మూలం – సరాషా గుఫ్తా
అనువాదం – కల్పనా రెంటాల
పంజరం నీడ కూడా ఖైదులో వుంది
నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను
నా చేతులు ఇతరుల చేతుల్లో ఒదిగి వుంటాయి
భూమి ఒంటరిదైపోయింది
ఒంటరి నది సముద్రంలోకి ఎందుకెళ్ళిపోయిందో?
నిర్ణయం ఎంత ఒంటరిదయింది?
మృతుల కోసం పొంగిపొరలుతున్న దుఃఖం
నేను నిప్పుల్లో మేలుకున్నాను.
రాళ్ల లోపల ప్రతిధ్వనిస్తున్నాను
వాటిలోపల మునిగిపోతున్నాను.
ఈ మట్టి నుంచి ఏ మొక్క పెరుగుతుందో?
నా విషాదాలన్నీ ఓ పసిపాప
నా చేతుల్లో విరిగిపోయిన ఆటబొమ్మలు
నా కళ్ళముందు ఓ మనిషి
అంతులేని మృతదేహాలు
కళ్లకోసం నన్ను ప్రార్ధిస్తున్నాయి
నన్ను నేను ఎక్కణ్ణుంచి ఆరంభించను?
ఆకాశాలన్నీ నా కన్నా చిన్నవి
ఎగిరేపక్షులకు నేలెక్కడ?
ఈ స్వరాల చేతులేవి?
నా అబద్ధాలన్నీ సహించు
అడవి నుండి పక్షులు విడుదలైనప్పుడు
నిప్పుకాగడా రుచిచూస్తుంది
నా అస్తిత్వం కప్పు మీద
నా ఆచ్ఛాదనల్ని ఆరబెడుతున్నాను.
దూరాన్నెక్కడో నా కళ్ళు
నా బట్టలే నా దుఃఖాలు
నేను నిప్పుల బట్టలు ధరించినదాన్ని
నా నీడ పేరు చెప్పనా?
అన్ని రాత్రుళ్ల చంద్రుళ్లని నీకిచ్చేస్తాను?
అద్భుతమైన కవిత .
కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
కల్పనారెంటాల