. ఎప్పుడో ఒకసారి ఆరోగ్యకార్యకర్త చుట్టంచూపుగా వస్తుండట. రావాలన్నా కష్టమేగా…! ఎవరికి ఏ సమస్య వచ్చినా 10 కి.మీ. నడచి మొండిగుట్ట వస్తే అక్కడినుండి నిర్మల్ వెళ్ళవచ్చు. లేవలేని పరిస్థితిలో ఉన్నవారిని రెండు కర్రలపై (పాడె కట్టినట్లుగా కట్టి) వారిని మోసుకుపోతారట. ప్రాథమిక పాఠశాల ఉంది. పంతులు రోజూ కాకపోయినా వస్తాడట.
గూడెంలో కల్లు తాగే అలవాటు కొద్దిమందికి మాత్రమే ఉందట. తాగాలనుకునేవారు 8 కి.మీ. దూరంలోని మరో గ్రామం నుండి తెచ్చుకు తాగుతారట. చాలామంది యువకులు పొగ తాగుతారు. ఒకరు మాత్రం నిర్మల్‌లో ఇంటర్ చదువుతున్నాడు. అది చదవడమే వాళ్లకి ఎక్కువ అనుకుంటారు. ఆడపిల్లలు ఎవరూ హైస్కూల్ చదువుకోలేదు. నెలసరి దినాల్లోనూ, పురుడు ఆ తర్వాత కొన్ని రోజులూ ఇంట్లోకి రానివ్వరట. దూరంగా ఒక గుడిసెలో ఉంటారట. నేను అలా గోండి మహిళలతో ముచ్చట్లాడుతుండగానే డప్పు శబ్దం. అక్కడున్న అందరినీ ఆకట్టుకుంటూ… అటుకేసి నాలుగడుగులేస్తే ఒళ్లంతా నలుపురంగు పులుముకొని విచిత్ర వేషధారణలో నలుగురు యువకులు. వారి తలలపై నెమలిపింఛాల్తో చేసిన గుస్సాడి కిరీటం/పాగా, దానిపై కొమ్ములు ఆ రెండు కొమ్ముల మధ్య రెండు అద్దాలు, ఎడమ భుజంపై జింకతోలు, మెడలో గవ్వలు, తుంగ గడ్డల పూసలతో చేసిన హారాలు, నడుముకు లంగాలాంటి వస్త్రం, దానిపై ఒక గంట, మణికట్టుకు మువ్వలు, గంటలు కట్టుకొని, కాళ్ళకి గజ్జెలు ధరించారు. చేతిలో చిన్న రోకలి నలుపు రంగు పులుముకున్న మొహంపై కళ్ళ దగ్గర చారికల్లా చర్మం తొంగిచూస్తూ… కృత్రిమ గడ్డాలు, మీసాలూ, చేతిలో కర్ర పట్టుకుని డప్పు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ… గుస్సాడి నృత్యం చేస్తూ… మొదట మెల్లగా ప్రారంభమైన వాద్యశబ్దం రానురానూ పదవిన్యాసంతోపాటు ఉధృతమవుతూ… మా అందరిలో ఉత్తేజం కలిగిస్తూ… అందరినీ ఆ నృత్యంలోకి రా రమ్మని ఆహ్వానిస్తూ… నాగరిక సమాజానికి దూరంగా వీరు వేసే దరువు కొండా కోనలల్లో మారుమోగుతూ… గోండుల సంస్కృతిలో మమ్మల్ని భాగం చేస్తూ… మహిళలూ నృత్యగానాలు మొదలుపెట్టారు… మా బృంద సభ్యులూ జత కలిసి స్టెప్పులేశారు.
రాజగోండులకు పెద్ద పండుగ దీపావళి అట. దీపావళికి ముందు వచ్చే పున్నమి నుండి నరకచతుర్దశి వరకూ గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారట. దీన్ని ‘దండారి’ పండగ అంటారట. గుస్సాడి నృత్యం చేసేవారిని దేవతలు ఆవహిస్తారని వారి నమ్మకం. చాలా నిష్టగా ఉండి గుస్సాడి నృత్య సాంప్రదాయిక వస్త్రధారణ చేస్తారట. నృత్యకారుడి చేతిలో ఉండే రోకలిలాంటి కర్రను తాకితే జబ్బులు రావని, వచ్చినా నయమవుతాయని వారి నమ్మకం. ఈ పండుగను తమ గ్రామంలో జరుపుకోవడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో సంబంధాలు పెంచుకుంటూ దండారి బృందమంతా మరో గ్రామానికి అతిథులుగా వెళ్తారు. వారికి పొరుగూరువారు అతిథిమర్యాదలతో స్వాగతం పలుకుతారు. అక్కడ వారి ఆటపాటా ప్రదర్శిస్తారు. తమ గూడేలు, వ్యవసాయభూములు, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటామని నారాయణ చెప్పారు. ఇలా చుట్టుపక్కలవారితో స్నేహసంబంధాల్ని పెంచుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ విందు వినోదాలతో కాలక్షేపం చేయడం వారికెంతో ఇష్టమట.
