గాంధారి లోకంలో శ్రీలేఖ పోరాటం

కొండేపూడి నిర్మల

చాలా రోజుల నుంచీ మీకు శ్రీలేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను.

దాదాపు పదిహేనేళ్ల క్రితం ”శావీ” అనే ఆంగ్ల పత్రికలో ఆమె ఆత్మకథ చదివి దాచుకున్నాను. ఆవిడ ధైర్యం, ఆత్మవిశ్వాసం లాగే సంఘర్షణ కూడా నన్ను వెంటాడుతూ వుంటుంది. కేరళ పోలీసు శాఖలో మొదటి తరం మహిళా అధికారి శ్రీలేఖ. నేరస్థుల పాలిట సింహ స్వప్నంలా అవినీతినీ, అక్రమాల్నీ చీల్చి చెండాడినంత సులువుగా తన మీద అమలయిన వివక్షను జయించలేక పోయాననీ స్వయంగా చెప్పుకుంది.

శ్రీలేఖ అనుభవాల్ని ఆమె మాటల్లోనే..”నాక్రింది అధికారి ఎవరైనా విజయం సాధించినపుడు ముక్తసరిగా, -మంచిది, బావుంది-అని వూరుకోవడం ఎందుకో ఇష్టం వుండదు.
ప్రోత్సాహిస్త్తూ భుజం తట్టాలనిపిస్తుంది. అందులో వచ్చే ఆత్మసంతృప్తి అందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. నా పై అధికారినుంచీ నేను అదే ఆశిస్తాను. కేవలం ఆడదాన్నవడంవల్ల అది పోగొట్టుకోవడం, అన్యాయంగా అనిపిస్తుంది. కరచాలనం కోసం దాచిన చెయ్యి తప్పు చేసినట్టు ముడుచుకుపోవడం అనేది ఏ పీనలు కోడుకీ అందని శిక్ష…! బహుశా చెయ్యి ముట్టుకోకుండా నమస్క రించడంవల్ల స్త్రీలను గౌరవిస్తున్నామని కొందరు అనుకోవచ్చు.మనం ఆశిస్తున్న విలువలు ఇవి కాదు”. అంటుంది శ్రీలేఖ. ఇంకా చాలా విషయలు సూటిగా చెప్పింది. ”వొంటి మీద ఖాకీ యూనిఫారం తొడిగిన నాడే నేను ఆడదాన్నని మర్చిపోయాను. జండరు మర్చిపోవడమంటే నా ఆలోచనా పరిధి మరింతగా వికసించడమేనని మనసా వాచా నమ్మాను. అసలందుకే పోలీసుశాఖలో చేరాను. కానీ ఏం జరుగుతోంది? సాధారణ ఉద్యోగి నుంచి డైరక్టరు జనరల్‌ పోలీసు వరకూ అందరూ నన్ను హద్దుల్లో వుండమని చెప్పేవారే.

”ఆడవాళ్ళు అంత శ్రమ తట్టుకోలేరు” 1987లో ట్రైనింగు ప్రోగ్రాం మీద లాల్‌ బహదూరు అకాడమీలో వున్నప్పుడు హిమాలయలు ఎక్కాల్సి వచ్చింది. ఆ ప్రాంతమంతా ఎగుడు దిగుళ్ళతో పట్టు చిక్కకుండా వుంది. సిబ్బందితో పాటు పాకుతూ కొండ ఎక్కుతున్నాను. అందరికీ సలహాలు, సచనలు ఇస్తున్న కోర్సు డైరక్టరు నన్ను మాత్రం దిగిపొమ్మని అది చాలా ప్రమాదమని చెబుతూ ”మీ ఆడవాళ్ళు అంత శ్రమ తట్టుకోలేరు.” అన్నాడు. చాలా అవమానంగా అనిపించింది. కాదు ఎలాగైనా ఎక్కుతానని చెప్పి ఒప్పించాను. అందర నా వైపే చూస్తున్నారు. పనికంటే వాళ్ళ పరిశీలన వల్ల నాకు కాళ్ళు వణకడం మొదలయింది. పది రోజులు జరిగిన ఆ క్యాంపులో విజయం సాధించానుగానీ నన్ను ఆదర్శంగా చెబుత ”చూడండి బ్రదర్సు.. ఆమె మహిళ అయివుండీ సాధించింది. మీరు ఆ మాత్రం ఎక్కలేరూ” అంటున్నప్పుడు అదే అవమానం వెంటాడింది.

