స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దా లలో రచన ప్రారంభించి విస్తృతంగా కథా నవలా రచనలు చేసి పాఠకుల ఆదరణ పొందిన రచయిత్రులలో డి. కామేశ్వరి ఒకరు. పందొమ్మిది వందల అరవైలలో రచన ప్రారంభించిన దూర్వాసుల కామేశ్వరి దాదాపు మూడువందల కథలతో పది కథాసంపుటాలు, ఇరవై యొక్క నవలలు ఒక యాత్రాకథనం, ఒక కవితా సంకలనం ప్రచురించారు. అనేక కథలు నవలలూ ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి. ”న్యాయం కావాలి” ”కోరికలే గుర్రాలైతే” చలన చిత్రాలుగా నిర్మితమయ్యాయి. న్యాయం కావాలి చిత్రం హిందీలో కూడా నిర్మితమయింది. ఉత్తమ సినిమా కథ అవార్డు గెలుచుకుంది. కొన్ని నవలలు టీవీ సీరియల్స్‌గా టెలిఫిల్మ్స్‌గా కూడా వచ్చాయి.
స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రులు కొందరి గురించి భూమిక పత్రికలో లోగడ వచ్చిన వ్యాసాలలో కామేశ్వరి గురించిన పరిచయ వ్యాసం ఒక భాగం కనుక ఇందులో ఆమె నవలల గురించిన ప్రస్తావన లేదు. కామేశ్వరి ప్రచురించిన పది కథా సంపుటాలలో ప్రస్తుతం అందుబాటులో వున్నవి నాలుగు. వడ్డెర చండీదాస్‌గారి ముందుమాటతో వచ్చిన ”వానజల్లు సంపుటి” ”కాదేదీ కథ కనర్హం” అనే సంపుటి ”డి కామేశ్వరి కథలు”, ”కాలాన్ని వెనక్కు తిప్పకు” వీటన్నిటిలోనూ మనకి దొరకని వాటితోనూ కలిసి మూడువందల కథలున్నాయి కనుక ఒక పది కథల్ని సమీక్షించుకోడం ద్వారా కామేశ్వరి గారి కథనశైలి, ఆమె ఎంచుకున్న వస్తువులూ ఆమె తాత్వికతా తెలిపే అర్థం చేసుకోవచ్చుననుకుంటాను.
వానజల్లు కథాసంపుటి ఆమె తొలిరచనలతో కూర్చినది. దీనికి వడ్డెర చండీదాస్ గారు చాలా ముక్కుసూటిగా నిర్మొహమాటంగా వ్రాసిన ముందుమాట చదివినప్పుడు కామేశ్వరిగారు ప్రశంసని ఎంత సహృదయంతో తీసుకుంటారో విమర్శని కూడా అంత హుందాగానూ స్వీకరిస్తారని అర్థమౌతుంది. ఈ సంపుటికి శీర్షిక అయిన వానజల్లు కథ కథలు వ్రాసే కొత్తలో రచయితలు తీసుకునే శ్రద్ధకి ఉదాహరణ. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెకు ఉద్యోగం ఇచ్చిన యువ బాస్.. ఆమె స్నేహాన్నీ చనువునూ తన పట్ల ప్రేమగా అర్థం చేసుకుంటాడు .. కానీ ఆ అమ్మాయి తనకిష్టమైన మేనబావతో పెళ్ళికి తల్లీ తండ్రీ అంగీకరించకపోవడంతో ఇంట్లో అలిగివచ్చిందనీ, తల్లీ తండ్రీ చివరికి ఆమె పెళ్ళికి అంగీకరిస్తే వెళ్ళిపోతోందనీ తెలిసి విలవిలలాడిపోతాడు. కొన్ని పెగ్గుల తరువాత అతనికి జ్ఞానోదయం అయింది. ”వానచినుకులు భూమిని శూలల్లా గుచ్చుతాయి.. మరుక్షణం ఇంకిపోతాయి. మహా అయితే ఒక గంట పట్టవచ్చు. ఆ గుర్తులెంతసేపు వుంటాయి? ఆ సంఘటనలు జ్ఞాపకాలూ కూడా అంతే! ఎప్పటికో అప్పటికి మట్టి గొట్టుకు పోతాయి. తనెందుకింత వ్యధ పడడం…….. ఐ యామ్ ఎ బ్లడీ ఫూల్” అనుకుని తనను తాను కూడ దీసుకుంటాడు. శిల్పపరంగా తాత్వికంగా కూడా ఇది చక్కని కథ. ఇదే సంపుటిలోని ”వేట” కథ కూడా చదివించే కథ.
