నా వయసులో అమ్మ ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకొంటే… లావుగానే ఉండేది. కానీ హుషారుగా పని అంతా చేసేది. ఉద్యోగం కూడా చేసేది. ఆమె అమ్మగానే నాకు గుర్తుకు వస్తోంది. ఒక్క అమ్మ అనే కాదు టీచరుగా ఎంత బాగా పాఠం చెబుతుందో చూసేవాళ్ళం. స్నేహితురాళ్ళలో స్నేహాన్ని తడుముకొని ఆనందించే వాళ్ళం. అమ్మ వడిలో వెచ్చని ప్రేమ స్పర్శ మాత్రమే అనుభవించే వాళ్ళం. ఎప్పుడూ వాళ్ళ శరీరాల గురించి అంతగా ఆలోచించ లేదు. పాఠ్య పుస్తకాల్లోని బొమ్మల్లో స్త్రీలు కూడా లావుగానే ఉన్నట్లు గుర్తు. ఆ కాల పరిస్థితులకు ఆ శరీరాలు, అందరికీ అంగీకారాలే. మహానటి సావిత్రి ఆ నాటి నమూనబొమ్మ.
మరి ఇప్పుడేమిటి. ఎంత వయసు వచ్చినా సన్నగా నాజూకుగా అందంగా ఉండమని అంటున్నారు? మార్కెట్ అవసరా ల కనుగుణంగా మహిళా ఉద్యోగస్తులు, ఎప్పుడూ ఏ వయసులోనైనా అందంగా… ముడతలు లేని మొహాలతో… డై వేసిన నల్లటి జుట్టుతో…. నిగ్గు తేలిన చర్మ సౌందర్యంతో… పొట్టలు లేని నడుములతో ఉండాలనే వత్తిడి అంతర్గతంగా ఎన్నో అననుకూల పరిణా మాలు కలిగిస్తుంది. ఇప్పుడు మన చుట్టూ నివసిస్తున్న సమూహాల మెదళ్ళలోకి కూడా మార్కెట్ ప్రవేశించినట్లుంది. సన్న తనాన్ని ఎక్కువ కాలం నిలుపుకొన్న మహిళలు విజేతలు ఇక్కడ. ఎంత వయసు వచ్చినా బక్క చిక్కిన శ్రీదేవి లాగా, నిన్న మొన్నటి రేఖ లాగా సన్న జాజి తీగల్లాగా ఉండాలి మరి. అలా ఉండలేని వాళ్ళంటే ఒకింత తక్కువ చూపే. వెక్కిరింతే. నల్లటి శరీర రంగు సమాజంలో ఇచ్చే అవమానాలు లావుతనం కూడా ఇప్పుడు ఎదుర్కొంటుంది.
సినిమా యాక్టర్లు వెయిట్ రిడక్షన్ మీదా, లైపో సక్షన్ మీదా కోట్లు ఖర్చు పెడు తుంటే మధ్య తరగతి ప్రౌఢలు ప్రకృతి ఆశ్రమాలు ఆశ్రయిస్తున్నారు. సినిమా యాక్టర్లకు డబ్బులు సంపాదించి పెట్టే సౌందర్య శరీర క్రేజు మధ్య తరగతి మగువల అశాంతికి కారణం అవుతుంది. వయసుతో బాటు తగ్గే మెటాబోలిక్ రేట్, పెరిగే హార్మోన్ల ప్రభావాన్ని అతిక్రమించి ఎల్లప్పుడూ మెరుపు తీగల్లాగా ఉండాలనే కోరిక మంచిదే కానీ అది నిర్దేశిత శిలా శాసనంగా మళ్ళీ నెత్తి మీద రుద్దుతున్న శక్తులు ఎవరో గమనించండి. 30 సంవత్సరాలు నిండని స్త్రీలతో తల్లి పాత్రలు వేయిస్తూ సినిమాలు, టీవీలు… ఏ వయసులో నైనా స్త్రీలు అందంగా ఉండాలనే సందేశాన్ని శక్తివంతంగా మోస్తున్నాయి. శరీర బరువును అదుపులో ఉంచుకోవటానికి నడక మంచిదని వైద్యులు చెబుతుంటే… శరీర కొలతలు గీటు దాటకుండా ఉండటానికి జిమ్ములు రంగంలోకి వచ్చాయి. అధిక బరువు సమస్య ఆరోగ్య పరిధిని దాటి అందాల ప్రదర్శనకు వెళ్ళినపుడు ఒక ఇంచి తేడా కూడా పరిగణనలోకి వస్తుందిప్పుడు.
