మా పుట్టిల్లు అ ఆడ్డగూడురు అయితే మానాయిన మొట్టమొదట కమ్యూనిస్టుల వొచ్చిండు. కమ్యూనిస్టు అనేదప్పుడు దాంట్లే ఈ ప్రజలతోగూడి ఇట్లా అన్యాయాలు జేత్తున్రు. జనమంతా మిది లంచాలు దీస్కోవటం యెట్టిపన్లుజేయటం ఆడోల్లతోని యెట్టిపన్లు జేయించుకోవటం గవుర్నమెంటు యివన్ని పోవాల్నంటే మనం ఈ కష్టంపోవాలంటె, మనందరం ఐక్యతగావాలె పోరాడాలె అనే పద్ధతిల మా నాయిన జెప్పేది.
చెప్తే మా నాయిన గురించి పోలీసులు అడ్డగూడురికి వాచ్చిన్రు. పోలీసులొచ్చిన్రు, సుట్టుముట్టిన్రు, వచ్చివూరంత జూసిన్రు, దేవులాడిన్రు ఊరిసుట్టు మిల్ట్రి వచ్చిన్రనంగనే మా నాయిన దంటకు స్నేహితులు ఎందరొచ్చినా అందరుగూడ బయటికెల్లిన్రు, బయిటికెల్లి దూరంగనిలబడిన్రు వాల్లదగ్గర రాల్లు, వడిశాలలు మిల్ట్రివోల్లదగ్గర తుపాకులు. వీల్లు రాల్లుదీస్కోని కొట్టిండ్రు. వాల్లు తుపాకులుదీస్కోని కాలువడానికె సూపెట్టిండు అది జరిపోయిందిగట్ల. పదిరోజులకోపారి వారంరోజుకోపారొచ్చి ఇల్లంతొచ్చి జూసేది వున్నడా అని. పూల్లె పోలీసుపటేలు కావలోల్లను వెంటబెట్టుకొచ్చి ఏ రాత్రివడ్తె ఆరాత్రి వొచ్చి యిల్లంతా జూసేది. ఆ భయనికే యింట్లలేకుండనే ఎల్లిపోయేది. మా నాయినె ఊల్లెకొచ్చినపుడు వూల్లె కాపలాపెట్టేది. ఆ కాపలా వున్నోల్లు పోలీసులొస్తున్నరని చెప్పంగనె మల్ల బయటికెల్లిపోయేది. వాల్లొచ్చి యిల్లంత జూస్కోనిపోయేది. మా అమ్మనిగూడ కొడ్తమని బయపెట్టేది. మా అమ్మ గూడ యింట్లనుంచి పరారయ్యేది.
అప్పుడు నాకు పదహారేండ్లుం డొచ్చు. మా తండ్రి పేరు వర్కాల మల్లారెడ్డి ఇగ మా నాయినె పరారయినప్పుడల్ల మా అమ్మనిగూడ బయపెట్టేది. నిన్నట్లజేస్తం, యిట్లజేస్తమని మొగోల్లనెక్కడెల్ల గొట్టినవు, నువింట్లెందుకున్నవు అని బయపెడ్తె మా అమ్మగూడ వాల్లొస్తున్నరనంగనే గోడదూకి బయటవడేది. ఇకపూర్ణ రౌడీలు కొంతమందుండేది. పోలీసుపటేలు వాండ్లతోవొచ్చి తెల్లర్దాక తలుపులుగొట్టి పొయ్యేది. అమీనుతోనొచ్చి పిల్సిపొయ్యేది. ఇగస్తరేమోనని మా అమ్మ తల్లిగారు ఇరసానిగూడెమని వుండె వాల్లతల్లిగారింటికి పరారయిపోయేది. నేనేమొ అత్తగారింటి కొచ్చిన మొగపిల్లలిద్దరుండిరి. ఒక చెల్లుండె వాల్లనెంటవెట్టుకొని యిరిసానిగూడెం బోయింది మా అమ్మ. మా నాయినగూడ పరారయున్నడుగద! యిల్లుగాలవెట్టిన్రొచ్చి. సరే యిల్లువోయినా పరువలేదు, మనుసు లమన్న బావుండా లన్జెప్పి మానాయిన అప్పుడప్పుడు మాకు మతులబు జేస్తుండేది. యిక్కడ మా అత్తగారూర్లగూడ గాలవెట్టిన్రు. యిక్కడగూడ గంద్రగోలమయితె పుల్లయ గూడెంబోయినం అక్కడ పోయేసరికొకసారి మా నాయినొచ్చిండు. ఆ వూల్లె వుండెతానికే వీల్లేకుడుంన్నది చాల గంద్రగోలంగున్నది. గడి గడికీ మిల్ట్రొస్తున్నది వూరు సోదిస్తున్నదాయనకోసం