– తుర్లపాటి లక్ష్మి
అది 11వ తేదీ ఆదివారం. మే నెల. దినమంతా ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరై చల్లబడుతున్న సాయం వేళ – భాగ్యనగర్ కళాభిమానులకు, కళాపిపాసకులకు ఒకింత సేద తీర్చి మానసికోల్లాసానికి వేదికై మధురానుభూతులు పంచినరోజు. సాహితీ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళామూర్తులను ‘మదర్స్‌డే’ సందర్భంగా – సగర్వంగా సత్కరించిన ‘అమృతలత – అపురూప పురస్కార ప్రదానోత్సవం – 2014’ కార్యక్రమం.
ఎవరికి వారే రాస్తూ మౌనంగా తమతమ రంగాల్లో పనులు చేసుకుంటూ సాగిపోయే మహిళామణులను విజయ్ విద్యాసంస్థల అధినేత్రి, రచయిత్రి, విద్యావేత్త, ‘అమృత’లతగారు ఒకే వేదికమీదికి ఆహ్వానించి, ఆయా రంగాల్లో వారివారి అమూల్యమైన సేవాకార్యక్రమాలను గుర్తించుకునేలా వాటి ద్వారా స్ఫూర్తిపొందేలా ఈ అరుదైన కార్యక్రమానికి రూపమిచ్చారు. ఎందరో సాహితీ, సాంస్కృతిక అభిమానులకు ఆదర్శంగా నిలిచింది ఈ పురస్కార ప్రదానోత్సవం.
సాయం సమయాన సాహితీకారులంతా సాహితీ జల్లులో సేద తీరేవిధంగా ఈ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో జరిగింది.
ప్రాంగణమంతా కవులూ కళాకారులు, రచయితలు, కళాభిమానులతో ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా అనిపిం చింది.
చాడా లలితాదేవి స్వాగతోపన్యాసంతో, కుమారి వర్షిణి ప్రార్థనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమానికి అవార్డ్స్ ప్రమోటర్ అమృతలత అధ్యక్షత వహించగా – జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత ప్రముఖ కవి డా||సినారె ముఖ్య అతిథిగా, ప్రఖ్యాత సినీనటి, కళాభారతి జమున విశిష్ఠ అతిథిగా, తొలి సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి ఆత్మీయ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై వన్నెతెచ్చారు.
అవార్డుల నేపథ్యాన్ని అమృతలత వివరిస్తూ ‘మనం సాహిత్య సభలని నిర్వహిస్తే – రానురాను సాహిత్యానికి ఇతర లలిత కళలకి దూరమవుతున్న యువ తరానికి వాటిపట్ల ఆసక్తి, అనురక్తి కలుగుతుందనీ, సాహిత్య సభలకి పూర్వవైభవం చేకూరుతుందనీ’ అన్నారు.
‘సాహిత్య పరిమళం లేనిదే చాలా కళలు రాణించ లేవు ముఖ్యంగా నృత్యానికి సాహిత్యానికి, గానానికి సాహిత్యానికి, సినిమాలకి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అవి పరస్పర ఆధారిత కళలు. మిగతా కళలకి ఇచ్చినంత ప్రాధాన్యత – పూలదండలోని దారంలా ఆ కళల వెనకాల దాగివున్న సాహిత్యానికీ – ఆయా రచయితలకూ ఇవ్వడంలేదన్న స్పృహ ఒక్కటే… ఈ అవార్డుల్లో సింహభాగం నవల, కథ, కవిత, సాహిత్య విమర్శ, జర్నలిజం తదితర ప్రక్రియల పేర ఇవ్వడం జరిగిందని’ అమృతలత అన్నారు.
తమ జీవిత కాలమంతా సాహిత్యంలో విశేష కృషి సల్పి, పాఠకుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నవలారచన చేసిన రచయిత్రులకి గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ‘అమృతలత లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందజేయటం జరుగుతోందన్నారు.