బారతదేశ సాంప్రదాయ దుస్తులు ఆయా ప్రాంత స్త్రీల శరీర నిర్మాణానికి అనుగుణంగా డిజైన్ అయ్యాయి. గోధుమలు తినే ఉత్తర భారతదేశంలో పంజాబీ సూట్స్, చూడీదార్స్… బియ్యం, చిరుధాన్యాలు తినే దక్షిణ భారతదేశంలో చీరలు… ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు తయారయ్యే శరీరాల కోసం తయారు అయ్యాయి. (ఆహారపు అలవాట్లు కూడా స్థానికతను కోల్పోయి ప్రపంచీకరణ చెందుతున్నాయి. ఆహారానికి స్థానికంగా దొరికే వస్తువులు కాకుండా యూనివర్సల్ తిండ్లు రంగంలోకి వస్తున్నాయి. అది ఇంకో విషయం) కానీ ఇప్పుడు ఆహార అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, శరీర నిర్మాణాలు కాకుండా సౌలభ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇది ఒక అనివార్య పరిణామం. అయితే శరీర నిర్మాణానికి అనుగుణమైన సౌలభ్యాన్ని ఆహ్వానించాలి కానీ, వారి మార్కెట్ ఉత్పత్తులకు అవసరమైన శరీర నిర్మాణాలకు మహిళలను (పురుషులను కూడా) పురిగొల్పుతున్నట్లుగా ఉంది. మన శరీర కొలతలకు అవసరమైన దుస్తులు ఉండాలి కానీ, వారి కొలతలకు అనుగుణంగా మన శరీర నిర్మాణాలు మార్చుకోవాలనే అదృశ్య వత్తిడిని గమనిస్తున్నారా?
మంచి ఆహారం, జీవన విధానం, ఉదయపు నడక పాటిస్తూ బ్రతకటం ఆరోగ్యమే. కానీ అలాంటి క్రమ బద్ధమైన జీవితం ఈ స్పీడు యుగంలో ఎంత మంది స్త్రీలకు దొరుకుతుంది? సామాజిక, ఆర్ధిక, మానసిక, కుటుంబపరమైన వత్తిళ్ళు చిక్కిన చక్కనమ్మలనే కాదు లావైన బొద్దు గుమ్మలను కూడా సృష్టిస్తాయి.
ఆధునిక స్త్రీ ఆరోగ్యంగా ఉందని ఎప్పుడు అనగలము?
దూరంగా ఆ మట్టిదారిలో నెత్తి మీద గడ్డి మోపు మోస్తూ చక చక నడుస్తూ ఉంది ఆమె. ఒక పది కేజీలు ఉండదూ ఆ మోపు? తన శరీర అధిక బరువుతో బాటు అంత మోపును మోస్తూ ఆమె ఆ వేగంతో ఎలా నడుస్తుంది? ఇక్కడెవరీమె? నాలుగేళ్ళ బిడ్డను చంకనేసుకొని మారథన్ చేస్తుంది? మోకాళ్ళ మీద కూర్చొని పాల తపాళ కాళ్ళ సందున ఇరికించుకొని పాలు పిండుతుంది. ఒకామె. ఏ యోగా భంగిమలో లేని ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది అక్కడ. నడుం విల్లులా వంచి కలుపు తీస్తుంది అక్కడ ఇంకొక ఆమె. వీళ్ళె వరూ జీరో కొలతల్లో లేరు మరి. అక్కడొక లావుపాటి మహిళ ”అదిగో తూరుపు హైలెస్సా” అంటూ నర్తిస్తుంది. కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్లు లేవు. శరీరాన్ని తేలికగా గాలిలో తేలిస్తుంది. ఆరోగ్యం, ఆనందం ఆమె సౌందర్య రహస్యాలు. వెల్లువ లాంటి చలనం, జన జీవాలతో ఆమె ఒక ప్రవాహ గీతం.