యిగనేను పోవల్సొస్తది. యెక్కన్నన్న అన్జెప్పి, వూర్లోల్లందరికి జెప్పి కొన్ని పైసలు చందాజేసుకోని దూరమెల్లిపొత వూర్లె తట్టుకునేటట్టు లేదన్జెప్పి బయటకెల్లిండు. యెల్లెటాల్లకి గుర్రాలుర్కొచ్చినయి కాపలావున్నోల్లువొచ్చె. గుర్రాలు వొచ్చె అన్జెప్పెటల్లకు, మానాయిన. యెల్లిపొతనే వున్నడు. అక్కడిక్కడున్న లంచెకొడ్కులు పట్కోవోయిన్రట. పట్కోవోతె నేనురానయ్యో అగో అట్లవోతున్నడు. వర్కాల మల్లారెడ్డి ఆయనను వట్కపొఅనంగనే ఆ గుర్రాలు తరుముకొని పొయిన్రు. మా నాయినెంటకు సోమిరెడ్డి రామిరెడ్డని ఒకాయనుండె ఎక్కడబోయినా స్నేహితం గుండేది. వాళ్లిద్దరురుకుతాంటె యిద్దర్ని వట్టుకొచ్చిన్రు గుర్రాలతోటి, ఒకటే చెట్టుగ్గట్టిన్రు కాల్చేసిన్రు. మేములేనేలేము. మా అమ్మలేదు. మా తమ్ముడులేడు. నేన్లేను, మా నాయినెదగ్గర ఈ చందా పైసలుండెనట. ఈ యెయ్యిరూపాయలు మీకు ఈ బండెడ్లిస్తను, యీ పైసల్దీసుకోండ్రి, నన్ను మాత్రం రచ్చించుండ్రి, పానమిడిసి పెట్టుండ్రి, అనిగిట్లంటె, ఆ పైసలన్ని దీసుకున్నరంట దీస్కోని ఆ చెట్టుకి యిద్దర్నిదంటజేసి, మొకానికి బట్టేసి ఒకటేదెబ్బకు తుపాకేసిన్రు ఏసి, బొందదోడి పూర్తిగ ప్రారంబోయిందో లేదో, అండ్లేసి పూడ్చేసి యెల్లిపొయిన్రు. ఆతర్వాత మాకుదెల్సింది, గిట్ల సచ్చిపొండని, మనిసొచ్చి చెప్పిండు. పదోనాడు దినాలయి నయి. దినాల్నాడుగూడ పోలీసులొస్తున్న రంటె పరారయిన్రు దానంనాడు గూడ, అంతవస్తలుండిగూడ ఆయనభార్య వస్తదట పట్టుకోవాలంటె. ఆ బయానికి అంతవస్తలు ండిగూడ దాక్కున్నది. ఆ రోజంత గడగడ వనుక్కుంట వచ్చిన సుట్టాలుమొత్తం దాక్కున్నరు. అటువంటి కష్టాలపాలయ్యింది మాజీవితం. అయితే మాయిల్లు కాలపెట్టిపొ యిన్రు. దొరోడనుకో పటేలోడనుకో ఈల్ల ఎవుసాయం పాడుసెయ్యాలని పసులనిడిసి పసులతోని ఏసినపైరంత మేపేసిన్రు. యింజనంత బాయిలదోపిచ్చిన్రు. జీతగాండ్లు నొక్కడ్లేకుండ వోయిన్రు. కొడ్తరంటె బయానికి అన్ని చాలా కష్టాలైనయి వాల్లకు యిప్పటికైన అదే కమ్యూనిస్టుల్లనే వున్నరు వాల్లు… అప్పుడెట్టిపన్లు జేసేదుండెగద. దొరోడుజేయించుకునే, పటేలోడు జేయించుకునే కారంగొట్టిచ్చుకునేది, వొడ్లుదంపిచ్చుకునేది మాదిగొల్లని దీస్కొచ్చి యింటిముందల కావలుంచుకునేది. ఈ పన్లన్నిజేయొద్దని జెప్తుండేది మా నాయిన. అప్పుడు మాగ్గూడ బూములుండె. మాదంత ఎవుసాయమ్మీద బతుకె మానాయిన పరారయిపోయినంక మా అమ్మనే జేపిచ్చేది మా అమ్మ రామనర్సమ్మ యిన్ని కష్టాలయితే వడ్డది వూరందరికి సచ్చిపొయినోల్లకి పైసలొచ్చినై. దేశమందరికి పైసలొచ్చినయి గని, మాకు దొరోడురాకుంట జేసిండు. అప్పటికి మేమందరం చిన్నపిల్లగాండమే మా నాయిన గురించి మా అన్నయ్యను గూడ జైల్లేసిన్రు. మా అన్న ఆర్నెల్లు జైల్లున్నడు.
