కల్లోల అస్సాంలో కవితా విహారం-సాహిత్య అకాడమీ నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌-2007

డా. కె. గీత

అస్సాంలో కజిరంగా నేషనల్‌ పార్క్‌కు దగ్గర్లో వున్న బోకాహాట్‌లో జె.డి.ఎస్‌.జి. కాలేజీ, సాహిత్య అకాడమీ కలిసి నిర్వహిస్తున్న నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌ – 2007లో పాల్గొనడాన్కి ఆహ్వానం అందింది నాకు.

అక్కడికి దగ్గరి విమానాశ్రయం జోర్‌హట్‌. హైదరాబాద్‌ నించి డైరక్టు విమానం లేకపోవడం వల్ల కలకత్తాలో బ్రేక్‌ జర్నీ చేయవలసి వచ్చింది మాకు. నవంబర్‌-26న సభ అయితే 24నే ఇక్కణ్ణించి బయలుదేరాం. హైదరాబాద్‌ నించి మూడు గంటలు విమాన ప్రయాణం కలకత్తాకి. మధ్యలో వైజాగులో కాస్సేపు ఆగుతుంది. విశాఖ సముద్రం మీంచి గిరికీలు కొడ్తూ విమానం నుంచి కైలాస గిరిని చూడడం ఎంత అద్భుతంగా వుందో! 25న కలకత్తా నించి జోర్‌హట్‌కు వెళ్ళాల్సిన మాకు మరో అరగంటలో చెకిన్‌ అవ్వాల్సి వుండగా ఫ్లైట్‌ కేన్సిల్‌ అయ్యిందని చెప్పారు సిబ్బంది. గౌహతీలో అల్లర్లు జరుగుతన్నందువలన అస్సాంకు సర్వీసులన్నీ రద్దుచేసామని, మేం తప్పనిసరిగా అదేరోజు వెళ్ళాల్సివుంటే నాగాలాండ్‌కు విమానంలో పంపి, అక్కణ్ణించి రోడ్డు ద్వారా అస్సాం చేరుకునే ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యాహ్నం 2 గం|| వేళ నాగాలాండ్‌లోని దివపూర్‌లో దిగాం. పైనించి విమానం దిగుతంటే తళతళా మెరుస్తూ అద్దాల్లా దర్శనమిచ్చాయి ఇళ్ళు. దారంతా అత్యున్నత పర్వతశ్రేణులు. మేఫల నీడల్ని చూస్తూ అలా వెళ్తూంటే మేఘం కంటే నా రెక్కలే గొప్ప అని విమానం గర్వంతో ఉప్పొంగి నట్లనిపించింది. విమానం కిందికి దిగేక తెల్సింది ఇళ్ళెందుకు మెరుస్తున్నాయో. అవన్నీ రేకులే. బహుశా వర్షపాతం అధికం కావడం వల్ల అనుకుంటా ఎక్కడో గానీ స్లాబ్స్‌ కనపడలేదు.