ఇక సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి లలిత కళలతోపాటు వివిధ ప్రక్రియలు, వ్యాఖ్యానం, జర్న లిజం, సంఘసేవ తదితర రంగాల్లో కృషిచేస్తోన్న మరో పదకొండు మంది మహిళామణులకు తమ కుటుంబ సభ్యులూ, మిత్రులూ (జి. లక్ష్మీభూమారెడ్డి, సుశీలా రాజారెడ్డి, కీ||శే పద్మాభూమారెడ్డి, చిన్నమ్మా రాంరెడ్డి, విజయాకిషన్‌రెడ్డి, ప్రభాదేవి మధుసూదనరావు, విజయలక్ష్మీ కోటేశ్వర రావు, టి. వసంత, టి.కవితల) పేర – వారి పిల్లలు ‘అపురూప అవార్డ్స్’ పేరిట – ఒక్కొక్క అవార్డు కింద పదివేల రూపాయలను ఇస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానని అమృతలత అన్నారు. అనంతరం అతిథులూ, అవార్డు గ్రహీతల పరిచయాలతో కూడిన ‘అభినందన’ సంచికని డా|| సినారె ఆవిష్క రించారు. అతిథులు తమతమ సందేశాన్నిస్తూ అమృతలత ఔదార్యాన్ని, పెద్దమనసును కొనియాడుతూ ఇంత మంది మహిళామూర్తులను – ప్రపంచ తల్లుల దినోత్సవం నాడు సన్మానించడం, శ్లాఘనీయమని, ఇలాంటి ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వం ఈనాటి తరానికి స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.
‘అమృతలత లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు పొందిన ప్రముఖ నవలారచయిత్రి డి. కామేశ్వరి గురించి వారణాసి నాగలక్ష్మి పరిచయం చేస్తూ – గత ముఫ్పై ఐదేళ్ళుగా సమకాలీన సమస్యల్ని తమ రచనలలో ప్రతిబింబించేలా డి. కామేశ్వరి నవలా రచనలు చేస్తున్నారని కొనియాడారు.
తన సన్మానానికి కామేశ్వరిగారు స్పందిస్తూ అమృత లత వ్యక్తిత్వం ఎంతో ఆదర్శనీయమని, ఓ విద్యావేత్త గా ఆమె ఎన్నోవేల మందికి విద్యనందించడం సంతోష దాయకమని అన్నారు.
‘మహిళాభ్యుదయం – సమాజసేవ’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకుంటున్న ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి పరిచయం చేస్తూ ‘నిజాం రాజరికంలో కరడు గట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలా కుతలం చేస్తున్న సమయాన ఆనాటి ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ప్రపంచదృష్టిని ఆకర్షించిన తెలంగాణా సాయుధపోరాటంలో తుపాకీ పట్టి ఎదురొడ్డిన వీరవనిత’ అన్నారు.
తన సన్మానానికి స్పందిస్తూ ‘ఆనాటి నిరక్షరాస్యులైన వీరవనితలు’ తెలంగాణ సాయుధ పోరాటంలో నిర్భయంగా పాల్గొన్నట్లే, ఈనాటి ఈ వేదికపై వున్న విద్యాధికులైన మహిళలు మరియు వేదికముందున్న ప్రేక్షకులు తలుచుకుంటే తాము కోరిన సమసమాజం తప్పక వస్తుందని’ మల్లు స్వరాజ్యం తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సాహితీ సంస్థ నిర్వహణలో ‘స్ఫూర్తి ప్రదాత’గా అవార్డు అందుకుంటోన్న డా|| వాసా ప్రభావతిని చాడా లలితాదేవి పరిచయం చేస్తూ ‘సాహితీ ప్రపంచంలో వాసా ప్రభావతి ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగిన విదుషీమణి అనీ, సాహిత్యంలో వీరు స్పృశించని ప్రక్రి య అంటూ లేదని కొనియాడారు. తన సన్మానానికి వాసా ప్రభావతి అవార్డు ప్రదాతలకు కృతజ్ఞతలు తెలి పారు.
‘సంగీతం’ విభాగంలో పురస్కారం అందుకున్న వేద వతీ ప్రభాకర్‌గారి గురించి ఆర్. విజయ పరిచయం చేస్తూ – ‘ఎందరో మహామహులైన నాటి కవుల రచనలకు మరెందరో లబ్ద ప్రతిష్టులైన సంగీత దర్శకులు సమ కూర్చిన బాణీలలో ఎన్నో భక్తి, లలిత గీతాలను ఆమె ఆలపించారంటూ ‘అమ్మదొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ’ అని వేదవతి పాడినపాటను తాను పాడి వినిపించారు.
ప్రతి స్పందనగా – వేదవతీ ప్రభాకర్ అన్నమయ్య కీర్తన పాడి తన గాన మాధుర్యంతో శ్రోతలను ప్రేక్షకులను సంగీతాభిమానుల్ని మంత్రముగ్దుల్నిచేశారు.