యూనియన్ సైన్యాలే కాల్చేసిన్రు మా నాయినెని. అప్పుడు రజాకార్లన్నా, యూనియనన్నా అంతొక్కటేపనిచేసిన్రుగద. యూనియనే రజాకార్లచేత జేయించింది. మా నాయిన వచ్చిదాక్కున్నడనిజెప్పి పుల్లాయగూడెం వూరిసుట్టు గేరా యేసుకున్నరు. మా నాయినగురించే ఆ వూరికొచ్చేది. ఆ వూల్లె యింకెవరు లేకుండె. ఈ వూరోల్లు మాల్‌పటేలు, పోలీసుపటే లుంటరుగద. వీల్లందరు చిన్నంగజాడద ెల్సుకోని అక్కడ కమ్యూనిస్టు జేసిండు. మల్లయిక్కడొస్తె యక్కడనేర్పుతడు. పట్టియ్యాలన్జెప్పి సిన్నంగ జాడజెప్పి రిపోర్టిచ్చిన్రు. వాల్లొచ్చి మన వూరుసుట్టు నిలవడ్డరు ఆడొకడు, ఈడొకడు స్తంబాలోలె పోలీసులు. ఏనంగోడ బయటికెల్తడని. అప్పటికె వూర్లెవుంటలేడు మా నాయినె. బైటుండే సద్దిదెప్పిచ్చుకునేది. రహస్యంగ ఎవరితోనన్నజెప్పిపంప్తె యింత టిఫిన్ పంపేది. పలాన బిడ్డవుంది, పలాన మేనత్త వుంది, మా నాయినె అక్కవుండె. వాల్లదగ్గరాస్తడు, వాల్లే అన్నంబెడ్తరనిజెప్పి ఏడెనిమిదిసార్లు దాడిజేసిన్రు. కాని యిక్కడ దొరకలే మా నాయన. యెక్కడదొరకలె మల్లవోయి సొంతవూర్లనేదొరికిండు. అక్కన్నే సంపేసిన్రు.
అయినా మాకుజెయ్యాలనే అన్పించింది. బాయికాడ గంపదీస్కొచ్చి, గుడిసెలేసి ఎవరుచూడకుంట పదిమంది నుంచి అండ్లనేవెట్టేది. కమ్యూనిస్టుల పనిజేసినోల్లు పరాయిలీడర్లని వొచ్చేదిగద, వస్తె వాల్లను దాసివెట్టి రోజూ ఒక పెద్దఅండలవండ్కపోయి, కూరవండ్కపోయి ఎవరులేకుండజూసి వాల్లకువెట్టేది. వాల్లను మార్గంగదాసేది.