”కాదేదీ కథకనర్హం” కథాసంపుటి మొదటిభాగంలో, కుక్కపిల్లా సబ్బుబిళ్ళా మొదలుకుని గుర్రపుకళ్ళెం హారతిపళ్ళెం వరకు కథలున్నాయి. అందులో సబ్బు బిళ్ళ కథలో ఒక పనమ్మాయికి అమ్మగారు రోజు వళ్ళు రుద్దుకునే సబ్బుబిళ్లమీద ఆశ. దాని సువాసన, దాని ఆకారం అన్నీ ఇష్టమే ఆ పిల్లకి. ఎట్లాగైనా ఆ సబ్బు బిళ్ళ స్వంతం చేసుకోవాలని కోరిక… చివరికి అమ్మగారు తలంటిస్నానం చేసిన రోజు నానా కష్టాలూ పడి సబ్బుబిళ్లని పరికిణీ కుచ్చెళ్లలో దాచుకుని తీసుకుపోవాలనుకుంది. సబ్బు బిళ్ళ పరికిణీ కుచ్చెళ్లల్లో దాచుకోడం వరకూ సజావుగానే సాగింది. కానీ ఇంతలోనే అమ్మగారు తన ”రవ్వల ముక్కుపుడక ఎక్కడ” అంటూ గర్జించింది. నిజంగానే పనిపిల్లకి ముక్కుపుడక తెలీదు. తెలీదని చెప్పింది. కానీ తను కాక స్నానాలగదిలోకి వెళ్ళి గది కడిగింది ఈ పిల్లేకదా? ఇంకెవరు తీస్తారు దాన్ని? అని ఆవిడ ఉగ్రురాలైపోయింది. ఎక్కడ దాచావో చెప్పమంది? చివరికి ఆ పిల్ల పరికిణీ దులిపించగా సబ్బుబిళ్ళ కిందపడింది. దానికి అతుక్కుని రవ్వల ముక్కుపుడక వుంది. ఆ సంగతి ఆ పిల్లకి తెలీదు. తిట్లతో పాటు ఉద్యోగం పోగా దొంగపిల్ల అనే ముద్ర పడిపోయింది… కథ బాగుంది.
‘తలుపుగొళ్ళెం’ కథలో నాయ నమ్మకు తలుపుకు గొళ్ళెం వేస్తే భయం అందులోనూ శోభనం పెళ్ళికొడుకునీ పెళ్ళికూతుర్నీ గదిలో పెట్టి గొళ్ళెం పెడితే మరీ భయం పెళ్ళికూతురు మీద ఎనలేని జాలి. ఆమె బాల్యవివాహపు అనుభవాలు, శృంగారం అంటే తన దేహం మీద ఒక దండయాత్ర అనే భావాన్ని మనసుపై ముద్ర వేసాయి. అదే అనుభవం అదే హింస ఇప్పటి వయస్సొచ్చిన పిల్లలకు కూడా వుంటుందేమో అని ఆవిడ ఆవేదన.
