జూపాక సుభద్ర
తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకుంది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. తెలంగాణ రావడా నికి అనేక బహుజన తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని ధారబోసినా వచ్చింది భౌగోళిక తెలంగాణనే. యీ భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణగా సాకారమైనపుడే అది నవ తెలంగాణగా రూపొందుతది. తెలంగాణ పాలక కులాలు అంటున్నట్లు యిది పునర్నిర్మాణంగా జరిగితే యిది ఆధిపత్య కులాలకు ప్రయోజనకారిగా వుంటది. గత తెలంగాణ చరిత్ర వెట్టి, ఫ్యూడల్ స్వామ్యా లున్న చరిత్ర, మరి పునర్‌నిర్మాణమంటే ఆ నిర్మాణాల్నే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమా! అనేది ఆలోచించాలి.
తెలంగాణ పల్లెల్ల చెరువులెండి పోయి మైనర్ యిరిగేషన్ దెబ్బదిని, భూములన్ని పెస్టిసైడ్ నేలలైనయి సీమాంధ్ర రాజకీయాలవల్ల. అట్లా వ్యవసాయం దెబ్బదిన్నందువల్ల రైతు కూలి కైకిలి జేసుకునే మట్టి మహిళలు పట్నాలకు వలసబొ యిండ్రు. భారీ విల్లాల, అపార్ట్‌మెంటుల కట్టడాలల్ల పనికి సరిపడా వేతనాలు లేక, పురుషుల్తో పాటు సమానవేతనాలు లేక బతికిండ్రు. యిండ్లల్ల పాసి పనిజేస్తుండ్రు. విద్య లేదు, ఉపాధులు లేవు. శ్రమ గౌరవం మానవ గౌరవాలు లేకుండా, మానవహక్కుల్లే కుండా తెలంగాణ మట్టి మహిళలు బతుకు లీడుస్తున్నరు. దళిత ఆడవాల్లు సపాయి చీపుర్లవుతున్నరు చాలా అవమానకర శ్రమలో. లంబాడీ తల్లులు తిండిలేక పిల్లల్ని అమ్ముకుంటున్నరు. బీడి కార్మికుల శ్రమలు కాలిపోతున్న బీడీలవుతున్నయి. అసంఘటిత కార్మిక రంగంలో మాన ప్రాణాలకు రక్షణలేక హింసాత్మక జీవితాల్లోకి తెలంగాణ మట్టి మహిళలు నెట్టబడిండ్రు చేనేత కార్మిక మహిళలు కూలిగిట్టక శవాలవుతున్నరు. ఆకలి చావులకంతే లేదు. కనీసం తాగనీకి మంచి నీళ్లు లేక ఫోరోసిస్ రోగాల పాలవుతున్నరు.
తెలంగాణ దళిత మహిళలు జోగిని, పాకిపనుల్లాంటి కుల దురాచార హింసలకు, అత్యాచారాలకు గురవుతున్నరు. భర్తలు బీమండి, దుబాయ్ మస్కట్‌లకు అప్పులు జేసి మోసగించబడి చచ్చిపోతుంటె, మట్టి మహిళలు (యస్‌సి, యస్‌టి, బిసి, ముస్లిం మహిళలు) పిల్లల్ని బెట్టుకొని చావలేక బతుకులేని దుర్భర దారిద్య్రంలో వున్నారు. ఆదివాసీల భూముల్ని సీమ, ఆంధ్ర పెట్టుబడిదారులు వాల్ల కంపెనీలకు వనర్లుగా ఎంచుకొని ఆదివాసుల్ని వెళ్లగొట్టే దుర్మార్గాలకు పాల్పడుతుండ్రు. పోరాటాలు జేసే కాడ అణగారిన జాతులు, మహిళలు ముందున్నా ఫలితాలు పొందలేక పోతున్నరు. బత్కమ్మలకు, బోనాలకు, వంటా వార్పులకు, బ్యానర్ మోసే దానికి నినాదాలివ్వడానికి, చచ్చిపోడానికి ముందు వుంచినట్లు తెలంగాణ ఫలితాల పంపకంలో కూడా ముందుంచాలి.
తెలంగాణ మహిళల పోరాటాలకు తగిన గుర్తింపు ప్రాతినిధ్యాల్ని కల్పించాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్స్ మట్టి మహిళలకు ఏర్పాటు చేయాలి. యీ అణచివేతకు గురవుతున్న భూమిలేని ప్రతి మహిళకు కనీసం మూడెకరాల భూమివ్వాలి. వెట్టిచాకిరి నిర్మూలన, బాలకార్మిక నిర్మూలన జరగాలి. నిరక్షరాస్యత, అంటరానితనాలు, అత్యాచారా లు, దాడులు హింసలు ఆధిపత్యాలు లేని తెలంగాణ రూపొందాలి.
– మట్టి మహిళలకు రెసిడెన్షియల్ హాస్టల్స్ ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలి.
– ఈ మహిళల పేరు మీదనే భూ వసతి (3 ఎకరాలు) యివ్వాలి.
– ప్రతి రాజకీయ పార్టీ కనీసం 30% సీట్లు మట్టి మహిళలకు కేటాయించాలి.
– ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషండ్లు యీ మహిళలకు ప్రకటించాలి.
– వ్యవసాయ కూలి మహిళలకు ఉపాదులు పెంచే పరిశ్రమలు స్థాపించాలి.
– వృత్తి కులాల మహిళలకు లోన్స్ ప్రథమ ప్రాధాన్యంగా కల్పించాలి.
– మహిళా కార్పోరేషండ్లలో మహిళలకు కుల ప్రాతిపదికలుగా లోన్స్ యివ్వాలి.
– బీసి, ఎస్సీ, ఎస్టీ, కార్పోరేషన్స్‌లో 50% లోన్స్ ఆయా మహిళలకు యిచ్చే ఏర్పాటు జరగాలి.
– గ్రామ స్థాయినుంచి యీ మహిళలకు ఉపాధి నిర్మాణం జరగాలి.
– గ్రామాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టాలి.
– రాజకీయ నిర్మాణాల్లో మట్టి మహిళల నాయకత్వాల్ని, సాధికారతలను 50% గా పెంచాలి
– రేపటి తెలంగాణ ముఖ్యమంత్రి మట్టి మహిళే కావాలి.
– మహిళల భద్రత కోసం మండల్ కొక మహిళా పోలిస్టేషన్స్ ఏర్పాటు చేయాలి.
– కుల నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్స్‌లను చిత్తశుద్ధిగా అమలు జరపాలి.
పై సూచనలు నవతెలంగాణలో అమలు చేయాలని మట్టిమహిళల డిమాండ్స్
– మట్టి మహిళా సంగం