మాకు జెయ్యాలనే అన్పించింది. కారప్పొడులు తయారుగవెట్టుకున్నం. ఎవరన్నవస్తె కారప్పొడి జల్లాలె. పోలీసులె వరైన అటాత్తుగొస్తరు. యిట్ల మా నాయినె వూర్ల మందికి నేర్పించేది. ఆ వూర్లె కమ్యూనిస్టయిపోయింది. ఊర్లంత కమ్యూనిస్టెక్కువైపోయిందనిజెప్పి ఆ వూర్లనే దాడిజెయ్యటం మొదలువెట్టిన్రు పోలీసులు. యింటింటికీ, యింటింటికీ వొచ్చి సూసిన్రు. వొంటరిగిట్ల ఆడోల్లగుపడ్తె వాల్లను కంగారుగూడజేసిన్రు. అయితె వాల్లిట్ల యిండ్లల్లకు వస్తున్నరన్జెప్పి పొద్దుగూకంగనె అందరు చినపిలగోన్లు, ముసలోల్లున్న యిండ్లల్లవోయి కూసుందురు.యాభై, అరవైఏండ్లున్న ముసలోల్లుందురుగద, ఆ యిండ్లల్ల యీ ఆడోల్లంతజమై పండుకునేది. ఆడికేవొచ్చి గుభీ గుభీమని సప్పుడుసే త్తున్నరు. వచ్చిన్రు. వచ్చిన్రని వీల్లపానాలన్ని గడగడవనుకుతున్నయి తలుపుదీసిన్రు. తలుపు దియ్యంగనె, ఒక యింట్ల యిందరున్నరా లంజెల్లారమీరు. ఆ వొక్కనికే యిందరు పుట్టినారు? మా అయ్య… మా అయ్య… అని జెప్తవు, వీడు మీ అందరికి అయ్య అవుతాడే లంజల్లారా అని తిట్టేది. ఆడోల్లందర్ని గుంపుజేసి మీ యిండ్లల్లకి మీరువోండ్రని లాటీచార్జి జేసిన్రు. దెబ్బలు పటా పటా యేసిన్రు, యేసినంక ఆ దెబ్బలకు తట్టుకొనైన వాంటరిగవోతె వాల్లేంజేత్తర అని దెబ్బలు గొట్టినా గుంపులు గుంపు లుండేది. వొకసారి ఎవరిమీదుంటె వాల్ల మీది నుంచి నల్లపూసలు, బంగారు గుండ్లు ఏది కనవదినా పీక్కపోయిన్రు. వొకసారి యిండ్లన్ని కాలవెట్టి, యింటి కమ్మలన్ని గుంజ్కపోయి, యిండ్లల్లయేదుంటె అది సగబెట్కవోయిన్రు. ఆడోళ్ళ మీదున్నయన్ని గుంజ్కవోయిన్రు. అంత ధూమ్ ధూమ్ జేసిన్రు. వొక్కోరోజయితె ఆ పూర్ణ బయంతో పానాలంత గడ గడ. అందరుపోయి వూరిబయట గుంపయ్యేది. యీడ పదిమంది, ఆడ పదిమంది, అడి ఇరవైమంది అట్లుండేది. యియ్యెత్తుకవోతరో, అయ్యెత్తుకవోతరో యింట్లకి వోయిసూ ద్దామని ఆశవున్నా దొరికితె యిగ నాశనమయితమని జెప్పి యింట్లకే పోకవొయ్యేది. వాల్లొచ్చి మళ్ళి పోయినంక యింట్లకెల్లేది. సానకష్టంరోజులవి. కమ్యూనిస్టులకెళ్ళిన ప్రతివాల్లని దెల్సుకొని పోలీసులకి జెప్పిన్రు. వాళ్ళే కొట్టిన్రు వాల్లని యెవరు వెడ్తున్నరని జాడ దీసుకోనొచ్చి వాల్లనొచ్చి కొట్టేది. అయినా దొంగతనంగ మార్గంగ వెట్టేది.
వూరిలో ఇరువైమంది వయసు వయసోల్లంత కూడిదలమలన్జెప్పి తయార య్యేది. ఆయుధాలు తయారుజేసుకునేది. ఈ కచ్చీర్లల్ల యెవరన్న పోలీసులు వొంటరిగ దొరిక్తె వాల్లనిసంపి ఆయుధాలు సంపాయించుకునేది. ఆ తుపాకులుండేవి దలంలో. పోలీసులొచ్చి యెల్లిపోయిన్రనంగనే ఎల్లొచ్చేది. వీల్లురాంగనే వీల్లకి వొండి వెట్టేది. అందరికి వొండి పెట్టేది. ఈ యింట్లనించే ఆనాటినించి పెట్టి… పెట్టి… పెట్టి వున్నరు. ఎవరన్న వస్తరూ, పోతరూ అని దబ దబా వండుడూ పెట్టుడూ మల్లీ… మల్లీ బయటికెల్లి ఏ సెట్లమీదనో వుండుతూ… వొకసారి ఏం జేసినవంటె ఈ వూరి కర్నపాయిన, కావలోడు, పటేలాయన ముగ్గురు బండి గట్కపోయి మోతుకూర్ల పోలీసు రిపోర్టిచ్చి వస్తున్రు. వస్తుంటె మా వూరోల్లు వొక పదిమంది పోయిన్రు. వాల్లను రెక్కలు బొక్కలు యిరగ్గొట్టి వచ్చిన్రు. మర్దనజేసిన్రు – బాటలో దొరికిచ్చుకుని కొట్టినంక వాల్లుపోయి బాగుజేపిచ్చు కున్నారు. బాగు జేపిచ్చుకోనొచ్చి అప్పట్నుంచి శాంతిగ, కోపం లేకుండున్నారు.