వంకర గీతలు అనే కథలో ఉన్నత మధ్యతరగతి ఉద్యోగుల సంస్కృతిని చిత్రించారు కామేశ్వరి. ముందు చాలా మామూలుగా సాధారణంగా వున్న ఒక యువతిని ఆధునికంగా వుండమని చెబుతా డు భర్త. ఆ ఆధునికతకు అలవాటు పడిపో యిన భార్య ఆమె భర్త ఆశించని విధంగా తయారైంది. డబ్బు నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతుంది. పిల్లలని అలక్ష్యం చేస్తుంది.
కామేశ్వరి గారి కథలు చాలా వరకూ స్త్రీల జీవితాలకు సంబంధించినవే. అందులో ”కాలాన్ని వెనక్కు తిప్పకు” అనే సంపుటిలో అన్ని కథలూ స్త్రీలకు సంబంధించినవే. అవగాహనతో, ఒకింత సర్దుబాటుతో వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకోమంటారు కామేశ్వరి. చిన్న చిన్న పంతాలతో జీవితాన్ని పాడుచేసు కోవద్దంటారు చాలా కథల్లో. అయితే సర్దుబాటుకు కూడా ఒక హద్దు అంటూ వుంటుందనీ అది దాటినప్పుడూ అవతలి వ్యక్తితో అంత రాజీ పడి బ్రతకనక్కర్లేదనీ ఆర్థిక స్వాతంత్య్రం, పక్కన ఒక సపోర్ట్ సిస్టం వుంటే భర్త తోడిదే జీవితం అని అనుకోనక్కర్లేదనీ కూడా కొన్ని కథల్లో చెప్పారు. ఏమైనా ఒకరినొకరు అర్థంచేసుకుని సర్దుకుపోయే వైవాహిక జీవితాన్నే ఆమె కథలు మెచ్చుకుంటాయి. అసలు వివాహం వద్దనుకుని స్వతంత్రంగా బ్రతికి ఉన్నతోద్యోగాలలో కుదురుకున్న మహిళలు కూడా చివరికి వివాహాన్ని నిరాకరించినందుకు పశ్చాత్తాపం చెందడం చాలా కథల్లో కనపడుతుంది. శేషప్రశ్న అనే కథలో ఇరవైలోపు ఆకర్షణలో పడి పెళ్ళి చేసుకుని విడిపోవడం. ఆ తరువాత మరో పెళ్ళి భగ్నం అయిపోవడం చివరికి ఆమె జీవితం శేష ప్రశ్నగా మిగలడం. కామేశ్వరి వ్రాసిన విశిష్టమైన కథ ”ఆకలి” కుటుంబసభ్యుల ఆకలిని చూసి తట్టుకోలేక ఒక అమ్మాయి చేసిన సమాజం దృష్టిలో ”తప్పుపని”, అది తప్పు కాదని బిడ్డని ఓదార్చీ తనే మీమాంసలో పడిన తండ్రి కథ. చదివించే కథ.
”కాలాన్ని వెనక్కి తిప్పకు” కథాసంపుటికి శీర్షికగా వున్న ఈ కథ ఈ తరం అమ్మాయిలకు ఒక హెచ్చరిక. ఈ కాలం అమ్మాయిలకు చదువుకునే అవకాశాలున్నాయి. స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశాలున్నాయి. అలాంటి ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ మాయ మాటలలో పడి సరదాకి అతనితో శృంగారంలో పాల్గొంటుంది. గర్భం రానే వచ్చింది. తల్లిదండ్రులకి తెలియకుండా దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే కుదరక తప్పని పరిస్థితుల్లో తల్లికి చెప్పి తనకి సాయం చెయ్యమంటుంది. తల్లి ముందు బాగా చివాట్లు పెడితే తనే ఎవరో ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. తరువాత తల్లి తన స్నేహితురాలైన మరో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి చికిత్స చేయిస్తుంది. అప్పుడా తల్లి ఇలా అంటుంది ”……. చిత్రా! ప్లీజ్ నీలాంటి అమ్మాయిలు విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ పెద్దలు ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని భావించి, చరిత్ర పునారవృతం అయి మళ్ళీ ఆడదాన్ని నూరేళ్ళు వెనక్కి పంపకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం అమ్మాయిల మీద వుంది ఫరవాలేదు స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్య్రం ఇచ్చినా దుర్వినియోగం చెయ్యదు అన్న నమ్మకం సమాజానికి మీలాంటి యువతరం లుగచెయ్యాల్సిన బాధ్యత వుంది” అని.. తప్పంతా చిత్రదేనా? చిత్రనలా నడిపించిన పరిస్థితుల మాటే మిటి? పరిస్థితులు, ప్రవర్తనలు, పర్యవసా నాలు పరిష్కారాల గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన చేయించాల్సి నదెవరు?