దాదాపు నాలుగుగంటలు చిక్కటి అరణ్యప్రాంతం గుండా ప్రయాణం చేసాం. ఆదివారం కావడం వల్ల ఎక్కడా షాపులు తీసిలేవు. మేం ప్రయాణిస్తున్న కార్పియ రోంగు అనే ప్రాంతం తీవ్రవాదం అధికంగా వున్న ప్రాంతం అని మాతో ప్రయాణించే వాళ్ళు చెప్పేరు. దారిలో ధనసిరి నది, గరమ్‌పానీ దాటివెళ్ళాం. ‘గరమ్‌పానీ’ ఉష్ణజలంతో నిండిన శీతలప్రదేశం. ఎత్తైనవృక్షాలు, రకరకాల శబ్దాలు మధ్య అడవి దాటుతంటే 4.30కే చీకటై పోయింది. చల్లగా చలి ఆవరించింది. 6 గం|| ప్రాంతంలో దౌర్‌గావ్‌ అనే చోట మాకోసం ఎదురుచస్తున్న కన్వీనర్‌ మృదుల్‌ బోరువాను కలిసాం. కజిరంగాలోని రిసార్టులో ఏర్పాటు చేసారు మాకు బస. మర్నాడు మీట్‌లో పాల్గొనే కవులంతా ఆ రాత్రి ముందుగా భోజనాల దగ్గరే కల్సుకుని పరిచయలు కానిచ్చాం. అస్సాం టూరిజమ్‌ వారి గెస్ట్‌హౌస్‌లో భోజనం సాహిత్య అకాడమీ స్థాయిలో లేదనిపించింది. అయితే అంతకంటే గొప్ప భోజనం మరెక్కడా అస్సాంలో దొరకదని తర్వాత అర్థమైంది. అస్సామీలు ప్రధానంగా అన్నమే తింటారు. రోటీలు తినరు. అయితే మన నెల్లూరు బియ్యంలాంటి నాజూకు రైస్‌ ఎక్కడా దొరకవట. ఇక కూరలు మిరియలు వాడడం వల్ల రంగు, రుచి లేనట్లు వుంటాయి. ఉన్న మూడు, నాలుగు రోజుల భోజనం ‘ఏదో’ అన్నట్లు కానిచ్చి సంతృప్తి పడ్డాం.

మర్నాడు పోలీసు ఎస్కార్టుతో అందరం కజిరంగా నుంచి బయలుదేరి సభాప్రాంగణానికి చేరుకున్నాం. అప్పటికే ఆదివాసీలు అస్సాం అంతా 36 గం|| బంద్‌కు పిలుపునివ్వడంతో ఎస్కార్టు లేకుండట ఎటూ వెళ్ళొద్దని చెప్పేరు మాకు. నాతో వచ్చిన మా సత్య, పాప రోజంతా మీటింగులోనే వుండిపోవల్సి వచ్చింది నాతో పాటు. జె.డి.ఎస్‌.జి. కాలేజి సిబ్బంది అత్యంత శ్రమించి ఏర్పాట్లు ఘనంగా చేసారు. అస్సాం సంప్రదాయ పద్ధతిలో ఊ…ఊ అని నోటితో శబ్దంచేస్తూ స్వాగతించి, సాంప్రదాయ మృదంగ నృత్యంతో ఆహ్వానం పలికారు. ప్రాంగణమంతా కలకల్లాడుతూ వెయ్యిమంది దాకా సభికులు, 80% పైగా యువకులే. నాకు చాలా ఆనందం వేసింది. ఈ తరం వాళ్ళకి కవిత్వం పరిచయం అవుతున్నందుకు. అయితే తర్వాత తెలిసింది వారొక ‘వాల్‌మేగజైన్‌’ నడుపుతూ ఇప్పటికే సాహిత్యసృజన చేస్తున్నారని. ప్రారంభోపన్యాసం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ అగ్రహారం కృష్ణమూర్తి చేసారు. తర్వాత నాతో పాటు అక్కడికి విచ్చేసిన కవులందరికీ ఆత్మీయ సత్కారం చేసారు. చక్కగా చెక్కిన ఖడ్గమృగం బొమ్మ, అస్సాం సంప్రదాయ కండువా, టీ పాకెట్‌, బ్యాగు, ఫైల్‌ వగైరాలతో సత్కరించారు. తర్వాత అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ”కరాబీ దౌఖా హజారికా” ఉపోద్ఘాతోపన్యాసంలో ఆ రోజు జయంతోత్సవం చేస్తున్న దివంగత కవులు గణేష్‌ గోగోయ్‌, ఆనంద బోరువాల గురించి వివరించారు. చిన్నవయస్సులో గొప్ప కవిత్వం రాసి ప్రసిద్ధులైన వారిద్దర్నీ స్మరించుకున్నారు సభలోని వారంతా. అకాడమీ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ సునీల్‌ గంగోపాధ్యాయ ఉపన్యాసంతో పాటు ”నో వన్‌ మేక్‌ ఎ ప్రామిస్‌” అని ఆంగ్లంలో కవిత్వం వినిపించారు. ”నేను కూడా కవిత్వం రాస్తాను ఇతర రచనలతో పాటు” అంటు చమత్కరించారు. సావనీర్‌ని భపతీదాస్‌ విడుదల చేయగా, కలకత్తా సాహిత్య అకాడమీ అధిపతి రామ్‌కుమార్‌ ముఖోపాధ్యాయ సభని ముగించారు. సరిగ్గా గంటలో ప్రారంభ కార్యక్రమం ముగించి ‘వాల్‌ మేగజైన్‌’ విడుదలకి కదిలారు అంతా. పెద్ద కాలేజీ ముందు ప్రాంగణంలో ఒక గోడకి అటు, ఇటు మెష్‌లు బిగించి అందులో ఆ కాలేజ్‌ విద్యార్థులు రాసిన వివిధ రచనలు వుంచుతారట నెలకు ఒకసారి. అంతా ఎప్పుడంటే అప్పుడు చదువుకునే వీలున్న ఆ ఆలోచన బాగా నచ్చింది నాకు. ఆ రోజు సభ గురించిన రచనలకు సునీల్‌ గంగోపాధ్యాయ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