‘కవిత్వం’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకున్న ఎన్. ఆరుణ గురించి అల్లూరి గౌరీ లక్ష్మి పరిచయం చేస్తూ – సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరుణగారు… ఇంకా పది కాలాల పాటు పచ్చని, వెచ్చని కవిత్వం అందించాలని కోరుకుంటూ తమ అభినందనలు తెలియజేశారు. అవార్డు ప్రదాతలకు అరుణ తన కృతజ్ఞతలు తెలియజేశారు.
‘జర్నలిజం’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకున్న డా|| అఖిలేశ్వరీ రామాగౌడ్ గురించి తుర్లపాటి లక్ష్మి పరిచయం చేస్తూ – అఖిలేశ్వరి నిజామాబాదు జిల్లాకు చెందిన తొలి మహిళా జర్నలిస్టు మాత్రమేకాదని రాష్ట్రానికి చెందిన తొలితరం విదేశీ వార్తా విలేఖరిగా పేరొందిన తొలి మహిళ అని’ ప్రశంసించారు.
సన్మానానికి స్పందిస్తూ అఖిలేశ్వరిగారు అవార్డు ప్రదాతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళలు ఎక్కువ భాగం జర్నలిజాన్ని వృత్తిగా తీసుకుంటే బాగుం టుందని సూచించారు.
కథా విభాగంలో అపురూప పురస్కారాన్ని అందు కున్న వి. ప్రతిమ గురించి పి. ప్రశాంతి పరిచయం చేస్తూ ‘మానవ జీవితాల్లో పరుచుకున్న అంతులేని దుఃఖాన్ని, అణచివేతకు వివక్షకు గురౌతున్న స్త్రీల ఆర్త నాదాల్ని పాఠకులకు కథలుగా అందిస్తున్న రచయిత్రి ప్రతిమ అంటూ తమ అభినందనలు తెలియజేశారు.
సన్మానానికి ప్రతిమ స్పందిస్తూ – ఈ అవార్డుతో తనపై సామాజిక బాధ్యత ఇంకా పెరిగిందనీ, దాన్ని హృదయ పూర్వకంగా నిర్వహిస్తానని తెలుపుతూ అవార్డు ప్రదాతలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
‘సాహిత్య విమర్శ’ అంశానికి అపురూప పురస్కారాన్ని అందుకున్న ఆచార్య కాత్యాయనీ విద్మహే గురించి పొత్తూరి విజయలక్ష్మి పరిచయం చేస్తూ ‘స్త్రీల కవిత్వాన్ని, కథలను కేంద్రంగా తీసుకుని మహిళలల అస్తిత్వ చైతన్యాలను విశ్లేషిస్తూ కాత్యాయని రచించిన ‘సాహిత్యంలో సగం’ అనే పరిశీలనా గ్రంథానికి ఇటీవలే కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటూ- అపురూప అవార్డు అందుకున్న సందర్భంలో ఆమెకి తన శుభాభినందనలు తెలియజేశారు. సన్మానానికి విద్మహే స్పందిస్తూ ‘అవార్డులనేవి చేసిన కృషికి గుర్తింపునేకాక సమాజంలో సమస్యల పట్ల స్పందించే బాధ్యతను పెంచుతాయని, దాన్ని నిర్వహిస్తానంటూ అవార్డు ప్రదాతకు కృతజ్ఞతలు తెలిపారు.
‘నృత్యం’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకున్న డా|| అలేఖ్య పుంజాల గురించి సుజాతా పట్వారి పరిచయం చేస్తూ ‘సౌందర్య, సౌష్టవం, సాత్వికాభినయం మూర్తీభవించిన నాట్య కళాకారిణిగా మూడు దశాబ్దాలకు పైగా తన అభినయ నృత్య కౌశలంతో ప్రేక్షకులను అలరిస్తోన్న డా|| అలేఖ్య అపురూప అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఆమెకి అభినందనలు తెలియజేశారు.
సన్మానానికి అలేఖ్య పుంజాల స్పందిస్తూ ‘అవార్డు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవార్డు పొందినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంద’న్నారు.
