రామాపురంలో మధుకర్ అనే తెలివైన బాలుడు వుండేవాడు. ఎటువంటి చిక్కు సమస్యను అయినా ఇట్టే పరిష్కరించేవాడు తన తెలివి తేటలతో మధుకర్ ఎన్నో సార్లు ఇతరులను ఆపదల నుండి తప్పించాడు. ఒకసారి మధుకర్ బంధువులు వచ్చి మధుకర్ తల్లిదండ్రులను తాత, అవ్వలను, ఇతర బంధువులను అందరినీ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లి జరిగే ఊరు చాలా దూరంలో వుంది. కానీ వారు దగ్గరి బంధువులు కావడంతో పెళ్లికి వెళ్ళక తప్పదు.
ఇంటిల్లిపాదీ పెళ్లికి అవసరమైన డబ్బు, నగలు, ఇతర సామాగ్రి అన్నీ తీసుకుని బయల్దేరారు. అయితే వీటిని బాహాటంగా తీసుకువెళితే దొంగలు దోచుకుని పోవచ్చు అనుకుని మధుకర్ సూచన మేరకు పసుపు బిందెలలో నగలు, మిరపకాయల డబ్బాలలో ధనం వేశారు. పట్టు వస్త్రాలన్నీ పప్పుబస్తాలలో దాచి పెట్టారు. మిగతా విలువైన వస్తువులను బియ్యం బస్తాలలో, నూనె డబ్బాలలో వేశారు. అన్నీ తీసుకుని బండ్లు కట్టుకుని బయల్దేరారు. ఊరుదాటే వేళకే చీకటి పడిపోయింది. అంతలో దొంగలు వారిని అటకాయించారు.
”మీ దగ్గర వుండే డబ్బు, నగలు ఇవ్వండి” అంటూ వాళ్ళను బెదిరించారు. ”అయ్యా! మేం కడు పేదవాళ్లం. మా దగ్గర డబ్బు, నగలు లాంటివి ఏమి లేవు” అని వాళ్లు బతిమలాడుకున్నా దొంగలు వినలేదు. అప్పుడు మధుకర్ ”వాళ్లు చెవుతున్నది నిజమే. వాళ్ల దగ్గర ఏమి లేవు. కేవలం నా దగ్గర మాత్రమే కొద్దిగా డబ్బుంది. కావాలంటే అది ఇస్తాను. తీసుకువెళ్లండి” అంటూ తన చొక్కా జేబులో వున్న కొద్ది పాటి డబ్బును వాళ్లకు ఇచ్చాడు. వాళ్లు వెళ్లిపోయారు. మధుకర్ తెలివికి అందరూ సంతోషించారు.