కామేశ్వరిగారు ఈ తరం పిల్లలం దర్నీ ఇలా ఊహించుకోలేదు. తెలివిగల నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని సాఫీగా నడిపించుకునే నవయువతులను గురించీ, కులాంతర మతాంతర వివాహాలు చేసుకుని ఆనందంగా వున్నవారి గురించీ కూడా వ్రాసారు. అట్లాగే త్వరపడి స్వయం నిర్ణయాలు తీసుకుని కష్టాల కడలిలో మునిగిన వారిని గురించి కూడా వ్రాసారు. స్త్రీలకయినా పురుషులకయినా జీవితానికో తోడుకావాలి అని రచయిత్రి చాలా కథల్లో చెబుతారు. ఇంక ఉద్యోగినుల కష్టాలు, ఉద్యోగినులకు ఏమాత్రం సౌకర్యం కలుగచెయ్యని పని ప్రదేశాలు. భర్తల సహకారలేమి, భార్యల ఉద్యోగాలపైనా ఆర్జన పైనా భర్తల అజమాయిషీ వంటి అనేక సమస్యల్ని స్పృశించారు. బాధ్యతారహితంగా భార్యనీ పిల్లల్నీ వదిలేసి పోయి ఆమె ఒంటరిగా బ్రతుకు పోరాటం చేసి ఆర్థికంగా కుదురుకున్నాక తిరిగి వచ్చి కుటుంబంలో భర్తగా తన స్థానాన్ని ఒక హక్కుగా పొందాలని చూసే పురుషులు. వారిని దరిచేరనివ్వని భార్యలు వుంటారు. అయితే పిల్లల కోసం మళ్ళీ అతన్ని భరించే భార్యలూ వుంటారు.. స్త్రీలకు ఇప్పుడు లభించిన ఈ సౌకర్యాలను హక్కులను జాగ్రత్తగా వాడుకుంటూ బ్రతుకు సుఖమయం చేసుకోమంటారు రచయిత్రి. కామేశ్వరి గారి కథన శైలి నిరాడంబ రమైనది. వానజల్లు, కాదేదీ కథ కనర్హం సంపుటిలలో కొంత వర్ణనా, వ్యంగ్యమూ కనిపిస్తాయి. తక్కిన కథలన్నీ మనని కూచోబెట్టి కథ చెబుతున్నట్లుంటాయి.
చాలా విస్తృతంగా రచనలు చేసిన డి. కామేశ్వరికి చాలా పురస్కారాలొచ్చాయి. గృహలక్ష్మి స్వర్ణకంకణం, మాదిరెడ్డి సులోచన అవార్డు మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమరచయిత్రి అవార్డు. ఇటీవల అమృతలతగారి ఉత్తమ నవలా రచయిత్రి అవార్డు కూడా అందుకున్నారు 1935లో జన్మించి నవ్వుతూ నవ్వుతూ హుషారుగా, ఎనభైయ్యవ పడిలో ప్రవేశించనున్న కామేశ్వరిగారు త్వరలోనే మరొక కథా సంపుటి వెలువరించనున్నారు.