పుల్లాయిగూడెం సత్తెమ్మనివుండేది. యిప్పుడు సచ్చిపోయింది. భర్త లేడు. తల్లిగారింట్లనే వుండేది. వొకసారి పోలీసులొచ్చిన్రు. ఆమెకు ముగ్గురు మరదన్లుండిరి. పోలీసులొచ్చిన్రు, ఈమరదన్ల చేయవట్టి గుంజుతున్నారు. వాల్లను ముగ్గుర్ని గుంజి వొకమూలకేసింది. యిట్లచేతులు పెట్టింది. పెట్టేటోల్లకు ఆమెని గుంజేసిన్రు. గుంజేసరికి ఈచేతుల పొరక (చీపురు) వుండె, వుంటె రెండు మూడు దెబ్బలేసి బయటకెల్లింది. యిగ దానిమీద పగవట్టి వచ్చినప్పుడల్లా దేవులాడేది. ఆగుడ్డిదెటుబా యెని వొక కన్ను గుడ్డుండె, అయినా తట్టుకున్నది.
వొకసారి పోలీసులొచ్చిన్రు. పర్కాలయల్లారెడ్డి పిల్లయేదని దేవులాడు తున్రు. నేనాగోడసాటుకు వోయికూసున్న. నన్నక్కడ గౌండ్లోల్లు కొందరు సాటుకుగూ సోవెట్టిన్రు. వారీమెను యామేనని చెప్పిన్రట. ఆమె నేనుకాను నేనుకాను అని బయటకు వురికింది. నాకు గడ గడ గడ గడ వొణుకుతున్నది. యెవరన్న సూపెడ్తరేమోనని వాల్లుజూసుకొని యెల్లిపోయెన్రు. అట్ల చాలా కష్టాలొచ్చినై. చెప్పజాలని కష్టాలు. వొకసారి మాఅమ్మ తల్లిగారింటికిపోయినమని జెప్పినగద. అక్కడ వుగాదిపండగరోజు అన్నం తింటుండగనె వచ్చిరి… వచ్చిరి… పోలీసులన్నరు. బయటికెల్లి అంటే అన్నాలూ, అప్పుడు-వుగాది పండుగగదా. అన్నీ అన్నిడిసిపెట్టి వూరంతాబయటకెల్లిన్రు. కాని ఎవ్వరు రాలేదప్పుడు. తిట్టుకొని ఎవర్రా అన్నలంజాకొడుకు పోలీసులొచ్చిన్రని అని మల్లొచ్చి తిన్నరు. ఆగంద్రగోలంల యెవరు యెవర్ని సూసేటట్టులేదు. యెవరి బతుకువాల్లదే. అత్తకోడల్ని సూసేటట్టులేదు, కోడలు అత్తను సూసేటట్టులేదు. అప్పుడు యిండ్లల్ల ఆయుధాలుండె, వంటాముదం, కోడిగుడ్లు అన్నొకదిక్కు పల్గగొట్టి అగ్గిపుల్లేసి మంటపెట్టిన్రు. అప్పుడు యెనుకటోల్లకేం దంటె సందుకలు లేకుండె యెదటి పెట్టెలుండె. ఆ పెట్టెల్ల బట్టలన్ని దీసి తగులవెట్టిన్రు. కుండలువల్గగొట్టిన్రు. ఆముదం, నెయ్యి, నూనె చెంబులన్ని ఎత్కపోయిన్రు. రెండుగుర్రాలమీదకెల్లి పెద్దదర్వాజలకెల్లి యిండ్లకొచ్చిన్రు.