‘ఉద్యమ సాహిత్య పుస్తక ప్రచురణ – సంపాదకత్వం’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకున్న అనిశెట్టి రజిత గురించి భండారు విజయ పరిచయం చేస్తూ- ‘గత నలభై యేళ్ళుగా రచయిత్రిగా, కవయిత్రిగా, సంపాదకురాలిగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం కృషిచేస్తూ- దళిత, బహుజన, స్త్రీవాద సాహిత్య, సామాజిక, పౌర, మానవహక్కుల ఉద్యమాలన్నింటిలోనూ మమేకమై శ్రమిస్తోన్న అనిశెట్టి రజిత – అపురూప అవార్డు అందుకున్న వేళ శుభాభినందనలు తెలియజేశారు.
అవార్డు గ్రహీత రజిత స్పందిస్తూ తాను చిన్న వయసు నుండే పలు సాహితీ, సాంస్కృతిక మరియు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఉద్యమ సాహిత్యాన్ని వెలువరించడంలో ముందున్నానంటూ అవార్డు ప్రదాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘వ్యాఖ్యానం / అభినయం’ విభాగంలో అపురూప పురస్కారం అందుకున్న ఉదయభాను గురించి యన్. సంధ్య పరిచయం చేస్తూ ‘ప్రయోక్తగా, పరిచయకర్తగా, నటిగా, చిత్రకారిణిగా, కవయిత్రిగా బహుముఖప్రజ్ఞ కలిగిన బుల్లితెర భానుతేజం ఉదయభానుని అవార్డు స్వీకరిస్తోన్న తరుణంలో తమ శుభాభినందనలు తెలిపారు.
తన సన్మానానికి స్పందిస్తూ – ‘సాహితీ వేత్తలందరితో పాటు బుల్లితెర వాఖ్యాతనైన తనను కూడా సత్కరించి ప్రాధాన్యత కలిగించినందుకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు.
‘కార్టూన్స్’ విభాగంలో అపురూప పురస్కారాన్ని అందుకున్న ‘రమ’ను కిరణ్‌బాల పరిచయం చేస్తూ ‘ఆమె కలం నుండి పుట్టే కథైనా, కవితైనా, కార్టూనైనా పాఠకులకదొక వరమని, తెలంగాణ ప్రాంతంలో పేరొందిన రచయిత్రి, కవయిత్రి, కార్టూనిస్ట్ మరియు వ్యాఖ్యాత నెల్లుట్ల రమాదేవి’ అని ప్రశంసించారు.
రమ సన్మానానికి స్పందిస్తూ కార్టూన్స్ విభాగంలో తనకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, తమ ఇంట్లో హాస్య వాతావరణం వుండటంచేత తాను మొదట కార్టూనిస్ట్ అయ్యాననీ, తర్వాతే రచయిత్రిని, కవయిత్రిని అయ్యానంటూ అవార్డు ప్రదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆద్యంతం అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా జరిగిన ఈ సాహితీ సభలో తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డా|| ఎన్. గోపి, ప్రొ|| జె. చెన్నయ్య, డా|| ముదిగంటి సుజాతారెడ్డి, పోల్కంపల్లి శాంతాదేవి, శీలా సుభద్రాదేవి, అత్తలూరి విజయలక్ష్మి, రత్నమాల, శారదా శ్రీనివాసన్, సురేఖా మూర్తి, అరుణావ్యాస్, డా|| నాళేశ్వరం శంకరం, మందరపు హైమవతి, కె. విమల, రాజీవ, గుత్తా జ్యోత్స్న, లీల, షహనాజ్ ఫాతిమా, పంతం సుజాత, ఏ. సూర్య ప్రకాశ్, వి.పి. చందన్‌రావు తదితరులు పాల్గొని ప్రదానోత్సవ కార్యక్రమానికి నిండుదనాన్ని తెచ్చారు.
డా|| హిమచందన్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎనిశెట్టి శంకర్, మేక రామస్వామి కో-ఆర్డినేటర్స్‌గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో మదర్స్‌డే సందర్భంగా యన్. విజయా కిషన్‌రెడ్డి ‘నేటి మదర్స్’ అనే తన కవితను వినిపించి సభికులను అలరించారు.
అనంతరం ‘భూమిక’ స్త్రీవాద పత్రికలో – ‘రచయి త్రుల సాహితీ యాత్ర’పై ట్రావెలాగ్ రాసిన రచయిత్రులకి బహుమతి ప్రదానం జరిగింది.
ఈ మెగా ఈవెంట్‌కి కిరణ్‌బాల, నెల్లుట్ల రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు రకరకాల బహుమతులందించారు. జి. సునీత వందన సమర్పణతో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ముగిసింది.