భోజనానికి ముందు కవిత్వం మొదటి సెషన్‌ జరిగింది. సరిగ్గా గంటన్నరలో పూర్తిచేయల్సి రావడం వల్ల ఒక్కొక్కరికి రెండు కవితలు చదివే అవకాశం మాత్రమే ఇచ్చారు. వీరేంద్రనాథ్‌ దత్తా అధ్యక్షులుగా కొనసాగిన ఆ సెషన్‌లో వరుసగా అతను భట్టాచార్య (అస్సామీ), రమాకాంత బసుమతరి (బోడో), హృదయనంద గోగోయ్‌ (అస్సామీ), జోతి రేఖా హజారికి (అస్సామీ), మృణాల్‌ కుమార్‌ గోగోయ్‌ (అస్సామీ), అజిత్‌ గోగోయ్‌ (అస్సామీ), బిజయ్‌ రబీదాస్‌ (అస్సామీ), బిథి ఛటోపాధ్యాయ (బెంగాలీ), గ్లాన్‌ పూజారీ (అస్సామీ), హకీల్‌ అజ్మీ (ఉర్దూ) కవితాగానం చేసారు. అస్సామీ కవులు చాలామంది అనువాదాలు కాకుండా కేవలం మూలం చదవడం వల్ల సభలోని ఇతర భాషల వారికి అర్థం కాలేదు. జీవితంలో వివిధ కోణాల గురించి, బయటి ప్రపంచంలో సంఘర్షణ గురించి, ప్రకృతి వర్ణన, బాల్యం, వర్తమాన సరిహద్దు సమస్యలు, గ్రామీణ జీవనం మొదలైన వస్తువులతో చక్కని శైలిలో కవిత్వం విన్పించారు. ఉర్దలో షాయరీలు, గజల్స్‌ సభికుల్ని బాగా అలరించాయి. ”ముఖం ఎందుకు మనకి? తమాషా అందరూ చూసేటందుకు” అని, ‘నాలోని ఇల్లు’లో మానసికంగా, భౌతికంగా ఇంట్లో వస్తువులు తనతో ముడిపడి వుండడాన్ని చక్కగా కవిత్వీకరించారు ఉర్దూకవి హకీల్‌ అజ్మీ. జ్యోతిరేఖా ‘అమ్మనించి మొదలై అమ్మగా రూపొందిన జీవితాన్ని’ పెద్దకవితతోను, ‘నువ్వెలా వున్నావు?’ నీలాగే – నా జీవనరేఖ వెంట నీడలాగా’ అనే చిన్న కవితతోను అలరించారు. బిథి ఛటోపాధ్యాయ సరిహద్దు సమస్య మీద, ఫ్యూడలిజమ్‌ వ్యతిరేకత మీద బలమైన కవితలు విన్పించారు.