అసలు పోరాటమంటె మాతల్లి గారూర్లనే… అయిదొందలెకరాల రేగడున్నది. గవర్నమెంటు బూముండె, మానాయిన పోరాటం సాగిచ్చిందే దాని కోసం. అదట్ల మొదట్నుంచి పడావుపడి వున్నది. ఆ బీదజనమంత బూముల్లేక వున్నదెందుకు? పడావుపెట్టుకున్నదెందుకు అని దాన్ని చెట్లుగొట్టించి పనిమొదలు పెట్టిన్రు. యింక మిల్ట్రి దిగింది. ఆపోరాటం యెటుగాకముందె మానాయినె సచ్చిపో యిండు. మల్ల మాతమ్ముడు సేసిండు. సేస్తనే యేడెనిమిదిమాట్ల దాడై మా తమ్మునిగూడ పట్టుకున్నరు. కొట్టిన్రు, సుట్టుపట్టు ఇరువై వూర్లోల్లు వొచ్చిన్రు ఆవూరికి ఆచెట్లు గొట్టిన్రు, ఆఖరికి, ఆభూమెవరికైందంటే బాయిలేనోల్లకైంది. ఆవూర్లె పోరాడి పోరాడి యిరువై ముప్పయి ఏండ్లసంది పోరాడిన్రు. అయిదొందలెకరాల రేగడి పంచిపెట్టేసిన్రు. యీల్లకే హరిజనులకి – లేనోల్లకు, లేనోల్లకు మనిసింతిచ్చిన్రు, గవర్నమెంటు దీస్కోలె, అంటె పట్టాలుగాకుండొచ్చుగని – పోరాటంజేసిజేసి పానాలు పోయినై, యిండ్లుగాలిపోయినై, మనుసులు సచ్చిన్రు. చాలామందిగొట్టిన్రు. అనేకమైన దెబ్బలుగొట్టిన్రు. యూనియనొచ్చినంక యెట్లగొట్టిన్రనుకున్నవు. యూనియన్ రాకముందు తురకలు అందర్ని కోసిపారేద్దురని అన్నరు. మరి వీల్లొచ్చి పొడుగుజేసిందేంది. మాఅన్నది బక్కపానం. ఆయనను బడబడ గుంజ్కపోయి యెత్తిగొట్టిన్రు. అయ్యో యిదేం చిక్కులోల్లు అంత పాడువడె-అప్పుడు యూనియనంత చిక్కులోల్లే పాడువడె. మాఅన్నను కొడ్తుంటె ‘యేందీ అన్యాయం పాపం తండ్రిసచ్చిపాయె, యిండ్లవుండి వాల్ల ఆస్తి నాశనమయిపాయె, యిల్లువోయె మల్లొచ్చి పిలగాన్ని కొడ్తున్నరెందుకోసం ఆల్లెందుకిట్ల గొట్టాలని జనమంత అయ్యో… అయ్యో… అన్నరు. జైలుకువట్కపోయిన్రు, పోయిన పున్యాన నెలకు మూడువందలొస్తున్నయి. అంతే గట్ల యూనియన్ సైన్యాలొకసారి లారీనిండ దిగిన్రు. చిక్కుపోలీసులు. కనపడ్డ పతిమడిషి ని కొట్టిన్రు. జనం మనసుల్లమేముండెనోగని గిట్లెందుగ్గొడ్తరని యెవరెదురుపడి – అడగలే. యెవరికి దమ్ములేకపోయిందప్పుడు. యిదివర్దాక యింత కష్టపడ్తుంటె వాల్లను బాగుజేస్తందుకు వచ్చినోల్లిట్ల కొడ్తున్నరేంద నుకున్నరు.
పార్టీల ఆడవాల్లెక్కువేం పోలే దండి. యేన్నన్నవొక్కమడిసి పోయిన్రంటే. లీడర్లనెటువంటివాల్ల భార్యలు పోయిన్రుగని అంతకెక్కువపోలె.
మా అమ్మ పెద్దదయిపాయె. నేనింత కష్టపడ్తిని నాకేం రాకపాయనే దున్నది అమ్మకి. కంటిసూపుగూడ సరిగ్గలేదు. సూడరాకుంటయ్యింది. నా కిద్దరు బిడ్డలు. యిద్దరు కొడుకులు. నా మొగుడు ఆఫీసుల టైపిస్టు. ఒకబిడ్డ పట్నంలున్నది. ఒకబిడ్డ నల్గొండలున్నది. ఆయన టీచరుపని జేస్తుండు. యిద్దరు కొడుకులు సదువుకుంటు న్నరు. నాకు కాలికి తిమ్మిర్లొచ్చి నడుకవడిపో యింది. యెన్నో జేసిన, సూపెట్టుకున్న, మందులుదిన్న, ఆపరేసనుజేయించుకున్న. ఏంజేసిన గని బాగుపడ్లే నడక. సంసారమంత డీలాపడిపోయింది. మూడు సంవత్సరాలయ్యింది. అంత చిన్నపిల్లకు జేసినట్టు జెయ్యాలె.
(మనకు తెలియని మన చరిత్ర నుండి)