మామూలుగా తమ పండుగ సమయాల్లో, జాతరలు ఉత్సవాల సమయాల్లో మాత్రమే గుస్సాడి నృత్యం చేసే వీరు మాకోసం చేయడం మాకిస్తున్న గౌరవంగా భావించాం. వారి ఆత్మీయత, స్నేహభావం చూస్తే ముచ్చటేసింది.జజ జజజ జజజ
జోడేఘాట్ వెళ్తున్నామన్న ఉద్విగ్నత మనసులో… అల్లం రాజయ్య, సాహులు రాసిన కొమురం భీం నవలలో అతని గురించి చదివి ఉండడంతో, ఆనాటి నిజాం ప్రభుత్వం గిరిజనుల పంటల్ని దోచుకుపోతుంటే, మేకలను గొర్రెలను ఎత్తుకుపోతుంటే ఎదురుతిరిగినవాళ్ళని చిత్రహింసలకి గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ, గూడేలను తగలబెడుతుంటే సహించలేక తిరుగుబాటు చేశాడు కొమురం భీం. కొందరు ద్రోహులవల్ల శత్రువుల చేత చిక్కి జోడేఘాట్‌లో ప్రాణాలు అర్పించిన అమరుడి తలపులతో సాగింది ప్రయాణం… జల్, జంగిల్, జమీన్‌పై హక్కు కోసం రక్తం చిందించిన కొమురం భీంతో పాటు మరో 11 మంది గోండు వీరులను తనలో ఇముడ్చుకున్న ఆ నేలపై అడుగుపెట్టడం… వారి అమరత్వానికి చిహ్నంగా వెలసిన స్తూపం… మాలో తెలియని స్ఫూర్తిని నింపింది.
గోండి, తెలుగు, మరాఠి, హిందీ భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి వారి మాటల్లో. గోండులతోపాటు కొలామ్, ప్రదాన్ (పర్దాన్), ఓజ, తోటి వంటి గిరిజన తెగలు అక్కడ ఉన్నాయి. కొలామి భాష గురించి ద్రావిడ భాషల గురించి చదివినప్పుడు విని ఉన్నాను. అతికొద్దిమంది మాత్రమే ఆ భాష మాట్లాడేవారు మిగిలి ఉన్నారని వారు మన రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లాలోను, ఉత్తర భారత్ ఒక దగ్గర మాత్రమే కొలామి భాష మాట్లాడేవారు ఉన్నారన్న విషయం గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఆ కొలామి తెగవాడు తెలుగు, గోండి భాషలు మాట్లాడడంతో కొలామి భాష అంతరించిపోతున్న జాబితాలో చేరింది.
పర్ధాన్ వాళ్ళే ఈ ప్రదాన్‌లు అని సాకృబాయి చెప్పినప్పుడు మా బుద్దిపల్లిలో ఉండే పర్దాన్‌వాళ్ళు గుర్తొచ్చారు. పర్దాన్‌లు, కోలాములు గోండులకన్నా తక్కువస్థాయివారట!
ఒకప్పుడు స్వతంత్రంగా రాజ్యాలేలిన గోండులు… వారికి చెందిన కోటలు, ఇప్పటికీ శిథిలావస్థలో ఆదిలాబాదు జిల్లాలో కనిపిస్తాయని గుర్తొచ్చి, ప్రస్తుతం వీరి జీవనాన్ని చూసి మనసు మూగదయింది. దాదాపు 500 ఏళ్ళు పాలించిన రాజగోండులు అంతరించి మరట్వాడా రాజులు చేతిలోకి అటునుండి నిజాం చేతిలోకి వాళ్ళ రాజ్యం పోవడంతో వారు చెల్లాచెదురు అయి ఉంటారేమో…
ఇప్పటికీ పెళ్ళిళ్ళు, పండుగలు-పబ్బాలూ, ఇతర సాంప్రదాయక వ్యవహారాలు మాత్రం తమదైన ప్రత్యేక పద్ధతుల్లోనే జరుపుకోవడం విశేషం.
విస్తారమైన అడవి వున్న ఆదిలాబాద్ అడవుల్లో పోడు వ్యవసాయం చేసి సాంప్రదాయక పంటలైన జొన్న, సజ్జ, కొర్రలు, కంది, పెసర, ఆముదాలు, నువ్వులు, కుసుమలు వంటి వర్షాధార పంటలు పండించే వీరి భూములపై మైదానప్రాంతాలవాళ్ళ కళ్ళుపడి భూమి వారి చేతుల్లోకి బదిలీ అవడం, రిజర్వ్ ఫారెస్ట్ విధానాలు వీరిని తామున్న అడవి నుండి వెళ్లగొట్టాయని, ప్రభుత్వ అటవీ చట్టాలు కూడా అడవి బిడ్డల బతుకు దుర్భరం చేస్తున్నాయని బుర్కరేగడిలో వారి నాయకుడు చెప్పినప్పుడు బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదా అన్న ఆలోచన.