రెండో సెషన్‌లో భోజన విరామం తర్వాత హరేకృష్ణదేఖా అధ్యక్షులుగా అమలేందు శేఖర్‌ పాఠక్‌ (మైథిలి), ఇస్మాయిల్‌ హుస్సేన్‌ (అస్సామీ), కె. గీత (తెలుగు), కె.బి. నేపాలీ (నేపాలీ), లుఫాహనమ్‌ సలీమా బేగం (అస్సామీ), మణికుంతల భట్టాచార్య (అస్సామీ), నీలిమా ఠాకూరియహక్‌ (అస్సామీ), రాజీవ్‌ బోరువా (అస్సామీ), లచేంబమీటీ (మణిపురి), విక్రమ్‌ విశాజీ (కన్నడ) కవుల గానం సాయంత్రం 5 గం||ల వరకు సాగింది. రెండు సెషన్లలోనూ స్త్రీల కవితలు ప్రతిభావంతమైన స్త్రీవాదానికి ప్రతీకలుగా నిలిచాయి. రాజీవ్‌ బోరువా భార్యాభర్తల మధ్య అనుబంధానికి కొత్త కోణంతో ‘స్టల్‌’ అనే కవితను విన్పించారు. కె.బి. నేపాలీ, హరేకృష్ణ దేఖా దేశభక్తి, పురాణాలకు సంబంధించి సంప్రదాయ కవిత్వం విన్పించారు. కన్నడం నించి విక్రమ్‌ ‘పోయెమ్‌’ అని తన కవిత్వం గురించిన మంచి కవిత విన్పించారు. మణిపురి కవి లచేంబమీటీ – మణిపూర్‌లో అభద్రతని తెలియజెప్పే కవితని విన్పించారు. పోయెమ్‌ చివర్లో ”మణిపూర్‌ నన్ను వద్దంటుంది చివరికి” అని కళ్ళు చెమరించారు. జీవితంలోని అనేక కోణాల్ని స్పృశిస్తూ అద్భుతమైన కవిత్వంలో ఎక్కడికక్కడ జీవన సంఘర్షణ కొట్టొచ్చినట్లు కన్పించింది ఆ సాయంత్రం. మణికుంతల ‘ద వుమెన్‌’, ‘లవ్‌’ అనే కవితలతో విలక్షణమైన సున్నిత స్త్రీవాదాన్ని విన్పించారు. ”ఎవర్ని కోరుకుంటావో అతన్ని నీవు పెళ్ళి చేసుకోవద్దు” అని ప్రారంభించి – ”అయినా అతను లేకుండా నువ్వు జీవించలేవు – అతనే గాలీ, నీర నీకు” అంటారామె. నేను శీతసుమాలు, కంప్యూటర్‌ కాపురం, మిస్ట్‌లెటర్‌ కవితల్ని విన్పించాను. శ్రీమతి శాంతసుందరి గారి హిందీ అనువాదాలు, శ్రీఎన్‌.ఎస్‌.మూర్తిగారి ఇంగ్లీషు అనువాదాలు మూలంలాగే మనస్సుకి హత్తుకున్నాయని పలువురు ప్రశంసించారు. చాలామంది ఇంగ్లీషు కంటే హిందీ బాగా అర్థం చేసుకోగలుగుతున్నారక్కడ. ఇల్లు, ఐపిసి- 302 మొదలైన కవితల హిందీ అనువాదాలు తీసుకుని చదివి మరీ ఆనందించారు పలువురు. సభ కాంగానే కాలేజ్‌ విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఓలలాడించాయి అందర్నీ. చక్కని గళాలతో ఎక్కడా శృతి, లయలు మీరకుండా పిల్లలు ఎన్నో అస్సామీ గీతాల్ని ఆలపించారు.