”ఆడదానికి సెల్యూటు చెయ్యలా?”
1991లో త్రిస్సరు పోలీసుశాఖకు సూపరిండెంటుగా చేస్తున్నాను. ప్రతినెలా ఆఖరి శుక్రవారం పెరేడు తర్వాత సలహాలు హెచ్చరికలు ఇవ్వాల్సిన బాధ్యత వుంటుంది. టీంలో చాలామందికి జుట్టు పెరిగి పోయి, మాసిన గడ్డాలతో చాలా నిర్లక్ష్యంగా వున్నట్టు అనిపించింది. క్రాఫింగు, షేవింగు చేసుకోని వాళ్ళంతా గ్రౌండ్సునుంచి వెళ్ళిపొమ్మని అంటూ ”ఫౌలౌట్‌” అని అరిచాను. ఏ మాత్రం సిగ్గు పడకుండా అందరూ వెళ్ళిపోయరు. బ్రేకు ఫాస్టు దగ్గర కూడా సారీ చెప్పడానికి ఎవరూ ప్రయత్నించలేదు. డి.ఐ.జి.నుంచి ఫోను మాత్రం వచ్చింది.

”పెరేడ్సు దగ్గర కటింగు ప్రస్తావన ఎందుకు తెచ్చారు? మీ ఉద్దేశ్యం ప్రకారం అందరూ బోడి గుండ్లతో రావాలనా? అనవసర విషయల్లో జోక్యం చేసుకోకండి?” అని ఎగిరాడు. అప్పటివరకూ వున్న క్రమశిక్షణ కూడా నా హయాంలో ఎవరూ పాటించరని తెల్సి ఆశ్చర్య పోయను. ఇంకా పరాకాష్ట ఏమిటంటే అసలు నేను వస్తున్నట్టు తెలిసి ఒక ఆడదానికి సెల్యటు చెయ్యడం ఇష్టంంలేని అక్కడి సి.ఐ. బదిలీ చేయించుకుని హడావుడిగా వెళ్ళిపోయాడట!
”రాత్రిపూట ఇంకెందుకు ఫోను చేస్తారు?”
త్రివేండ్రంలో వుండగా ఓ రాత్రి నాలుగ్గంటలపాటు కరెంటు లేదు. కరెంటాఫీసుకి ప్రయత్నించి విసుగేసి కనెక్షను కోసం కజహకుట్టం పోలీసుస్టేషనుకు ఫోను చేసి ఎస్సై వున్నాడా? అని అడిగాను. హటాత్తుగా గొంతు మార్చి చవకగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ”ఎవరితో మాట్లాడుతున్నావో అర్ధమవుతోందా?” అని అరిచాను. ”తెలుసు అర్ధరాత్రి ఆడదానితో ఇంకేం మాటలుంటాయి” అని జవాబు చెప్పాడు. అతని ప్రవర్తన గురించి రిపోర్టు చేసినా ఫలితం లేకపోయింది. ”ఆయన మంచివాడేనండీ ఆ రోజు తాగి వుంటాడు” అని ఒకరిద్దరు సమర్ధించాలని చూశారు. ఇంకోసారి మతి పోయింది.
ప్రశ్నించడమే నా శీలానికి మచ్చ