గోండు భాషలో కొన్ని పుస్తకాలు లభ్యమయ్యాయని అయితే అవి చదవడం తెలిసిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారని ఎక్కడో జయధీర్ తిరుమలరావు గారి వ్యాసం చదివి ఉన్నా. గోండి భాషలో పుస్తకాలని విడుదల చేస్తున్నారని సాక్రుబాయి ద్వారా విన్నప్పుడు కలిగిన సంతోషంతో అంతరించిపోతున్న భాషని కాపాడిన భాషాభిమానులకు మనసులోనే అభినందనలు తెలుపుకున్నా.
మైదాన ప్రాంతాల వారి ప్రభావంతో, పురుగు మందుల కంపెనీల మాటల హోరుతో పత్తి పంట వేసి ఎంత నష్టపోతున్నది వారు తెలుసుకోలేకపోతున్నారని కెరెమెరి మండలంలోని ఝరి గ్రామానికి వెళ్ళినప్పుడు పదవీవిరమణ చేసిన వ్యవసాయాధికారి రాజయ్య ఆవేదన అక్కడి చెలకలను చేలను చూసినప్పుడు అర్థమయింది. జీవవైవిధ్యం మాట్లాడుతూ ఇట్లాగే ఇబ్బడిముబ్బడిగా ఎరువులు, పురుగు మందులు వాడుతూ పోతే మరో నలభై యాభై ఏళ్లలో భూమి చచ్చిపోతుంది. అందుకే మనిషిని, భూమిని కాపాడే పనిలో ఉన్నామని చెప్పినప్పుడు ఒళ్ళు పులకరించింది. సాంప్రదాయిక జొన్న, మచ్చ కంది వంటి విత్తనాలను ఊరుఊరు తిరిగి సేకరిస్తూ, సేద్యం చేస్తూ ఆ పంటలను ఎక్కువ మొత్తంలో పండించడానికి ప్రయత్నాలు చేస్తున్నవారికి శిరస్సు వంచి నమస్కరించాలనిపించింది.
కుసుమల్తో చేసిన కారప్పొడి, మక్క గట్క జీవితంలో మొదటిసారి రుచి చూసాను. ప్రకృతి ఒడిలో పెరిగేవారు పండించే పంటలు, వారు తీసుకునే ఆహారపు అలవాట్లు నాగరిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్ల కంటే చాలా ఆరోగ్యకరమైనవి. అయితే, మూడుపూటలా ముద్ద దొరకడమే వారికి గగనం… అందుకేనేమో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా లావుగా కనిపించలేదు. వారు తినే ఆ కొద్ది తిండి వారి నడకకే సరిపోదేమో… పత్తి, కంది తదితర పంటలకు వేసే పురుగుమందులు, రసాయన ఎరువులు కొండవాలులో పారే వోర్రెల్ని, వంకల్ని కలుషితం చేయడం, ఆ నీటినే ఈ అడవిబిడ్డలు తాగడంవల్ల గతంలో వచ్చే మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక జబ్బులు కూడా వచ్చి ప్రాణాలు కోల్పోవడం పెరిగిపోతోందట. వేసవిలో గుక్కెడు నీటికోసం కటకటలాడే వారి బతుకు చిత్రం గురించి విని మనసు ఆవిరయింది.
కొత్త పాత లేకుండా అంతా కలసిపోవడం, ఎవరికీ తెలిసిన విషయాలు వారు పక్క వారితో పంచుకోవడం, అమృతలత గారి ఆత్మీయ ఆతిథ్యం, వారి బృంద ప్రదర్శనలు, మొండిగుట్టలో కల్పన గారి కుటుంబం చూపిన ఆప్యాయత, ఏర్పాట్లు, పొచ్చెర జలపాతంలో జలకాలాటలు, కుంటాల అందాలు, ఘాట్‌రోడ్‌లో కెరిమెరి వైపు సాగిన ప్రయాణం, ఓజ కళాకారుల అద్భుతమైన పనితనం అన్నీ మా మనసులో ముద్రించుకుని సమతానిలయానికి ప్రయాణమయ్యాం.
రెండు రోజులు మరో కొత్త లోకంలో విహరించి రావడానికి ఎంతో శ్రమకోర్చి ఏర్పాట్లు చేసి, ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకున్న అమృతలత, ప్రశాంతి, సత్యవతి గార్లకు కృతజ్ఞతలు.