మర్నాడు ఇంకా బంద్‌ కొనసాగడం వల్ల ఫ్లైట్స్‌ అన్నీ కేన్సిల్‌ కావడంతో కజిరంగా నేషనల్‌ పార్క్‌ సందర్శనకు తీసుకువెళ్ళారు అందర్ని. ఉదయం 4-30 కే వెలుతురు వచ్చేసింది. అయిదు గంటల వేళ మంచు ఉదయపు తెమ్మెరను కుంజర గమనంతో దాటుకెళ్ళడం అత్యద్భుతమైన అనుభూతి. దాదాపు గంటన్నర పాటు సాగిన ‘ఎలిఫేంట్‌ సఫారీ’లో అతిదగ్గర్నించి ఖడ్గమృగాలు, జింకలు మొదలైన అడవి జంతువుల్ని, అరుదైన పక్షి జాతుల్నీ చూడడం, ఏనుగంత ఎత్తువున్న గడ్డిలో ఏనుగెక్కి స్వారీ చేయడం మళ్ళీ రాని అనుభూతులు. దాదాపు ఇరవై ఏనుగులపై టూసీటర్‌, త్రీ సీటర్స్‌లలో వెళ్ళాం అందరం. పొగమంచులో ఏనుగుల గుంపులో అలా ప్రయాణం మంచి థ్రిల్లింగుగా అన్పించింది. మా మావటీ అశోక్‌ అక్కడవున్న 1800 ఖడ్గమృగాల గురించి, వాటి విలక్షణ జీవనశైలి గురించి చెప్పుకొచ్చాడు. అక్కడ జంతువులు కేవలం ఏనుగుల్నే చూడగలుగుతున్నాయో – మనుషుల అలికిడిని పట్టించుకోలేదో కానీ హాయిగా పక్కనించే వెళ్తూ ఉన్నాయి. మా ఏనుగు ‘ఫూల్‌ బాయి’ను ”రాణి” అనే రెండేళ్ళ గున్న ఏనుగు అనుసరిస్తంటే మా నాలుగేళ్ళ ‘వరధిని’ కేరింతలు కొట్టింది. ‘ఇంటికి తెచ్చుకుందాం’ అని పేచీపెట్టింది.

రిసార్టులో చలిమంట ముందు కవుల ప్రత్యేక గానం మళ్ళీ మొదలైంది. అంతా మళ్ళీ రకరకాల కవిత్వాల విందారగించేం. ఆనందంగా అస్సాం జానపద నృత్యం ”బిహు”లో అడుగులు కదిపేం. ఒక ఉత్సవంలాగా అంతా కేరింతలతో బాగా సంతోషంగా గడిపేం. నేను వారి సంప్ర దాయ చీర కట్టు నేర్చుకున్నాను. మధ్యాహ్నం జీప్‌ సఫారీకి వెళ్ళాం మళ్ళీ. ఈసారి మా జీపు శబ్దం వినగానే పారిపోయే జంతువుల్ని, దూరంగా నిక్కినిక్కి చూస్తున్న పక్షుల్ని మాత్రమే చూడగలిగేం. సరైన దారిలేని ఆ ప్రాంతంలో అరణ్యం వెంబడి నడుములు విరిగిపోయేలా సాయంత్రం వరకు జీప్‌లలో తిరిగేం. చెక్క వంతెనల వెంబడి, పులుల బెరళ్ళ గీతలు, అడుగుజాడలు చూసి ఒళ్ళు గగుర్పొడిచింది మాకు. ఎక్కడ చూసినా ఎత్తైన, దట్టమైన వృక్షాలు, అల్లుకున్న లతలు, సెలయేళ్ళు. కజిరంగా…కజిరంగా అని మనసు కవిత్వమై ఉరకలేసింది.