చర్తాలా టౌనులో లిక్కరు షాపులు మూయించడానికి గూండాలతో కంటే అలపూజ పరిధిలోని తోటి అధికారితో ఎక్కువ యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. నేను రైడ్స్‌కు బయల్దేరే లోపు అతను వర్తమానం ఇచ్చేసి వాళ్ళని షాపులు మూయించేస్తూ వుండేవాడు. ఒకసారి నన్ను చెవులతో వినలేని భాషలో తిట్టాడు. నేను కిందకు ఈడ్చి కొట్టాను. అప్పుడు తావిమారం అనే సాయంకాలం పత్రికలో నన్ను గురించి నానా కూతలు రాసి మా బంధువులందరికీ పోస్టు చేశాడు. ఇదంతా నేను పై అధికారికి రిపోర్టు చేశాను. అప్పుడు ఆయన ఒక టేపు రికార్డు చేతికి ఇచ్చి లజు టాక్సు ఎవరు మాట్లాడినా రికార్డు చెయ్యమన్నాడు. అంటే ఆధారం లేకుండా నా మాట ఎవరూ నమ్మరని అర్ధమయింది. యూనిఫాం జేబులో రికార్డు వేసుకుని ఎవరు ఏం వాగినా ఈడ్చి దవడ వాయగొట్టడానికి బదులు రికార్డవుతోందా లేదా అని ఎదురు చూడడం చాలా అసహ్యమనిపించేది.
అంతా దొంగలే త్రిస్సరు నుంచి డిస్టిక్టు క్రైం రికార్డు బ్యూరోలోకి నన్ను ఎస్సైగా వేశారు. అది ప్రమోషను అయిన పోస్టు కాక క్రియేటు చేసిన పోస్టు అవడం నా అధికారాన్ని తగ్గించడానికేనని తెలుసుకున్నాను. అప్పుడు నేను మూడు నెలల పాటు డెలివరీ లీవు తీసుకుని ప్రసవమైన తర్వాత వచ్చాను. నాకు యూనిఫారం బావులేదని పై అధికారి అనధికార సలహానట! అంతకు ముందు పొట్టతో వున్నప్పుడు అదే మాట అన్నారు. యూనిఫారం మీ అందరికీ బావుండాల్సిన అవసరమేమిటనే నా ప్రశ్నే ఎవరికీ అర్ధం కాలేదు. ఈ విషయలు ఎవరికి ఫిర్యాదు చెయ్యలి? నా కోసమే రూల్సు సృష్టిస్తున్న వాళ్ళకా? నా ఫిర్యాదులు బుట్ట దాఖలు చేస్తున్న వాళ్ళకా? నా సర్వీసునీ క్రెడిటునీ ఆడదాన్ననే కారణం చేత పక్కన పెడుతున్న వాళ్ళకా? స్త్రీగా పుట్టడం ఒక అంగవైకల్యం అయినట్టు…నన్ను వెడలుగా చూపించి నా డిపార్టుమెంటు వాళ్ళు యువకులకి ధైర్యం చెబుతుంటే.. అదేదో తెలీని బాధ…”

కరాటేవల్ల, పదవులవల్ల, అంతరిక్షం లోకి ఎగిరి రావడం వల్ల ఆడవాళ్ళకు అనేక శక్తులొస్తాయని మనం నమ్మేస్తాం. అందుకు కోచింగులు ఇప్పిస్తాం. ప్రపంచం సమర్ధులైన ఆడవాళ్ళతో నిండిపోయింది. కానీ సమస్యలు తీరడమేలేదే! సమాజం భావశూన్యతతో తుప్పు పట్టేసింది. అభద్రతా భావంతో పిల్లి మొగ్గలు వేస్తోంది. కాబట్టే ఒక పురుషుడు చేసే పని అతని కంటే సమర్ధవంతంగా చేస్తూ కూడా అది గుర్తింపు చేయడానికి సగటు స్త్రీ తన జీవితాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.