డా. శిలాలోలిత
‘మనుష్యుల మధ్య మనుష్యుల కోసం బ్రతకడమే మంచితనం’. అని ‘టాల్‌స్టాయ్’ అన్నట్లుగానే కవయిత్రి అరుణ కూడా ఆ కోవలోకే వస్తారు.
స్వచ్ఛమైన, అంతరంగ పేటికను మూతతీసి, రోజుకు కొన్ని కవితావిత్తనాలను వెదజల్లుతున్నారు. ఇవి మాగిన విత్తనాలు. విలువైనవి, బరువైనవి, ఫలించేవి. అందుకే చాన్నాళ్లయిన తర్వాత కూడా వాటి సాంద్రతను కోల్పోలేదు.
ఇప్పుడు రాస్తున్న కవయిత్రులందరిలో తనదైన స్థానాన్ని, ముద్రనీ బలంగా వేయడానికి ఆమె వ్యక్తిత్వం, కవితా గాంభీర్యమే కారణం.
నిజామాబాద్ జిల్లాలో, గ్రామీణ నేపథ్యంలో పెరిగిన కవయిత్రి, ఆర్ట్స్ కాలేజీలో పీ.జీ. కొచ్చేసరికి, ఇక్కడి భావవాతావరణం ఆమెనొక మంచి కవయిత్రిగా మలిచింది. తెలుగు సాహిత్యం పట్ల గల గాఢమైన అభిరుచితో అధ్యయనం చేయడం వల్ల సున్నితమైన వ్యక్తిగా నిలబడ్డారు.
ఆ తరువాత అందరు కవయిత్రుల లానే ‘ప్రయారిటీలు’ ఎంచుకోవడంలో సాహిత్యానికి కొంత శాతం తగ్గించుకునే సరికి రచనా వేగం తగ్గింది.
ఇటీవలి కాలంలో అంటే, 2003 ఆ ప్రాంతం నుంచి మళ్ళీ రచించటం ఆరంభించారు.
అలా మొదలైన తర్వాత ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంకలనాన్ని 2004లో వెలికితీసుకొచ్చారు. ఇన్నాళ్ళ మౌనం వెనుక, నిశ్శబ్దం వెనుక శబ్దం రావడంతో, జలపాతహోరులో ఎంతో ఉధృతితో కవిత్వం దూసుకువచ్చింది. ఆ ప్రవాహవేగం కన్పిస్తూనే వుంది. ఒకోసారి రెండు కవితలు కూడా ఒకే రోజు పుట్టాయ అన్నట్లుగా రచనను చేస్తున్నారు.
‘కప్పనర్చి
వడ్లను తర్పారపడితే…..
మిగిలిన గట్టిగింజల్లా
నా అక్షరాలు’
అని కవయిత్రి చెప్పుకున్నట్లుగానే వాస్తవాలివి. తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని, భావించినట్లుగానే, తానేమిటో కవయిత్రి చెప్పారు.
అలాగే, 2005 లో ‘పాటల చెట్టు’ అనే మరో కవితా సంకలనాన్ని తెచ్చారు.
‘ఇది పాటల చెట్టు
ఎన్నెన్నో సుఖదుఃఖాల కలబోతలతో
…………
మనిషిగా లయమై
చెట్టుగా పచ్చని లయనై…..’
– అంట తన కవిత్వ భూమిపై వృక్షమై నిలిచిన కవితాత్మను ఆవిష్కరించారీ పాదాల్లో.
స్త్రీపురుషులు సమానత్వభావనతో కలిసి జీవించాలనే భావాన్ని స్పష్టంగా చెబ్తూ – ‘మనిషితనం’ కవితలో – ‘స్త్రీ అర్థంకాని బ్రహ్మపదార్థమేమీ కాదు/అర్థం చేసుకోవడం ఇష్టం లేదంతే’ – అని నిజాలమూటను విప్పేశారు. మనిషితనం ప్రధానమన్నారు.
అనుభవసాంద్రత, వేదాంతం, లోకజ్ఞత కనిపించే కవిత్వ పాదాలెన్నో వున్నాయి. జీవితం ఆమె అక్షరాల నిండా పరుచుకుని వుంటుంది. ముడుచుకొని వున్న చాప చుట్టను తెరుచుకుంటూ పోతుంటే దృశ్యమానమౌత వుంటుంది.
‘తరగతి గదిలో
చిన్ని మెదళ్ల జ్ఞాన సమారాధన ముందు
దేవాలయమెంతటి…
…….
కనలి కనలి అంగలార్చే
చిరంతన మహాదుఃఖం ముందు
కవిత్వమెంత?!’ – అని సూటిగా ప్రశ్నిస్తుంది.
ఆమె వేదాంత చింతనకు మరో ఉదాహరణ
‘జీవితం మనది కానప్పుడు
ఎన్ని వ్యాఖ్యానాలైనా
అడ్డూఆపూ లేకుండా వర్షిస్తూనే వుంటాయి’ –
….
‘జీవితం గణితం కాదు
అగణితం’ – ఇలా ఎన్నెన్నింటినో చెప్పుకుంటూ పోవచ్చు. ఒక మంచి కవిత్వాన్ని చదివిన తృప్తినీ, గొప్ప భావదీప్తిని ‘అరుణ’ కవిత్వం కలిగిస్తుంది. జీవితంలోని అనేక పార్శ్వాలను ఓసారి తడిమిచూద్దామనుకున్నవాళ్ళంతా చదవాల్సిన ఉత్తమ కవిత్వం ఈ కవయిత్రిది.