సాయంత్రం బంద్‌ పూర్తి కాగానే మళ్ళీ పోలీస్‌ ఎస్కార్టుతో ‘జోర్‌హట్‌’కు చేరుకున్నాం అందరం. పూర్తిగా పట్టణ వాతావరణం, ఆధునిక జీవనం జోర్‌హాట్‌లో కన్పించింది. అస్సామీ భాషలో ‘జో’ అంటే రెండు, ‘హట్‌’ అంటే మార్కెట్‌ అని అర్థమట. అక్కడ రెండురకాల పెద్ద మార్కెట్లు కలిపి ఆ ప్రాంతానికా పేరు వచ్చిందట. ఖడ్గమృగం ప్రింటు, త్రెడ్‌మార్క్‌లతో వున్న అస్సాం ‘ముంగాసిల్క్‌’ చీరలు ప్రత్యేకత అక్కడ. జ్యోతిరేఖా, అస్సామీ కవయిత్రి అక్కడే కాలేజ్‌ లెక్చరర్‌గా పనిచేయడం వల్ల షాపింగు బాగా సులభమైంది మా అందరికీ. అస్సామీ సాహితీ సమాఖ్య వాళ్ళు 28న అప్పటికప్పుడు స్థానిక కవులతో, విలేఖరులతో సమావేశం ఏర్పాటు చేసారు. సాహిత్య అకాడమీ వారిని, కవులని సత్కరించారు. వారి స్థానిక కవిమిత్ర ప్రముఖులని పరిచయలు చేసి, వారి పుస్తకాలు మాకు బహూకరించి ఆనందంలో ముంచెత్తారు. ఎక్కడ చూసినా మాకెదురైన ప్రతి ఒక్కరూ ఆత్మీయతను కురిపించడం బాగా ఆశ్చర్యపరిచింది నన్ను. అస్సామీలు సహజంగానే మంచి మర్యాదస్తులని అర్థమైంది.

దగ్గర్లోని ‘శిబ్‌సాగర్‌’ అనే చారిత్రాత్మక ప్రాంతాన్ని, నదీద్వీపాన్ని బంద్‌ వల్ల చూడలేకపోయం. అకాడమీ కలకత్తా ప్రతినిధి అరుణి చక్రవర్తి ప్రతి నిమిషం అందర్నీ జాగ్రత్తగా పట్టించుకుంటూ, ఏర్పాట్ల గురించి బాగా శ్రద్ధ వహించారు. సభలు జయప్రదం కావడంలో ప్రముఖపాత్ర వహించారు.
వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అందర్లోన ఒక్కటే భావం. ‘అప్పుడే వెళ్ళాలా’ అని. అడుగడుగునా ఆత్మీయతే ప్రధానంగా సాగిన సభలు గడిచి తిరిగి విమానం గాల్లో ఎగురుతూ మబ్బుల్లో దోబచులాడుతుంటే ఏదో తెలీని బెంగ చుట్టుముట్టింది నన్ను. ఏ పర్వత కొసనో దిగి, శిఖరాలతో తాడాట లాడి, మేఘాల్ని కప్పుకుని, అక్కడే నిద్రించాలన్పించింది. రెక్కలు సాచి దట్టమైన అరణ్యాల మీంచి ఎగురుకుంటు నదులతో పరుగెత్తా లన్పించింది.
కళ్ళు మూసుకున్నా ‘బిహు’ నృత్యం, జానపద గానం ఇంకా తడుతూనే వున్నాయి. అస్సాం అనుభూతి తల్చుకున్నప్పుడల్లా ఆహ్లాదభరితంగా అన్పిస్తుంది. తిరిగి కలకత్తా, హైదరాబాద్‌ చేరుకున్నా ఇంకా చల్లచల్లని అస్సాం అరణ్యాల్లో తిరుగుతున్నట్లే వుంది. మంచి అవకాశం కల్గించిన సాహిత్య అకాడమీకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సభ ఒక్కరోజైనా వెళ్ళి రావడాన్కి అయిదారు రోజులు పట్టడంతో అలిసిపోయినా హాయిగానే అన్పించింది. కవిత్వం రాయడం వల్లే ఇంత గౌరవం, ఆనందం కలుగుతుందని ప్రతి కవి మనస్సులో తప్పకుండా అన్పించి వుంటుంది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.