కవిని
నన్ను శిలలా మలచాలనుకున్నావు
తీగమీటితే అద్భుత స్వరాలు నాలో
స్వరాలను నీ అనుకూలరాగాలుగా మలచావు
స్వరాల మాధుర్యాన్ని మలుస్తూ, మారుస్తూ వచ్చాను
స్వరాలకు నేనెంతగా పదును పెట్టానో
గొంతులోని ప్రతినరం స్వరంగా మారి
అనుకూల రాగంగా అతికష్టంగా పలికింది
స్వరాలను నాశనం చేయాలనుకున్నావు
కోరినప్పుడే స్వరాలు పలకాలని శాసించావు
మౌనంగా, బాధగా పలికినా హింసించావు
స్వర సంపదల్ని, రాగ మాధుర్యాన్ని వంచిస్తూ
వికృత నైజంలో, శాడిజానికి బలిచేస్తూ వచ్చావు
అనేక వసంతాలు గడిచినా భరిస్తూనే వున్నా
నీ శాడిజం దృఢంగా కొత్తపుంతలు తొక్కింది
నన్ను శిలలా మలచగలిగావని విర్రవీగావు
ఎగిసిపడే అగ్నిజ్వాలలతో అగ్నిశిలలా మారాను
ఉవ్వెత్తున్న ఎగిసిపడే అగ్నిజ్వాలలను నిలుపలేవు
అగ్నిశిల ఎన్నటికీ శిలలా, బండరాయిలా మారదు.
ప్రచండశక్తిగా సజీవ ద్రవాలతో వెలుగుతుంటుంది
వెలుగులను నిరంతరాయంగా విరజిమ్ముతుంటుంది
నన్ను నాశనం చేయాలనే నీ ప్రతి ప్రయత్నం
నీ ఉనికికే చరమాంకం పలకబోతోంది ఖబడ్దార్…..
ఆచార్యదేవోభవ – ఆచార్య విజయశ్రీ కుప్పా
చైత్రమా! నీవొక ఆచార్యుడివి
క్రమం తప్పని ఋతుధర్మం నీ ప్రవచనం
వసంతం వనస్పతులని తానే వెతికింది
అరుణిమలు ఆమ్రపల్లవాలని అడక్కుండా చుంబించాయి.
పరిమళాలు పుష్పరాగాల్లో పిలవకుండా పడుకున్నాయి
స్వాగతించకపోయినా శుకపికాలు సంగీతమయ్యాయి
పర్జన్య గర్జనలకి ఉలిక్కిపడి పరవశమయ్యాయి శిఖి సమూహాలు
మల్లె తోటలు పిల్లగాలుల్లో విలీనమయ్యాయి
మామిడి చెట్లు మధుర రసాలుగా మారిపోయాయి
ప్రకృతి మొత్తం నీ అధీనంలో ఆనందంగా వుంది
కర్తవ్యాలు కాచివడపోసి అందరికీ పంచిన
మెత్తని చిత్తం నీది – చైతన్యానికి విత్తనానివి
నీ శిష్యరికంలో క్రమశిక్షణ – ధర్మ నిర్వచనం
సమయపాలన సవినయంగా నేర్చుకుంటాం!!
లెటర్ బాక్స్
– డా|| ఎన్. గోపి
లెటర్ బాక్స్‌కు పనిలేదు
ఆరు నెలలుగా
ఒక్క ఉత్తరం రాలేదు
ఎవరైనా అడ్రసు అడిగితే
లెటర్ బాక్స్ ఇల్లు అని గుర్తు చెప్తారు.
పాత పోస్టుమ్యాన్
రిటైరైనాడు
కొత్తవాడికి
ఎవరేమిటో తెలియదు.
ఎప్పుడైనా
ఒకటీ అరా ఉత్తరం వచ్చినా
టైముకు ముట్టడం లేదు
మా స్నేహితుడు చనిపోయిన సమాచారం
పది దినాల తర్వాత గాని అందలేదు
కుదురుగా కూర్చొని
ఉత్తరాలు చెక్కటంలో గాని,
ఆరాటంగా అందుకోవటంలోగాని
ఉన్న థ్రిల్లు
ఇప్పటివారికేం తెలుస్తుంది!
ఉత్తరాలు గతాన్ని మోసుకొస్తుండేవి
వర్తమానాన్ని వెలిగించేవి
వెరసి కాలాన్ని బంధించేవి.
ప్రాచీన కావ్యాల్లాగా
నిత్యనూతనంగా ఉండేవి.
పెట్టెల అడుగున
ముత్యాల దండల్లా మెరిసేవి.
ఒంటరితనమంటే
ఇవాళ లెటర్ బాక్స్‌దే
వెళ్ళిపోతున్న కాలం ఓడను చూస్తూ
లైట్‌హౌజ్‌లా మిగిలిపోతున్నది.
అవతారం చాలిస్తున్న
ఒక మహా అనుభూతికి నమస్కారం.
ఎందుకంటే, నేను ఆడదాన్ని
మూలం : షహనాజ్ బేగం
అనువాదం : ఆర్.శాంతసుందరి
నాకు మాట్లాడే హక్కు లేదు
ఏదైనా చెప్పాలనుకున్నా
వినటానికెవరికీ ఇష్టముండదు
ఎందుకంటే, నేనొక ఆడదాన్ని!
ఆడదాన్ని కావటం చేత
కిటికీలోంచి తొంగిచూడటం తప్పు
గలగలా నవ్వటం అపరాధం
గుమ్మం దాటీ బైటికెళ్ళి
స్వచ్ఛమైన గాలి పీల్చటం నిషిద్ధం!
నేను దేనినీ ప్రశ్నించకూడదు
తండ్రి ఆస్తిలో హక్కు అడక్కూడదు
నేను పుట్టి పెరిగిన ఇంటిని
ఇది ‘నా ఇల్లు’ అని అనకూడదు
అసలు తలెత్తి మాట్లాడితేనే తప్పు
ఎందుకంటే, నేను ఆడదాన్ని!
నా కోసం ఉన్నాయి గోడలు,
గుమ్మం, పరదాలూ,
అధిగమించకూడని ఆంక్షల అదృశ్య సంకెళ్ళు –
మగవాడికి మాట్లాడే హక్కుంది
స్వేచ్ఛగా ఎక్కడికైన వెళ్ళే హక్కుంది
నవ్వటానికీ, పాడటానికీ, సంతోషం ప్రకటించటానికీ
కావల్సినంత స్వేచ్ఛ ఉంది
మన్నో – మిన్నో
చందమామా – నక్షత్రాలూ
ఇంటి బయటున్న ప్రపంచమంతా
వాళ్ళ సొంతమే!
వంటిల్లూ – పడకటిల్లూ
మండే కుంపటీ – పొగా
సీతా, సావిత్రీ, అనసూయల కథలూ
ఇవన్నీ నా సొంతం!
నేను కదలకూడదు మొదలకూడదు
నోరు విప్పి మాట్లాడకూడదు
ఎందుకంటే, నేను ఆడదాన్ని!
తస్మాత్ ! జాగత్త్ర
– భండారు విజయ
పరిచయాలు కానంతవరకు
నీవొక అపురూప అందానివి
పరిచయాలైయ్యాక
నీవొక అందాల ప్రేయసివి
ప్రాణానికి ప్రాణమంటాడు
నీవు లేనిదే తను లేనంటాడు
నీ ప్రేమే జీవనాధారమంటాడు
తనలోకమే నీవంటాడు
ప్రణయమనే మాయా ప్రపంచంలో
నిన్నొక అపురూప బొమ్మను చేస్తాడు
పెండ్లనే ‘అనస్తీషియా’ నిచ్చి
ముందర కాళ్ళకు బంధాలనేస్తాడు
బ్రతకటానికి మూల్యం కావాలని
సంసారానికి బండి చక్రాలమని
సంపాదనే నేటి సంప్రదాయమని
ఇంటి చాకిరిని ‘ఎట్టిని’ చేసేస్తాడు
పుత్రసంతానం కావాలంటూ
పురుడు మీద పురుడ్లు చేయిస్తాడు
అన్నీ ప్రేమబంధాల పాశాలే!
అనురాగాలకు ఆలంబనలే!
అనుబంధాలకు ఆశల పల్లకీలే!
కూరుకుపోయిన నీ కలలు
కనిపించని భావాలై పోతాయి
కళ్ళు తెరచి చూసుకుంటే!
నవవసంతాలు చప్పబడ్తాయి
ప్రతిఘటనల పరంపరలు
ప్రతిధ్వనులై అతన్ని ప్రశ్నిస్తే?
నీవొక పిచ్చిదానివై పోతావు
గుట్టుచప్పుడుగా సంసారాన్ని నడపలేని
విశృంఖల వ్యక్తివై పోతావు!
నిన్ను ఎలా బంధించాలో!
తెల్సిన నక్కజిత్తులకు
విడాకుల ‘తలాక్’ వై పోతావు
ఎదురు తిరిగిన నైజానికి
నీకొక ధృవపత్రం వస్తుంది
సంసారానికి పనికిరానిదానివని
స్కిృజోఫేరియా పేషెంట్‌వని
సైకలాజికల్ డిజార్డరు పని
‘షాక్’ ట్రీటుమెంట్ లవసరమని
మైండ్ క్లినిక్‌లకు సాగనంపుతాడు
ప్రేమ ఒక మైకం
పెళ్ళి ఒక శాపం
సహజీవనమొక భ్రాంతి
నమ్మకాల పునాదులు కూలిన రోజు
అపనమ్మకాల సాంగత్యాలు
అహంకారపూరిత యాసిడ్లు
నిన్ను భయపెడుతూనే ఉంటాయి
ప్రతిక్షణం నిన్ను నీవు
ప్రశ్నించుకొనని రోజు
ఆశల కుప్పలు అంతరిస్తాయి
తస్మాత్ ! జాగ్రత్త !